
భార్యపై బలాత్కారం నేరమా... కాదా?
భిన్న తీర్పులతో వీడని గందరగోళం
మారుతున్న కాలంతోపాటు సామాజిక ఆచార విచారాలు, న్యాయనిర్ణయమూ మారకతప్పదు. పెళ్ళి, విడాకులు, మనోవర్తికి సంబంధించి వివిధ మతాలు విభిన్న వ్యక్తిగత న్యాయసూత్రాలను పాటిస్తాయి. ఆధునిక కాలానికి తగినట్లు ఈ వ్యక్తిగత న్యాయసూత్రాలను మారుస్తూ 1955లో హిందూ వివాహ చట్టం, 1956లో హిందూ వారసత్వ చట్టం తీసుకొచ్చారు. రాజ్యాంగ విలువలైన సమానత్వం, వ్యక్తి గౌరవాలను ప్రతిబింబిస్తూ ఆ చట్టాలకు ఎప్పటికప్పుడు సవరణలు చేశారు. ఫలితంగా ఆధునిక మహిళల్లో తమ హక్కుల గురించి చైతన్యం, వాటి కోసం పోరాడే తత్వం, దుర్విచక్షణను ఎదిరించే ధోరణి పెరిగాయి. పెళ్ళి అనేది స్త్రీపురుషుల పరస్పర అంగీకారంతో ఏర్పడే బంధమనే నిర్వచనం బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన దిల్లీ హైకోర్టు డివిజన్ బెంచి వైవాహిక అత్యాచారం కేసులో ఇచ్చిన తీర్పు ప్రాముఖ్యం సంతరించుకుంది. ఆర్.టి.ఐ. ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో డివిజన్ బెంచిలోని ఇద్దరు న్యాయమూర్తులు పరస్పర భిన్న తీర్పులను వెలువరించారు.
విభజన రేఖ
భార్యకు ఇష్టం లేకపోయినా ఆమెతో బలవంతంగా లైంగిక కార్యం జరపడానికి భర్తకు చట్టపరమైన అనుమతి ఉందా అన్నది ప్రశ్న. బలవంతపు శృంగారాన్ని మానభంగంగా పరిగణించకూడదని ఐపీసీ 375 సెక్షన్‌కు ఇచ్చిన రెండో మినహాయింపు స్పష్టం చేస్తోంది. భార్యపై భర్త బలాత్కారాన్ని మానభంగం నిర్వచనం నుంచి తొలగించడం రాజ్యాంగంలోని 14, 15, 19, 21వ సెక్షన్లను ఉల్లంఘించడమే అవుతుందని దిల్లీ హైకోర్టు డివిజన్ బెంచి సభ్యుడైన జస్టిస్ రాజీవ్ షక్దర్ తీర్మానించారు. పెళ్ళి చేసుకున్నంత మాత్రాన భార్యకు ఇష్టం లేకున్నా ఆమెపై బలవంతంగా లైంగిక కార్యానికి పాల్పడే విషయంలో చట్టపరమైన మినహాయింపు కల్పించడం పితృస్వామ్య భావజాలం తప్ప మరొకటి కాదన్నారు. వివాహ బంధానికి లోపలకాని, వెలుపలకాని స్త్రీ అనుమతి లేకుండా శృంగారం జరపడం ఆమె హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. కానీ, షక్దర్ తీర్పునకు భిన్నమైన తీర్పును ఆయన సహ న్యాయమూర్తి జస్టిస్ హరిశంకర్ వెలువరించారు. పెళ్ళి అంటే భార్యాభర్తల మధ్య ఆశలు, అనుబంధాలు, బాధ్యతల సమాహారమని, లైంగిక కార్యానికి ఆమోదం అందులో అంతర్భాగమని ఉద్ఘాటిస్తూ ఐపీసీ 375వ సెక్షన్‌కు ఇచ్చిన రెండో మినహాయింపు రాజ్యాంగబద్ధమని స్పష్టం చేశారు. వివాహ బంధంలో భార్యకు ఇష్టం లేకపోయినా లైంగిక కార్యం జరపడం మానభంగం కిందకు రాదన్నారు. ఇలా ఒకే డివిజన్ బెంచిలోని ఇద్దరు సభ్యులు పరస్పర భిన్నమైన తీర్పులను వెలువరించడంతో ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యానికి ద్వారాలు తెరచినట్లయింది. మహిళ సమ్మతి లేకుండా లైంగిక కార్యం జరపడం నిషిద్ధమని భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) పేర్కొంటోంది. అయితే, ఐపీసీ 375 సెక్షన్‌కు అనుబంధమైన రెండో వివరణ భార్య అనుమతి లేకుండా లైంగిక కార్యం జరపడానికి భర్తకు మినహాయింపునిస్తోంది. ఈ విధంగా వివాహబంధం లోపల, వెలుపల లైంగిక అత్యాచారాల మధ్య విభజన రేఖను పాటిస్తోంది. మహిళకు తన శరీరంపై తనకే హక్కు ఉందని, అది ఆమె ప్రాథమిక హక్కులో భాగమని ఉద్ఘాటించిన సుప్రీంకోర్టు- భర్త కోరినా నిరాకరించే హక్కు భార్యకు ఉందా, లేదా అన్నది స్పష్టం చేయలేదు. 2017లో ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోనూ సుప్రీంకోర్టు వైవాహిక అత్యాచారం మూలాల్లోకి వెళ్ళలేదు. అయితే, 18 ఏళ్ల లోపు యువతికి పెళ్ళయినా, కాకున్నా ఆమెతో లైంగిక కార్యం జరపడం మానభంగ నేరం కిందకు వస్తుందని సుప్రీం తేల్చింది. పలు కేసుల్లో వివిధ హైకోర్టులు భిన్నతీర్పులు వెలువరించడంతో ఈ సమస్యపై గందరగోళం తొలగడం లేదు. వైవాహిక అత్యాచారం జరిగినప్పుడు మహిళకు విడాకులు పొందే హక్కు ఉందని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. భార్యకు ఇష్టం లేకపోయినా లైంగిక కార్యం జరిపి ఆమెకు పక్షవాతం రావడానికి కారకుడైన భర్తకు బాంబే హైకోర్టు ముందస్తు బెయిలు ఇవ్వడం ద్వారా ఈ చర్య చట్టవిరుద్ధం కాదని తేల్చింది. భర్త బలవంతపు శృంగారాన్ని కూడా మానభంగ నేరంగా పరిగణించాలని 2013లో జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ ఇచ్చిన నివేదిక ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఈ కమిటీ నివేదికను అమలు చేయాలంటూ స్త్రీల హక్కులు మానవహక్కుల సంఘాలు, మేధావులు డిమాండ్ చేస్తున్నా ఫలితం లేకపోయింది.
మారాల్సిన దృక్పథం
భారతదేశంలో సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆర్థికపరంగా, మత విశ్వాసాలపరంగా ఇప్పటికీ అధునాతన భావాలు పూర్తిగా వేళ్లూనుకోలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం వైవాహిక అత్యాచారం కేసులో దిల్లీ హైకోర్టు మిశ్రమ తీర్పు పట్ల అనిశ్చిత వైఖరిని అవలంబించింది. ఈ అంశాన్ని లోతుగా పరిశీలించడానికి వ్యవధి కావాలన్నది. మొదట సామాజిక దృక్పథంలో మార్పు రావాలి. స్త్రీలకు సమాన హక్కులు ఉన్నాయని అందరూ నిర్ద్వంద్వంగా గుర్తించాలి. సమాజంలో ఇలాంటి మార్పు రాకుండా వైవాహిక బలాత్కారాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టాలు చేసినా ఉపయోగం ఉండదు. ఇంటి నాలుగు గోడల మధ్య భార్యపై భర్త అత్యాచారం చేసినా, దానికి ప్రత్యక్ష సాక్షులెవరూ ఉండరు కాబట్టి- నేరం జరిగిందని కోర్టులో నిరూపించడం కష్టం. అందువల్ల వైవాహిక అత్యాచారాల నిరోధక చట్టం చేసినా దాన్ని అమలు చేయడం దుస్సాధ్యం. ఈ చట్టం దుర్వినియోగం కాబోదనే భరోసా కూడా ఏమీ లేదు. ఇదంతా చివరకు కోర్టుల్లో వైవాహిక అత్యాచార కేసులు కొండల్లా పెరిగిపోవడానికి దారితీస్తుంది తప్ప సమస్య పరిష్కారానికి కాదు. ఏతావతా పాశ్చాత్య దేశాలను గుడ్డిగా అనుకరించకుండా భారతదేశ స్థితిగతులు, సామాజిక ఆచార వ్యవహారాలకు అనుగుణమైన శిక్షాస్మృతులను, చట్టాలను రూపొందించి అమలు చేసుకోవాలి. ప్రజల దృక్పథంలో మార్పు వస్తే తప్ప ఏ చట్టమూ సరిగ్గా పనిచేయదు.
మహిళా హక్కులకు పెద్దపీట
నిజానికి సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు స్త్రీ శరీరంపై స్త్రీకే హక్కు ఉంటుందని పలు సందర్భాల్లో తీర్పులు ఇచ్చాయి. అది ఆమె ప్రాథమిక హక్కులో అంతర్భాగమన్నాయి. వివాహ బంధంలో కూడా లైంగిక చర్యలో పాల్గొనాలా వద్దా, గర్భనిరోధక సాధనాలు వాడాలా వద్దా అనేది నిర్ణయించుకునే హక్కు మహిళదేనని సుచితా శ్రీవాస్తవ వర్సెస్ చండీగఢ్ ప్రభుత్వం కేసులో సుప్రీం తేల్చిచెప్పింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల ఆధునిక సమాజాలు స్త్రీల సమాన హక్కులకు పెద్దపీట వేశాయి. పెళ్ళయినంత మాత్రాన భార్య అనుమతి లేకుండా భర్త లైంగిక కార్యం జరిపితే వైవాహిక అత్యాచారం కిందకు వస్తుందని నిర్ధారించాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
సంపాదకీయం
ప్రధాన వ్యాఖ్యానం
ఉప వ్యాఖ్యానం
అంతర్యామి


తాజా వార్తలు (Latest News)
-
India News
Maharashtra crisis: సుప్రీం తీర్పు.. బాలా సాహెబ్ సాధించిన హిందుత్వ విజయం: ఏక్నాథ్ శిందే
-
India News
Amarnath Yatra: మూడేళ్ల విరామం అనంతరం.. అమర్నాథ్ యాత్రకు సర్వం సిద్ధం
-
General News
Andhra news: తుని మండలంలోకి ప్రవేశించిన బెబ్బులి
-
Technology News
Slice App: స్లైస్ యాప్‌తో ముప్పు ఉందన్న గూగుల్.. వివరణ ఇచ్చిన ఫిన్‌టెక్ సంస్థ!
-
India News
Sonia Gandhi: సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై అత్యాచారం కేసు!
-
World News
Viral Video: బోరిస్ జాన్సన్‌ను వెంబడించిన పోలీసులు.. అసలేమయ్యింది..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Netflix: నెట్‌ఫ్లిక్స్ ఇక చౌక!