Updated : 29 May 2022 06:36 IST

ఉన్నతవిద్య... కళావిహీనం!

విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు పేలవం

న్నత విద్య, ఆర్థిక వృద్ధి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించే మానవ వనరులను కళాశాలలు, విశ్వవిద్యాలయాలే తీర్చిదిద్దుతాయి. ఇండియా ఉన్నత విద్యావ్యవస్థ ప్రపంచంలోనే రెండో అతి పెద్దది. అందులో విశ్వవిద్యాలయాల పాత్ర కీలకమైంది. అత్యుత్తమ విద్యకు, మేధావికాసానికి వర్సిటీలు నెలవు కావాలి. కానీ, భారత్‌లో ఈ స్ఫూర్తి సన్నగిల్లుతోంది. మౌలిక సదుపాయాల లేమి, అధ్యాపకుల ఖాళీలు, సరైన నైపుణ్యాలు లేని సిబ్బంది, కాలం చెల్లిన బోధన పద్ధతులు, పరిశోధన ప్రమాణాలు పడిపోవడం వంటివి ఇండియాలో విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.

తీసికట్టుగా భారత్‌

విశ్వవిద్యాలయ విద్య పరంగా భారత ఉపఖండానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దంలో పశ్చిమ పంజాబ్‌లో నెలకొల్పిన తక్షశిల విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. బౌద్ధ యుగంలో విక్రమశిల, నలంద వంటి విశ్వవిద్యాలయాలు ఒక వెలుగు వెలిగాయి. వాటిలో వ్యాకరణం, జ్యోతిషం, వైద్యం, తర్కం, తత్వశాస్త్రం వంటివి బోధించేవారు. బ్రిటిష్‌ హయాములో దేశీయంగా ఆధునిక విద్యాసంస్థల ఆవిర్భావం మొదలైంది. 1854లో ఛార్లెస్‌ వుడ్‌ సిఫార్సులకు అనుగుణంగా లండన్‌ వర్సిటీ తరహాలో భారత్‌లోనూ ఆధునిక విశ్వవిద్యాలయాల ఆవిర్భావం మొదలైంది. 1857లో బొంబాయి, కలకత్తా, మద్రాస్‌ విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. 

లార్డ్‌ కర్జన్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు 1902లో భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. దాని సిఫార్సులతో విశ్వవిద్యాలయాల చట్టం-1904 పురుడు పోసుకుంది. వర్సిటీలు సొంతంగా అధ్యాపకులను నియమించుకోవడం, అనుబంధ కళాశాలలపై పటిష్ఠ పర్యవేక్షణ వంటి సూచనలను విశ్వవిద్యాలయాల కమిషన్‌ చేసింది. స్వతంత్ర భారతంలో 1948లో ఉన్నత విద్య మెరుగుదలకు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ నేతృత్వంలో విశ్వవిద్యాలయ విద్యా కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. అధ్యాపకుల నియామకాలు, పరిశోధన వంటి వాటిపై ఆ కమిషన్‌ కీలక సూచనలు చేసింది. వర్సిటీ విద్య పర్యవేక్షణ, నిధుల కేటాయింపు కోసం 1956లో విశ్వవిద్యాలయాల నిధుల సంఘాన్ని (యూజీసీని) చట్టబద్ధ సంస్థగా కొలువు తీర్చారు. 1976లో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. తద్వారా కేంద్రమూ దానికి సంబంధించి చట్టాలు చేసే అవకాశం ఏర్పడింది. కాలక్రమంలో వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలు వంటివి ఏర్పాటయ్యాయి. శాస్త్ర సాంకేతిక విద్యకు మెరుగులద్దేలా ప్రత్యేక సంస్థలు ఆవిర్భవించాయి. 1980ల తరవాత ప్రభుత్వ వర్సిటీల వృద్ధి మందగించి, ప్రైవేటు రంగానికి ప్రాధాన్యం పెరగడం మొదలయింది.

స్వాతంత్య్రం పొందే నాటికి భారత్‌లో 20 వర్సిటీలు, 200 కళాశాలలు ఉండేవి. యూజీసీ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఇండియాలో రాష్ట్రస్థాయి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినవి, కేంద్రీయ, ప్రైవేటు వర్సిటీలు అన్నీ కలిపి వెయ్యికి పైగా ఉన్నాయి. 40 వేల కళాశాలలు విద్యను బోధిస్తున్నాయి. దాదాపు మూడున్నర కోట్ల మంది ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. లెక్క ఇంత ఘనంగా ఉన్నా క్యూఎస్‌ ప్రపంచ వర్సిటీల ర్యాంకింగుల్లో తొలి రెండొందల జాబితాలో భారత్‌ నుంచి మూడు వర్సిటీలు మాత్రమే స్థానం సంపాదించాయి. తొలి వంద స్థానాల్లో ఒక్కటీ కనిపించదు. అధ్యాపక-విద్యార్థి నిష్పత్తి పరంగానూ మన వర్సిటీలు తీసికట్టుగా నిలుస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు పెరగాలని చెబుతుంటే, ఆర్థిక శాఖ మాత్రం కొత్త అధ్యాపకుల నియామకాలను తొక్కిపడుతోంది. మరోవైపు కేంద్రం దశాబ్దం క్రితం నెలకొల్పిన చాలా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 60శాతానికి పైగా సిబ్బంది కొరత నెలకొంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు యూజీసీకి సరిపడా నిధులు అందడంలేదన్న విమర్శలూ ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యూజీసీకి రూ.4,900 కోట్ల నిధులు కేటాయించారు.  అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే పెరిగింది నాలుగు శాతమే.  2016-21 మధ్య యూజీసీ చేపట్టే పరిశోధనా ప్రాజెక్టులకు నిధులు భారీగా పైగా తెగ్గోసుకుపోయాయి. ఫలితంగా చాలా ప్రాజెక్టులను యూజీసీ అటకెక్కించింది. కేంద్రం ఆధ్వర్యంలోని ఉన్నత విద్యా సంస్థలతో పోలిస్తే, రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలు నిధుల కొరతతో మరింతగా సతమతమవుతున్నాయి.

తక్షణ దిద్దుబాటు అత్యావశ్యకం

వర్సిటీల పరిశోధనల్లో పడిపోతున్న ప్రమాణాలు సైతం తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. పరిశోధనను పరిపుష్టం చేసేందుకు ఉద్దేశించిన జాతీయ పరిశోధనా ఫౌండేషన్‌(ఎన్‌ఆర్‌ఎఫ్‌) వాస్తవ రూపం దాల్చలేదు. దేశీయంగా పీహెచ్‌డీలు పూర్తి చేసినా ఎంతోమందికి సరైన ఉద్యోగాలు దక్కడంలేదు. గతంలో యూపీలో ప్యూన్‌ ఉద్యోగాలకు 3,700 మంది పీహెచ్‌డీ అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం పది లక్షల మందికి పైగా భారత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లు అంచనా. దేశీయంగా నాణ్యమైన విద్యాసంస్థలు పెద్దగా లేకపోవడమే దీనికి కారణం. మరోవైపు విశ్వవ్యాప్తంగా విదేశీ విద్యలో భారత్‌ వాటా ఒక శాతం కన్నా తక్కువే! ఇండియాలో ఉన్నత విద్య వెలుగులీనాలంటే పాలకుల చొరవ కీలకం. అన్ని వర్సిటీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు నిపుణులైన అధ్యాపకులను నియమించాలి. పరిశ్రమలకు, తరగతి గదికి మధ్య అంతరాన్ని తొలగించడం కీలకం. విదేశీ విద్యాసంస్థలతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతోపాటు, ప్రఖ్యాత పరిశోధనా సంస్థలతో వర్సిటీలు అనుసంధానం కావాలి. ఆ దిశగా తక్షణం అడుగులు పడాల్సి ఉంది!


ప్రైవేటు హవా

దేశీయంగా 1,500 విశ్వవిద్యాలయాలు అవసరమని జాతీయ విజ్ఞాన సంఘం గతంలోనే తేల్చింది. 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల విద్యార్థి నమోదు నిష్పత్తిని 50శాతానికి పెంచాలని నూతన విద్యా విధానం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో దేశీయంగా ప్రైవేటు వర్సిటీలు పెరుగుతున్నాయి. 2015-16 నాటికి భారత్‌లో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు 276. ప్రస్తుతం అవి 410కి చేరాయి. గత అయిదేళ్లలో ప్రభుత్వ వర్సిటీలు 18శాతం మేరకే పెరిగాయి. ప్రైవేటు సంస్థల గుత్తాధిపత్యంతో విద్యార్థులపై ఫీజుల భారం అధికమవుతుంది. గతంలో యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీయూ) నిపుణుల కమిటీలు 84 ప్రైవేటు వర్సిటీలను పరిశీలించి వాటిలో మౌలిక సదుపాయాలు లేవని, నిపుణులైన బోధకులు కొరవడ్డారని తేల్చాయి. ప్రైవేటు వర్సిటీలపై ప్రభుత్వాలు సరైన దృష్టి సారించకుంటే భావి తరాలకు తీవ్ర నష్టం తప్పదు.


రాజకీయ జోక్యం

ర్సిటీల ఉపకులపతుల నియామకం చాలా ఏళ్లుగా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రాజకీయ ప్రాబల్యంతో వారి ఎంపిక సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. వీసీల అవినీతి, అనైతిక వ్యవహారాలు సైతం తరచూ ఆ బాధ్యతాయుతమైన పదవికి మచ్చ తెస్తున్నాయి. వీసీలను గవర్నర్లు నియమించే విధానంపై తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ్‌ బెంగాల్‌ వంటి రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలే వారి నియామకాలు చేపట్టాలని చెబుతున్నాయి. దానిపైనా పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా రాజకీయ ప్రాబల్యం నుంచి వర్సిటీలు బంధ విముక్తం కావాలి. ఉపకులపతులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వర్సిటీ విద్యలో ఉన్నత ప్రమాణాలకు పాదుకొల్పాలి.


- వేణుబాబు మన్నం

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని