Published : 11 Aug 2022 00:54 IST

మహోన్నతం... మన చారిత్రక వైభవం

భావితరాలకు అందిస్తేనే సముజ్జ్వలం

ఒక దేశ సంస్కృతి, చరిత్ర అక్కడి ప్రజలను ఉత్తేజితులను చేస్తాయి. జాతీయ స్ఫూర్తిని రగిలిస్తాయి. మన దేశ చరిత్ర, గత వైభావాన్ని తెలుసుకోవడానికి అలనాటి వాఙ్మయం, పురావస్తు పరిశోధనలు మూలాధారాలు. వాఙ్మయం కన్నా పురావస్తు ఆధారాల కచ్చితత్వం ఎక్కువ. అందువల్ల చరిత్ర నిర్మాణంలో పురావస్తు ఆధారాలు అత్యంత కీలకమైనవి. వాటిలో శాసనాలు, నాణేలు, కట్టడాలు-పరికరాలు వంటి భౌతిక అవశేషాలు ముఖ్యమైనవి. వలస పాలకులైనప్పటికీ మనదేశ చరిత్రను వెలికితీయడానికి బ్రిటిష్‌ వారు ఎంతో ఆసక్తి కనబరచారు. మన ప్రాచీన చరిత్ర గురించి మనకు తెలియజేసింది బ్రిటిష్‌ వారే. మన తత్వశాస్త్రం, సంస్కృతి ఎంతో విభిన్నమైనవని, దేశం ఎన్నో చారిత్రక స్థలాలకు, అద్భుత శిల్ప కళాఖండాలకు నిలయమని బ్రిటిష్‌ వారు గ్రహించారు.

పురావస్తు పరిశోధనలతో వెల్లడి
భారత ఉపఖండ చరిత్రపై మొదటిసారి శాస్త్రీయంగా పరిశోధనలు చేపట్టింది- విలియం జోన్స్‌ అనే బ్రిటిష్‌ పరిశోధకుడు. 1784లో ఆయన కలకత్తాలో స్థాపించిన ఏషియాటిక్‌ సొసైటీ భారత్‌లో చరిత్ర రచనలకు పునాది వేసింది. దేశంలో వేలకొద్దీ చారిత్రక స్థలాలను గుర్తించారు. తవ్వకాలు జరిపి అనేక కట్టడాలను, అవశేషాలను వెలికి తీశారు. 1837లో జేమ్స్‌ ప్రిన్సెప్‌ రాళ్లపై చెక్కిన బ్రాహ్మీ లిపిని అర్థం చేసుకోగలగడంతో అశోకుడి శాసనాలతో పాటు అనేక శాసనాలను చదవగలిగారు. తవ్వకాల్లో లభించిన నాణేలు రాజుల వంశక్రమాన్ని, పాలనా సంవత్సరాలను కచ్చితంగా నిర్ధారించాయి. దట్టమైన అడవుల్లో మరుగున పడిపోయిన అజంతా, ఎల్లోరా, ఎలిఫెంటా, కన్హేరీ మొదలైన రాతి గుహలను వెలుగులోకి తెచ్చారు. వాటిని తొలిచిన తీరు, వాటిలోని అపూర్వమైన శిల్ప సౌందర్యం ప్రపంచాన్ని అబ్బురపరచాయి. కాలిన్‌ మెకంజీ కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని చారిత్రక స్థలాలను గుర్తించి, మ్యాపింగ్‌ చేసి ‘కైఫియత్‌’ల పేరుతో 77 సంపుటాలుగా వెలువరించారు. 1861లో దేశంలోని చారిత్రక స్థలాల అన్వేషణకు, పరిశోధనకు ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) స్థాపించారు. ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా పని చేసిన అలెగ్జాండర్‌ కన్నింగ్‌హాం అర్ధ శతాబ్దం పైగా శ్రమించి, అనేక బౌద్ధ స్తూపాల అవశేషాలను వెలికి తీసి వాటి చరిత్రను మూడు సంపుటాలుగా వెలువరించారు. 1922లో సర్‌ జాన్‌ మార్షల్‌, మార్టిమర్‌ వీలర్‌ పరిశోధనలతో సింధులోని హరప్పా, మొహంజొదారోల్లో 5000 ఏళ్ల నాటి సింధు నాగరికత అవశేషాలు బయల్పడ్డాయి. అవి అత్యంత ప్రాచీనమైన సుమేర్‌, రోమన్‌, ఈజిప్టు నాగరికతలకు మన నాగరికత సమకాలీనమని రుజువు చేశాయి.

స్వాతంత్య్రానంతరం కొంత కాలం పురావస్తు పరిశోధనల స్ఫూర్తి కొనసాగింది. 1948లో దిల్లీలో జాతీయ మ్యూజియాన్ని నెలకొల్పారు. సింధు నాగరికత స్థలాలైన కాలిబంగన్‌, లోథాల్‌, ధోలవీరాల్లో ఏఎస్‌ఐ తవ్వకాలు కొనసాగించి, విలువైన చారిత్రక సంపదను వెలికి తీసింది. హెచ్‌.డి.శంకాలియా గంగానదీ లోయలో, మధ్య భారతంలో అనేక చారిత్రక పూర్వయుగ పనిముట్లను వెలికి తీశారు. దేశంలోని వాయవ్య కశ్మీర్‌, గంగానదీ లోయ, మధ్య, పశ్చిమ, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో కనుగొన్న వేలకొద్దీ పూర్వ చారిత్రక యుగ అవశేషాలు భారత ఉపఖండ చరిత్రకు కొత్త అధ్యాయాన్ని జత చేశాయి. 19వ శతాబ్దపు ద్వితీయార్ధంలో రాబర్ట్‌ బ్రూస్‌ఫుట్‌, కృష్ణస్వామి, బెండపూడి సుబ్బారావు మొదలైన వారి పరిశోధనలు తెలుగు రాష్ట్రాల్లో శిలాయుగపు మానవ జీవిత విధానాలను వెల్లడించాయి. పరబ్రహ్మ శాస్త్రి కాకతీయులపై విస్తృత పరిశోధనలు చేశారు. డూబ్రె, హీరాన్‌, గోపాలన్‌, కృష్ణశాస్త్రి, బి.వి.కృష్ణారావు, డి.సి.సర్కార్‌, టి.వి.మహాలింగం,   రమేశన్‌ దక్షిణ భారత రాజవంశాల చరిత్రను నిర్మించడంలో విశేష కృషి చేశారు. తెలంగాణలో కొత్త చరిత్రకారుల బృందం మరుగున పడిన అనేక శాసనాలను వెలికి తీసి పరిష్కరిస్తోంది. ప్రాచీన వస్తువులు, శిథిలాల కాలాన్ని కచ్చితంగా నిర్ణయించగలిగే రెండు రేడియో కార్బన్‌ లేబొరేటరీలను అహ్మదాబాద్‌, లఖ్‌నవూల్ల్లో నెలకొల్పారు. పురావస్తు క్షేత్ర పరిశోధనల్లో దేశ విశ్వవిద్యాలయాలూ కీలక భూమిక పోషిస్తున్నాయి. దేశంలో 3678 పురాతన కట్టడాలు ఏఎస్‌ఐ సంరక్షణలో ఉన్నాయి.

సంరక్షణ అత్యావశ్యకం
దేశ ఔన్నత్యానికి, మహోన్నత సంస్కృతికి చిహ్నాలైన ప్రాచీన కట్టడాలు, అవశేషాల పరిరక్షణలో అలసత్వం మన చరిత్రను మరుగున పడవేస్తుంది. అది మన జాతి మనుగడకు, భవిష్యత్తుకు ప్రమాదకరం. అందువల్ల నూతన చారిత్రక స్థలాల నిరంతర అన్వేషణకు, అవశేషాల వెలికితీతకు, పరిరక్షణకు ఏఎస్‌ఐతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనిక వహించాలి. ఇతోధికంగా నిధులు కేటాయించడం అత్యంత ఆవశ్యకం. అభివృద్ధి పనుల పేరుతో ప్రాచీన కట్టడాల సమీపంలో జరిగే నిర్మాణ కార్యకలాపాలు- కట్టడాలు బీటలు వారడానికి, కట్టడాల భాగాలు అదృశ్యం కావడానికి కారణమవుతుంటాయి. అలాంటివి చోటుచేసుకోకుండా ఆధునిక సాంకేతికత తోడ్పాటుతో ప్రాచీన కట్టడాల చుట్టూ రక్షణ వ్యవస్థలు నిర్మించాలి. ప్రాచీన కట్టడాలు కాలుష్యం బారిన పడకుండా వాటికి రసాయన చికిత్సలు నిర్వహించాలి. కళాఖండాల దొంగతనాలను, గుప్తనిధుల కోసం జరిగే కట్టడాల విధ్వంసాలను అరికట్టాలి. పూర్తిగా కూలిపోయిన కట్టడాలను పునర్నిర్మించాలి. ప్రాచీన స్థలాల పరిరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి. చరిత్ర పట్ల చారిత్రక సంపద పట్ల, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలి. గత వైభవానికి సాక్ష్యంగా నిలిచే అద్భుతమైన చారిత్రక సంపదను చెక్కుచెదరకుండా కాపాడుకోవడం ద్వారానే అపూర్వమైన, గర్వకారణమైన మన సంస్కృతీ వైభవాన్ని, చరిత్రను భావితరాలకు అందించగలం.


లోపించిన శ్రద్ధాసక్తులు

దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాల ప్రాథమ్యాలు మారడంతో పురావస్తు పరిశోధనలకు ప్రాధాన్యం తగ్గిపోతోంది. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు కొన్నేళ్లుగా చారిత్రక స్థలాల అన్వేషణను, తవ్వకాలను ఆపేశాయి. నిధులు, సిబ్బంది కొరత పురావస్తు శాఖను తీవ్రంగా వేధిస్తోంది. ఏఎస్‌ఐ పరిధిలోని 92 రక్షిత కట్టడాలు అసలు కనిపించకుండా పోయాయని కాగ్‌ 2013 నివేదిక వెల్లడించింది. తన సంరక్షణలో ఉన్న కట్టడాల సమగ్ర సమాచారం కూడా ఏఎస్‌ఐ వద్దలేదని కాగ్‌ కుండ బద్దలు కొట్టింది. చాలా కట్టడాలకు రక్షణ కరవై ఆక్రమణలకు గురవుతున్నాయి. దేశంలో కొన్ని ప్రసిద్ధ ఆలయాల భాగాలను పునర్నిర్మాణం కోసమంటూ పెకలించారు. ఏళ్లు గడిచినా అవి పునర్నిర్మాణానికి నోచుకోకపోవడంతో వాటి భాగాలు క్రమక్రమంగా భూగర్భంలో కలిసిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రాచీన కట్టడాలు పురావస్తు అవశేషాల చట్టం, 1958కి సవరణలు ప్రతిపాదిస్తోంది. వీటిద్వారా ఏఎస్‌ఐకి విశేష అధికారాలు సంక్రమిస్తాయని చెబుతోంది.


Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts