Updated : 14 Aug 2022 06:50 IST

సురాజ్య స్థాపనే ధ్యేయం


నేను కోరుకొనేది పేదవాడి స్వరాజ్యం. పేద ప్రజల కనీస అవసరాలు నెరవేరనిదే సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించిందని భావించలేను  - మహాత్మాగాంధీ


‘సర్వేజనాస్సుఖినోభవన్తు!’... 

భూమ్మీద ఏ దేశం ఇంతటి మహోదాత్త సందేశాన్ని విశ్వానికి అందించింది?

‘వసుధైక కుటుంబకమ్‌!’... 

ఏ దేశం ఇలాంటి మహోన్నత భావాన్ని ప్రకటించి, ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది?

ఈ విశ్వం నలుదిక్కుల నుంచి అమృత భావనలు మమ్ము ఆవహించుగాక- ‘ఆనో భద్రాణి క్రతవోయన్తు విశ్వతః’... అంటూ ఏ దేశం ఆశించింది... అనుక్షణం తపించింది?!

...ఇలాంటి విశ్వజనీనమైన విశాల భావాలకు స్థావరం, ఈ భూమండలానికే గొప్ప వరం- మన భారతదేశం! వివేకానందుడి మాటల్లో ఇది బాల్యంలో ఊయల... యౌవన వసంతాల నందనవనం... వార్ధక్య దినాల వారణాసి!

‘ఏక్‌భారత్‌- శ్రేష్ఠ్‌భారత్‌’ నినాదంతో పై సమున్నత భావాల దివ్య పరిమళాలను అమృతోత్సవ శుభవత్సరంలో ఎన్నో కోణాల్లోంచి మనం సంస్మరించాం... మన చైతన్యాలను సంస్కరించాం... కొత్తశకాన్ని ఊహించాం... కొత్త రక్తాన్ని ఆశించాం. ఇక ఆ దిశగా తదుపరి చర్యలు ఏమిటి? ఆ అమృత భావనలను కొనసాగించాలంటే ఏం చెయ్యాలి? ఇకపై ఎటువైపు సాగాలి మన పయనం?

అపూర్వ యత్నం
ప్రతి దేశానికీ ఒక సంఘటిత ఆత్మ (గ్రూప్‌సోల్‌) ఉంటుందన్నారు అరవింద యోగి. ఆ దేశ ఆచారాల్లో అలవాట్లలో ప్రజల మనుగడలో మతంలో సారస్వతంలో- దాని సంఘటిత ఆత్మ ప్రతిబింబిస్తుంది. వ్యక్తి తనలోని ఆత్మ చైతన్యాన్ని గుర్తించి, దాన్ని అఖండ ఆత్మ చైతన్యంతో అనుసంధానం చేసినట్లే- ప్రతి దేశ పౌరుడూ ఆ దేశ సంఘటిత ఆత్మకు తనను అంకితం చేసుకోవాలి. దాన్ని ఆవహించుకోవాలి. అలాగే, ప్రతి దేశం తన సంఘటిత ఆత్మ పరిపూర్ణంగా సంతృప్తి  చెందేలా వ్యక్తిత్వాన్ని, శీలసంపదను సరిదిద్దుకోవాలి. తనదైన ప్రత్యేకతను, ముద్రను నిలబెట్టుకోవాలి. ప్రపంచదేశాల్లో దానికో గుర్తింపును సాధించాలి. భారతదేశ సంఘటిత ఆత్మకు చేరువ కావాలని మనం చేసిన అపూర్వమైన ప్రయత్నం పేరే- ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌!

స్వరాజ్య సమరం
భగత్‌సింగ్‌ రాసిన పుస్తకం ‘నా నెత్తురు వృథా కాదు...’- వాస్తవానికి ఒక సునామీ. భగత్‌సింగ్‌ మనోభావాలు అవగతమైతే, మనకు నరనరాల్లో విద్యుత్తు ప్రసరిస్తుంది. నెత్తురు ఉడుకుతుంది. దేహంపై పులకలు రేకెత్తుతాయి. ‘నన్ను మీరు చూడాల్సింది- నేరస్థుడిగా కాదు, యుద్ధఖైదీగా... నేను చేసింది నేరంకాదు, యుద్ధం... నేను గురికావాల్సింది ఉరితాడుకు కాదు- ఫిరంగికి!’ అంటూ, ‘రండిరా... ఇదె కాల్చుకొండిరా’ అని గర్జించిన మన టంగుటూరి ప్రకాశం మాదిరే భగత్‌సింగ్‌ నిప్పులు చెరిగాడు. బలిదానానికి సిద్ధపడ్డాడు.

లండన్‌ పోయి బారిస్టర్‌ చదువుతానన్న పెద్దకొడుకుతో మహాత్మా గాంధీ ఏమన్నారో తెలుసా? ‘సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళడమే అంతకన్నా విలువైన విద్యాభ్యాసం. కారాగారం దేశభక్తిని అలవరుస్తుంది. క్రమశిక్షణను నేర్పిస్తుంది. చదువుల పరమలక్ష్యం అదే. ఈ దేశంకోసం పోరాడటమే నీ తక్షణ కర్తవ్యం’ అన్నారాయన.

‘నా దేశం అమరభారతం. మనిషిలోని మూర్ఖత్వాన్ని రూపుమాపి, దైవత్వాన్ని నింపి, మనిషిని పునరుజ్జీవింపజేసే అద్భుతశక్తి- భారతదేశానికి సొంతం. నా మాతృభూమి రాచఠీవితో ముందుకు సాగుతూ తన గమ్యాన్ని చేరుకుంటుంది. తన కలలను సఫలం చేసుకుంటుంది’ అన్నారు స్వామి వివేకానంద. వారందరిదీ అమోఘమైన జాతీయవాదం. ఈ జాతీయవాదుల్లో ఎవరికి వారే మహోన్నతులు. భగత్‌సింగ్‌ది కవోష్ణ రుధిరం. మహాత్ముడిది సత్యాగ్రహ సమరం. వివేకానందుడిది ఆధ్యాత్మిక స్వరం. వారి దృక్పథాలు వేరుగాని, లక్ష్యం ఒక్కటే- అదే, దేశానికి దాస్యవిముక్తి! ఆ ప్రయాణంలో ఈ యోధులంతా ఈ దేశాన్ని ఏ రకంగా దర్శించారు, ఏ తరహా స్వాతంత్య్రాన్ని వారు ఆశించారు... ముఖ్యంగా ఈ దేశం ఎవరికి చెందాలని అభిలషించారు... అనేవి 75 ఏళ్ల ఈ మలుపులో మనకు ఎదురయ్యే ప్రశ్నలు. ఆ వీరులు నడిచినంతమేర కదం తొక్కిన శబ్ద గంభీర సరిత్సాగర ఘోషకు... ఆ ప్రచండ భీకర పద ఘట్టనలకు... భీషణ గర్జనలకు...ఆనాడు దేశం హోరెత్తిపోయింది. శత్రువు ఠారెత్తిపోయాడు. వలసవాదుల గుండెలు అవిసిపోయాయి. మన మాతృభూమి సంకెళ్లు తెగిపడ్డాయి. మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. స్వరాజ్య సమరయోధుల శ్రమ ఫలించింది.

భవిష్యత్‌ భారతం
అలనాటి త్యాగమూర్తులు ఆశించింది- మనం ఇప్పుడు చూస్తున్న భారతదేశాన్నేనా? ఈ తరహా స్వాతంత్య్రం కోసమేనా వారంతా కారాగారాలకు తరలివెళ్ళింది... ఉరికొయ్యలను ముద్దాడింది? తెల్లదొరల స్థానాన్ని నల్లదొరలు ఆక్రమించడమేనా- స్వాతంత్య్రం అంటే? ‘నేను కోరుకొనేది పేదవాడి స్వరాజ్యం. పేద ప్రజల కనీస అవసరాలు నెరవేరనిదే సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించిందని నేను భావించలేను’ అన్నారు మహాత్మాగాంధీ. స్వరాజ్యంకన్నా ‘సురాజ్యం’ ప్రధానమని ఆయన పదేపదే స్పష్టం చేశారు. ‘స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వ అధికారుల పనితీరు ఎలా ఉండాలని మీరు ఆశిస్తున్నారు’ అన్న పాత్రికేయుల ప్రశ్నకు గాంధీజీ బదులిస్తూ ‘ప్రభుత్వ పథకాలతో పేదవారికి మేలు జరుగుతున్నదా... జీవితం క్రమంగా మెరుగుపడుతున్నదా... స్వాతంత్య్ర ఫలం దక్కిందన్న సంతృప్తి వారి వదనంలో కనిపిస్తున్నదా... అని అధికారులు తమను తాము ప్రశ్నించుకోవాలి’ అన్నారాయన.

కఠోరసత్యం కళ్లముందే కరాళనృత్యం చేస్తున్న ప్రస్తుత దుస్థితికి కారణం- ప్రజల 75 ఏళ్ల అజ్ఞానం, 75 ఏళ్ల అలసత్వం, 75 ఏళ్ల మౌనం. మరో పాతికేళ్లు ఈ మాదిరిగానే గడిచిపోతే- ఈ అజ్ఞానానికి, ఈ అలసత్వానికి, ఈ నిర్లక్ష్యానికి వందేళ్లు పూర్తవుతాయి. దేశం శతవసంతాల వేడుకకు సిద్ధమవుతుంది. పేద బతుకులు గానుగెద్దుల్లా యథాతథంగా ఆ పరిధిలోనే తిరుగుతూనే ఉంటాయి. సురాజ్యం- కచ్చితంగా ఇదైతే కాదు!

వాస్తవానికి స్వరాజ్య సాధన- అలనాటి సమరయోధుల ఘనత. సురాజ్య స్థాపన- ఈనాటి స్వతంత్ర పౌరుల బాధ్యత. ఈ దేశం మననుంచి ఏం ఆశిస్తోంది, ఏమని పిలుస్తోందని అందరూ ఆలోచించినప్పుడే- సురాజ్య స్థాపన సాధ్యమవుతుంది. ‘వేర్‌ ది మైండ్‌...’ కవితలో విశ్వకవి రవీంద్రుడు సూచించిన సురాజ్యంలో దేశ పౌరులు సగర్వంగా తలెత్తుకొని జీవిస్తారు. భయ సంకోచ సందేహాలు లేకుండా, సచ్ఛీలంతో స్వేచ్ఛగా వ్యవహరిస్తారు. పాలకులు పారదర్శకతతో, ప్రజల పట్ల జవాబుదారీతనంతో, భవిష్యత్తు తరాలపట్ల బాధ్యతతో ప్రభుత్వాలను నిర్వహిస్తారు. పేదల కన్నీరు తుడుస్తారు. ముఖ్యంగా- జనాన్ని ఓటర్లుగా కాక మనుషులుగా చూస్తారు. సురాజ్యానికి అదొక నమూనా! ఈ దేశం పట్ల అందరికీ ఆత్మీయమైన ప్రేమాభిమానాలు, అంకితభావం ఉన్నప్పుడే-అది సాధ్యం అవుతుంది. ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా...’ మనదేశం గురించి చెబుతున్నప్పుడు గుండెల్లోంచి గర్వవీచిక పొంగి వస్తుంది. ఈ తరహా అపూర్వ భావతీవ్రతను (ఇంటెన్సిటీని) కాంతిపరివేషాన్ని వివేకానందుడి కంఠస్వరంలో ‘సిస్టర్‌ క్రిస్టెయిన్‌’ స్పష్టంగా గమనించారు. ప్రపంచానికి వెల్లడించారు.

ఘన వారసత్వం
ఒక వివేకానందుడి దేశభక్తి... ఒక భగత్‌సింగ్‌ ఆత్మశక్తి, ఒక గాంధీజీ ఆశయస్ఫూర్తి... మన ఆంతర్యంలో లేశమైనా ఉన్నాయా? సురాజ్యం అనే పరమాద్భుత భావన- మన చేతనను తాకుతోందా? ఇది నా దేశం, ఇది నా దుర్గం, ఇది నా స్వర్గం... అని మనకు ఎప్పుడైనా అనిపిస్తోందా? అలా అనిపించినప్పుడే మనం నిజమైన భారతీయులం. అప్పుడే మనం సురాజ్యాన్ని నిర్మించగలం. స్వరాజ్య సమరయోధుల కలలు నిజం చేయగలం. అలా నిర్మాణాత్మక చైతన్యాన్ని, నిష్కళంక వ్యక్తిత్వాన్ని ప్రజలు అలవరచుకొన్న రోజున- పాలకులు తప్పక దిగి వస్తారు. జనం ఆకాంక్షలను నెరవేరుస్తారు. దేశం సుభిక్షమవుతుంది. లేకుంటే రాబోయే తరం మనల్ని దోషులుగా చూస్తుంది. భగత్‌సింగ్‌ నెత్తురు వృథా అవుతుంది. వివేకానందుడి ఆశయం గంగలో కలుస్తుంది. గాంధీజీ ఆత్మ క్షోభిస్తుంది.

‘ఈ అల్లకల్లోలాల నుంచి, ఈ అలసత్వం నుంచి వైభవోపేతమైన భావి భారతదేశం- పరిపూర్ణ ప్రభాకలితమై, అప్రతిహతమై జూలు విదిలించి లేచి గర్జిస్తున్నట్లు మనోవీధిలో నాకు దర్శనం ఇస్తోంది’ అన్నారు స్వామి వివేకానంద. అది- సురాజ్య స్వరూపం! మనం చేయాల్సింది మరో స్వరాజ్య సమరం- ఈసారి దాస్యవిముక్తి కోసం కాదు, భావదాస్య విరక్తికోసం... సురాజ్యసిద్ధికోసం... అదే మనదేశం మననుంచి ఆశించే మాతృవందనం!

- ఎర్రాప్రగడ రామకృష్ణ

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని