ఆర్థికాభివృద్ధికి పర్యాటక మంత్రం

ప్రపంచంలోనే గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం, ప్రకృతి సౌందర్యం భారత్‌ సొంతం. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి గుజరాత్‌ వరకు ఎన్నో పర్యాటక, దర్శనీయ కేంద్రాలున్నాయి. ప్రతి ప్రాంతం తనదైన ఆచార వ్యవహారాలతో ప్రత్యేకతను చాటుకుంటుంది.

Published : 01 Sep 2022 03:07 IST

దృష్టి సారిస్తే పురోగతి సాధ్యం

ప్రపంచంలోనే గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం, ప్రకృతి సౌందర్యం భారత్‌ సొంతం. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి గుజరాత్‌ వరకు ఎన్నో పర్యాటక, దర్శనీయ కేంద్రాలున్నాయి. ప్రతి ప్రాంతం తనదైన ఆచార వ్యవహారాలతో ప్రత్యేకతను చాటుకుంటుంది. శీతల కశ్మీర్‌ లోయలు, రాజస్థాన్‌లో ఎడారులు, గంగ, బ్రహ్మపుత్ర నదులు, నీలగిరి, ఈశాన్య అడవులు, అండమాన్‌, నికోబార్‌ వంటి ద్వీపాలు, అందమైన చారిత్రక చిహ్నాలు, భిన్న రుచుల ఆహారంతో పర్యాటకులను ఆకట్టుకునే హంగులెన్నో ఉన్నాయి. కానీ థాయ్‌లాండ్‌, మలేసియా, దక్షిణ కొరియా, చైనాలతో పోలిస్తే పర్యాటకంలో ఇండియా వెనకబడిపోతోంది. యాత్రికులను ఆకట్టుకునేందుకు సరైన ప్రచార వ్యూహాలను అనుసరించకపోవడం, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యమే ఇందుకు కారణమన్నది వాస్తవం. పర్యాటక పరిశ్రమలో సుమారు తొమ్మిది కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నవారు ఎన్నోరెట్లు అధికం. ప్రపంచ ఆర్థిక వేదిక అనుబంధ ప్రయాణ, పర్యాటకాభివృద్ధి సూచీ-2021 ప్రకారం ఇండియా 117 దేశాల్లో 54వ స్థానంలో నిలిచింది. 2018లో ప్రపంచ ప్రయాణ, పర్యాటక మండలి అంచనా ప్రకారం పర్యాటకం వల్ల భారత్‌ రూ.16.91 లక్షల కోట్ల ఆదాయం పొందింది. దీనివల్ల 4.2 కోట్ల ఉద్యోగాలు సమకూరాయని వెల్లడించింది. 2019లో దేశంలోని మొత్తం ఉద్యోగాల్లో 13శాతం ఈ రంగమే కల్పించింది. 2028 నాటికి ఈ రంగం ద్వారా రూ.32.05 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా.

అడ్డంకులను అధిగమించాలి
దేశంలో పర్యాటకాభివృద్ధికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో విధానాలను రూపొందిస్తోంది. గ్రామీణ, సముద్రయాన, వైద్య, పర్యావరణ పర్యాటకాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోంది. వీటిపై ఆధారపడి ప్రయాణ, వసతి, ఆహార పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. దేశంలో ఈ రంగం విస్తరణకు అపారమైన అవకాశాలున్నా కొన్ని అడ్డంకులు సవాళ్లను విసురుతున్నాయి. యాత్రికులకు తగినంతగా వసతి గృహాలు అందుబాటులో లేవు. మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం ఒకటి, రెండు నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వాలి. వచ్చే మూడు, నాలుగేళ్లలో భారత హోటళ్లలో 54 వేలకు పైగా గదులు అవసరమని ప్రపంచ ఆతిథ్య సంప్రదింపుల సంస్థ అభిప్రాయపడింది. ముంబయి, దిల్లీ మినహా యునెస్కో ప్రకటించిన అన్ని సాంస్కృతిక కేంద్రాల్లోని రెండు, మూడు, నాలుగు నక్షత్రాల హోటళ్లకు అయిదేళ్ల పన్ను మినహాయింపు, కొత్తవాటికి ఆదాయపన్ను చట్టం ప్రకారం పెట్టుబడి అనుసంధాన పన్ను ప్రోత్సాహకాలను ఇవ్వాలి. హోటల్‌, పర్యాటక రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలి. రూ.1,000 కంటే తక్కువ అద్దెలున్న హోటల్‌ గదులపై 12శాతం జీఎస్‌టీ వేయాలన్న ఇటీవలి నిర్ణయం సామాన్యులకు ఇబ్బందికరమే. థాయ్‌లాండ్‌, కంబోడియా, శ్రీలంకల్లో వ్యయానికి తగిన విలువ ఉంటుందని, ఆగ్నేయాసియా, దక్షిణాసియా దేశాలతో పోలిస్తే భారత్‌లో అధిక వ్యయమవుతుందన్న అభిప్రాయాన్ని పారదోలాలి.

గొప్ప సంస్కృతీ వారసత్వమున్నా మౌలిక వసతుల కొరతతోనే పర్యాటకులను ఆకట్టుకోలేకపోతున్నామన్నది సుస్పష్టం. జపాన్‌, కంబోడియా, వియత్నాం, శ్రీలంకల నుంచి బౌద్ధ పర్యాటకులు వస్తుంటారు. బిహార్‌ వంటి రాష్ట్రాల్లో రహదారులు, మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మన ప్రధాన ఆకర్షణ తాజ్‌మహల్‌. ఆ ప్రాంతంలో సరైన బడ్జెట్‌ హోటళ్లు, సరైన సౌకర్యాలు తక్కువే. జైపుర్‌లో సౌకర్యాలు బాగుండటంతో పర్యాటకుల్లో అధిక శాతం అక్కడికే వెళుతుంటారు. ఇతర రాష్ట్రాల్లో రహదారి మార్గంలో వెళ్లేవారికి మౌలిక సదుపాయాలు లభించవు. కొన్ని ప్రాంతాల్లో కనీసం కాఫీ, టీలు కూడా దొరకవు. భద్రతపరమైన సమస్యలు కూడా పర్యాటకులను నిరుత్సాహపరుస్తున్నాయి. భారతీయ వీసాలు పొందడానికి అధిక సమయం పడుతోందని విదేశీ యాత్రికులు విమర్శిస్తున్నారు. ఆగమన వీసాల పథకాన్ని మరికొన్ని దేశాలకు విస్తరించడంతో పాటు విమాన ఛార్జీలను కొంతకాలం పెంచకుండా చూడాలి. ఇటువంటి కారణాల వల్లే ఏడాదిలో మనం కోటి మందినే ఆకర్షిస్తుంటే- బ్యాంకాక్‌, థాయ్‌లాండ్‌ వంటి చిన్నదేశాలు మనకంటే రెట్టింపు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.

ప్రచారమే ప్రధానం
ఇటీవలి కాలంలో పర్యాటకాభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం విభిన్న పథకాలతో ప్రచారం చేస్తుంటే రాష్ట్రాల పర్యాటక శాఖలు మాత్రం మూసపద్ధతిని వీడటం లేదు. ఈ శాఖను పర్యవేక్షించే మంత్రులు శ్రద్ధ వహించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పర్యాటకులను ఆకర్షించడానికి, సౌకర్యాల మెరుగుదలకు ప్రత్యేక పథకాలను రూపొందించాల్సిన అవసరముంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖకు రూ.2,400 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 18.42శాతం అధికం. పెద్ద సంఖ్యలో పర్యాటక కేంద్రాలున్న విశాలమైన దేశంలో యాత్రికులకు సౌకర్యాల కల్పనకు ఈ నిధులు సరిపోవు. తెలంగాణ ప్రభుత్వం ఈ విభాగానికి రెండేళ్లలో వరసగా రూ.282.73 కోట్లు, రూ.513.69 కోట్ల చొప్పున కేటాయించింది. ప్రస్తుత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కేటాయింపులు రూ.290 కోట్లకే పరిమిత మయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 20 వరకూ ప్రధానమైన పర్యాటక కేంద్రాలున్నాయి. స్థానిక, విదేశ యాత్రికులను ఆకట్టుకోవడానికి ఈ నిధులు ఏమాత్రం సరిపోవు. కేటాయింపులు పెంచితే పర్యాటకులను ఆకట్టుకోవచ్చు. తద్వారా రాష్ట్రాల ఆదాయం పెరగడంతో పాటు అదనపు ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుంది.


వైద్యచికిత్సకు...

భారత్‌లో వైద్యపర్యాటక రంగం విస్తరిస్తోంది. ఇండియాలో తక్కువ ఖర్చుతో వైద్యం లభిస్తుందని, నిపుణులైన వైద్యులు, నర్సులతో పాటు ప్రపంచ స్థాయి ప్రైవేటు వైద్యశాలలు ఉన్నందువల్ల- టర్కీ, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, ఒమన్‌, ఇరాక్‌, మాల్దీవులు, నైజీరియా, కెన్యా తదితర దేశాల నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. ప్రపంచంలోని 20 ప్రఖ్యాత వైద్య పర్యాటక విపణుల్లో భారత్‌ ఏడో స్థానంలో ఉంది. గత కొన్నేళ్లలో కోట్ల మంది విదేశీ ప్రయాణికులు భారత్‌కు వచ్చారు. 2021లో ప్రయాణాలపై నిషేధం తొలగించిన తరవాత వైద్యం కోసం వస్తున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.