ఆర్కిటిక్‌... మన ప్రయోజనాలకు కీలకం!

ఆర్కిటిక్‌ ధ్రువప్రాంతంలో మంచు వేగంగా కరిగిపోతోంది. అక్కడ ఉన్న ఖనిజ, చమురు నిక్షేపాలపై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. పలు దేశాలపై ఆధిపత్యానికి అర్రులు చాస్తున్న చైనా- తనను తాను ఆర్కిటిక్‌ సమీప దేశంగా వర్ణించుకొంటూ అక్కడా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకం కింద కార్యకలాపాలు చేపడుతోంది.

Published : 02 Oct 2022 00:49 IST

ఆర్కిటిక్‌ ధ్రువప్రాంతంలో మంచు వేగంగా కరిగిపోతోంది. అక్కడ ఉన్న ఖనిజ, చమురు నిక్షేపాలపై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. పలు దేశాలపై ఆధిపత్యానికి అర్రులు చాస్తున్న చైనా- తనను తాను ఆర్కిటిక్‌ సమీప దేశంగా వర్ణించుకొంటూ అక్కడా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకం కింద కార్యకలాపాలు చేపడుతోంది. ఆర్కిటిక్‌లో ఇప్పటికే శాస్త్ర, వాతావరణ పరిశోధనలు నిర్వహిస్తున్న భారత్‌- వ్యాపార ప్రయోజనాలను దక్కించుకొనేందుకూ సంసిద్ధమవుతోంది.

ర్కిటిక్‌ లేదా ఉత్తర ధ్రువ సమీప జలాలు, భూభాగాలు మంచుతో కప్పి ఉంటాయి. ఈ ప్రాంతం చుట్టూ కెనడా, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఐస్‌ల్యాండ్‌, నార్వే, స్వీడన్‌, రష్యా, అమెరికాలోని అలాస్కా ప్రాంతాలు ఆవరించి ఉన్నాయి. ఆర్కిటిక్‌ వ్యవహారాలను పర్యవేక్షించే ఆర్కిటిక్‌ మండలిలో ఎనిమిది ఆర్కిటిక్‌ ప్రాంత దేశాలు, ఆ ప్రాంతంలోని మూలవాసులతో ఏర్పడిన ఆరు శాశ్వత భాగస్వామ్య సంస్థలు, ఆరు కార్య బృందాలు, 38 పరిశీలక సంస్థలు, దేశాలకు సభ్యత్వం ఉంది. భారత్‌ వంటి ఆర్కిటికేతర దేశాలు, స్వచ్ఛంద సంస్థలు, శాస్త్ర పరిశోధక సంస్థలకు పరిశీలక హోదా ఇచ్చారు. ఆర్కిటిక్‌ సమస్యలపై ఈ దేశాలు, సంఘాలు సమన్వయ, సహకారాలు నెరపుతాయి. ప్రస్తుత అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆర్కిటిక్‌ ప్రాంతంపై ఏ ఒక్క దేశానికీ పూర్తి సార్వభౌమాధికారం లేదు.

డ్రాగన్‌పై అనుమానపు చూపులు

ఐక్యరాజ్యసమితి నిబంధనావళి, 1925 స్వాల్‌బార్డ్‌ ఒప్పందం, 1982 ఐక్యరాజ్యసమితి సముద్ర చట్ట ఒడంబడిక(అన్‌క్లాస్‌)లను ఆర్కిటిక్‌ వ్యవహారాల పర్యవేక్షణకు వినియోగిస్తున్నారు. ఆర్కిటిక్‌ దేశాలకు ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని, న్యాయ పరిధిని అన్‌క్లాస్‌ దత్తం చేస్తోంది. ఆర్కిటికేతర దేశాలకు ఆర్కిటిక్‌ సముద్ర జలాల్లో, అక్కడి ప్రత్యేక ఆర్థిక మండలాల్లో ప్రయాణ హక్కులను ఇస్తోంది. ఇక్కడ ఏ దేశానికీ చెందని ప్రాంతాలను మానవాళి ఉమ్మడి వారసత్వంగా పరిగణిస్తున్నారు. రష్యా, అమెరికా(అలాస్కా)ల మధ్య చుక్చి సముద్రంలో ఉమ్కా 2022 పేరుతో రష్యా సెప్టెంబరు 16న సైనిక విన్యాసాలు నిర్వహించడంతో ఆర్కిటిక్‌ ప్రాంతం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఒకవైపు ఉక్రెయిన్‌లో యుద్ధం సాగుతుండగానే 50,000 మంది రష్యన్‌ సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. తన అధీనంలోని సువిశాల ఆర్కిటిక్‌ ప్రాంతాన్ని రష్యా చాలా కీలకంగా పరిగణిస్తుంది. ఇక్కడ చైనాతో సహకారం నెరపుతూ సైనిక బల సమీకరణను పెంచుతోంది. చైనా తనను తాను ఆర్కిటిక్‌ సమీప దేశంగా వర్ణించుకొంటున్నా అమెరికా విభేదిస్తోంది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకంలో భాగంగా ఆర్కిటిక్‌ ధ్రువప్రాంతంలో చైనా పోలార్‌ సిల్క్‌రోడ్‌ను చేపట్టింది.
ఆర్కిటిక్‌ పరిణామాలను భారత్‌ శ్రద్ధగా గమనిస్తోంది. ఈ ప్రాంతాన్ని శాస్త్రీయ, పర్యావరణ, వాణిజ్య, సైనిక వ్యూహ పరంగా తనకెంతో ప్రాధాన్యమున్నదిగా భారత్‌ పరిగణిస్తోంది. ఆర్కిటిక్‌ మండలిలో పరిశీలక హోదా ఉన్న 13 ఆర్కిటికేతర దేశాల్లో భారత్‌ ఒకటి. 2007 నుంచి ఇప్పటివరకు ఆర్కిటిక్‌కు దిల్లీ 13 అన్వేషక యాత్రలు నిర్వహించింది. అక్కడ 23 శాస్త్ర పరిశోధన ప్రాజెక్టులు చేపట్టింది. 25 భారతీయ పరిశోధక సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఆర్కిటిక్‌పై పరిశోధనల్లో భాగస్వామ్యం తీసుకున్నాయి. భారత్‌ 2007లో తొలి శాస్త్ర పరిశోధక బృందాన్ని ఆర్కిటిక్‌కు పంపింది. ఆ బృందం జులై 2008లో నార్వేలోని స్వాల్‌బార్డ్‌లో హిమాద్రి అనే పరిశోధక స్థావరాన్ని నెలకొల్పింది. అక్కడ వాతావరణ, జీవశాస్త్ర, హిమనదాలకు సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయి.

పెరుగుతున్న సముద్ర మట్టాలు

ఆర్కిటిక్‌ ప్రాంతం భారతదేశంలో రుతుపవనాలను ప్రగాఢంగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ ప్రాంతంలో భారతీయ శాస్త్రజ్ఞులు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. దీనికోసం 2014లో సముద్ర గర్భంలో ఇండ్‌ఆర్క్‌ అనే పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2016లో గ్రువెబాడెట్‌ వాతావరణ ప్రయోగశాలను నెలకొల్పారు. ఆర్కిటిక్‌ ప్రాంతంలో బారెంట్స్‌-కారా సముద్రంలో మంచు కరిగిపోతే భారతదేశంలో సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని 2021లో భారతీయ, నార్వేజియన్‌ పరిశోధకులు నిర్ధారించారు. ఒకవైపు ఆర్కిటిక్‌ మంచు కరుగుతుంటే, మరోవైపు అరేబియా సముద్రం వేడెక్కడమూ మితిమీరిన వర్షపాతానికి దారితీస్తుందని తెలిపారు. ఆర్కిటిక్‌ మంచు కరిగి సముద్రంలో కలసిపోతున్నందువల్ల మిగతా ప్రపంచంలోకన్నా చాలా వేగంగా భారత తీరంలో సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయని 2021లో ప్రపంచ వాతావరణ పరిశోధక సంస్థ నివేదిక హెచ్చరించింది. ఆర్కిటిక్‌లో శాశ్వత కార్యకలాపాల కోసం మరిన్ని పరిశోధక స్థావరాలను, ఉపగ్రహ భూతల కేంద్రాలను నెలకొల్పాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకొంది. భారత్‌ 2022 మార్చిలో ప్రకటించిన ఆర్కిటిక్‌ విధానం ప్రాధాన్యం సంతరించుకొంటోంది. సైన్స్‌, పరిశోధనలు, వాతావరణం, పర్యావరణ రక్షణ, ఆర్థిక, మానవ అభివృద్ధి, రవాణా, కమ్యూనికేషన్‌ అనుసంధానత, అంతర్జాతీయ సహకారం అనే అంశాలను భారత ఆర్కిటిక్‌ విధానం పట్టించుకొంటోంది. భూతాపం వల్ల మిగతా ప్రపంచంకన్నా ఆర్కిటిక్‌ నాలుగు రెట్లు వేగంగా వేడెక్కిపోతోంది. అది భారత్‌లో రుతుపవనాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కుండపోత వర్షాలు, సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలు కోసుకుపోవడం వంటి ఉత్పాతాలకు భారత్‌ ఎక్కువగా గురవుతుంది. ఆర్కిటిక్‌ వనరుల కోసం పోటీ సైనిక పరంగా కీలక పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి ఆర్కిటిక్‌ను భారత ప్రయోజనాలకు కీలకమైన ప్రాంతంగా పరిగణించాలి. ఆర్కిటిక్‌ తీర దేశాలు, ఇతర పక్షాలతో చేయీచేయీ కలిపి భారత్‌ పనిచేయాలి.


అవకాశాలను అందిపుచ్చుకోవాలి

శాస్త్ర పరిశోధనలు, వాతావరణ పరిశోధనలకు తోడు ఆర్కిటిక్‌లో వ్యాపారావకాశాలనూ అందిపుచ్చుకోవాలని భారత్‌ నడుంబిగించింది. 2050కల్లా ఆర్కిటిక్‌లో మంచు అంతా కరిగిపోతుందని అంచనా. దానివల్ల అక్కడ బయటపడే అమూల్య ఖనిజ, చమురు నిక్షేపాల కోసం భారత్‌ సహా ప్రధాన దేశాలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్కిటిక్‌ ప్రాంతంలో రేవులు, గనులు, రైల్వేలు, విమానాశ్రయాలు, సమాచార సాంకేతిక పరిజ్ఞాన సేవలకు గిరాకీ పెరుగుతుంది. అంటే భారీ పెట్టుబడులు, ఆర్థిక అవకాశాలను చూడబోతున్నామన్నమాట. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారతీయ ప్రైవేటు రంగం సమాయత్తం కానున్నది. ఆర్కిటిక్‌లోని చమురు, సహజవాయు నిక్షేపాలు భారత్‌కు ఎంతో అక్కరకొస్తాయి. ఇక్కడ చైనా పాత్ర పెరగడం తనకు మంచిది కాదని భారత్‌ భావిస్తోంది. భూగోళంపై అన్ని చోట్లా తన సైనిక, ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఇతర దేశాల మాదిరిగా భారత్‌ కూడా పోటీ పడక తప్పదు.

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని