బాల్య విద్య... భవితకు గట్టి పునాది

పూర్వ ప్రాథమిక విద్య కోసం కేంద్ర ప్రభుత్వం ‘సమీకృత శిశు అభివృద్ధి పథకం’ (ఐసీడీఎస్‌) అమలు చేస్తోంది. ఇది కేంద్ర ప్రాయోజిత కార్యక్రమమైనా,  నిర్వహణ బాధ్యతను రాష్ట్రాలు చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఐసీడీఎస్‌ కింద ఉన్న 13.7 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అమలవుతున్న ఆరు ప్రధాన సేవల్లో పూర్వ ప్రాథమిక విద్య ఒకటి...

Published : 04 Oct 2022 01:28 IST

మానవ జీవితకాలంలో ఎనిమిదేళ్ల వయసులోపు దశ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఎదుగుదలకు ఎంతో కీలకమైంది. అభ్యాసానికి అవసరమైన పునాదులు బాల్యంలోనే పడాలి. అందుకే నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించడానికి పాలకులు అవసరమైన నిధులను కేటాయించాలి. పకడ్బందీ ప్రణాళిక ప్రకారం విద్యా కార్యక్రమాలను అమలు చేయాలి.

పూర్వ ప్రాథమిక విద్య కోసం కేంద్ర ప్రభుత్వం ‘సమీకృత శిశు అభివృద్ధి పథకం’ (ఐసీడీఎస్‌) అమలు చేస్తోంది. ఇది కేంద్ర ప్రాయోజిత కార్యక్రమమైనా,  నిర్వహణ బాధ్యతను రాష్ట్రాలు చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఐసీడీఎస్‌ కింద ఉన్న 13.7 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అమలవుతున్న ఆరు ప్రధాన సేవల్లో పూర్వ ప్రాథమిక విద్య ఒకటి. జాతీయ బాల్య సంరక్షణ, విద్య (నేషనల్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌-ఈసీసీఈ) పథకాన్ని 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పూర్వ ప్రాథమిక విద్యకు నిధులు కేటాయించడం మొదలుపెట్టింది. మూడు నుంచి ఆరేళ్లలోపు ప్రతి పదిమంది పిల్లల్లో దాదాపు ఎనమండుగురు ఈసీసీఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నట్లు సర్వేలు వెల్లడించాయి. ఈ విషయంలో రాష్ట్రాల మధ్య తేడాలున్నాయి. కర్ణాటక 86.6శాతంతో అగ్రస్థానంలో ఉంటే, ఉత్తర్‌ ప్రదేశ్‌ 43.7శాతంతో అట్టడుగున ఉంది. నమోదు చేసుకున్న వారిలో దాదాపు సగం మంది ప్రైవేటు పాఠశాలల్లో చేరారు.

అరకొర వ్యయం

కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ 2020 జులైలో తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానం ప్రకారం మూడేళ్ల వయసునుంచే పాఠశాల విద్య ప్రారంభమవుతుంది. ఈసీసీఈలో మూడేళ్ల పూర్వ ప్రాథమిక విద్యలోని 1, 2 తరగతులను పునాది దశ(ఫౌండేషన్‌)గా పేర్కొన్నారు. ఇందుకోసం నూతన జాతీయ విద్యావిధానం- అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లోని కేంద్రాలు, పూర్వ ప్రాథమిక విద్యా విభాగాలు, స్వతంత్ర ప్రీస్కూళ్లు అనే నాలుగు నమూనాలను ప్రతిపాదించింది. సరైన పూర్వ ప్రాథమిక విద్య పొందలేని పిల్లలు పాఠశాల, ఉన్నత విద్యల్లో తగిన సామర్థ్యాలను కనబరచలేక పోతున్నారని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కొత్త విద్యావిధానం పిల్లల్లో పాఠశాల సంసిద్ధతను, నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని ఇండియన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఇంపాక్ట్‌ స్టడీ (ఐఈసీఈఐ) 2017 సైతం నిర్ధారించింది. ఆరేళ్లలోపు పిల్లల చదువు కోసం భారత్‌ స్థూల దేశీయోత్పత్తిలో కేవలం 0.1శాతమే కేటాయిస్తోంది. బడ్జెట్‌, పాలనా బాధ్యతల పర్యవేక్షణ కేంద్రం, సేవ్‌ ది చిల్డ్రన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ఫలితాలు ఇటీవల వెల్లడయ్యాయి. వాటి ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2020-21 ఆర్థిక సంవత్సరంలో పూర్వ ప్రాథమిక విద్యకు జీడీపీలో 0.1శాతం కేటాయించాయని, ఇది దేశం మొత్తం బడ్జెట్‌ వ్యయంలో 0.39శాతానికి సమానమని తేలింది. 2011 జనగణన ప్రకారం- మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు దేశంలో దాదాపు పది కోట్ల మంది ఉన్నప్పటికీ భారత్‌ బాల్య విద్య కోసం చేస్తున్న వ్యయం చిన్న దేశాలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంది. భారత్‌లో పూర్వ ప్రాథమిక విద్యావ్యయం రూ.25 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. సగటున ఒక్కో పిల్లవాడికి రూ.8,297 కేటాయిస్తున్నారు. మేఘాలయలో అత్యల్పంగా రూ.3,792, హిమాచల్‌ ప్రదేశ్‌లో అత్యధికంగా రూ.34,758 కేటాయింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం విద్యామంత్రిత్వ శాఖ సమగ్ర శిక్షా పథకం, ఐసీడీఎస్‌ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అమలవుతోంది. వీటి ద్వారా మూడు కోట్ల మందికి పైగా చిన్నారులు (32శాతం) పూర్వ ప్రాథమిక విద్యను పొందుతున్నారు. ఈ విద్యకు బడ్జెట్‌ కేటాయింపు జీడీపీలో 1.6శాతం నుంచి 2.2శాతం వరకు ఉండాలని అధ్యయనాలు చెబుతున్నాయి. నాణ్యమైన బాల్యవిద్యా సేవల కోసం ఒక్కో పిల్లవాడికి రూ.32,531 నుంచి రూ.56,327 వరకు వెచ్చించాల్సి ఉంటుందని అవి గుర్తించాయి. 2020-21లో అరుణాచల్‌ ప్రదేశ్‌ మినహా మిగతా రాష్ట్రాలన్నీ బాల్య విద్య కోసం ఒక్కో పిల్లవాడిపై చాలా తక్కువగా వెచ్చించాయి.

నిరంతరం కొనసాగించాలి

దేశవ్యాప్తంగా కుటుంబ ఆదాయాల్లో వ్యత్యాసం తీవ్రంగా ఉండటం వల్ల పిల్లలందరికీ పూర్వ ప్రాథమిక విద్య అందడం లేదు. పిల్లలను బడికి పంపించే విధంగా తల్లిదండ్రుల్లో అవగాహన పెంచాలి. ప్రోత్సాహమూ అందించాలి. అమెరికా, బ్రిటన్‌లలో మాదిరిగా పిల్లవాడి తల్లికి పన్ను మినహాయింపు పథకాలను అమలుచేయవచ్చు. పూర్వ ప్రాథమిక పాఠశాల విద్య పొందే పిల్లల అవసరాలు భిన్నంగా ఉంటాయి. పెద్ద పిల్లలతో కలిసి ఉండటంవల్ల భద్రతాపరమైన సమస్యలు సైతం ఎదురవుతాయి. ఆరేళ్లలోపు పిల్లల పూర్వ ప్రాథమిక విద్య కోసం ప్రత్యేక ప్రాంగణాల్లో పాఠశాలలు నిర్వహించడమే మేలు. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. దేశ జనాభాలో 60శాతానికి పైగా 30 ఏళ్లలోపు వారే. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆరేళ్ల లోపు పిల్లలు 16.5 కోట్ల మంది ఉన్నారు. మన దేశానికి జనాభా వల్ల ప్రయోజనం దక్కాలంటే అది నాణ్యమైన విద్యపైనే ఆధారపడి ఉంటుంది. ఈ కీలక దశలో పూర్వ ప్రాథమిక విద్య ప్రాధాన్యాన్ని గుర్తించడం మొదటి అడుగు మాత్రమే. ఇక ముందూ దీన్ని నిరంతరం కొనసాగించడానికి పాలకులు కంకణబద్ధం కావాలి.  


పర్యవేక్షణ కీలకం

జాతీయ విద్యావిధానం-2020 ఈ దశాబ్దం చివరి నాటికి పూర్వ ప్రాథమిక విద్య అందరికీ అందేలా చేయాలని నిర్ణయించింది. ఆ విద్యను బలోపేతం చేయడానికి ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేయడంతోపాటు, ఓ వ్యవస్థను రూపొందించాలని ‘జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) సూచించింది. బాల్య విద్యా కార్యక్రమాల అమలుకు నిధుల ప్రవాహాన్ని సమీక్షించడానికి పటిష్ఠమైన ఆన్‌లైన్‌ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని తెలిపింది. పూర్వ ప్రాథమిక విద్యలో మౌలిక సదుపాయాలు, శిక్షణ సాధనాలు, భద్రతా ప్రమాణాల పర్యవేక్షణకు పాఠశాలల నమోదు తప్పనిసరి. సాధారణ తనిఖీలూ ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా పూర్వ ప్రాథమిక పాఠశాలల కోసం చాలా పాఠ్యాంశాలున్నాయి. ప్రభుత్వం ఆమోదించిన పాఠ్యాంశాలు ఉపాధ్యాయులు తమ రోజువారీ విధులను మరింత సమర్థంగా, విజ్ఞానదాయకంగా నిర్వహించడానికి వీలుగా ఉండాలి. అందుకోసం వారికి శిక్షణ అవసరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.