తెప్పరిల్లుతున్న పర్యాటకం

కొవిడ్‌ వల్ల కుదేలైన ప్రపంచ పర్యాటకం తిరిగి మెల్లగా పుంజుకొంటోంది. ప్రపంచ గమనానికి అనుగుణంగా పర్యాటక రంగమూ మారాలి. కరోనా కాలంలో ఎదురైన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. కొత్త వ్యాపార నమూనాలను చేపట్టాలి.

Updated : 05 Oct 2022 05:37 IST

కొవిడ్‌ వల్ల కుదేలైన ప్రపంచ పర్యాటకం తిరిగి మెల్లగా పుంజుకొంటోంది. ప్రపంచ గమనానికి అనుగుణంగా పర్యాటక రంగమూ మారాలి. కరోనా కాలంలో ఎదురైన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. కొత్త వ్యాపార నమూనాలను చేపట్టాలి. సామాన్య ప్రజలు పర్యాటకం నుంచి గరిష్ఠ లబ్ధి పొందగలిగేలా ప్రణాళికలు అమలు చేయడం కీలకం. డిజిటల్‌ సాంకేతికతలు తోడైతే పర్యాటక రంగం దేశార్థికానికి కొత్త ఊతం ఇవ్వగలదు. 

అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకొని పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కించాలని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) పిలుపిచ్చింది. ‘పర్యాటకంపై పునరాలోచన’ అనే నినాదంతో ఈ ఏడాది సెప్టెంబరు 27న ఇండొనేసియాలోని బాలిలో అధికారికంగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని యూఎన్‌డబ్ల్యూటీఓ నిర్వహించింది. సుందర ప్రదేశాలకు, పుణ్య స్థలాలకు భారత్‌లో కొదవలేదు. ఆధునిక కాలంలో మెడికల్‌ టూరిజం, సాహస పర్యాటకం, సముద్ర విహారం, పర్యావరణ పర్యాటకం ఊపందుకొంటున్నాయి. 2022 చివరికల్లా భారతీయులు స్వదేశంలో కనీసం 15 పర్యాటక కేంద్రాలను సందర్శిస్తే భారతీయ టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఉద్ఘాటించారు.

పెట్టుబడులకు ఉత్సాహం 

ప్రయాణాలు, పర్యాటక రంగాల్లో పోటీ సామర్థ్యానికి సంబంధించి ప్రపంచ ఆర్థిక వేదిక 2019లో ప్రచురించిన నివేదికలో భారత్‌ 34వ స్థానంలో నిలిచింది. యాత్రలకు ముందుగానే మార్గం నిర్ణయించుకోవడం నుంచి రవాణా, వసతి ఏర్పాట్ల దాకా అంతా డిజిటల్‌ సాధనాలతోనే జరిగిపోతున్న దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇండియాలో మధ్యతరగతి సంఖ్య, తలసరి ఆదాయాలు పెరగడం పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడే అంశాలు. పర్యాటకం ద్వారా భారత్‌కు 2001లో 320 కోట్ల డాలర్ల విదేశీ మారకం అందింది. 2019 నాటికి అది 3,010 కోట్ల డాలర్లకు చేరినట్లు గణాంకాలు చాటుతున్నాయి. 2019-2028 మధ్య జీడీపీకి భారతీయ పర్యాటక రంగం అందించే వాటా ఏడాదికి 10.35శాతం చొప్పున పెరుగుతుందని అంచనా. 2028కల్లా పర్యాటక రంగ ఆదాయం 5,090 కోట్ల డాలర్లకు పెరగనుందని అంచనా. 2020-27 మధ్య కాలంలో వైద్య పర్యాటకం ఏటా 21.1శాతం వృద్ధి రేటును నమోదు చేయనుంది. వైద్య చికిత్స కోసం ఇక్కడికి వచ్చే విదేశీయులకు కేంద్రం మెడికల్‌ వీసా ప్రవేశపెట్టింది.

ప్రస్తుతం ఇండియాలో 2,000 కోట్ల డాలర్లుగా ఉన్న విమాన ప్రయాణాల మార్కెట్‌ విలువ 2027నాటికి రెట్టింపు కానుందని అంచనా. ప్రయాణికులకు తేలిగ్గా పాస్‌పోర్టులు లభించడం, విమానాశ్రయాల సంఖ్య పెరగడం ఇందుకు తోడ్పడతాయి. స్వదేశీ, విదేశీ అతిథుల రాకపోకలు పెరగడం భారతీయ హోటల్‌ పరిశ్రమ వృద్ధికి కారణమవుతోంది. 2020లో 3,200 కోట్ల డాలర్లుగా ఉన్న భారతీయ హోటల్‌ పరిశ్రమ విలువ 2027కల్లా 5,200 కోట్ల డాలర్లకు చేరుతుందంటున్నారు. చాలామంది విదేశీ పర్యాటకులు భారత్‌లో రెండు వారాలు గడుపుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాల నుంచి వచ్చిన వారు సగటున ఇరవై రోజులకు పైగా ఇండియాలో బస చేస్తున్నారు. వారి ద్వారా స్థానిక మార్కెట్లలో విక్రయాలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతీయ పర్యాటకులు సైతం విలాసవంతమైన వసతిని కోరుకొంటున్నందువల్ల ప్రసిద్ధ హోటల్‌ గ్రూపులు ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహం చూపుతున్నాయి. పర్యాటకులు దేశంలో ఎక్కడైనా సరే హోటల్‌ గదులు పొందడానికి అనువుగా కేంద్ర టూరిజం శాఖ నిధి పోర్టల్‌ను ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖలతోపాటు హోటల్‌ పరిశ్రమ కూడా అందులో చురుగ్గా పాలుపంచుకొంటోంది. 2020 చివరి నాటికి 34,399 విడిది సౌకర్యాలు నిధి పోర్టల్‌లో రిజిస్టరయ్యాయి. 2021తో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటిదాకా భారత్‌కు విదేశీ పర్యాటకుల రాక దాదాపు 178శాతం పెరిగింది. 39శాతం దాకా విదేశీ పర్యాటకులు అమెరికా, బ్రిటన్‌ల నుంచే వచ్చారు. 2000-2022 మధ్య కాలంలో భారతీయ టూరిజం రంగంలోకి 1,638 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవహించాయి.

ప్రత్యేక విధానం 

స్వదేశ దర్శన్‌, పుణ్యయాత్రల వృద్ధికి చేపట్టిన ప్రసాద్‌ పథకాలకు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు జరిగాయి. ఈశాన్య భారతంలో 16 పర్యాటక ప్రాజెక్టుల కోసం కేంద్ర టూరిజం శాఖ రూ.1,300 కోట్లు మంజూరు చేసింది. దేశంలో ఏ పర్యాటక ప్రదేశాలకైనా సులువుగా వెళ్ళి రావడానికి కేంద్రం 2021లో ఆలిండియా టూరిస్టు పర్మిట్‌ను ప్రవేశపెట్టింది. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోనే ఈ పర్మిట్‌ పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2020-25 కాలానికి కొత్త పర్యాటక విధానంతో ముందుకెళ్తోంది. అందులో భాగంగా టూరిస్టుల కోసం ముఖ్య ప్రదేశాల్లో విలాసవంతమైన రిసార్టులు నిర్మించాలని తలపెట్టింది. రాష్ట్ర పర్యాటక రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను, ఔత్సాహిక వ్యవస్థాపకులను ఆకర్షిస్తోంది. 2020-25 పర్యాటక విధాన కాలంలో కొత్త హోటళ్లు, గోల్ఫ్‌ కోర్సులు, థీమ్‌ పార్కులు, వ్యవసాయ టూరిజం, రోప్‌వేల వంటి మౌలిక వసతులకు, టూరిజం సేవా ప్రాజెక్టులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రపంచ టూరిజం సంస్థ 2021లో తెలంగాణలోని పోచంపల్లిని అత్యుత్తమ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా గుర్తించింది. కొవిడ్‌ సంక్షోభ సమయంలో విధించిన ప్రయాణ ఆంక్షలు తొలగిపోతూ ఉండటంతో భారతీయ పర్యాటకానికి మంచిరోజులు రానున్నాయని భావించవచ్చు.


ఉద్యోగాల సృష్టి

కొవిడ్‌ టీకా తీసుకున్న విదేశీ టూరిస్టులు దేశంలో ఎక్కడైనా పర్యటించవచ్చని కేంద్రం నిరుడు నవంబరులో ప్రకటించింది. 2019లో భారత జీడీపీలో ప్రయాణాలు, పర్యాటక రంగ వాటా 6.8శాతం. కేంద్రం ప్రవేశపెట్టిన ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా, అతిథి దేవోభవ వంటి పథకాలతో పర్యాటకానికి కొత్త ఊపు వచ్చింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో కుశీనగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ గతేడాది అక్టోబరులో ప్రారంభించడమూ టూరిస్టుల రాక పెరిగేందుకు దోహదం చేస్తోంది. పర్యాటకం, ఆతిథ్య రంగాలపై ప్రస్తుతం 12 శాతం నుంచి 18 శాతం దాకా జీఎస్‌టీ విధిస్తున్నారు. దాన్ని తగ్గిస్తే మరింత ప్రోత్సాహం లభిస్తుంది. 2029కల్లా పర్యాటక రంగం 5.3 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా.


- డాక్టర్‌ మైల త్యాగరాజు
(టూరిజం మేనేజ్‌మెంట్‌ విభాగాధిపతి, విక్రమసింహపురి విశ్వవిద్యాలయం, నెల్లూరు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.