సమాచార బిల్లు సమగ్రమేనా?

వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. డిజిటల్‌ సమాచారాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ముసాయిదాను రూపొందించారు.

Published : 28 Nov 2022 00:13 IST

వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. డిజిటల్‌ సమాచారాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ముసాయిదాను రూపొందించారు. కానీ, దాన్ని లోపాల పుట్టగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ తాజాగా అభివర్ణించారు!

నాలుగేళ్లుగా నానుతున్న వ్యక్తిగత సమాచార పరిరక్షణ (పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌) బిల్లుకు మళ్ళీ కదలిక వచ్చింది. 2019లో తీసుకొచ్చిన బిల్లు రకరకాల కొర్రీలతో మూడేళ్లుగా పార్లమెంటు ఆమోదానికి నోచుకోలేదు. ఆగస్టు నెలలో ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది. ప్రధానంగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ టెక్‌ కంపెనీలు గూగుల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ లాంటి సంస్థల ఒత్తిడి వల్లే ప్రభుత్వం ఆ బిల్లును తాత్సారం చేసిందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా 81 సవరణలు, 12 భారీ సూచనలతో దానికి మార్పులు చేపట్టి డిజిటల్‌ వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు-2022ను కేంద్రం తెరపైకి తెచ్చింది. డిసెంబర్‌ 17 వరకు దానిపై ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని కేంద్ర సమాచార, ఐటీ శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ఇటీవల ప్రకటించారు. రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును సభ ముందుకు తెచ్చే అవకాశాలున్నాయి. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగపరిచే సంస్థలకు కోట్ల రూపాయల్లో జరిమానా విధించే అంశాన్ని ప్రభుత్వం ఇందులో ప్రతిపాదించింది. బిల్లులోని నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు జరిగేలా చూసేందుకు భారత సమాచార పరిరక్షణ బోర్డును సైతం ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.  

విమర్శలెన్నో...

అంతర్జాల వినియోగదారుల సంఖ్య దాదాపు 80 కోట్లకు చేరిన భారత్‌లో ప్రజల డిజిటల్‌ సమాచార పరిరక్షణకు సంబంధించిన చర్యలు అంతంత మాత్రమే. ఆయా కంపెనీలు ఇష్టారాజ్యంగా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని వినియోగిస్తున్నందువల్ల కేవలం వ్యక్తిగత సమాచార పరిరక్షణ ఒక్కటే చాలదని ప్రభుత్వం భావించింది. దానికి డిజిటల్‌ అనే పదాన్ని కలిపి డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు ముసాయిదాను రూపొందించింది. ఎవరైనా వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగపరచినట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే బోర్డు నిర్ధారిస్తే వారిపై గరిష్ఠంగా రూ.500 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు. డేటా ప్రాసెసర్లు లేదా ఆ సమాచారాన్ని సేకరించిన సంస్థలు దాని పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. అలాకాకుండా ఆ సమాచారం బయటకు పొక్కిందని తేలితే రూ.250 కోట్ల వరకు అపరాధ రుసుము విధించవచ్చు. అంతర్జాలంలో ఆన్‌లైన్‌ క్లాసుల వంటి వాటి నేపథ్యంలో చిన్నారుల సమాచార పరిరక్షణకూ ఈ ముసాయిదాలో ప్రత్యేక స్థానం కల్పించడం ఆహ్వానించదగ్గ పరిణామం. తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినా లేదా దుర్వినియోగపరిచినా రూ.200 కోట్ల వరకు జరిమానా విధించే ప్రతిపాదననూ ముసాయిదాలో పొందుపరిచారు. ఇలాంటి అంశాలపై ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఓ సమర్థమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. డేటా సేకరించే ప్రతి సంస్థ/కంపెనీ ఈ పరిష్కార వేదిక వివరాలను కచ్చితంగా తెలియజెప్పాలి. సమాచార పరిరక్షణ బిల్లును ఏడు సూత్రాల ఆధారంగా రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సంస్థలు వ్యక్తుల సమాచారాన్ని వారికి ఇబ్బంది కలగకుండా చట్టబద్ధంగా, పారదర్శకంగా ఉపయోగించాలి. వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్‌ చేయాలని నిర్ణయించిన సంబంధిత సంస్థలోని వ్యక్తే ఆ సమాచార పరిరక్షణకు జవాబుదారీగా ఉండాలి. ఏ ఉద్దేశంతో సమాచారాన్ని సేకరించారో అంతవరకు మాత్రమే వినియోగించాలన్న ప్రతిపాదన సమంజసమే. కాకపోతే, కోట్ల మందితో ముడివడిన వ్యవహారంలో ఆ అంశాన్ని నిర్దిష్టంగా ఎలా పర్యవేక్షిస్తారన్నది ప్రశ్నార్థకం.

గత బిల్లులో 90కి పైగా క్లాజులు ఉన్నాయి. ప్రస్తుత బిల్లులో వాటిని 22కే పరిమితం చేయడంపై నిపుణులు పెదవి విరుస్తున్నారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు, శాంతిభద్రతల పరిరక్షణకు ముప్పు వాటిల్లే సందర్భంలో వ్యక్తుల సమాచారాన్ని ప్రభుత్వ సంస్థలు పౌరుల సమ్మతి లేకుండా తీసుకోవచ్చని గత బిల్లు 35వ క్లాజులో పేర్కొన్నారు. ఇది పౌరుల సమాచార గోప్యతకు ముప్పు తెస్తుందనే విమర్శలు వెల్లువెత్తాయి. కొత్త ముసాయిదా బిల్లులోని 18వ క్లాజ్‌లోనూ దాన్ని దాదాపు అలాగే ఉంచడం పౌరుల వ్యక్తిగత సమాచారంపై ప్రభుత్వానికి అప్రకటిత అధికారాల్ని కట్టబెట్టడమేనంటూ అభ్యంతరాలు మొదలయ్యాయి. జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ సైతం తాజా బిల్లు ప్రభుత్వానికే అనుకూలంగా ఉందని పెదవి విరిచారు. 

స్వతంత్రత ప్రశ్నార్థకం

వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారాన్ని మన దేశంలోనే భద్రపరచాలని, ఇందుకోసం విదేశీ సంస్థలు సైతం ఇక్కడ డేటా సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని పాతబిల్లులో పొందుపరిచారు. తాజా ముసాయిదాలో మాత్రం ఇందుకు కొంత వెసులుబాటు కల్పించారు. సేకరించిన సమాచారాన్ని నమ్మకమైన దేశాలకు బట్వాడా చేయవచ్చని, అయితే ఆయా దేశాల జాబితాను కేంద్రం తరవాత ప్రకటిస్తుందని ముసాయిదా తెలిపింది. మన పౌరుల సమాచారానికి దేశంలోనే భద్రత లేని ప్రస్తుత పరిస్థితుల్లో నమ్మకమైన దేశాల పేరిట విదేశాల్లో మనవారి సమాచారాన్ని భద్రపరిచేందుకు అనుమతించే ప్రతిపాదనపై విమర్శలు వస్తున్నాయి. బిల్లులోని నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు జరిగేలా చూసేందుకు సమాచార పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేస్తామని ముసాయిదా బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. బిల్లులోని 19వ క్లాజ్‌లో ఈ బోర్డు ఏర్పాటు, అందులోని సభ్యుల నియామకం, అవసరమైతే వారి తొలగింపు అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి దఖలు పరచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. బోర్డు కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు కట్టబెట్టే ఈ ప్రతిపాదన దాని స్వతంత్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ క్రమంలో అన్నిరకాల అనుమానాలకు, సమస్యలకు పరిష్కారాలు చూపుతూ, అన్ని అవసరాలనూ పూర్తిస్థాయిలో నెరవేర్చగలిగితేనే బిల్లుకు సార్థకత, ప్రజలకు ఉపయోగం చేకూరుతుంది. 


కీలక అంశాల ప్రస్తావన ఏదీ?

సమాచారాన్ని దుర్వినియోగపరిచే సంస్థలకు రూ.500 కోట్ల వరకు పరిహారం విధించవచ్చన్న బిల్లులో సంబంధిత వ్యక్తికి పరిహారం ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేకపోవడం సరికాదని పౌరహక్కుల కార్యకర్త మిషీ చౌధురి వ్యాఖ్యానించారు. కొవిడ్‌ నేపథ్యంలో నేర్చుకున్న ఎన్నో కొత్త పాఠాలు ప్రతిఫలించేలా ముసాయిదా బిల్లులో పలు సవరణలు ప్రతిపాదించామని కేంద్ర ప్రకటించింది. అయితే కొవిడ్‌ తరవాత విపరీతంగా పెరిగిన సైబర్‌ నేరాలు, రుణయాప్‌ల దందాలు, ఆర్థిక మోసాల్లో ప్రజల వ్యక్తిగత సమాచార దుర్వినియోగమే కీలకంగా మారింది. వాటికి సంబంధించి బిల్లులో ఇదమిత్థంగా ఏమీ ప్రస్తావించలేదు.

శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.