ఓటర్లకు ప్రలోభాల ఎరలు

నేడు గుజరాత్‌లో రెండోదశ పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు గంపగుత్తగా ఉచిత హామీలను గుప్పించాయి.

Published : 05 Dec 2022 01:29 IST

నేడు గుజరాత్‌లో రెండోదశ పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు గంపగుత్తగా ఉచిత హామీలను గుప్పించాయి. గెలవడమే ఏకైక ఎజెండా అయిన తరుణంలో ఉచితాల హేతుబద్ధత అప్రస్తుతమవుతోంది. ఈ క్రమంలో ప్రజల ఆర్థిక స్వావలంబనకు దోహదపడే, ఉత్పాదకతకు ఊతమిచ్చే దీర్ఘకాలిక ప్రణాళికలు మృగ్యమై, తాత్కాలిక ప్రయోజనాలే ముందుకొస్తున్నాయి.

నిరుద్యోగులకు భృతి, విద్యార్థినులకు సైకిళ్లు స్కూటీలు, గృహ వినియోగ కనెక్షన్లకు 300 యూనిట్ల వరకు, వ్యవసాయానికి పూర్తిగా ఉచిత విద్యుత్తు, ఏటా రెండు మూడు ఉచిత వంట గ్యాస్‌ సిలిండర్లు, రైతులకు రుణమాఫీ, పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) పునరుద్ధరణ... గుజరాత్‌ ఎన్నికల్లో పార్టీలు గుప్పించిన హామీల్లో ఇవి కొన్ని. అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు ఆమ్‌ఆద్మీ పార్టీ సైతం పెద్దయెత్తున ఉచిత వాగ్దానాలు చేసింది. తరతమ భేదాలతో అన్ని పార్టీల మేనిఫెస్టోల్లో ఒకే రకమైన అంశాలు చోటుచేసుకున్నాయి. ఇటీవలి హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ ఎన్నికల్లోనూ ఈ తరహా హామీలే హోరెత్తాయి. ఓటర్లను ప్రలోభపెట్టే సంస్కృతికి స్వస్తి పలుకుదామంటూ ఇటీవల ప్రధాని మోదీ పిలుపిచ్చారు. గుజరాత్‌ ఎన్నికల్లో భాజపా సైతం పలు ఉచితాలను ప్రకటించింది. 

తాయిలాలే గెలుపు మార్గాలా?

రాష్ట్రాల ఆర్థిక స్థితిపై సరైన అంచనా, అవగాహన లేకుండా పార్టీలు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఉచితాల భారం ఎంత, లబ్ధి పొందే వారెందరు తదితర అంశాలను ఎన్నికల సంఘం (ఈసీ) స్వతంత్ర ఆర్థిక నిపుణులతో మదింపు చేయించాలి. ఆ తరవాతే హామీల ప్రకటనకు అనుమతించాలని కోరుతూ భాజపా నేత అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) సుప్రీంకోర్టులో లోతైన చర్చకు దారితీసింది. ఈ పిల్‌పై విచారణ సందర్భంగా అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం- పార్లమెంట్, ఈసీ, ఇతర రాజ్యాంగబద్ధ సంస్థల ముందు పలు ప్రతిపాదనలను ఉంచింది. ‘పన్నుల ద్వారా సమకూరే సొమ్మును ఉచితంగా ఇవ్వకూడదని చెప్పడం సులువే. కానీ, పేదరిక నిర్మూలన కార్యక్రమాల వల్ల ఒనగూడే ఫలితాలను కాదనలేం’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వాస్తవానికి సంక్షేమ పథకాల్లో ఏవి ఉచితాలు, ఏవి కాదు అని విస్పష్టంగా నిర్వచించలేం. తమిళనాడులో 1980ల్లో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం నేడు దేశవ్యాప్తంగా విస్తరించింది. తెలుగునాట ఎన్టీఆర్‌ ప్రారంభించిన రెండు రూపాయలకే కిలోబియ్యం పథకాన్ని వివిధ రాష్ట్రాలు అందిపుచ్చుకొన్నాయి. రైతులకు నేరుగా నగదు బదిలీ చేసేలా తెలంగాణ (రైతుబంధు), ఒడిశా (కాలియ), పశ్చిమ్‌ బెంగాల్‌ (కృషక్‌ బంధు) ప్రభుత్వాలు ప్రారంభించిన పథకాల మాదిరిగానే కేంద్రం ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజనను అమలు చేస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య బీమా పథకాలూ ఆ కోవలోనివే. ఉత్పాదక రంగానికి అందించే ప్రోత్సాహకాలు దీర్ఘకాలంలో సత్ఫలితాలను ఇస్తాయి. వాహనాలు, యంత్రాలు, చేతివృత్తుల కళాకారులకు పరికరాలు సబ్సిడీపై అందిస్తే వారి జీవనోపాధికి దన్నుగా నిలిచే అవకాశం ఉంది. మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు కుటుంబ ఆదాయాన్ని గణనీయంగా పెంచుతాయి. వారికి రవాణా భత్యం, పన్ను మినహాయింపు వంటి ప్రోత్సాహకాలను ఉచితాలుగా భావించలేం.

జాతీయ ప్రజారోగ్య విధానం-2017 ప్రకారం ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో కనీసం ఎనిమిది శాతం వెచ్చించాలి. అలాంటిది కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రాల సగటు ఖర్చు 6.6శాతమేనని తేలింది. సాధారణ పరిస్థితుల్లో అది మరింత తెగ్గోసుకుపోతుంది. ఇంటింటికీ కలర్‌ టీవీలు, సెట్‌టాప్‌ బాక్సులు, గృహోపకరణాలు, ఎలక్ట్రికల్‌ వస్తువులతో ఓటర్లను ప్రలోభపెట్టడానికి, పన్ను చెల్లింపుదారులపై భారాన్ని మోపడం సమంజసం అనిపించుకోదు. అభివృద్ధికి నమూనాగా అభివర్ణించే గుజరాత్‌లోనూ 31.56 లక్షల కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల ఆ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అయినా అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు జనాకర్షక హామీలను భాజపా నమ్ముకోవడం ఎన్నికల వైచిత్రి.

నియంత్రణ సాధ్యమేనా?

సంక్షేమం, ఉచితాల మధ్య విభజన రేఖ గీసి, ప్రలోభాలను నియంత్రించే శక్తి ఎన్నికల సంఘానికి ఉందా అన్నది నిపుణుల ప్రశ్న. అమలు చేయదగ్గ హామీలే ఇవ్వాలని ఈసీ నిర్దేశిస్తే, ఏ పార్టీ అయినా అందుకు తగిన ప్రాతిపదికను స్థూలంగా ఈసీ ముందు ఉంచుతుంది. రాష్ట్ర ఆదాయ వ్యయాల లోతుపాతుల్లోకి వెళ్ళకుండా, పైపై లెక్కల విన్యాసాలతో తమ వాగ్దానాలు ఆచరణ సాధ్యమేనంటూ పార్టీలు సమర్థించుకుంటాయి. ఆ వివరాలను సమగ్రంగా విశ్లేషించే యంత్రాంగం, సమయం ఈసీకి లేవు. ఒకవేళ ఈసీ వాటితో సంతృప్తి చెందినా, అధికారంలోకి వచ్చిన పార్టీ నిర్దిష్ట సమయంలోగా ఆ హామీలు అమలు చేయాలని నిర్దేశించగలదా... ఎగ్గొడితే సర్కారులను రీకాల్‌ చేయగలదా... ఇవన్నీ శేషప్రశ్నలే. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అయిదేళ్ల కాలానికి హామీలిచ్చి, తదుపరి ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు పథకాలను ప్రారంభించిన దాఖలాలున్నాయి. అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి, 140 మంది శతకోటీశ్వరులు ఉన్న భారత్‌లో నేటికీ అయిదో వంతు జనాభా పేదరికంలోనే మగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజల సంక్షేమానికి, జీవన, ఆహార, ఆరోగ్య భద్రతకు పూచీపడేలా పార్టీల మేనిఫెస్టోలు రూపుదిద్దుకోవాలి. లేనిపక్షంలో పదేళ్ల కిందట వెనుజువెలా, ఇటీవలి శ్రీలంక అనుభవాలే మనకూ ఎదురవుతాయి.


పరిణతికి పరీక్ష

కొన్ని పార్టీలు శాస్త్రీయ అధ్యయనం చేయకుండా సంక్షేమం పేరిట ఉచితాలనే నమ్ముకొని ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఓటర్లు వ్యక్తిగత ప్రయోజనాల ఉరవడిలో కొట్టుకుపోతూ పరిణతితో ఆలోచించే వీల్లేకుండా అవి చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక ఆ హామీల అమలుకు ప్రభుత్వ ఆస్తులను అమ్మేయడం, తాకట్టు పెట్టడం, కార్పొరేషన్ల పేరిట బడ్జెట్‌లో చూపించకుండా అప్పులు చేయడం వంటి ఆర్థిక అపసవ్య పద్ధతులను అనుసరిస్తున్నాయి. పంజాబ్‌, కేరళ, దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఈ ధోరణి ప్రమాదకరంగా మారుతోందని కాగ్‌ నివేదికలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే రూ.49 వేల కోట్ల రుణాలు సమీకరించింది. మద్యం విక్రయాలపై భవిష్యత్తు ఆదాయాన్ని హామీగా చూపిస్తూ రుణాలు తీసుకుంటోంది. సింహభాగం నిధులను నగదు బదిలీ రూపేణా ఖర్చుచేస్తోంది. సాగుకు ఉచిత విద్యుత్తు అందిస్తున్న రాష్ట్రాలు సకాలంలో ఆ బిల్లులను డిస్కమ్‌లకు జమ చేయకపోవడం, డిస్కమ్‌లు జెన్‌కోలకు చెల్లించకపోవడం విద్యుత్తు రంగ సంక్షోభానికి దారితీస్తోంది.

 బోండ్ల అశోక్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.