పదును తగ్గిన విపక్ష గళాలు

కరోనా వైరస్‌ దాదాపు కనుమరుగైన దశలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ఈ ఏడాది చివరిసారిగా జరిగే పార్లమెంటు సమావేశాలపై ఒకప్పటి ఆసక్తి కనిపించడంలేదు. అధికార, విపక్షాల వ్యవహారశైలి ఒకే సరళిలో కొనసాగుతుండటమే ఇందుకు కారణం.

Published : 07 Dec 2022 00:44 IST

నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

కరోనా వైరస్‌ దాదాపు కనుమరుగైన దశలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ఈ ఏడాది చివరిసారిగా జరిగే పార్లమెంటు సమావేశాలపై ఒకప్పటి ఆసక్తి కనిపించడంలేదు. అధికార, విపక్షాల వ్యవహారశైలి ఒకే సరళిలో కొనసాగుతుండటమే ఇందుకు కారణం.

నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు మొత్తం 17 పనిదినాల పాటు సాగనున్నాయి. వీటి ముందుకు ప్రభుత్వం 25 బిల్లులను తీసుకొస్తోంది. అందులో నాలుగు- తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కొన్నివర్గాలను కొత్తగా ఎస్టీ జాబితాలో చేర్చడానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులు. మరో నాలుగు- ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందాయి. ఇంకో రెండు- డిమాండ్‌ ఆన్‌ గ్రాంట్స్‌కి సంబంధించినవి. మిగిలిన వాటిలో అటవీ సంరక్షణ సవరణ బిల్లు, మల్టీస్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ సవరణ బిల్లులు మాత్రమే కొంత వేడి పుట్టిస్తున్నాయి. ఈ రెండింటినీ స్థాయీసంఘ పరిశీలనకు పంపాలని విపక్షాలు ఇప్పటికే డిమాండ్‌ చేస్తున్నాయి. ఇవి మినహా మిగిలిన బిల్లులు సాఫీగా ఆమోదం పొందే సూచనలు కనిపిస్తున్నాయి.

ఖర్గే సమర్థతకు సవాలు

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే రోజునే దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరుసటిరోజు గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఎలక్షన్ల ఫలితాలు రానున్నాయి. ఇవి సమావేశాల గతి రీతులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దిల్లీ, గుజరాత్‌లలో అక్కడి అధికార పార్టీలు జయకేతనం ఎగరవేస్తాయని ముందస్తు అంచనాలు చెబుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ప్రతి అయిదేళ్లకోసారి ప్రభుత్వం మారే సంప్రదాయం ఆ రాష్ట్రంలో ఉంది. ఈసారీ అదే పునరావృతమైతే కాంగ్రెస్‌ ఊపిరి పీల్చుకుంటుంది. ఉత్తరాఖండ్‌ తరహాలో హిమాచల్‌లోనూ భాజపా పైచేయి సాధిస్తే, హస్తంపార్టీ మరింత నైతిక స్థైర్యాన్ని కోల్పోతుంది. పార్లమెంటులోనూ ఆ పార్టీ స్వరంలో తేడా వచ్చే అవకాశం ఉంది. దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ గెలిస్తే మద్యం కుంభకోణం పేరుతో కేంద్రం తమ నాయకులపై పెడుతున్న కేసుల గురించి పార్లమెంటులో ఆందోళనను ఉద్ధృతం చేయడం ఖాయం. దానికి తెలంగాణ రాష్ట్ర సమితి సైతం జతకలిసే వీలుంది.

సమావేశాల నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం పార్లమెంటరీ వ్యవహారాలశాఖ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి 31 పార్టీలు హాజరయ్యాయి. తమ డిమాండ్ల చిట్టాను అవి ప్రభుత్వం ముందుంచాయి. రాజకీయంగా ఎన్ని దెబ్బలు తిన్నా పార్లమెంటులో అనుసరించబోయే వ్యూహాలను కాంగ్రెస్‌ మార్చడంలేదు. తొలినుంచీ ధరల పెరుగుదల, నిరుద్యోగం, రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం అన్న అంశాలనే చర్వితచర్వణంగా అది వల్లెవేస్తోంది. ఇవి సామాన్యుల జీవితాలతో ముడివడిన అంశాలైనా- వారికి అర్థమయ్యేలా, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా సభముందుకు తేవడంలో ఆ పార్టీ విఫలమవుతోంది. కాంగ్రెస్‌ జాతీయ అంశాలపై, మిగిలిన ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ అంశాలపై పార్లమెంటు వేదికగా పోరాడాలని భావిస్తున్నాయి. జాతీయ అంశాలకు ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ అంశాలకు జాతీయ పార్టీలు మద్దతిచ్చే అవకాశం లేకపోవడం ప్రభుత్వానికి అయాచిత వరమవుతోంది.

తెలంగాణలో భాజపా, తెరాసల మధ్య ప్రత్యక్ష యుద్ధం నడుస్తున్నందువల్ల తెరాస ఎంపీలు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా అస్త్రాలు ప్రయోగించే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ పార్టీల అండ లేకుండా ప్రాంతీయ పార్టీలు చేసే ఆందోళనలు పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరవాత జరుగుతున్న తొలి పార్లమెంటు సమావేశాలు ఇవే. భారత్‌ జోడో యాత్ర కారణంగా రాహుల్‌గాంధీ ఈ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. చలికాలం అనారోగ్య ఇబ్బందులవల్ల సోనియాగాంధీ సరిగ్గా సభకు వచ్చే పరిస్థితి లేదు. ఈ తరుణంలో పార్టీని సమర్థంగా నడపడం ఖర్గేకు కత్తిమీద సామే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌, డీఏంకే, వామపక్షాలు, ఆప్‌, తెరాసలాంటివి బలంగా వ్యతిరేకిస్తున్నాయి. మిగిలిన పార్టీలన్నీ పరిస్థితులను బట్టి వ్యవహరిస్తున్నాయి. పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ వైఖరిలో ఉపరాష్ట్రపతి ఎన్నికల తరవాత నుంచి మార్పు వచ్చింది. గత పార్లమెంటు సమావేశాల వరకు ఎన్డీయే కూటమిలో సభ్యుడిగా ఉన్న బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఆర్‌జేడీతో జట్టుకట్టడంతో రాజ్యసభలో ఎన్డీయే మిత్రపక్ష బలం కొంత తగ్గింది. ఆ లోటును రహస్య మిత్రుల ద్వారా మోదీ ప్రభుత్వం అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎన్నికలకు అస్త్రంగా...

కొలీజియం వ్యవస్థపై ఇటీవల కేంద్రం దాడిని పెంచింది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ రెండు అంశాలపైనా ఈ సమావేశాల్లో వాడివేడి చర్చకు అవకాశం ఉంది. భాజపా తన వరస గెలుపులను, మోదీ నాయకత్వంలో భారత్‌కు జీ20 నాయకత్వం దక్కిన అంశాన్ని పార్లమెంటు వేదికగా బలంగా చాటి రాబోయే ఎన్నికలకు వాటిని అస్త్రంగా మలచుకోవడానికి ప్రయత్నించవచ్చు. కరోనా పేరుతో మీడియా ప్రతినిధులకు ఆంక్షలతో కూడిన ప్రవేశం కల్పించడం లోటుగా కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం ఇవ్వడం మినహా మిగిలిన సమయాల్లో ప్రధానమంత్రి సమావేశాల్లో పెద్దగా భాగస్వామ్యం వహించడం లేదు. ప్రతిపక్షాలవైపు నుంచి అనుభవజ్ఞులైన పార్లమెంటేరియన్లు కొరవడ్డారు. ప్రాంతీయ పార్టీల సభ్యులు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఫలితంగా పార్లమెంటు సమావేశాల్లో చర్చల వాడి తగ్గడం- స్పష్టంగా కనిపిస్తోంది.


తొలిసారి ధన్‌ఖడ్‌

ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ సమావేశాలు కొత్త పార్లమెంటు భవనంలో జరగాలి. నిర్మాణంలో జాప్యం కారణంగా కొత్త భవనం అందుబాటులోకి రావడం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త సంవత్సరంలో బడ్జెట్‌ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగం ఒక్కటే నూతన భవనంలో జరిగే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి    జగదీప్‌ ధన్‌ఖడ్‌ తొలిసారి రాజ్యసభకు నేతృత్వం వహించబోతున్నారు. ఆయన వ్యవహారశైలి ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ప్రభుత్వం ఈ సమావేశాల ముందుకు విద్యుత్తు చట్ట సవరణ, డేటా ప్రొటెక్షన్‌, బ్యాంకింగ్‌ అమెండ్‌మెంట్‌ లాంటి వివాదాస్పద బిల్లులను తీసుకురావడంలేదు. అందువల్ల పెద్దగా గందరగోళం లేకుండానే సభ సజావుగా సాగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది కర్ణాటక ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కర్ణాటక-మహారాష్ట్రల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలను అక్కడి రాజకీయ    పార్టీలు పార్లమెంటులో లేవనెత్తే అవకాశాలున్నాయి.


- చల్లా విజయభాస్కర్‌

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి