ఓటు... ప్రజాస్వామ్య జీవనాడి!

నేడు భారతదేశం 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించుకొంటోంది. సార్వత్రిక ఎన్నికల తరవాత ఇదే అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగ.

Published : 25 Jan 2023 00:03 IST

నేడు భారతదేశం 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించుకొంటోంది. సార్వత్రిక ఎన్నికల తరవాత ఇదే అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగ. అర్హులైన ఓటర్లందరూ ఓటుహక్కు వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన పండుగ రోజు. ఆ దిశగా ప్రజల్ని చైతన్య పరచడమే ఓటర్ల దినోత్సవం ముఖ్య ఉద్దేశం.

జాతీయ ఓటర్ల దినోత్సవ ఆవిర్భావం ఎంతో ఆసక్తికరంగా జరిగింది. 2010 సెప్టెంబరులో భువనేశ్వర్‌లో నిర్వహించిన ఒక ప్రజాకార్యక్రమంలో పాల్గొన్నవారిలో నుంచి ఒక యువకుడు లేచి, ‘18 ఏళ్ల వయసు రావడమనేది సంబరం చేసుకోవలసిన సందర్భం. కాబట్టి ఏడాదిలో కనీసం ఒక్కరోజైనా 18 ఏళ్లవారు పండుగ చేసుకోవడానికి కేటాయించాలి’ అని కోరారు. ఆ భావన నుంచే జాతీయ ఓటర్ల దినోత్సవం ఆవిర్భవించింది. 2011 జనవరి ఒకటో తేదీనాటికి 18 ఏళ్ల వయసు నిండినవారిని, లేదా ఆ వయసు రాబోతున్నవారిని మూడు నెలల ముందే గుర్తించి, కొత్త సంవత్సరం రాగానే వారి వివరాలను చేర్చి కొత్త ఓటర్ల జాబితాను ప్రకటించాలని నిర్ణయించడం జరిగింది. ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి దేశంలోని ఎనిమిది లక్షల పోలింగ్‌ కేంద్రాల్లో 2011 జనవరి 25న అర్హులైన వారందరికీ ఆ కార్డులను అందించాలని నిర్ణయించాం. ఈ తేదీకి విశేష ప్రాధాన్యం ఉంది. 1950లో సరిగ్గా అదే తేదీన ఎన్నికల సంఘం ఆవిర్భవించింది. ఆ మరుసటి రోజే భారత్‌ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఏటా జనవరి 25 తేదీన ఓటర్ల దినోత్సవంగా జరపాలన్న నిర్ణయం మేరకు మొట్టమొదటి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ఘనంగా ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో దేశదేశాల నుంచి వచ్చిన 30 మంది ప్రధాన ఎన్నికల కమిషనర్లు పాల్గొన్నారు. వారిలో పాకిస్థాన్‌, భూటాన్‌ ఎన్నికల కమిషనర్లూ ఉన్నారు. వీరంతా దిల్లీ నుంచి తమ తమ దేశాలకు వెళ్ళి సొంతంగా జాతీయ ఓటర్ల దినోత్సవాలను ప్రకటించుకున్నారు.

మధ్యతరగతి ఉదాసీనత

భారత్‌లో, ముఖ్యంగా పట్టణాల్లో విద్యావంతులైన మధ్యతరగతి ప్రజలు పోలింగ్‌లో పాల్గొనే విషయంలో ఉదాసీనత కనబరుస్తారు. వారు ఓటు వేయకపోవడమే కాకుండా, ఓటింగ్‌లో పాల్గొనలేదంటూ గర్వంగా చెప్పుకోవడమూ కనిపిస్తుంది. ఓటు వేయడం నామోషీగా భావించే స్థితి నుంచి అందరినీ ఇళ్ల నుంచి బయటకు తీసుకురావడం మా ముందున్న సవాలు. దాన్ని అధిగమించడానికి ఎంతో సమయం పట్టలేదు. ఓటు వేయనివారిని ఆటపట్టించే కార్యక్రమాన్ని 2010లో చేపట్టడం ద్వారా ఆశించిన ఫలితాన్ని రాబట్టగలిగాం. పోలింగ్‌ శాతం గణనీయంగా పెరగసాగింది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం ప్రచార దూతగా రంగంలోకి దిగడమూ ఎంతో తోడ్పడింది. ఆయనతోపాటు మరింతమంది ప్రచార దూతలుగా బాధ్యత తీసుకున్నారు. అంతవరకు ఎన్నికలంటే అనాసక్తత, కొన్ని సందర్భాల్లో తూష్ణీభావం ప్రదర్శిస్తూ వచ్చిన యువతరం తామే ముందుండి ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 25వేల మంది ప్రాంగణ దూతలను నియమించాం. పాఠశాల విద్యార్థులు కూడా తల్లిదండ్రులను ఓటు వేసేలా ప్రేరేపించారు. ఫలితంగా 2010 నుంచి అన్ని ఎన్నికల్లో పోలింగ్‌ శాతం రికార్డులు సృష్టించసాగింది. 2014 ఎన్నికల్లో 66.4 శాతం పోలింగ్‌ నమోదై ఆరు దశాబ్దాల రికార్డు సృష్టించింది. 2019లో అంతకన్నా పెద్ద రికార్డు నమోదైంది. కొన్ని రాష్ట్రాల్లోనైతే 80 శాతం పోలింగ్‌ నమోదైంది. 2019లో తొలిసారిగా పురుషులకన్నా స్త్రీలు ఎక్కువగా పోలింగ్‌లో పాల్గొన్నారు. దీన్ని కొందరు ఎన్నికల భాగస్వామ్య విప్లవంగా అభివర్ణించారు. చేతి వేలి మీద ఎన్నికల సిరా గుర్తు ప్రజాస్వామ్య ప్రతీకగా మారింది. ఓటు వేసి వచ్చినవారికి రెస్టారెంట్లు డిస్కౌంట్లు ఇవ్వసాగాయి. క్షౌరశాలలు ఉచితంగా క్షవర సేవలు అందించసాగాయి.

భారతదేశంలో తొలి ఎన్నికల సంవత్సరమైన 1951లో అర్హులైనవారిలో 17 శాతం ఓటర్లుగా నమోదయ్యారు. వారిలో 45 శాతమే పోలింగ్‌లో పాల్గొన్నారు. 2019 వచ్చేసరికి అర్హులైన ఓటర్లలో 91 శాతం ఓటరు రికార్డులకెక్కారు. వారిలో 67 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్హులైన ఓటర్లలో దాదాపు 30 కోట్లమంది పోలింగ్‌ కేంద్రాలకు దూరంగా ఉండిపోయారు. జీవనోపాధి కోసం స్వస్థలాలు వదిలి వలస వెళ్ళినవారు పోలింగ్‌లో పాల్గొనలేకపోవడమే ఈ పరిస్థితికి ఒక ముఖ్య కారణం. ఈ సమస్యపై ఎన్నికల సంఘం నియమించిన అధికారుల కమిటీ రిమోట్‌ ఓటింగ్‌ను పరిష్కారంగా ప్రతిపాదించింది. దీని గురించి చర్చించడానికి ఎన్నికల సంఘం ఈ ఏడాది జనవరి 16న అన్ని గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. భారత పౌరులకు దేశంలో ఎక్కడికైనా వెళ్ళడానికి, నివసించడానికి స్వేచ్ఛ ఉందని రాజ్యాంగం భరోసా ఇస్తోంది. కానీ, కూలీ పనుల కోసం స్వల్పకాలంపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు వలసవెళ్ళే కోట్లమంది ఓటుకు నోచుకోలేకపోతున్నారు. 19(1)ఎ రాజ్యాంగ అధికరణ ప్రకారం వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించాల్సి ఉందని సుప్రీంకోర్టు పలు కేసుల్లో తీర్పులు ఇచ్చింది. ఆ అవకాశం కల్పించకపోవడం వారి ప్రాథమిక హక్కును నిరాకరించడమే అవుతుంది. అయితే, నివాస ధ్రువీకరణ ఉంటేనే సంబంధిత ప్రాంతంలో ఓటుహక్కు వినియోగించుకోవాలనే నిబంధన వలసదారులకు అడ్డుగా మారుతోంది.  

పరిష్కారాలు ఏమిటి?

ప్రాదేశిక, సామాజిక కారణాల వల్ల సొంత నియోజకవర్గాల్లో ఓటు వేయలేకపోతున్న కొన్ని వర్గాలకు తపాలా బ్యాలట్‌ విధానం అందుబాటులో ఉంది. దీన్ని ‘ఎలెక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలట్‌ సిస్టమ్‌ (ఈపీటీబీ)’ అంటారు. ఓటింగ్‌లో మోసాలకు తావివ్వని విధానమిది. 2019 ఎన్నికల్లో 18 లక్షలమంది రక్షణ సిబ్బంది ఈ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని పురస్కరించుకుని విదేశాల్లోని 3.1 కోట్లమంది ప్రవాస భారతీయులకూ రిమోట్‌ ఓటింగ్‌ సౌకర్యం కల్పించడానికి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. స్వదేశంలోనే ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారికీ ఇదే సౌకర్యం కల్పించాలి. దీనికోసం ఎన్నికల సంఘం బహుళ నియోజకవర్గ రిమోట్‌ ఎలెక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్ర నమూనాను సిద్ధం చేసింది. దీన్ని ఆర్‌వీఎం అంటారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ఈవీఎంలో తగు మార్పులు చేసి రూపొందించిన ఆర్‌వీఎం ద్వారా ఇతరప్రాంతాల్లోని ప్రజలు ఒకే రిమోట్‌ పోలింగ్‌ కేంద్రం నుంచి 72 నియోజక వర్గాల్లో దేనిలోనైనా ఓటు వేసే సౌకర్యం లభిస్తుంది. దీనిపై అన్ని రాజకీయ పార్టీలూ ఫిబ్రవరి చివరికల్లా అభిప్రాయాలను తెలపాలని కోరారు. ఈ క్రమంలో ప్రతి ఓటరూ తన రాజ్యాంగ హక్కును వినియోగించుకుని పోలింగ్‌లో పాల్గొంటేనే భారత్‌ అతి గొప్ప ప్రజాస్వామ్యంగా వర్ధిల్లుతుంది.


పెరిగిన  ఓటింగ్‌

భారత్‌లో కేవలం తొమ్మిదేళ్లు జాతీయ ఓటర్ల దినోత్సవాలు జరిగిన తరవాత 2019 పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలు 67.1 శాతం పోలింగ్‌తో దేశ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక పోలింగ్‌ రేటు నమోదు చేశాయి. 2009లో ఈ రేటు కేవలం 58 శాతమే. ఎన్నికల్లో పాల్గొనాలంటూ ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ‘సిస్టమాటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌ (స్వీప్‌)’ కార్యక్రమానికి ఓటర్ల దినోత్సవం పతాకం వంటిది. నిజానికి ఓటర్లను జాగృతం చేయడం ఎన్నికల సంఘం బాధ్యతా అని మా సంఘంలోనే ప్రశ్నించినవారున్నారు. నా దృష్టిలో అది ఎన్నికల సంఘం బాధ్యతే. బాగా తక్కువ పోలింగ్‌ శాతం నమోదుకావడం మన ఎన్నికల్లో ప్రధాన లోపం. దాంతో మన ప్రజా ప్రతినిధులు నిజంగా విస్తృత ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమయ్యేవి. కాబట్టి ఓటుహక్కు తప్పక వినియోగించుకునేలా ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉంది.

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు