కీచక పర్వంలో క్రీడాకారిణులు
కుటుంబ కష్టాలు దాటి... సామాజిక సవాళ్లను అధిగమించి... క్రీడా యవనికపై మెరిసి... అంతర్జాతీయ స్థాయికి చేరినా రక్షణ కొరవడుతోంది.
కుటుంబ కష్టాలు దాటి... సామాజిక సవాళ్లను అధిగమించి... క్రీడా యవనికపై మెరిసి... అంతర్జాతీయ స్థాయికి చేరినా రక్షణ కొరవడుతోంది. ప్రపంచ వేదికపై పతకాలతో త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తున్న భారత క్రీడాకారిణులకు లైంగిక హింస, వేధింపులు తప్పడం లేదు. ఆటలో ప్రత్యర్థులపై విజయాలతో చెలరేగుతున్నా- స్వదేశంలో శిక్షకులు, క్రీడా పాలకుల చేతిలో ఓడిపోక తప్పని దుస్థితి నెలకొంది. దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొస్తున్న భరతమాత ముద్దుబిడ్డలు క్రీడాజీవితంలో సగర్వంగా గెలిచి నిలిచేదెప్పుడు?
ఇటీవల దిల్లీలో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై వివిధ ఆరోపణలతో మేటి రెజ్లర్లు ధర్నాకు దిగడం సంచలనం సృష్టించింది. మహిళా రెజ్లర్లపై బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. వాటిపై విచారణ కోసం భారత ఒలింపిక్ సంఘం, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వేర్వేరు కమిటీలను నియమించడంతో రెజ్లర్లు నిరసన విరమించారు. కానీ, ఆ సమస్య సంపూర్ణంగా సమసిపోలేదు. మహిళా అథ్లెట్లపై శిక్షకులు, క్రీడా పాలకుల లైంగిక వేధింపుల పర్వం ఎప్పటి నుంచో సాగుతోంది. దానివల్ల కొంతమంది అమ్మాయిలు మానసికంగా కుంగిపోయి ఆటకు దూరమైతే, మరికొందరు ప్రాణాలే కోల్పోతున్నారు.
చర్యలు నామమాత్రం
నిరుడు ఏప్రిల్‌లో కోచ్ మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని బిహార్‌లో బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది మే నెలలో స్లొవేనియాలో శిక్షణ శిబిరం సందర్భంగా కోచ్ ఆర్కే శర్మ మసాజ్ చేసేందుకు ప్రయత్నించారని, లైంగిక వాంఛ తీర్చాలన్నారని భారత క్రీడాప్రాధికార సంస్థ(సాయ్)కు మహిళా సైక్లిస్ట్ ఫిర్యాదు చేయడంతో అతడిపై వేటు పడింది. జర్మనీలో శిక్షణ సందర్భంగా కోచ్ అనుచితంగా ప్రవర్తించారని అగ్రశ్రేణి భారత మహిళా సెయిలర్ వెల్లడించారు. జులైలో ఐరోపా పర్యటనలో తమతో అసభ్యకరంగా ప్రవర్తించారని అండర్-17 ఫుట్‌బాల్ జట్టు అమ్మాయిల ఫిర్యాదుతో సహాయక కోచ్ అలెక్స్ ఆంబ్రోస్‌ను తొలగించారు. 2021 జులైలో ఏడుగురు మహిళా అథ్లెట్లు ప్రముఖ అథ్లెటిక్స్ కోచ్ పి.నాగరాజుపై లైంగిక హింస ఆరోపణలు చేయడం కలకలం రేపింది. మహిళా క్రికెటర్‌ను వేధించారని 2020 జనవరిలో కోచ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 2010లో అప్పటి భారత మహిళల హాకీ జట్టు కోచ్ మహారాజ్ కిషన్ కౌశిక్ లైంగికంగా హింసిస్తున్నారంటూ కొంతమంది క్రీడాకారిణులు హాకీ ఇండియాకు ఫిర్యాదు చేశారు. జాతీయ పోటీలకు ఎంపిక చేయాలంటే లైంగిక కోరికలు నెరవేర్చాలని తమిళనాడు బాక్సింగ్ సంఘం కార్యదర్శి ఏకే కరుణాకరన్ బలవంతం చేస్తున్నారంటూ బాక్సర్ తులసి 2009లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవి మహిళా అథ్లెట్లపై అరాచకాలకు కొన్ని ఉదాహరణలు.
లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నా, వాటికి అడ్డుకట్ట వేసే దిశగా ఎలాంటి ప్రయత్నాలూ జరగడం లేదు. తప్పును గుర్తించి, తగిన చర్యలు తీసుకునే వ్యవస్థే లేదు. ఎప్పుడైనా ఆరోపణలు రాగానే హడావుడి చేయడం, కమిటీలు వేసి సాగదీయడం పరిపాటిగా మారింది. ఇప్పుడు రెజ్లర్ల నిరసనను రాజకీయ కుట్రగా భూషణ్ వ్యాఖ్యానిస్తుండటంతో ఇది మరో రంగు పులుముకొంది. వేధింపుల గురించి బయటపెట్టే స్వేచ్ఛాయుత వాతావరణమే మన దగ్గర లేదనేది కఠోర వాస్తవం. క్రీడల్లో లైంగిక వేధింపుల ఘటనలు ఎక్కువగానే ఉంటాయని, ఎంతోమంది వాటిని బయట పెట్టడం లేదని మహిళా సాధికారత కోసం ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ 2019లో వెల్లడించింది. లైంగిక హింస గురించి ఇంట్లోవాళ్లకు చెబితే ఆటలే మాన్పించేస్తారని, తెగించి ఫిర్యాదు చేస్తే కెరీర్ అక్కడితో ఆగిపోతుందేమోననే భయం క్రీడాకారిణులను వెన్నాడుతోంది. క్రీడా సమాఖ్యల ద్వారానే అథ్లెట్ కెరీర్ కొనసాగించాల్సి రావ డాన్ని అదనుగా తీసుకుని అమ్మాయిలను లొంగదీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పుడు ఆరోపణలంటూ, సాక్ష్యాలు లేవంటూ ఎన్నో ఉదంతాల్లో చర్యలే ఉండటం లేదు. ఫిర్యాదు చేసిన తరవాత విచారణ జరిగి, దోషిగా తేలేసరికి పదవీ విరమణ పొందుతున్న సందర్భాలు ఉంటున్నాయి. నిందితులను చిన్నపాటి శిక్షలతో వదిలేస్తుండటంతో పరిస్థితిలో మార్పులు రావడం లేదు. ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తులు శక్తిమంతులైతే వారికెలాంటి ఢోకా ఉండదనేది కాదనలేని నిజం. భాజపా తరఫున యూపీలో పలుమార్లు ఎంపీగా గెలిచిన బ్రిజ్‌భూషణ్ మూడో పర్యాయం డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా (2011 నుంచి) కొనసాగుతున్నారు.
మార్పు అత్యావశ్యకం
క్రీడాకారిణులపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడా సమాఖ్యలదే. ఆరోపణలపై సత్వరమే విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షిస్తే ప్రయోజనం ఉంటుంది. విచారణ కోసం వేసే కమిటీలు వేగంగా తమ పని పూర్తి చేయడం ముఖ్యం. దోషులు ఎంతటివారైనా శిక్ష తీవ్రంగా ఉండాలి. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఫిర్యాదు చేసినా కెరీర్‌కు ప్రమాదం ఉండదనే భరోసాను క్రీడాకారులకు కల్పించాలి. ప్రతి క్రీడా సమాఖ్యలో నమోదయ్యే ఫిర్యాదులు, పరిష్కారాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్లో పొందుపరచాలి. క్రీడాకారిణుల శిక్షణకు వీలైనంత ఎక్కువగా మహిళా కోచ్‌లను నియమించే యత్నాలు జరగాలి. గత రెండు ఒలింపిక్స్‌లలో భారత అథ్లెట్ల బృందంలో మహిళల వాటా 44శాతానికి పెరిగింది. శిక్షణ సిబ్బంది విషయంలో మాత్రం ఎలాంటి పురోగతీ లేదు. మహిళా కోచ్‌లు, సెలక్టర్లకు మరింతగా సహకారం దక్కాలి. ముఖ్యంగా, క్రీడా పాలనలో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉంది.
అంతర్గత కమిటీలు ఏవీ?
పని ప్రదేశంలో మహిళలపై లైంగిక హింస నిరోధం కోసం 2013లో తీసుకొచ్చిన చట్టం క్రీడాకారిణులకూ వర్తిస్తుంది. క్రీడాసంస్థ, స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, పోటీలు, వేదికలు వంటివాటినన్నింటినీ పని ప్రదేశాలుగానే పరిగణిస్తారు. చట్టం ప్రకారం లైంగిక హింస ఆరోపణలపై విచారణకు క్రీడా సమాఖ్యల్లో అంతర్గత కమిటీలు వేయాలి. దేశంలో గుర్తింపు పొందిన 56 జాతీయ క్రీడా సమాఖ్యల్లో ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు చాలా తక్కువ. లైంగిక వేధింపులపై ఫిర్యాదుల కోసం సాయ్‌లో సహాయక కేంద్రం ఏర్పాటు చేయాలని భారత దిగ్గజ అథ్లెట్ అంజు బాబీ జార్జ్ అయిదేళ్ల క్రితమే కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. ఓ నివేదిక ప్రకారం 2010 నుంచి 2020 వరకు పదేళ్లలో లైంగిక వేధింపులపై సాయ్‌లో 45 ఫిర్యాదులు నమోదయ్యాయి. వాటిలో 29 కోచ్‌లకు వ్యతిరేకంగా ఉన్నా, చర్యలు అంతంత మాత్రమే. నిరుడు జులైలో రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా 2017 నుంచి కోచ్‌లు, సిబ్బందిపై సాయ్‌కు 30 లైంగిక హింస ఫిర్యాదులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
శనిగారపు చందు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Ap-top-news News
సీఎం జగన్ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
-
Movies News
Priyanka Chopra: బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. అందుకే హాలీవుడ్‌కి వెళ్లానంటూ