Budget 2023: కొత్త బడ్జెట్‌... కోటి ఆశలు!

ఏటా కొత్త బడ్జెట్‌ (Budget 2023) రాబోతున్నదనగానే అన్ని వర్గాల్లో ఎన్నెన్నో ఆశలు! అందులో సాకారమయ్యే వాటికన్నా, నెరవేరనివే ఎక్కువ. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించే ఆర్థిక పద్దు- లోక్‌సభ ఎన్నికలకు ముందు వచ్చే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ (Budget 2023).

Updated : 31 Jan 2023 10:00 IST

ఏటా కొత్త బడ్జెట్‌ (Budget 2023) రాబోతున్నదనగానే అన్ని వర్గాల్లో ఎన్నెన్నో ఆశలు! అందులో సాకారమయ్యే వాటికన్నా, నెరవేరనివే ఎక్కువ. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించే ఆర్థిక పద్దు- లోక్‌సభ ఎన్నికలకు ముందు వచ్చే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ (Budget 2023). ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ద్రవ్యోల్బణమూ అదుపులోకి రాలేదు. ఇప్పటికే అధిక రుణభారం మోస్తున్న ప్రభుత్వం- పారిశ్రామిక, వ్యవసాయ రంగాల అవసరాలు తీర్చగలిగే స్థాయిలో కేటాయింపులు చేయగలుగుతుందా అన్నదే కీలక ప్రశ్న!

అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు ఎక్కువగానే ఉన్నాయి. కొవిడ్‌ వల్ల దెబ్బతిన్న సరఫరా గొలుసులు ఇంకా గాడిన పడలేదు. ఆర్థిక మాంద్యానికి తోడు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీస్తుందన్న ఆందోళనా ముప్పిరిగొంటోంది. ఏతావతా 2014లో నరేంద్ర మోదీ సర్కారు కేంద్రంలో అధికారం చేపట్టిన తరవాత ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితుల్లో బడ్జెట్‌ (Budget 2023)ను సమర్పించాల్సి వస్తోంది. రుణ భారాన్ని తగ్గిస్తామని, ఆర్థిక క్రమశిక్షణ తీసుకొస్తామని, 2022కల్లా రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామంటూ ఎన్డీయే సర్కారు ఇచ్చిన వాగ్దానాలేవీ నెరవేరలేదు.

లక్ష్యాన్ని అందుకోవడం కష్టమే

విత్త లోటు జీడీపీలో 6.4 శాతం, రెవిన్యూ లోటు 3.8 శాతం. 2026 ఆర్థిక సంవత్సరానికల్లా విత్త లోటును 4.5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమలకు భారీ సబ్సిడీలు ఇవ్వడం, ఇతరత్రా ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల ఆ లక్ష్యాన్ని అందుకోవడం కష్టమే. ఇప్పటి నుంచి 2026 వరకు ప్రతి బడ్జెట్‌ (Budget 2023)లో సబ్సిడీలను జీడీపీలో ఒక శాతానికి సమాన మొత్తంలో తగ్గించుకొంటూ వస్తే తప్ప విత్తలోటును తగ్గించడం సాధ్యపడదు. అయితే ఈ ఏడాది, వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నందువల్ల సబ్సిడీలను తగ్గించడం అసంభవం. ఈ ఏడాది కేంద్రం సగటున నెలకు రూ.1.3 లక్షల కోట్ల చొప్పున అప్పు చేస్తూ వచ్చింది. పన్ను వసూళ్లు పెరుగుతున్నా అప్పులు చేయకతప్పని స్థితి నెలకొంది. ఎన్డీయే ప్రభుత్వం ఇన్నేళ్లలో ఒకే ఒక్కసారి విత్త లోటును కట్టడి చేయగలిగింది. 2016 మార్చి నాటికి ప్రభుత్వ రుణ భారం మొత్తం రూ.64 లక్షల కోట్లయితే, నేడు అది రూ.142 లక్షల కోట్ల పైమాటే. ముఖ్యమైన కార్యక్రమాలపై ప్రభుత్వ వ్యయం పెరగడం ఒక్కటే ఊరట కలిగించే అంశం. మొత్తం సబ్సిడీలలో 40 శాతం ఆహారం, ఎరువులు, పెట్రో ఉత్పత్తులపై సబ్సిడీలే. రష్యా నుంచి చవకగా చమురు కొనడం కొంత ఉపకరించింది. లేకపోతే దిగుమతుల బిల్లు, పెట్రో సబ్సిడీలు ఇంకా పెరిగిపోయేవి. ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయానికి సంబంధించి గత బడ్జెట్‌ (Budget 2023)లో నిర్దేశించిన లక్ష్యాన్ని సర్కారు అందుకోలేకపోయింది. ఈ విక్రయం ద్వారా ఆశించిన మొత్తంలో 70 నుంచి 75 శాతం మాత్రమే లభించింది.

 

వచ్చే బడ్జెట్‌ (Budget 2023)లో ఆదాయ పన్ను శ్లాబులు మారుస్తారని, స్టాండర్డ్‌ డిడక్షన్‌ను, పన్ను మినహాయింపు మొత్తాలను పెంచుతారని వేతన జీవులు ఆశపెట్టుకున్నారు. ఉద్యోగ విరమణ చేసినవారు పాత పింఛన్‌ విధానం మళ్ళీ వస్తుందని ఎదురుచూస్తున్నారు. ఆ అవకాశమే లేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేసినా, విశ్రాంత ఉద్యోగులు ఆశ వీడటం లేదు. మధ్యతరగతి ప్రజలకు ద్రవ్యోల్బణం వల్ల జీవన వ్యయం పెరుగుతున్నా 2014 నుంచి వారి ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షల వద్దనే నిలిచిపోయింది. దీన్ని పెంచడం వల్ల అసంఖ్యాక వేతన జీవులకు ఎంతో ఊరట లభిస్తుంది. వ్యాపారాలపై పన్నులు తగ్గించి, కొన్ని సెస్సులను తొలగించినా కొత్త బడ్జెట్‌ (Budget 2023) మరింతగా పన్ను రాయితీలను అందిస్తుందని వ్యాపార వర్గాలు ఆశపెట్టుకుంటున్నాయి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్‌ఐ) మరికొంత కాలం పొడిగించాలని పారిశ్రామిక రంగం ఆశిస్తోంది. అంకుర సంస్థలకు నూరు శాతం పన్ను విరామం, ప్రవాస భారతీయులు ఆర్జించే వడ్డీపై తక్కువ పన్ను, విద్యుత్‌ వాహనాల కొనుగోలు రుణాలపై వడ్డీ తగ్గింపు, గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో నెలకొల్పిన పరిశ్రమలకు పన్ను రాయితీలను కొత్త బడ్జెట్‌ (Budget 2023)లోనూ కొనసాగించాలని పారిశ్రామిక రంగం కోరుకొంటోంది. సౌర విద్యుదుత్పాదనకు ఉపయోగించే సౌర ఫలకాలపై పెట్టుబడులకు కొన్నేళ్ల క్రితం వరకు పూర్తి తరుగుదలను అనుమతించేవారు. దాన్ని పునరుద్ధరిస్తే వ్యక్తులకు, వ్యాపారాలకు ఎంతో వెసులుబాటుగా ఉంటుంది.

విద్య, వైద్యంపై పెట్టుబడులు

భారతీయుల దీర్ఘకాల ఆహార భద్రతకు బడ్జెట్‌ (Budget 2023)లో ప్రాధాన్యం ఇవ్వాలి. మన యువతకు వృత్తి నైపుణ్యాలను పెంచి, వారి కోసం పెద్దయెత్తున శాశ్వత ఉద్యోగాలను సృష్టించాలి. విద్య, వైద్యంపై ప్రభుత్వ పెట్టుబడులను పెంచడం దీనికి బాటలు వేస్తుంది. నూతన విద్యావిధానంలో ప్రతిపాదించిన లక్ష్యాలను అందుకోవాలంటే ఇప్పటి నుంచి 2030 వరకు ఏటా ఆరు శాతం జీడీపీని ఆధునిక విద్యా వసతులపై వెచ్చించాలి. మరిన్ని పాలిటెక్నిక్‌లను, ఇతర సాంకేతిక విద్య శిక్షణ సంస్థలను స్థాపించి విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాలను నేర్పాలి. ఉపాధ్యాయులకూ అధునాతన శిక్షణ ఇచ్చి వారి బోధన నైపుణ్యాలను ఇనుమడింపజేయాలి. సామర్థ్యానికి తగినట్లు జీతభత్యాలు పెంచాలి. పంట దిగుబడులు తగ్గుతున్న నేపథ్యంలో వ్యవసాయ పరిశోధనలపై పెట్టుబడులను అధికం చేయాలి. ఓట్లను ఆకర్షించడం కోసం పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని పలు రాష్ట్రాలు భావిస్తున్నాయి. దానివల్ల ఆ రాష్ట్రాలు ఆర్థికంగా దివాలా తీయకతప్పదు. దీన్ని నివారించడానికి కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఉద్యోగులకూ నూతన పింఛన్‌ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాలి. ఇటువంటి పకడ్బందీ చర్యలతో కేంద్ర బడ్జెట్‌ రూపు దిద్దుకోవాలి.


పన్ను వసూళ్లు

గత సంవత్సరం మోదీ ప్రభుత్వం పన్నుల ఆదాయాన్ని పెంచుకోగలిగినందువల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉంది. 2021తో పోలిస్తే 2022 డిసెంబరు నాటికి కేంద్ర ప్రభుత్వ మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లు 25.90 శాతం పెరిగాయి. రిఫండ్‌ల తరవాత నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 19.81 శాతం హెచ్చాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.13,37,820 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు సమకూరతాయని గత బడ్జెట్‌ (Budget 2023)లో అంచనా వేయగా, వాస్తవంలో వసూళ్లు రూ.14 లక్షల కోట్లకు చేరవచ్చు. నిరుడు బడ్జెట్‌ (Budget 2023)లో రాష్ట్రాలకు పెట్టుబడుల నిమిత్తం 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలను ఇస్తామని ప్రకటించారు. రూ.1.07 లక్షల కోట్లను ఈ పథకం కింద కేటాయించి 2022 డిసెంబరు మధ్యనాటికి రూ.41,117 కోట్లను అర్హత కలిగిన రాష్ట్రాలకు విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు