ఉపాధి హామీకి మొండిచెయ్యి

గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలను ఆదుకోవడంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కీలక భూమిక పోషిస్తోంది. కొవిడ్‌ కల్లోల సమయంలో కోట్ల సంఖ్యలో అభాగ్యుల ఆకలి కేకలను అది తీర్చింది. ఇంతటి  కీలక పథకానికి బడ్జెట్‌ కేటాయింపులు పోనుపోను తెగ్గోసుకుపోతున్నాయి. తాజా పద్దులోనూ కేంద్రం ఆ పథకానికి అరకొర నిధులే విదిలించింది.

Published : 02 Feb 2023 00:28 IST

గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలను ఆదుకోవడంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కీలక భూమిక పోషిస్తోంది. కొవిడ్‌ కల్లోల సమయంలో కోట్ల సంఖ్యలో అభాగ్యుల ఆకలి కేకలను అది తీర్చింది. ఇంతటి  కీలక పథకానికి బడ్జెట్‌ కేటాయింపులు పోనుపోను తెగ్గోసుకుపోతున్నాయి. తాజా పద్దులోనూ కేంద్రం ఆ పథకానికి అరకొర నిధులే విదిలించింది.

హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) అమలులోకి వచ్చి నేటితో 17 ఏళ్లు పూర్తవుతున్నాయి. పేదలందరినీ ‘ప్రణాళికాబద్ధంగా’ ప్రగతి మెట్లు ఎక్కించడం సాధ్యం కాని పరిస్థితుల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న దీన జనుల ఆకలి మంటలనైనా చల్లార్చాలన్న ఉద్దేశంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన, వనరుల ఉత్పాదకత అభివృద్ధికి తగిన పనులను ఎంచుకొని వేతనదారులకు పని కల్పించడం, తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ పేదరిక సమస్యకు ఒక పరిష్కారం చూపడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. గ్రామీణ భారతంలో ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న కీలకమైన ఈ పథకానికి కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు పోనుపోను కుంచించుకుపోతున్నాయి. 2021-22 బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి కేంద్రం రూ.98,468 కోట్లు వ్యయం చేసింది. తరవాతి ఏడాది డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు ప్రకటించింది. సవరించిన అంచనాల్లో అవి రూ.89,400 కోట్లకు చేరాయి. తాజా బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి కేంద్రం అరకొరగా అరవై వేల కోట్ల రూపాయలనే విదిలించింది.

ఆలస్యంగా వేతనాలు

ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సంవత్సరానికి వంద రోజుల పని కల్పించాలంటే, బడ్జెట్లో రూ.1.80 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనీసం అరవై రోజులు పని కల్పించాలన్నా రూ.1.1 లక్షల కోట్ల నిధులు ప్రత్యేకించాల్సి ఉంటుంది. కేంద్రం దీని గురించి పట్టించుకోకుండా ఏటా కేటాయింపులను తగ్గిస్తోంది. కొవిడ్‌ మహమ్మారి విజృంభించిన 2020-21లో ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా రూ.1.1 లక్షల కోట్లు వ్యయం చేసింది. ఆ మరుసటి ఏడాదే సవరించిన అంచనాల మేరకు అవి తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు తగ్గిపోయాయి. పైగా 2015-20 మధ్య కాలంలో ఒక్కొక్కరికి సగటున 48 రోజులే పని దక్కినట్లు పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ విరుచుకుపడిన కాలంలో ఉపాధికి అర్హులైన 39శాతం ప్రజలకు రిక్తహస్తమే మిగిలిందని ఇటీవల అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.49 కోట్ల కుటుంబాలు పనిని కోరగా, 5.7 కోట్ల కుటుంబాలకే దక్కినట్లు తాజాగా ఆర్థిక సర్వే తేటతెల్లం చేసింది. ఉపాధి హామీ కోసం పని వెతికేవారి సంఖ్య 2020-21లో 4.47 కోట్ల నుంచి 2021-22లో 4.02 కోట్లకు తగ్గినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో చెప్పింది. ఆ క్రమంలో రాయితీలు, ఉపాధి హామీ పనులు, ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రాలకు నిధుల బదిలీలను తగ్గిస్తున్నట్లు గతేడాది బడ్జెట్‌ సమయంలో వెల్లడించింది. కేంద్రం తన బడ్జెట్‌ పరిమితులకు లోబడి ఉపాధి హామీ పనుల వ్యయాన్ని ఉద్దేశపూర్వకంగా పరిమితం చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీస వేతనం గురించి ఉపాధి హామీ చట్టం స్పష్టంగా చెప్పింది. 2015-16లో రూ.180 కనీస వేతనంగా నిర్ణయించారు. సగటున రూ.120 మాత్రమే అందింది. 2021లో కనీస వేతనం రూ.245. ప్రస్తుతం అది రూ.257. అయితే, కొన్నిచోట్ల సగటున రూ.160లోపే అందుతున్నట్లు విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. పని చేసిన వెంటనే కొలతలు తీయక పోవడంతో వేతనదారులు నష్టపోవాల్సి వస్తోంది. ఉపాధి హామీ పనులకు చెల్లింపులను పదిహేను రోజుల్లోనే జరపాలని చట్టం నిర్దేశిస్తోంది. ఇది సరిగ్గా అమలవుతున్న దాఖలాలు కనిపించడంలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం 29శాతం బిల్లులనే సకాలంలో మంజూరు చేసింది.

ఇతోధిక నిధులు కీలకం

గ్రామీణ భారత అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం కీలకంగా నిలుస్తున్నట్లు గతంలోనే నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. అందుకే ప్రపంచ వేదికలపైనా ఈ పథకం ప్రాశస్త్యం చర్చకు వచ్చింది. కరోనా విలయంలో పట్టణాల నుంచి గ్రామాల బాట పట్టినవారిలో అత్యధికులు ఇంకా వెనక్కి వెళ్ళనే లేదని విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామీణంలో అవసరార్థులైన ప్రతి ఒక్కరికీ ఆదరువు దక్కేలా ఉపాధి హామీ పథకానికి ఇతోధిక నిధులను కేటాయించాలి. ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా 100 రోజుల పని కల్పించాలి. అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ సూచించినట్లు అవసరమైతే రెండు వందల రోజుల పని దినాలు కల్పించే అంశాన్నీ పాలకులు పరిశీలించాలి. 15 రోజుల్లోనే అందరికీ వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. పని కల్పించలేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇవ్వడం తప్పనిసరి. 2017 వరకు గ్రామాల్లో చెరువుల అభివృద్ధి పనులకు కూలీలనే వినియోగించేవారు. ప్రస్తుతం యాంత్రీకరణ పెరిగింది. దాన్ని గణనీయంగా తగ్గించాలి. అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ పక్కాగా ఉండేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. నిధులు దుర్వినియోగం కాకుండా గట్టి నిఘా పెట్టాలి. వేతనదారులకు లాభదాయకంగా ఉండేలా పనులు కల్పించినప్పుడే ఉపాధి హామీ చట్టానికి సార్థకత చేకూరుతుంది. గ్రామీణ భారతానికి నిజమైన అండ లభిస్తుంది.


భారీగా అవకతవకలు

పాధి హామీ పనుల్లో అవకతవకలను అరికట్టేందుకు సామాజిక తనిఖీ (సోషల్‌ ఆడిట్‌), విజిలెన్స్‌, అంబుడ్స్‌మన్‌ వంటి పక్కా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ని వ్యవస్థలు ఉన్నా పోనుపోను అవకతవకలు పెచ్చరిల్లుతున్నాయి. ముఖ్యంగా అక్రమ హాజరులు, చెల్లింపుల్లో అవకతవకలను బయటపెట్టే సామాజిక తనిఖీలకు కేంద్రం సరిగ్గా నిధులను విడుదల చేయడంలేదు. మరోవైపు ఏటా నిర్వహించే సామాజిక తనిఖీల్లో కోట్ల రూపాయల అవినీతిని వెలికితీసి ఆ ధనాన్ని వెనక్కి రాబట్టాలని ఆదేశిస్తున్నారు. అవి వసూలవుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించడంలేదు. కేవలం క్షేత్ర సహాయకులను విధుల నుంచి తొలగించి చేతులు దులుపుకొంటున్నారు. 2017-21 మధ్య కాలంలో ఉపాధి హామీ పనుల్లో తొమ్మిది వందల కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్లు గతంలో కథనాలు వెలువడ్డాయి. అందులో పన్నెండు కోట్ల రూపాయలను మాత్రమే రికవరీ చేశారు.

డాక్టర్‌ గురువెల్లి రమణమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.