కృత్రిమ మేధకు నిధుల దన్ను

కృత్రిమ మేధా (ఏఐ) రంగంలో అగ్రరాజ్యాలతో పోటీలో వెనకబడకూడదని భారత్‌ నిశ్చయించినట్లు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ చాటుతోంది. కృత్రిమ మేధలో పరిశోధన-అభివృద్ధికి నిధులిస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

Updated : 06 Feb 2023 05:58 IST

కృత్రిమ మేధా (ఏఐ) రంగంలో అగ్రరాజ్యాలతో పోటీలో వెనకబడకూడదని భారత్‌ నిశ్చయించినట్లు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ చాటుతోంది. కృత్రిమ మేధలో పరిశోధన-అభివృద్ధికి నిధులిస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. మూడు విద్యాసంస్థల్లో ఏఐ ఉత్కృష్ట కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు జాతీయ డేటా నిర్వహణ విధానం కింద అంకుర సంస్థలను ప్రోత్సహిస్తామనీ చెప్పారు.

ఐ రంగంలో పరిశోధకులు, అంకుర సంస్థలు, ప్రైవేటు కంపెనీల చొరవ, సృజన కీలక పాత్ర వహిస్తాయి. ప్రస్తుతం ప్రపంచమంతటా సంచలనం రేపుతున్న చాట్‌ జీపీటీని ఇక్కడ ఉదాహరించాలి. చాట్‌ జీపీటీని సృష్టించిన ఓపెన్‌ ఏఐ సంస్థకు బడా టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ భారీ పెట్టుబడులు అందించింది. ఏఐ అంకుర సంస్థలకు బడా టెక్‌ సంస్థలే కాదు- వెంచర్‌ పెట్టుబడిదారులూ నిధులు సమకూరుస్తున్నారు. దిల్లీ యువకుడు సమన్యౌ గర్గ్‌ స్థాపించిన అంకుర సంస్థ రైట్‌ సోనిక్‌కు వై కాంబినేటర్‌ అనే వెంచర్‌ నిధి మూలధనం అందించింది. గర్గ్‌ సృష్టించిన ఏఐ చాట్‌ బాట్‌-చాట్‌ సోనిక్‌ ప్రస్తుతం చాట్‌ జీపీటీకన్నా వేగంగా, సమర్థంగా పనిచేస్తోందంటూ వినియోగదారులు చాట్‌ సోనిక్‌కు మారిపోతున్నారు. చాట్‌ జీపీటీ సృష్టికర్త శామ్‌ ఆల్ట్‌మన్‌ పూర్వాశ్రమంలో వై కాంబినేటర్‌ సంస్థ అధ్యక్షుడే. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లపై పనిచేసే చాట్‌ సోనిక్‌ మొబైల్‌ యాప్‌నూ గర్గ్‌ విడుదల చేస్తున్నారు. ఇలాంటి అంకుర సంస్థల వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి బడ్జెట్‌ ముఖ్యమైన ప్రతిపాదనలు చేసింది.

సమర్థ డిజిటల్‌ పాలన

ఏఐ పరిశోధనలకు, ఏఐ సాధనాల రూపకల్పనకు అపార సమాచార రాశులే (డేటా సెట్స్‌) ముడిసరకు. ఏఐ పరిశోధనల నిమిత్తం అంకుర సంస్థలు, పరిశోధకులకు అనామక సమాచారాన్ని (ఎనానిమైజ్డ్‌ డేటాను) అందించడానికి జాతీయ డేటా నిర్వహణ విధానాన్ని తీసుకొస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రకటించారు. కేంద్ర ఎలెక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక శాఖ ఈ విధాన ముసాయిదాను నిరుడు మే నెలలో విడుదల చేసి, సంబంధిత వర్గాల నుంచి సలహాలు సూచనలను ఆహ్వానించింది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా వ్యక్తుల వివరాలను తొలగించి ఇచ్చే సమాచారాన్ని అనామక (ఎనానిమైజ్డ్‌) డేటా అంటారు. మరోవైపు వ్యకిగత సమాచార గోప్యతా రక్షణకు సంబంధించి ప్రభుత్వం ఒక బిల్లును ఆన్‌లైన్‌లో ప్రజా పరిశీలనకు అందుబాటులో ఉంచింది. ఆ బిల్లు నియమాల ప్రకారం వ్యక్తిగత వివరాలను తొలగించిన తరవాతనే, సదరు డేటాను ఏఐ పరిశోధనలకు అందుబాటులో ఉంచుతారు. ఉదాహరణకు ఉబర్‌, ఓలా వంటి యాప్‌లు సేకరించే రవాణా సమాచారాన్ని అనామికీకరించి, కృత్రిమ మేధ సాయంతో స్వయంచాలిత ఎలక్ట్రిక్‌ వాహనాల రూపకల్పనకు ఉపయోగించుకోవచ్చు.

ఏఐ పరిశోధనలకు తమ వద్దనున్న భారీ సమాచార రాశులను పంచుకోవాలని కేంద్ర ఎలెక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ చేసిన డిమాండును 2020లోనే అమెజాన్‌, గూగుల్‌ వంటి బడా టెక్‌ సంస్థలు వ్యతిరేకించాయి. వాటి అభ్యంతరాలు, ఆందోళనను తొలగించడానికి అనామక సమాచారాన్ని పంచుకోవాలన్న ప్రతిపాదన ముందుకొచ్చింది. వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది చట్టరూపం దాల్చిన తరవాతే అనామక సమాచార పంపిణీకి జాతీయ డేటా నిర్వహణ విధానం తీసుకురావాలని ప్రభుత్వం ఉద్దేశిస్తోంది. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల వద్దనున్న అనామక సమాచార రాశులను (డేటా సెట్లను) ఈ విధానం కింద ఏఐ పరిశోధనలకు అందించాలని నిర్ణయించింది.

వాతావరణ సమాచారం, భారత ఆర్థిక వ్యవస్థ గురించి రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న వివరాలు, జనగణన, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వద్ద ఉన్న కొన్ని రకాల సమాచారాన్ని ఏఐ పరిశోధనలకు అందిస్తారు. ముఖ్యంగా ఇండియా డాట్‌ ఏఐ డేటాసెట్‌లో ఆరోగ్యం, వ్యవసాయం, ట్విటర్‌, కంప్యూటింగ్‌ సమాచారాలు అందుబాటులో ఉంటాయి. నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని పొందవచ్చు. వివిధ సమస్యలకు పరిష్కారాలను ప్రతిపాదించడానికి డేటా సైంటిస్టులు యంత్ర విద్య (మెషీన్‌ లెర్నింగ్‌) ప్రక్రియతో ఇటువంటి సమాచారాన్ని ఉపయోగించుకుంటారు. సమర్థ డిజిటల్‌ పాలనకూ ఏఐ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు విస్తృత డేటా అందుబాటులో ఉంటే విద్యారంగంలో ఏ జిల్లా ఏయే అంశాల్లో, ఏయే పరామితుల్లో వెనకబడిందో వేగంగా కనిపెట్టి, పరిష్కారాలను కనుగొనవచ్చని ఎలెక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వివరించారు. జన్‌ధన్‌ ఖాతాలు, ముద్రా రుణాలు, వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) చెల్లింపులకు సంబంధించిన అనామక సమాచారాన్ని ఏఐతో విశ్లేషిస్తే సమర్థ ఆర్థిక నిర్వహణ సాధ్యపడుతుంది.

పోటీని తట్టుకొని...

వ్యవసాయంలో డ్రోన్లు, ఉపగ్రహ వినియోగం పెరుగుతున్నకొద్దీ అపార సమాచారం అందుబాటులోకి వస్తుంది. అది అత్యాధునిక సునిశిత (ప్రెసిషన్‌) సేద్యానికి తోడ్పడుతుంది. దీన్ని ముందుకు తీసుకువెళ్ళే వ్యవసాయ అంకుర సంస్థలను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్షిస్తోంది. అపార అనామక సమాచారం ఎంఎస్‌ఎంఈ సంస్థలకూ అందుబాటులోకి వస్తే చిన్న వ్యాపారాలు సైతం అమెజాన్‌, వాల్‌మార్ట్‌ల పోటీని తట్టుకొని ఈ-కామర్స్‌ రంగంలో రాణించగలుగుతాయి. అలాగే పారిశ్రామిక యంత్రాల్లో 5జీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) సాంకేతికతల వినియోగం పెరుగుతున్నకొద్దీ కొత్త డేటా అందుబాటులోకి వచ్చి సరికొత్త ఉత్పత్తి ప్రక్రియల రూపకల్పనకు ఏఐని ఉపయోగించగలుగుతాం. ఒక్కమాటలో చెప్పాలంటే జాతీయ డేటా నిర్వహణ విధానం భారత్‌లో కృత్రిమ మేధా విప్లవానికి గొప్ప సాధనంగా ఉపయోగపడగలదు.


కుంభమేళాలో వినియోగం

కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కాగితాలపై ఆధారపడిన సంప్రదాయ పాలన పద్ధతులను ఇండియా చాలావరకు వదిలేసి డిజిటల్‌ పరిపాలనకు మళ్ళింది. జాతీయ కృత్రిమ మేధా పథకాన్ని చేపట్టింది. భారత్‌ పే, గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి యూపీఐ చెల్లింపు యాప్‌లు సర్వవ్యాప్తమయ్యాయి. నేడు సువిశాల జనాభాకు సంబంధించి డిజిటల్‌ డేటా అందుబాటులో ఉంది. ఈ విస్తృత సమాచారాన్ని విశ్లేషించి కొత్త ఉపయోగాలను కనుగొనడానికి కృత్రిమ మేధ (ఏఐ) వాడకం పెరిగింది. ఏఐ ఆధారిత పారిశ్రామిక ఉత్పత్తి క్రమంగా ఊపందుకొంటోంది. భారత్‌లో ఏఐపై పరిశోధనలకన్నా దాన్ని ఆచరణలో వినియోగించడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఉదాహరణకు 2019లోనే కుంభమేళాలో 20 కోట్ల మంది తీర్థయాత్రికుల రద్దీ నియంత్రణకు, అవాంఛనీయ శక్తుల ముఖాల గుర్తింపునకు, భద్రతా బందోబస్తు, వ్యర్థాల నిర్మూలన, శుద్ధికి ఏఐని విజయవంతంగా వినియోగించారు.

ఏఏవీ ప్రసాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు