సహకార సంఘాల దశ మారుతుందా?
ఇటీవలి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకార రంగానికి నిరుటి కన్నా ఎక్కువ నిధులు (రూ.1149 కోట్లు) కేటాయించారు.
ఇటీవలి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకార రంగానికి నిరుటి కన్నా ఎక్కువ నిధులు (రూ.1149 కోట్లు) కేటాయించారు. సహకార సంఘాలకు పన్ను రాయితీలు కల్పించారు. అయితే, వాటి తలరాత
మారాలంటే, ఆ సంఘాలను పట్టి పీడిస్తున్న అసలు సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించాలి.
కేంద్రం ఈ ఏడాది జనవరిలోనే సేంద్రియ ఉత్పత్తులు, విత్తనాలు, ఎగుమతుల వృద్ధికి జాతీయ స్థాయిలో మూడు కొత్త సహకార సంఘాలను నెలకొల్పాలని నిర్ణయించింది. సహకార సంఘాల సభ్యులైన రైతులకు న్యాయమైన ధరలు లభించడానికి వీలుగా ప్రపంచంలో అతిపెద్ద వికేంద్రీకృత నిల్వ కేంద్రాలను నెలకొల్పాలని 2023-24 బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇది అపూర్వమని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా ప్రశంసించారు. సహకార సంఘాల వ్యవహారాల నిర్వహణకు మోదీ ప్రభుత్వం కేంద్రంలో కొత్త శాఖను నెలకొల్పి, దాని సారథ్యాన్ని అమిత్ షాకు కట్టబెట్టింది. ప్రభుత్వంలో మోదీ తరవాత అంతటి శక్తిమంతుడైన అమిత్ షాకు ఈ శాఖను అప్పజెప్పడం చూస్తే సహకార సంఘాలకు సర్కారు ఎంత ప్రాధాన్యమిస్తోందో అర్థమవుతుంది.
సవరణ బిల్లుపై విమర్శలు
అమిత్ షా 1990ల్లోనే గుజరాత్ సహకార రంగంలో చురుగ్గా ఉండేవారు. అవినీతి, అవకతవకల కారణంగా దివాలా అంచున ఉన్న అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్ష పదవిని చేపట్టి అనతికాలంలోనే దాన్ని లాభదాయకంగా మార్చారు. సహకార సంఘాల సారథ్యం ద్వారా రాజకీయ ప్రాముఖ్యం లభిస్తుందని అప్పట్లోనే అమిత్ షా గ్రహించారు. కేంద్రంలో సహకార శాఖను చేపట్టిన వెంటనే సంఘాల ఆధునికీకరణ ఆరంభించారు. భారత్‌లో నేడు 8.6 లక్షల సహకార సంఘాలు ఉన్నాయి. వాటిలో క్రియాశీలక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) సంఖ్య 63,000. వాటిని 2026కల్లా మూడు లక్షలకు పెంచాలని లక్షిస్తున్నారు. నేటికీ సహకార సంఘాలు లేని గ్రామాల్లో బహుళార్థ సాధక, పాడి రైతుల కోఆపరేటివ్‌లను, మత్స్యకార పీఏసీఎస్‌లను నెలకొల్పాలని కేంద్రం ప్రతిపాదించింది. సహకార ఉమ్మడి సేవా కేంద్రాలను, జాతీయ సహకార సమాచార నిధి (డేటాబేస్), జాతీయ సహకార విశ్వవిద్యాలయాన్నీ కొలువుతీర్చాలని యోచిస్తోంది. ఈ నేపథ్యం నుంచే 2023-24 బడ్జెట్లో సహకార సంఘాల ప్రస్తావనను పరిశీలించాలి. 2024 మార్చి 31కి ముందే ఉత్పత్తి ప్రారంభించే కొత్త సహకార సంఘాలకు నూతన పరిశ్రమల మాదిరిగా 15శాతం పన్ను రాయితీ ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. సహకార ఉత్పత్తి సంఘాలు లాభాపేక్ష లేనివి కాబట్టి, వాటికి మరిన్ని రాయితీలు ఇవ్వాల్సింది. సహకార ఉద్యమం ఆది నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. నేటికీ 30 కోట్ల మంది ఈ రంగాన్ని నమ్ముకొని ఉన్నారు. సహకార రంగంలో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక అగ్రగాములు. కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌లలోనూ ఈ సంఘాలు విస్తరిస్తున్నాయి. పీఏసీఎస్‌ల వార్షిక టర్నోవరు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు. పట్టణ, జిల్లా సహకార బ్యాంకులు అయిదు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. విస్తరణ, డిజిటలీకరణ ద్వారా గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు సహకార రంగ ఉమ్మడి టర్నోవరును రూ.30 లక్షల కోట్లకు పెంచాలని మోదీ ప్రభుత్వం లక్షిస్తోంది.
బహుళ రాష్ట్ర సహకార సంఘాల (ఎంఎస్‌సీఎస్) చట్టం-1984 సవరణకు నిరుడు డిసెంబరులో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సంఘాలు ప్రజాస్వామికంగా, జవాబుదారీతనంతో పనిచేసేలా చూడటానికి సహకార ఎన్నికల ప్రాధికార సంఘం ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. సహకార సమాచార అధికారి, అంబుడ్స్‌మన్ నియామకాలకూ అవకాశం దక్కుతుంది. ప్రస్తుతం దేశమంతటా 1500 ఎంఎస్‌సీఎస్‌లు ఉన్నాయి. భారత్‌లోని ఏ సహకార సంఘమైనా ఏదైనా ఎంఎస్‌సీఎస్‌లో విలీనం కావడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. సహకార రంగం అధికారాలను కేంద్రం గుప్పిట్లోకి తీసుకోవడానికి ఈ బిల్లు సహకరిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. బిల్లులోని అయిదు క్లాజులపై చట్టాలు చేసే అధికారం లోక్‌సభకు లేదు కాబట్టి దాన్ని ఉపసంహరించాలని కాంగ్రెస్ నాయకుడు మనీశ్ తివారీ పట్టుపట్టారు. లోక్‌సభ ఈ బిల్లును పార్లమెంటు సంయుక్త సంఘ పరిశీలనకు నివేదించింది. సహకార సంఘాల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వానికి ప్రాధాన్యం కల్పిస్తూ 2011లోనే యూపీఏ ప్రభుత్వం 97వ రాజ్యాంగ సవరణ తెచ్చింది. అప్పట్లో ఆ బిల్లును ఎన్‌డీఏ సైతం సమర్థించింది. దానివల్ల సహకార సంఘాల నిర్వహణ మెరుగుపడుతుందని సమర్థకులు వాదించారు. కొందరు అది రాష్ట్రాల హక్కులను హరిస్తుందని విమర్శించారు. ఈ సవరణతో బహుళ రాష్ట్ర సహకార సంఘాల్లో భాగస్వామ్యం కాని వాటికీ కేంద్రం ఆదేశాలు జారీచేయగలుగుతుంది. ఈ కారణాల వల్ల 97వ రాజ్యాంగ సవరణ బిల్లును కోర్టుల్లో సవాలు చేశారు. ఆ బిల్లును రాష్ట్రాల హక్కులపై దాడిగా గుజరాత్ హైకోర్టు అభివర్ణిస్తూ, కనీసం సగం రాష్ట్రాలు ఆమోదిస్తేనే అది చట్ట రూపం ధరించాలని 2013లో తీర్మానించింది. సుప్రీంకోర్టు సైతం ఆ అభిప్రాయాన్ని బలపరచింది.
నిపుణ నాయకత్వం కీలకం
దేశీయంగా సహకార సంఘాలు ఇప్పటికే రాజకీయ, అధికారుల జోక్యం, అవకతవక నిర్వహణ వల్ల కునారిల్లుతున్నాయి. కేంద్రం పెత్తనం వల్ల ఈ లోపాలు మరింత పెరగవన్న భరోసా ఏమైనా ఉందా? రాష్ట్ర స్థాయి సహకార సంఘాలు ఎంఎస్‌సీఎస్‌లుగా మారకుండానే అద్భుత విజయం సాధించగలవని గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య ఎన్నడో నిరూపించింది. ఈ సంఘం అమూల్ బ్రాండ్‌పై పాడి ఉత్పత్తులను దేశమంతటా విక్రయిస్తోంది. 2011 నుంచి ఈ సంఘం ఇతర రాష్ట్రాల్లోనూ పాల సేకరణ జరుపుతోంది. డాక్టర్ వర్గీస్ కురియన్ లాంటి అంకిత భావంతో పనిచేసే నాయకులు, నిపుణులు ఉంటే సహకార సంఘాలు విజయవంతం అవుతాయని గుజరాత్‌లో అమూల్ ప్రయోగం నిరూపించింది. ఈ అంశాన్ని గుర్తించి ఇతర సహకార సంఘాల్లో లోపాలను సరిదిద్దాలి. వాటి నాయకత్వ బాధ్యతలను నిపుణులకు అప్పగించాలి. అప్పుడే వాటి తలరాత మారడానికి ఆస్కారం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌కు నిరాశ
గుజరాత్‌కు చెందిన అమూల్ బ్రాండ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆది నుంచీ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తోంది. రైతులకు ఇష్టం లేకపోయినా అమూల్ సంస్థకు పాలను సరఫరా చేసేలా వారిపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ స్థలాల్లో అమూల్ పాల కేంద్రాల ఏర్పాటుకు అనుమతిస్తున్నారు. ఏపీ సర్కారు అమూల్‌పై అమిత ప్రేమ చూపిస్తున్నా, దక్షిణ భారతంలోనే అతిపెద్ద పాల కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఆ సంస్థ నిశ్చయించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Guna Sekhar: సమంతను అలా ఎంపిక చేశా.. ఆ విషయంలో పరిధి దాటలేదు: గుణ శేఖర్
-
Crime News
TSPSC: నిందితుల కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు.. 40మంది టీఎస్పీఎస్సీ సిబ్బందికి సిట్ నోటీసులు
-
World News
Rent a girl friend: అద్దెకు గర్ల్‌ఫ్రెండ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్...
-
India News
దేవుడా.. ఈ బిడ్డను సురక్షితంగా ఉంచు: భూప్రకంపనల మధ్యే సి-సెక్షన్ చేసిన వైద్యులు..!
-
Politics News
AP News: ఎవరి అంతరాత్మ ఎలా ప్రబోధిస్తుందో?.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి
-
Sports News
IND vs AUS: భారత్, ఆసీస్ మూడో వన్డే.. ఆలౌటైన ఆస్ట్రేలియా