అడ్డగోలు అప్పులు... జనానికే తిప్పలు!

మితిమీరిన అప్పులు రాష్ట్రాలకు ఏమాత్రం మంచివి కాదని ప్రధాని మోదీ తాజాగా రాజ్యసభలో హెచ్చరించారు. రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ఆయన సూచించారు. దేశీయంగా రాష్ట్రాల వారీగా విడివిడిగా చూస్తే అప్పులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయని రిజర్వుబ్యాంకు సైతం ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది.

Updated : 15 Feb 2023 16:52 IST

మితిమీరిన అప్పులు రాష్ట్రాలకు ఏమాత్రం మంచివి కాదని ప్రధాని మోదీ తాజాగా రాజ్యసభలో హెచ్చరించారు. రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ఆయన సూచించారు. దేశీయంగా రాష్ట్రాల వారీగా విడివిడిగా చూస్తే అప్పులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయని రిజర్వుబ్యాంకు సైతం ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది.

దేశీయంగా అన్ని రాష్ట్రాల మొత్తం నిధుల్లో 2016-17లో అభివృద్ధి పనులకు 67.6శాతం వెచ్చిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23లో) అది 63శాతానికి పడిపోయింది. అభివృద్ధేతర కార్యక్రమాలకు వెచ్చించిన సొమ్ము 2004-05లో కేవలం రూ.1.85 లక్షల కోట్లు. ప్రస్తుత ఏడాది అది రూ.14.18 లక్షల కోట్లకు చేరినట్లు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ఇటీవలి నివేదికలో రిజర్వు బ్యాంకు వెల్లడించింది. ఈ ఏడాది అన్ని రాష్ట్రాల ద్రవ్యలోటు రూ.2.15 లక్షల కోట్లను దాటింది. ప్రపంచమే అప్పుల కుప్పలా మారుతోంది. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)తో పోలిస్తే 256శాతం అప్పులున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) తాజా నివేదికలో వెల్లడించింది. వాటిలో 40శాతం అన్ని దేశాల ప్రభుత్వాలు తీసుకున్న రుణాలే. మిగతావి ప్రైవేటు సంస్థలు, ప్రజలు తీసుకున్నవి. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఒక ఏడాదిలో అత్యధికంగా అప్పులు 2020లోనే తీసుకున్నట్లు ఆ సంస్థ వివరించింది. ఇండియాలో సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా అప్పులు చేస్తూ ప్రజలపై వడ్డీల భారం మోపుతున్నాయి. ఇటీవలి బడ్జెట్‌ గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ అప్పులు ఇప్పటికే రూ.155 లక్షల కోట్లకు చేరాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం అంతానికి అవి రూ.172 లక్షల కోట్లను దాటనున్నాయి. రాష్ట్రాలూ పోటాపోటీగా అప్పులు తెచ్చి ప్రజాకర్షక పథకాల పేరుతో ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఎడాపెడా రుణాలు

దేశ చరిత్రలోనే అత్యధికంగా 2020-21లో రాష్ట్ర ప్రభుత్వాలు రూ.7.89 లక్షల కోట్ల అప్పులు చేశాయి. గత ఆర్థిక సంవత్సరం రూ.7.01 లక్షల కోట్లు, 2022-23లో రూ.6.42 లక్షల కోట్లు సేకరించాయి. గతంలో తీసుకున్న అప్పుల చెల్లింపులకు సంబంధించి గడువు తీరిన బకాయిలు ఈ ఏడాది రూ.2.39 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ఇంతలా బకాయిలుండటం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. దీనివల్ల పాత బకాయిల మేట పెరిగిపోతోంది. పోనుపోను ఇది మరింత భారంగా పరిణ మిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న మొత్తం అప్పుల్లో రాబోయే అయిదేళ్లలో 30.5శాతం, పదేళ్లలో 28.2శాతం తిరిగి చెల్లించాలి. రాష్ట్రాలకు ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగకపోతే కొండలా పేరుకుపోయిన అప్పులను తీర్చడానికే మళ్ళీ కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు, ప్రభుత్వ రంగ సంస్థలు పాత అప్పులు తీర్చడానికి కొత్త రుణాలు తీసుకుంటూ సర్దుబాట్లతో కాలం వెళ్ళదీస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ్‌ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో పాత అప్పుల చెల్లింపులకు కొత్త రుణాలు తీసుకోవడం అధికమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో నిధులను అన్ని పనులకు సర్దుబాటు చేయలేక ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం(డీఏ) సైతం ఎప్పటికప్పుడు పెంచకుండా తొక్కిపడుతున్నారు. ఆర్థిక సంవత్సరంలో ప్రతి త్రైమాసికానికి ఒకసారి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు నిధులు విడుదల చేయడం ఆనవాయితీ. బడ్జెట్లలో అంచనా వేసినంత ఆదాయం రాకపోవడం, అదనంగా పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని చర్యలు తీసుకోనందువల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఏటా చివరి త్రైమాసికంలో పథకాలకే కాకుండా, ఆఖరికి ఉద్యోగులకు చెల్లించాల్సిన పలు రకాల బిల్లులకూ సొమ్ము విడుదల చేయకుండా ఖజనాపై అనధికార ఆంక్షలు పెడుతున్నారు. పాత బకాయిలకు చెల్లింపులు పోను తీసుకున్న కొత్త అప్పుల్లో నికరంగా రాష్ట్ర ప్రభుత్వాల చేతికొచ్చే సొమ్ము ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4.03 లక్షల కోట్ల వరకే ఉంటుంది.

రాష్ట్రాలు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో విచ్చలవిడిగా ఎడాపెడా అప్పులు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఎరగని రీతితో ఏపీలో వైకాపా ప్రభుత్వం ప్రజల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమచేసే పథకాల కోసం అందిన చోటల్లా రుణాలు తెస్తోంది. దాంతో భవిష్యత్తులో ఏపీ చెల్లించాల్సిన బకాయిలు భారీగా పెరిగిపోతున్నాయి. ఆదాయం వచ్చే పథకాలపై అప్పులు తెచ్చి పెడితే తిరిగి తీర్చడానికి మార్గం ఉంటుంది. ఓట్ల రాజకీయాలతో పేదల సంక్షేమం పేరుచెప్పి తెచ్చే అప్పులను ఎలా వినియోగిస్తున్నారనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. కేరళ, రాజస్థాన్‌, మహారాష్ట్ర పాత పన్ను బకాయిలను వసూలు చేసుకుని ఆదాయం పెంచుకోవడానికి రాయితీ పథకం ప్రారంభించాయి. పంజాబ్‌లో పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో పన్నులు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల కోసం ఒక విభాగం నెలకొల్పారు.

డిస్కమ్‌లపై పెను భారం

పలు రాష్ట్రాల్లో 2020-21 నుంచి నిర్వహణ వ్యయం భారీగా పెరుగుతోంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత లేదా సంక్షేమ పథకాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు పలు వర్గాలకు ఉచితంగా లేదా తక్కువ ఛార్జీలకు కరెంటును ఇస్తూ ఆ సొమ్మును అక్కడి విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కమ్‌)లకు తిరిగి పూర్తిగా చెల్లించడం లేదు. దానివల్ల డిస్కమ్‌ల నష్టాలు, అప్పులు భారీగా పెరుగుతున్నాయి. గతంలో 2015 నాటికి ఇలాగే డిస్కమ్‌ల నష్టాలు రూ.2.50 లక్షల కోట్లకు చేరితే, వాటిని రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలకు బదిలీ చేశారు. ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరచిపోయి మళ్ళీ పాతబాటలోనే నడుస్తున్నాయి. అప్పులు తీర్చి ఆదాయం పెంచుకొనేలా రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఉండకపోతే అవి వెనెజ్వెలా, శ్రీలంక, జింబాబ్వే వంటి దేశాల మాదిరిగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొనే ప్రమాదం ఉందని గుర్తించాలి. ప్రజలను మాయచేసి ఓట్లు దండుకోవాలనే లక్ష్యాలతో ప్రజాకర్షక, ఉచిత పథకాల అమలుకు వేల కోట్ల రూపాయలను గుమ్మరించేందుకు ఎడాపెడా అప్పులు చేస్తున్నారు. ఆ బాకీలను తిరిగి కట్టాలంటే ప్రజలపై ఏదో ఒక రూపంలో పన్నులు వడ్డించి సొమ్ము రాబట్టాల్సిందే. ఈ సత్యాన్ని ప్రజలు గుర్తించి అప్పులతో మాయ చేసే పాలకులకు ఓటుతో గుణపాఠం చెబితేనే దేశానికి భద్రత లభిస్తుంది.

మంగమూరి శ్రీనివాస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.