ఈ ఏడాదైనా రూపాయి బలపడుతుందా?

మన రూపాయి సుమారు పదేళ్లపాటు ప్రజలను, పాలకులను ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చింది. అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులు 2013లో రూపాయి పతనానికి దారితీశాయి.

Updated : 17 Feb 2023 13:18 IST

మన రూపాయి సుమారు పదేళ్లపాటు ప్రజలను, పాలకులను ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చింది. అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులు 2013లో రూపాయి పతనానికి దారితీశాయి. నాటి నుంచి ఇంచుమించు స్థిరంగా కొనసాగిన భారత కరెన్సీ- ఈసారి అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తీవ్ర ఆటుపోట్లకు గురైంది. గత మూడేళ్లలో వరసగా రెండు శాతం చొప్పున పతనమవుతూ 2022 చివరినాటికి పది శాతం పతనాన్ని చవిచూసింది!

అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి కొంతకాలంగా పతనమవుతూ వచ్చింది. డాలరు బలపడటం, ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి తరలిపోవడమే ఇందుకు ప్రధాన కారణాలు. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వు 2022లో వడ్డీరేట్లను విపరీతంగా పెంచింది. దాంతో- 2021 డిసెంబరులో 1.5శాతంగా ఉన్న యూఎస్‌ ట్రెజరీ బాండ్ల వడ్డీ రేట్లు 2022 చివరి నాటికి 3.8 శాతానికి పెరిగాయి. ఫలితంగా డాలరు సూచీ గత సెప్టెంబరు నాటికి 20శాతం పెరుగుదలతో ఒక్కసారిగా 20 ఏళ్ల గరిష్ఠాన్ని (114.78) చేరుకొంది. తరవాత అది తగ్గుతూ 103.51 స్థాయికి చేరింది. నిరుడు ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం- పీపా బ్రెంట్‌ ముడిచమురు ధరను మార్చి నాటికి 139 డాలర్లకు తీసుకెళ్ళింది. జూన్‌ వరకు ఈ ధరలు 100 డాలర్లకుపైనే కొనసాగాయి. భారత దిగుమతుల్లో అత్యధికం ముడిచమురే కావడంతో, పెరిగిన ధరల కారణంగా భారీ వాణిజ్యలోటు ఏర్పడింది. 2021 డిసెంబరులో అప్పటి విదేశ మారకపు విలువ ప్రకారం సుమారు రూ.1,21,730 కోట్లుగా ఉన్న ముడిచమురు దిగుమతులు జూన్‌ 2022 నాటికి రూ.1,69,850 కోట్లకు పెరిగాయి. ఈ వ్యవధిలో వాణిజ్యలోటు సుమారు రూ.1,65,900 కోట్ల నుంచి రూ.1,89,600 కోట్లకు ఎగబాకింది. అదే సమయంలో మదుపరులు ఈక్విటీ, రుణాల రూపాల్లోని విదేశీ ప్రైవేటు పెట్టుబడులను డాలర్లలోకి మార్చుకోవడంతో సుమారు రూ.1,50,100 కోట్లు తరలిపోయాయి. దాంతో రూపాయి తీవ్ర ఒత్తిడికి గురైంది.

రూపాయి పతనానికి ఈ ఏడాదిలో కొంత విరామం లభిస్తుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. నిరుడు మన కరెన్సీ పతనానికి దారితీసిన పరిస్థితులు 2023 తొలి అర్ధ సంవత్సరం వరకు కొనసాగే సూచనలున్నా, వాటి ప్రభావం తీవ్రస్థాయిలో ఉండకపోవచ్చు. భారత్‌ తన చమురు అవసరాలకు సుమారు 85శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. నిజానికి ముడిచమురు వినియోగం దేశ ఆర్థికప్రగతికి చిహ్నం. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు జూన్‌ నుంచి తగ్గుముఖం పట్టడం దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. మన చమురు దిగుమతులు దేశ మొత్తం దిగుమతుల్లో 30శాతం వరకు ఉన్నాయి. 2022 మొదటి అర్ధ సంవత్సరంలో పీపా చమురు సగటు కొనుగోలు ధర 103 డాలర్లు. డిసెంబరు చివరినాటికి అది 78 డాలర్లకు దిగివచ్చింది. 2021 క్యాలెండర్‌ ఏడాదిలో సగటు దిగుమతుల బిల్లు సుమారు రూ.65,120 కోట్లుగా తేలింది. ప్రపంచ వృద్ధి నెమ్మదించడం వల్ల 2023లోనూ ముడిచమురుకు గిరాకీ తక్కువే ఉంటుంది. ప్రపంచ ఇంధన డిమాండ్‌ 2022లో సగటున రోజుకు 23 లక్షల పీపాలు కాగా, 2023లో అది 13 లక్షలకు పడిపోతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ లెక్కగట్టింది. మరోవైపు ఈ ఏడాది పీపా చమురు సగటు ధర 92 డాలర్లు ఉంటుందని అమెరికా ఇంధన పాలనా సంస్థ వెల్లడించింది. అంతర్జాతీయ ముడిచమురు ధర 100 డాలర్లలోపు ఉండటం వల్ల- నిరుడు జులైలో 3,000 కోట్ల డాలర్లుగా నమోదైన వస్తు వాణిజ్యలోటు నవంబరు నాటికి 2,400 కోట్ల డాలర్లకు తగ్గింది. మిత్రదేశం రష్యా తక్కువ ధరకు ముడిచమురును సరఫరా చేయడమూ ఇందుకు తోడ్పడింది. తగ్గించిన ధరలను రష్యా ఈ ఏడాదిలో కొనసాగిస్తుందా లేదా అన్నది సందేహమే. ఏదేమైనా రాబోయే నెలల్లో ఈ వాణిజ్యలోటు 2వేల కోట్ల డాలర్లకు తగ్గుతుందన్నది నిపుణుల అంచనా.

తగ్గనున్న కరెంటు ఖాతా లోటు...

భారత కరెంటు ఖాతాలో సింహభాగం సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు, ప్రైవేటు బదలాయింపులదే. భవిష్యత్తులో ఈ రెండింటి వాటా ఇంకా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. దిగివస్తున్న ముడిచమురు ధరలతో వస్తు వాణిజ్యలోటు తగ్గుముఖం పట్టడం; సాఫ్ట్‌వేర్‌, ప్రైవేటు బదలాయింపులు పెరగడం- కరెంటు ఖాతా లోటును కొంతవరకు పరిష్కరించగలుగుతాయి. ప్రతికూల పరిస్థితుల వల్ల 2023 మొదటి అర్ధభాగంలో డాలరు బలపడటం కొనసాగి, రెండో అర్ధభాగంలో తిరిగి సాధారణ స్థితికి చేరుతుంది. కాబట్టి మొదటి ఆరునెలలు రూపాయిపై ఒత్తిడి కొనసాగుతుంది. ఆ తరవాతి అర్ధ సంవత్సరంలో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ముఖ్యంగా ముడిచమురు వాణిజ్య లోటు తగ్గడం, కరెంటు ఖాతా లోటు సన్నగిల్లడం, విదేశీ పెట్టుబడుల రాక వంటి బలమైన ఆర్థిక పరిస్థితులు రూపాయిని బలోపేతం చేస్తాయని చెప్పవచ్చు.


ఇవీ ప్రతికూల  పరిస్థితులు...

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మాంద్యం పరిస్థితులతో కొన్ని దేశాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాదిలో మాంద్యం మరింత తీవ్రంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2022లో ప్రపంచ వృద్ధిరేటు 3.2 శాతం. 2023లో ఇది 2.7 శాతానికి పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నిరుడు అక్టోబరులోనే వెల్లడించింది. ఈలోగా డాలరు సాధారణంగానే బలపడుతుంది. 2001 మాంద్యం సమయంలో డాలరు సూచీ ఆ ఏడాది జనవరిలో 108గా ఉండగా జులై నాటికి 121కు పెరిగి, ఆ తరవాత తగ్గింది. అలాగే 2008-09 మాంద్యం కాలంలో డాలరు సూచీ 71 నుంచి 89కు ఎగబాకి ఆ తరవాత కిందికి వచ్చింది. అంటే సాధారణంగా మాంద్యం సమయంలో డాలరు తొలుత బలపడి, తరవాత బలహీనపడుతుంది. మిగతా దేశాలపై ఉన్నట్లే ఒకవేళ భారత్‌పైనా మాంద్యం ప్రభావం ఉంటుందని భావించినా- మాంద్యం మధ్యకాలం నుంచి విదేశీ పెట్టుబడులు భారత్‌లో విశేషంగా ప్రవహించి ఆ ప్రవాహం కొన్నాళ్లు కొనసాగుతుందని చరిత్ర చెబుతోంది. 2008-09 సంక్షోభ సమయంలో భారత్‌ నుంచి 1200 కోట్ల డాలర్ల మేర ఈక్విటీ వెనక్కి తరలిపోయింది. 2009లో మార్చి-జూన్‌ మధ్య మాంద్యం తిరోగమనం పట్టడంతో తిరిగి ఈక్విటీ రూపంలో పెట్టుబడులు భారత్‌లోకి రావడం మొదలయ్యాయి. అదే ఏడాది మార్చి- డిసెంబరు కాలంలో 1800 కోట్ల డాలర్ల మేర విదేశీ పెట్టుబడులు భారత్‌లోకి వచ్చాయి. దీన్ని బట్టి మాంద్యం తీవ్రరూపం దాల్చినా స్వల్పకాలమే ఉంటుందని చెప్పవచ్చు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఈ ఏడాదిలో ముగిస్తే చమురు ధరలు మళ్ళీ పెరిగే అవకాశం లేకపోలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు