ప్రపంచ వేదికపై తెలుగు చిత్ర పతాక

ఆస్కార్‌ పురస్కారాల వేడుకలో మన పాట విని అకాడమీ పురస్కారాలు అందుకుంటున్న ఇద్దరు తెలుగు వ్యక్తులను చూసి... ప్రపంచవ్యాప్తంగా తెలుగువారంతా పులకించిపోయారు.

Updated : 19 Mar 2023 06:42 IST

ఆస్కార్‌ పురస్కారాల వేడుకలో మన పాట విని అకాడమీ పురస్కారాలు అందుకుంటున్న ఇద్దరు తెలుగు వ్యక్తులను చూసి... ప్రపంచవ్యాప్తంగా తెలుగువారంతా పులకించిపోయారు. కొన్నేళ్లుగా ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదుగుతున్న తెలుగు సినిమాకు ప్రపంచస్థాయిలో పట్టంకట్టిన సందర్భమది. ‘నాటు నాటు’ పాటకు దక్కిన ఆస్కార్‌ పురస్కారం మన సినిమా ప్రపంచ స్థాయిలో మరింతగా విస్తరించడానికి బలమైన పునాది అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

చాలా ఏళ్ల కిందట దిల్లీలో తాను ఒక చిత్రోత్సవంలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు ఎదురైన అనుభవాన్ని వజ్రోత్సవ వేడుకలతో పాటు పలు సందర్భాల్లోనూ ప్రముఖ సినీ నటులు చిరంజీవి వివరించారు. అక్కడ ఎటు చూసినా బాలీవుడ్‌ ప్రముఖుల చిత్రాలు తప్ప దక్షిణాదికి చెందిన, ముఖ్యంగా తెలుగు సినీ దిగ్గజాల ఫొటోలేవీ కనిపించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలల కిందట గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో చిరంజీవి ‘ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న ప్రాధాన్యం, గుర్తింపు గురించి ఆ వేదికపై ప్రస్తావిస్తూ చిరంజీవి అమితానందానికి గురయ్యారు. ఇప్పుడు ఆస్కార్‌ వేదికపై తెలుగు పాటకు దక్కిన గుర్తింపునకు ప్రతి తెలుగు వ్యక్తీ ఆనందంతో పొంగిపోయాడు.

భారీ వసూళ్లు

గతాన్ని ఒక్కసారి పరికిస్తే వివిధ విభాగాల్లో జాతీయ పురస్కారాలు దక్కించుకోవడం సంగతి అటుంచితే... ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’ విభాగంలోనూ తెలుగు సినిమాలు ఎంపిక కాని దయనీయ స్థితి కొన్నేళ్ల పాటు కొనసాగింది. ఇందుకు మన సినిమాల్లో నాణ్యత లేకపోవడం కంటే తెలుగు చిత్రాల పట్ల జ్యూరీ సభ్యులకు ఉన్న చిన్నచూపు ప్రధాన కారణం. అప్పటికి భారతీయ సినిమా అంటే బాలీవుడ్డే అన్నట్లుండేది. హిందీ సినిమాల మార్కెట్‌ పరిధి ప్రాంతీయ భాషా చిత్రాలతో పోలిస్తే ఎక్కువ. అందువల్ల వాటి బడ్జెట్లు, వసూళ్లు అన్నీ భారీ స్థాయిలో ఉండేవి. ఆ సినిమాల నాణ్యతా అందుకు తగ్గట్లే ఉండేది. ప్రాంతీయ భాషా చిత్రాల పట్ల బాలీవుడ్‌ వారిలో తక్కువ భావం కనిపించేది. తెలుగు సినిమాల్లోని మాస్‌ మసాలా అంశాల గురించి ఉత్తరాదివాళ్లు వ్యంగ్యాస్త్రాలు విసిరేవారు. జాతీయ అవార్డులు ప్రకటించినప్పుడు మరింతగా చిన్నచూపు కనిపించేది. అలాంటిది ఇప్పుడు జాతీయ అవార్డులను దాటి ఏకంగా ఆస్కార్‌ పురస్కారం తెలుగు సినిమాను వరించింది.

గత ఏడాదిన్నర వ్యవధిలో తెలుగు నుంచి పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కార్తికేయ-2 లాంటి చిత్రాలు ఉత్తరాదిన అనూహ్యమైన వసూళ్లు సాధించాయి. పైగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై భారీ అంచనాలుండటం సహజం. హిందీలో విడుదలైన పుష్ప, కార్తికేయ-2 లాంటి చిత్రాలూ బాలీవుడ్‌ బడా హీరోల సినిమాలను వెనక్కి నెట్టి అక్కడి బాక్సాఫీస్‌పై ఆధిపత్యం చలాయించడం అనూహ్యం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అయితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. ఈ సినిమా చూసి అమెరికన్‌ ప్రేక్షకులు, హాలీవుడ్‌ ప్రముఖులు మంత్రముగ్ధులయ్యారు. నాలుగు నెలల కిందట జపాన్‌లో ఈ సినిమాను విడుదల చేశారు. అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ‘ముత్తు’ పేరిట ఉన్న దీర్ఘకాల రికార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బద్దలు కొట్టింది. పైగా వంద కోట్ల యెన్‌ల మైలురాయిని అధిగమించింది.

హాలీవుడ్‌కు సమానంగా...

ఆస్కార్‌ పురస్కారాలకు భారత్‌ నుంచి ఎక్కువమంది కోరుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను కాదని ఓ గుజరాతీ చిత్రాన్ని బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగానికి అధికారికంగా ఎంపిక చేశారు. అయినా, తమ చిత్రాన్ని రాజమౌళి బృందం స్వతంత్రంగా ఆస్కార్‌ బరిలోకి దింపింది. ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో ‘నాటు నాటు’కు పురస్కారం దక్కింది. దీనికంటే ముందు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనేక అంతర్జాతీయ పురస్కారాలను సాధించింది. ప్రస్తుతం హాలీవుడ్‌ స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగా ప్రభాస్‌ సినిమా ‘ప్రాజెక్ట్‌-కె’ రూపొందుతోంది. ‘పుష్ప’ సినిమాలో హీరో హావభావాలను విదేశీ లీగుల్లో క్రీడాకారులు అనుకరించడం ఆ సినిమాకు దక్కిన ప్రత్యేక గుర్తింపునకు నిదర్శనం. దానివల్ల ‘పుష్ప-2’పై అంచనాలు పెరిగిపోయాయి. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు సినిమాలకు అమెరికా సహా పలు దేశాల్లో మంచి ఆదరణ దక్కుతోంది. పెరిగిన మార్కెట్‌ పరిధిని ఉపయోగించుకుంటూ ఉన్నత సాంకేతిక విలువలతో కూడిన చిత్రాలతో ముందుకు సాగితే తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో మరింతగా వెలుగులీనడం ఖాయం.


* పదేళ్లు వెనక్కి వెళ్తే- తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో కనీస గుర్తింపు ఉండేది కాదు. జాతీయ పురస్కారాల్లో ఎప్పుడూ హిందీ సినిమాల ఆధిపత్యమే కనిపించేది. దక్షిణాది నుంచి మలయాళం, తమిళ చిత్రాలు సైతం కొన్ని పురస్కారాలు దక్కించుకునేవి. తెలుగు సినిమా మాత్రం కనీస ప్రభావమూ చూపలేకపోయేది.


* గతానికి భిన్నంగా ఇప్పుడు తెలుగు సినిమాలు ఉత్తరాదిన హిందీ చిత్రాలను వెనక్కి నెట్టి భారీ వసూళ్లు దక్కించుకుంటున్నాయి. అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుతున్నాయి. అవార్డుల విషయంలోనూ ఆధిపత్యాన్ని చాటుకొంటున్నాయి. 


* దక్షిణాది సినిమాలు ఉత్తరాదిన ఆధిపత్యం చలాయించడం ‘బాహుబలి’తో మొదలైంది. భాష, ప్రాంతం లాంటి హద్దులన్నీ చెరిపేస్తూ ఆ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరగని వసూళ్లు రాబట్టింది. ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని సైతం దక్కించుకుంది. ఈ సినిమాతోనే ‘పాన్‌ ఇండియా’ ట్రెండు ఊపందుకొంది.


* ‘నాటునాటు’కు ఆస్కార్‌ పురస్కారం విషయంలో పలు విమర్శలు గుప్పించిన వాళ్లూ ఉన్నారు. ఆస్కార్‌ అవార్డుల కోసం పోటీ పడే ప్రతి సినిమానూ అకాడమీ వాళ్లతో పాటు హాలీవుడ్‌ సినీ ప్రముఖుల కోసం భారీ థియేటర్లలో ప్రదర్శించడం, చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం అనివార్యం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ ప్రచారానికి అయిన వ్యయంతో పోలిస్తే అకాడమీ అవార్డుతో తెలుగు సినిమాకు దక్కిన గుర్తింపు వెలకట్టలేనిది.


* తాజా ఆస్కార్‌ పురస్కారంతో భారతీయ సినిమా పట్ల విదేశీయుల దృక్పథమే మారిపోయింది. తెలుగులో మరిన్ని ప్రపంచ స్థాయి సినిమాలు తెరకెక్కడానికి ఈ ఆస్కార్‌ పురస్కారం బాటలు పరుస్తుంది.


 తిమ్మాపురం చంద్రశేఖర్‌రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి