కొత్త సాంకేతికతలు ఎంత సురక్షితం?

సెల్యులార్‌ మొబైల్‌ ఫోన్లు పనిచేయాలంటే స్పెక్ట్రమ్‌ కేటాయింపులు కావాలి. కమ్యూనికేషన్‌ రంగంలో స్పెక్ట్రమ్‌ అంటే రేడియో తరంగాల సంచయం. ఇవి ఒక తరహా విద్యుదయస్కాంత తరంగాలే. మొబైల్‌ కమ్యూనికేషన్లకు ఇవే మూలాధారం.

Updated : 26 Mar 2023 13:28 IST

సెల్యులార్‌ మొబైల్‌ ఫోన్లు పనిచేయాలంటే స్పెక్ట్రమ్‌ కేటాయింపులు కావాలి. కమ్యూనికేషన్‌ రంగంలో స్పెక్ట్రమ్‌ అంటే రేడియో తరంగాల సంచయం. ఇవి ఒక తరహా విద్యుదయస్కాంత తరంగాలే. మొబైల్‌ కమ్యూనికేషన్లకు ఇవే మూలాధారం. విద్యుదయస్కాంత తరంగాలను మానవుడు నిర్మాణాత్మకంగానే కాకుండా వినాశానికీ వినియోగిస్తున్నాడు.

విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగించడం ద్వారా మానవుడు ఒక్క శతాబ్ద కాలంలోనే వేగంగా ఆధునిక లోకంలోకి ప్రవేశించాడు. రేడియో ఫ్రీక్వెన్సీలు కాంతి, ధ్వని తరంగాలు ప్రవేశించలేని చోట్లకూ చొచ్చుకెళ్లగలవు. టెలిఫోన్‌ను కనుగొన్నప్పుడు 300 నుంచి 3400 హెర్ట్జ్‌ శ్రవణ శ్రేణిలో మానవులు సంభాషించుకునే వీలు కలిగింది. 1950లో మైక్రోవేవ్‌ టవర్లు అవతరించాయి. ప్రతి 42 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మైక్రోవేవ్‌ టవర్‌ను నెలకొల్పారు. అవి 3700 మెగాహెర్ట్జ్‌ నుంచి 6425 మెగాహెర్ట్జ్‌ ఫ్రీక్వెన్సీల మీద పనిచేసేవి. ఉపగ్రహ కమ్యూనికేషన్లు వచ్చాక ఫ్రీక్వెన్సీ రేంజి ఒక గిగాహెర్ట్జ్‌ నుంచి 40 గిగాహెర్ట్జ్‌ వరకు విస్తరించింది. సీ, ఎక్స్‌, కు, కె, కా బ్యాండ్లను రేడియో, టెలికాం, టెలివిజన్‌ ప్రసారాలు, ఖగోళ శోధన, వాతావరణ, విమానయాన, సైన్య ప్రయోజనాలకు వినియోగించసాగారు. పోలీసు, రైల్వేతోపాటు అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు స్వల్ప, మధ్య, ఉన్నత ఫ్రీక్వెన్సీలను ఉపయోగిస్తున్నాయి. సెల్యులార్‌ మొబైల్‌ సేవలతోపాటు రాబోయే 5జీ సేవలు భూగోళాన్ని రేడియో ఫ్రీక్వెన్సీల మయం చేయబోతున్నాయి.

బీఎస్‌ఎన్‌ఎల్‌ వెనకంజ

భారతదేశంలో 1970ల వరకు ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ కనెక్షన్‌ కావాలంటే మహా నగరాల్లో సైతం ఎనిమిదేళ్ల దాకా వేచి చూడాల్సి వచ్చేది. సామాన్య పౌరులు ఫోన్‌ చేసుకోవాలంటే తపాలా, టెలిగ్రాఫ్‌ కార్యాలయాల్లోని పీసీఓ బూత్‌లను ఆశ్రయించాల్సివచ్చేది. తరవాత వీధివీధినా పీసీఓ, ఎస్‌టీడీ బూత్‌లు ఏర్పడి లక్షల మందికి ఉపాధి కల్పించాయి. 1990ల నుంచి ల్యాండ్‌లైన్‌ కనెక్షన్లు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. 2000 సంవత్సరం నుంచి సెల్యులార్‌ ఫోన్లు రంగప్రవేశం చేసి, దేశంలో టెలీ సాంద్రత విస్తరించింది. అత్యధిక నగరాలు, పట్టణాల్లో ఇంటింటా సెల్‌ఫోన్లు, బ్రాడ్‌బ్యాండ్‌, ఫైబర్‌ కనెక్షన్లు వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వాయిస్‌, వీడియో కాల్స్‌ చేసుకునే సౌలభ్యం ఏర్పడింది. మొబైల్‌ ఫోన్లు విస్తరించడానికి మూలమైన టవర్లు, విద్యుత్‌ప్లాంట్లు, ఇతర మౌలిక వసతులు, సాధనాలపై భారీగా పెట్టుబడి పెట్టాలి. 4జీ టవర్లకన్నా 5జీ టవర్లు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. 4జీ సెల్‌ టవర్లను మూడు నుంచి ఆరున్నర కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తే సరిపోతుంది. 5జీ టవర్లను 150 నుంచి 300 మీటర్లకు ఒకటి చొప్పున నెలకొల్పాలి. దేశమంతటికీ 5జీ టెలికాం సేవలు అందించాలంటే అదనంగా 2,50,000 చిన్న సెల్‌ సైట్లను నెలకొల్పాల్సి వస్తుంది. ప్రస్తుతం 70 కోట్లమంది భారతీయుల వద్ద 3జీ, 4జీ స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటీ సుమారు రూ.12,000 నుంచి రూ. 15,000 ధరకు కొనుగోలుచేసి ఉంటారు. 5జీ సేవలు విస్తృతమయ్యాక ఆ ఫోన్లన్నింటికీ కాలం చెల్లిపోతుంది. వాటికి బదులు సరికొత్త 5జీ ఫోన్లను కొనాలంటే అధికమొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది. 1980ల్లో ప్రజలు ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌ కోసం రూ.3,000 డిపాజిట్‌ చేయాలంటే చాలా భారంగా భావించేవారు. ఆ తరవాత ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడటంతోపాటు ప్రైవేటు సెల్యులార్‌ ఆపరేటర్లు ఉచితంగానో, చౌకగానో కాల్స్‌, డేటా అందించడం వల్ల మొబైల్‌ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది.

ప్రపంచంలో అత్యంత చౌక 5జీ మార్కెట్‌ భారత్‌ కానుందని ఇటీవల దిల్లీ జీ20 సమావేశంలో మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ వ్యాఖ్యానించారు. భారతీయులకు చౌకగా డేటా అందించడానికి కట్టుబడి ఉన్నామని రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తమ సంస్థ జనరల్‌ బాడీ సమావేశంలో ప్రకటించారు. 2023 డిసెంబరుకల్లా భారత్‌లో 5జీ సేవలను అందించాలని టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు (టీఎస్‌పీలు) ఉవ్విళ్లూరుతున్నారు. అప్పటికి భారత ప్రభుత్వ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ కనీసం ప్రధాన నగరాలు, పట్టణాల్లోనూ పూర్తిస్థాయిలో 4జీ సేవలను అందించలేకపోతుంది. నిజానికి టీఎస్‌పీలు నిర్దేశిత వేగంతో 4జీ డేటాను అందిస్తే సామాన్యుడు 5జీకి మారాల్సిన అవసరమే ఉండదు. ఆరంభంలో వ్యాపారాలకు, కార్పొరేట్లకు, విద్యా, వైద్య సంస్థలకు, ప్రభుత్వ విభాగాలకు, పత్రికలు, టీవీ, ఎలెక్ట్రానిక్‌ మీడియాకు, ఇతర ఉన్నత స్థాయి వినియోగదారులకు 5జీ సేవలను అందిస్తే సరిపోతుంది. టీఎస్‌పీలు నిలదొక్కుకునేలా హేతుబద్ధమైన రుసుములు విధిస్తే ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా చూసుకోవచ్చు.  

భారీగా విద్యుత్‌ వినియోగం

అమెరికా, ఐరోపా శాస్త్రజ్ఞులు 5జీ తరంగాల వల్ల మానవ శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడదని చెబుతున్నారు. అయితే, దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. పైగా ప్రపంచ జనాభాలో సగంమంది, అంటే 400 కోట్లమంది ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారంటే విద్యుత్‌ వినియోగం అపారమని గుర్తించాలి. 5జీ స్మార్ట్‌ ఫోన్లు, ఇతర పరికరాలూ భారీగా విద్యుత్తును వినియోగిస్తాయి. ఈ పరిణామాల వల్ల భూగోళంపై కర్బన ఉద్గారాలు 3.7శాతం పెరుగుతాయని 2011లో అంచనా వేశారు. 2025 కల్లా ఇది రెట్టింపు కావడం ఖాయం. మరో దశాబ్దిలో 6జీ వస్తుందంటున్నారు. కొత్త సాంకేతికతలు భూగోళానికి, సమస్త జీవజాలానికి హాని చేయకుండా చూడటం మానవుడి విధ్యుక్త ధర్మం.


ప్రభుత్వ ఆదాయానికి గండి

ఇప్పటికే టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు (టీఎస్‌పీలు) తీసుకున్న రుణాలు తీర్చలేకపోవడంతో బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు రూ.4.5 లక్షల కోట్ల పారు బకాయిలను (ఎన్‌పీఏలను) ఎదుర్కొంటున్నాయి. టీఎస్‌పీల నుంచి రూ.1.76 లక్షల కోట్ల ఏజీఆర్‌ బకాయిలను వడ్డీతో సహా వసూలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం వాటికి నాలుగేళ్ల మారటోరియం ప్రకటించింది. వొడాఫోన్‌ ఐడియా నుంచి రావాల్సిన రూ.16,133 కోట్ల వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్చడానికి ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి మూడున అనుమతించింది. తద్వారా ప్రభుత్వానికి ఆ సంస్థలో ఒక్కొక్క షేరు రూ.10 ముఖ విలువతో 33.14శాతం వాటాలు లభించాయి. ఇప్పుడు ఆ షేరు విలువ ఏడు రూపాయలకు దిగజారింది. టీఎస్పీలకు పెట్టుబడి వ్యయం తగ్గించడానికని 5జీ స్పెక్ట్రమ్‌ ప్రాథమిక ధరను 40 శాతం మేరకు తగ్గించడం ద్వారా ప్రభుత్వం గణనీయంగా ఆదాయం కోల్పోయింది. అయినా టెలికాం సంస్థల నుంచి ఎక్కువ ఆదాయం సంపాదించడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం లేదు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి