వనాలు... మానవాళికి రక్షా కవచాలు!

నేడు ప్రపంచ అటవీ దినోత్సవం. భూగోళంపై అరణ్యాల ప్రాధాన్యం, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఏటా అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

Published : 21 Mar 2023 02:58 IST

నేడు ప్రపంచ అటవీ దినోత్సవం. భూగోళంపై అరణ్యాల ప్రాధాన్యం, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఏటా అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ‘ఆరోగ్యవంతమైన ప్రజల కోసం అడవులు’ అన్నది ఈ ఏడాది దినోత్సవ ఇతివృత్తం. వనాలు మానవాళికి అందించే ఆరోగ్య ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించాలని ఐక్యరాజ్య సమితి పిలుపిచ్చింది.

డవుల వల్ల కోట్ల సంఖ్యలో వన్యప్రాణులు, వృక్షజాతులు, కీటకాలతో పాటు మానవాళికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. వాతావరణ మార్పులను నివారించడమే కాదు- పాటు జీవుల మనుగడకు అవసరమైన స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, ఔషధాలను అందించడంలో వనాలు విశేష పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ, పర్వత ప్రాంతాలకు చెందిన కోట్లాది ప్రజలు తమ ఆహారంలో భాగమైన పండ్లు, కాయలు, గింజలు, పుట్టగొడుగులు, తేనె వంటి వాటిలో అధికశాతం అడవుల నుంచే సేకరిస్తున్నారు. అవి పేదలకు శక్తిని, ఆహార భద్రతను అందిస్తున్నాయి. ఆహార వైవిధ్యానికీ తోడ్పడుతున్నాయి. ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) గణాంకాల ప్రకారం- అరణ్యాలలో లభించే ఆహార, ఔషధ, కలపేతర ఉత్పత్తుల ద్వారా ఏటా రూ.5.86లక్షల కోట్ల ఆదాయం సమకూరుతోంది. అటవీ వనరుల సేకరణ ద్వారా 136 దేశాల్లో 1.25 కోట్ల మంది పూర్తి స్థాయి ఉపాధిని పొందుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం విశ్వవ్యాప్తంగా ఔషధాల కోసం వినియోగించే అటవీ వృక్ష జాతుల సంఖ్య యాభై వేల దాకా ఉంటుంది.

తీవ్ర సమస్యలు

పారిస్‌ ఒప్పందం తరవాతి నుంచి ఏటా జరుగుతున్న ప్రపంచ వాతావరణ సదస్సులు 2030 నాటికి అడవుల క్షీణతను పూర్తిగా నియంత్రించాలని తీర్మానిస్తున్నాయి. ఈ లక్ష్యం నెరవేరాలంటే ధనిక రాజ్యాలు 1900 కోట్ల డాలర్ల సహాయాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు కేటాయించాలని అవి చెబుతున్నాయి. అది కార్యరూపం దాల్చడంలేదు. మరోవైపు ఆయా దేశాల్లో అడవుల క్షీణత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎఫ్‌ఏఓ అధ్యయనం ప్రకారం 1990-2020 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల హెక్టార్ల మేర అడవులు నాశనమయ్యాయి. 2015-2020 మధ్య కాలంలోనే ఏటా కోటి ఎకరాలకుపైగా తరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అడవిని పరిరక్షించాల్సిన ప్రభుత్వ వ్యవస్థలు వాటిని ఆర్థిక వనరుగా చూస్తూ వాణిజ్య లాభాలపైనే అధిక శ్రద్ధ చూపుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. దానివల్ల అనాదిగా వనాలతో మమేకమై జీవనం సాగిస్తున్న ఆదివాసులకు, అటవీ శాఖకు ఘర్షణ వాతావరణం నెలకొంటోంది.

అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబరుకు ముందు ఆదివాసుల సాగులో ఉన్న అటవీ భూములపై వారికి హక్కులు దక్కుతాయి. వారి ఆవాసాలకు ఆనుకొని ఉన్న వనాలపై సాముదాయిక హక్కులు కల్పిస్తారు. కలపేతర అటవీ వనరులపై స్వేచ్ఛ ఉంటుంది. చట్టం అసలు లక్ష్యాలు, నిబంధనలపై లబ్ధిదారులకు సంపూర్ణ అవగాహన కల్పించడంలో, చట్టం వచ్చిన తరవాతా వనాల ఆక్రమణలను నిలువరించడంలో అటవీ యంత్రాంగం విఫలమైనట్లు నిపుణులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఈ చట్టం ప్రకారం హక్కులు దఖలుపడ్డ భూములను ఫారెస్ట్‌ ల్యాండ్‌గానే పరిగణిస్తారు. వాటి క్రయవిక్రయాలు సైతం చెల్లవు. ఈ చట్టాన్ని సానుకూలంగా ఆహ్వానించి హక్కులు కల్పించిన భూముల్లో రబ్బరు, కాఫీ వంటి తోటల పెంపకానికి ఊతమిస్తూ, ఆదివాసులకు ఆదాయం సమకూర్చే ప్రణాళికలను పటిష్ఠంగా అమలు చేస్తే మంచి ఫలితాలు వచ్చేవి. దానివల్ల అటవీ భూముల్లో పచ్చదనం మరింతగా పెరిగేది. అటవీ యంత్రాంగం మొదటి నుంచీ అనేక ప్రాంతాల్లో సహాయ నిరాకరణ పాటించడం వల్ల చట్టం అసలు లక్ష్యం నెరవేరలేదు.

ఇండియాలో ఎనిమిది కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో వనాలు విస్తరించి ఉన్నాయి. మొత్తం భారత్‌ భూభాగంలో ఇది దాదాపు 25శాతం. అటవీ సర్వే నివేదికల ప్రకారం గత పదేళ్లలో ఇండియాలో 1611 చదరపు కిలోమీటర్ల భూభాగంలో అడవులను అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులకు బదలాయించారు. గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా 1540 చదరపు కిలోమీటర్ల దాకా అరణ్యాల విస్తీర్ణం పెరిగిందని అటవీ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రాజెక్టులకు కేటాయించిన వనాలకు ప్రత్యామ్నాయంగా ‘క్షీణతకు గురైన వనాల పునరుద్ధరణ నిధి నిర్వహణ, ప్రణాళికా ప్రాధికార సంస్థ (కంపా)’ చట్టం నిధులతో పెంచుతున్న అడవుల విస్తీర్ణం, ఖర్చు తదితరాల లెక్కల విషయంలో వారు పారదర్శకంగా వ్యవహరించడం లేదు.

ప్రోత్సాహం అవసరం

భారత్‌లో అడవుల పరిరక్షణ, వాటి నుంచి సేకరించిన ఉత్పత్తులతో సమాజ ఆరోగ్యానికి తోడ్పడటంలో ఆదివాసీ సమూహాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కేంద్రం అంచనాల ప్రకారం దేశీయంగా మూడు కోట్ల మంది ఆదివాసులు, అసంఘటిత పేదలు ఏటా రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన అటవీ ఫలసాయ ఉత్పత్తులను సేకరిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా అరణ్యాల్లో లభించే తేనె, మూలికలు, పుష్పాలు వంటివి కలపేతర అటవీ ఫలసాయం కిందకు వస్తాయి. వీటిని క్షేత్రస్థాయిలో సేకరిస్తున్న వారికి సరైన లాభం దక్కడంలేదు. వనాలకు నష్టం వాటిల్లకుండా వాటిని సేకరించడంపై అవగాహన పెంచడంతో పాటు మార్కెటింగ్‌ సదుపాయాల కల్పనకు సంబంధించీ ప్రభుత్వాల సహకారం, ప్రోత్సాహం పెరగాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అడవుల క్షీణతకు దారితీస్తున్న అంశాలను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి.


తప్పని ఎదురు చూపులు

డవుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రపంచ బ్యాంకు సాయంతో రెండు దశాబ్దాల క్రితం పలు కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో ఉమ్మడి అటవీ యాజమాన్యం, సామాజిక అటవీ యాజమాన్యం వంటి పథకాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. వాటి కింద పెంచిన అడవుల నుంచి వచ్చే ఉత్పత్తులు, కలప దిగుబడిపై ఆదాయాన్ని స్థానిక ప్రజలకే కేటాయిస్తామన్న హామీ మాత్రం అనేక రాష్ట్రాల్లో అమలుకు నోచుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఆ పథకాల కింద ఏర్పాటైన అయిదు వేలకు పైగా వన సంరక్షణ సమితులు తమ ఆదాయ వాటా కోసం నేటికీ ఎదురు చూస్తున్నాయి. మరోవైపు పర్యావరణ, అటవీ, వన్యప్రాణి సంరక్షణ, జల, వాయు కాలుష్య నియంత్రణ వంటి చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి సమగ్ర పర్యావరణ న్యాయ (నిర్వహణ) శాసనం తీసుకురావాలనే ప్రతిపాదన ఏళ్ల తరబడి చర్చల్లోనే నలుగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు