నత్తనడకన జల సంరక్షణ

నేడు ప్రపంచ జల దినోత్సవం. అన్ని జీవరాశులకు అత్యవసరమైన రెండు ముఖ్య వనరులు గాలి, నీరు. దురదృష్టవశాత్తు అవి తీవ్రంగా కలుషితం  అవుతున్నాయి. ముఖ్యంగా మనిషికి నాగరికత నేర్పిన నీటికి తీవ్ర కొరత ఏర్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పరిశ్రమలు, వాహనాల కాలుష్యంతో దేశీయంగా నానాటికీ గాలి నాణ్యత తెగ్గోసుకుపోతోంది...

Updated : 22 Mar 2023 05:50 IST

నేడు ప్రపంచ జల దినోత్సవం. అన్ని జీవరాశులకు అత్యవసరమైన రెండు ముఖ్య వనరులు గాలి, నీరు. దురదృష్టవశాత్తు అవి తీవ్రంగా కలుషితం     అవుతున్నాయి. ముఖ్యంగా మనిషికి నాగరికత నేర్పిన నీటికి తీవ్ర కొరత ఏర్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

రిశ్రమలు, వాహనాల కాలుష్యంతో దేశీయంగా నానాటికీ గాలి నాణ్యత తెగ్గోసుకుపోతోంది. మరోవైపు అడవుల నరికివేత, విచక్షణా రహితంగా రసాయన ఎరువులూ పురుగు మందుల వాడకం, భూగర్భ, ఉపరితల జలాల విచ్చలవిడి వినియోగం వంటి కారణాలతో నీటి లభ్యత తగ్గిపోవడంతో పాటు దాని నాణ్యతా దెబ్బతింటోంది. పెరుగుతున్న అవసరాలతోపాటు నీటి వినియోగం అధికమై ఏటికేడు దాని కొరత తీవ్రమవుతోంది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 200 కోట్ల మందికి సురక్షిత తాగునీరు అందుబాటులో లేదు. 2050 నాటికి విశ్వవ్యాప్తంగా సుమారు అయిదు వందల కోట్ల మంది నీటి కొరతను ఎదుర్కొనే పరిస్థితులు నెలకొన్నాయి.

తీవ్ర ఇక్కట్లు

ఏటా పెరుగుతున్న నీటి కష్టాలను రెండు దశాబ్దాల క్రితమే గుర్తించిన ఐరాస- అందుబాటులో ఉన్న నీటి వనరులను కాపాడుకోవడంపై పలు రకాల అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా విశ్వ మానవాళిని స్థిరమైన నీటి వనరుల నిర్వహణకు కంకణబద్ధులను చేయడమే లక్ష్యంగా, పలు రూపాల్లో నీటి ప్రాముఖ్యాన్ని తెలియజెప్పడానికి సిద్ధమైంది. ఇండియాలోనూ నీటి కొరత నానాటికీ ముమ్మరిస్తోంది. 2030 నాటికి దేశీయంగా 40శాతం జనాభా తాగునీటి సమస్యను ఎదుర్కొంటుందని అయిదేళ్ల క్రితమే నీతి ఆయోగ్‌ నివేదిక హెచ్చరించింది. ఇండియాలో సుమారు 60కోట్ల మంది తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేక భారత్‌లో ఏటా సుమారు రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2024 నాటికి గ్రామీణంలోని అన్ని ఇళ్లకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కేంద్రం జల్‌ జీవన్‌ మిషన్‌ను ప్రారంభించింది. పలు రాష్ట్రాల్లో ఇది నత్తనడకన సాగుతున్నట్లు పరిశీలనలు చెబుతున్నాయి. మరోవైపు నీటి వనరులు నానాటికీ తరిగిపోతుండటం, తీవ్రమవుతున్న ఉష్ణోగ్రతల వల్ల పంట దిగుబడులూ తెగ్గోసుకుపోతున్నాయి. వాటి కారణంగా 2050 నాటికి భారత ఆహార సరఫరా 16శాతానికి పైగా తగ్గిపోతుందని తాజాగా గ్లోబల్‌ కమిషన్‌  ఆన్‌ ది ఎకనామిక్స్‌ ఆఫ్‌ వాటర్‌ (జీసీఈడబ్ల్యూ) నివేదిక వెల్లడించింది. దానివల్ల యాభై శాతానికిపైగా జనాభా ఆహార అభద్రత ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. నీటికొరత, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఆసియాలో చాలా దేశాలు ఆహారాన్ని ఎగుమతిచేసే స్థితి నుంచి దిగుమతి చేసుకునే జాబితాలోకి జారిపోతాయన్నది జీసీఈడబ్ల్యూ నివేదిక సారాంశం. నీటి కొరత, స్వచ్ఛత లోపం కారణంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా ప్రభావితమవుతారు. వారికి సులభంగా నీరు అందాలన్నది ఐరాస లక్ష్యం. పేదరిక నిర్మూలన, నాణ్యమైన ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో నీటి లభ్యత కీలకమైన అంశం. అయితే, ప్రపంచవ్యాప్తంగా మినరల్‌ వాటర్‌ అమ్మకాలు నానాటికీ ఎగబాకుతూ లక్షల కోట్ల రూపాయల వ్యాపారంగా మారుతుండటంపై ఐరాస ఇటీవల ఆవేదన వ్యక్తం చేసింది. మినరల్‌ వాటర్‌ మార్కెట్‌ ఇండియాలో 2018-21 మధ్యకాలంలో 27శాతం వృద్ధిని నమోదు చేసింది.

ప్రపంచ జనాభాలో ఇండియా వాటా పదహారు శాతం. కానీ, మొత్తం మంచి నీటి లభ్యతలో భారత్‌ వాటా నాలుగు శాతమే. భవిష్యత్తులో నీటి కొరత ముమ్మరించకూడదంటే ప్రతి ఒక్కరూ అవసరాలకు అనుగుణంగా నీటిని పొదుపుగా వాడుకోవాలి. బాధ్యతాయుత వినియోగం అందరి విధ్యుక్త కర్తవ్యం కావాలి. నీటి అవసరం ఎక్కువగా ఉండే కర్మాగారాలు విచక్షణతో సమర్థంగా దాన్ని వినియోగించుకొని, వ్యర్థజలాలను శుద్ధిచేసి పునర్వినియోగంలోకి తేవాలి. వ్యర్థ జలాలను చెరువులు, నదుల్లోకి వదులుతున్న కర్మాగారాలపై కఠిన చర్యలు తీసుకోవడమూ తప్పనిసరి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా నీటి కాలుష్యాన్ని నివారించవచ్చు.

ప్రజల భాగస్వామ్యంతోనే...

వాన నీటి సంరక్షణ ఒకప్పుడు ప్రభుత్వాల ప్రాధాన్యక్రమంలో లేని అంశం. కొన్నేళ్లుగా పాలకుల ఆలోచనలో మార్పు వచ్చింది. వాన నీటి సంరక్షణ ఆవశ్యతను ప్రభుత్వాలు ప్రజలకు తెలియజెబుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలు వాన నీటి సంరక్షణ, సక్రమ వాడకంలో ముందంజలో ఉన్నాయి. తాగు, సాగు నీటి ప్రాధాన్యాన్ని గుర్తించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు చెరువుల పునరుద్ధరణ, ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాయి. అయితే, ప్రభుత్వాల చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యమూ తోడైతేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. కురిసే ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టి సమర్థంగా వినియోగించడం, విస్తృతంగా మొక్కలను పెంచడం వంటివి అన్ని ప్రాంతాల్లో పెద్దయెత్తున సాగాలి. వాన నీటిని సేకరించడం, నిల్వ చేసుకోవడంపై ప్రభుత్వాలు మరింతగా ప్రజలకు అవగాహన కల్పించాలి. అందరూ కలిసి పొదుపు, ఆదా, సమర్థ వినియోగ సూత్రాలు పాటిస్తేనే నేటి, రేపటి తరానికి నీటి భరోసా లభిస్తుంది.  


ఇజ్రాయెల్‌  ఆదర్శం

ప్రతి ఒక్కరికీ సురక్షితమైన తాగునీరు సులువుగా అందుబాటులో ఉండేలా స్థిరమైన పరిష్కారాలను కనుగొనడం చాలా అవసరం. ఆ దిశగా మేధావులు పలు మార్గాలను ప్రజల ముందుంచారు. నీటి సరఫరా, పారిశుద్ధ్య వ్యవస్థల కోసం మౌలిక సదుపాయాలపై పెట్టుబడి, నీటి నిర్వహణను మెరుగుపరచడం అత్యావశ్యకం. జల కాలుష్యాన్ని తగ్గించడం, నీటి సంరక్షణ, పునర్వినియోగాన్ని ప్రోత్సహించడంపైనా అధికంగా దృష్టి సారించాలి. ముఖ్యంగా జల సంరక్షణ చర్యలను ముమ్మరంగా చేపట్టాలి. నీటి పొదుపు, సంరక్షణ, సమర్థ వినియోగంలో ఇజ్రాయెల్‌ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఎడారి ప్రాంతంలో అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్‌ వర్షపు నీటిని వంద శాతం సమర్థంగా వాడుకుంటోంది. దక్షిణాఫ్రికాలోని వెస్ట్రన్‌ కేప్‌ టౌన్‌ కొన్నేళ్ల కిందట తీవ్ర నీటి కొరతను చవిచూసింది. ఆ తరవాత సమర్థ నీటి పరిరక్షణ చర్యలతో సమస్యను అధిగమించింది.

ఎం.కరుణాకర్‌ రెడ్డి, (వాక్‌ ఫర్‌ వాటర్‌ వ్యవస్థాపకులు)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి