వినియోగం క్షీణిస్తే ఆర్థికంగా మందగతే

భారత ఆర్థిక వ్యవస్థకు ప్రజల వినియోగ వ్యయమే మూలాధారం. మన జీడీపీలో వ్యక్తులు, కుటుంబాల వినియోగ వ్యయం వాటా 63శాతం. జనాభాలో అధిక శాతం ఉన్న పేద, మధ్యతరగతివారి వస్తుసేవల వినియోగం తగ్గిపోతే అది దేశ జీడీపీకి గండి కొట్టి ఆర్థిక మందగతికి దారితీస్తుంది.

Updated : 26 Mar 2023 13:32 IST

భారత ఆర్థిక వ్యవస్థకు ప్రజల వినియోగ వ్యయమే మూలాధారం. మన జీడీపీలో వ్యక్తులు, కుటుంబాల వినియోగ వ్యయం వాటా 63శాతం. జనాభాలో అధిక శాతం ఉన్న పేద, మధ్యతరగతివారి వస్తుసేవల వినియోగం తగ్గిపోతే అది దేశ జీడీపీకి గండి కొట్టి ఆర్థిక మందగతికి దారితీస్తుంది. ఈ ప్రతికూల ప్రభావం వెంటనే కాకుండా... రాబోయే 3-5 ఏళ్లలో కనిపించనుంది.

ఇటీవల ఆర్థిక రంగానికి సంబంధించి ఒక ముఖ్యమైన వార్త వెలుగులోకి రాకుండా పోయింది. అదేమంటే- 2015 మే తరవాత మొదటిసారిగా ఏడాది, పదేళ్ల గడువున్న ప్రభుత్వ బాండ్లపై స్వల్పకాలిక రాబడి కన్నా దీర్ఘకాల రాబడి తక్కువ కావడం. దీన్ని ఆర్థిక మాంద్యానికి సంకేతంగా పాశ్చాత్య దేశాలు పరిగణిస్తాయి. భారత్‌లో మాంద్య ప్రమాదం లేకపోయినా రాబోయే త్రైమాసికాల్లో ఆర్థికాభివృద్ధి తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. వచ్చే మూడు నెలల్లోనూ బాండ్లపై రాబడి తక్కువగా ఉంటే ఆర్థిక మందగతికి అది సూచన కావచ్చు. 1970ల తరవాత ఎన్నడూ లేనంతగా మొత్తం ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామికోత్పత్తి వాటా చాలా తక్కువకు పడిపోయింది. ఇతర సంకేతాలు సైతం, ప్రభుత్వం చెబుతున్నంత పటిష్ఠంగా భారత ఆర్థిక వ్యవస్థ లేదని సూచిస్తున్నాయి. అందుకే రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ భారత్‌ మళ్ళీ హిందూ అభివృద్ధి రేటులోకి జారిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. 1970లు, 1980ల్లో భారత జీడీపీ వృద్ధి రేటు మూడు-నాలుగు శాతం మధ్యనే తచ్చాడేది. దాన్నే హిందూ అభివృద్ధి రేటు అంటారు. వచ్చే ఏడాది జీడీపీ ఆరు శాతంకన్నా తక్కువ వృద్ధి రేటు నమోదు చేస్తుందని అంచనా. భారత్‌ ఏడు శాతం, అంతకు మించిన జీడీపీ వృద్ధి రేటు సాధిస్తే తప్ప పెరుగుతున్న యువ జనాభాకు ఉపాధి అవకాశాలు కల్పించలేదు.

సామాన్యులపై భారం

భారత్‌లో నానాటికీ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. అవి సామాజికంగా, రాజకీయంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని లాటిన్‌ అమెరికా దేశాలను చూస్తే తెలుస్తుంది. 2014-15లో రూ.86,647గా ఉన్న భారతీయుల తలసరి ఆదాయం ఇప్పుడు రూ.1,72,000కు పెరిగిందని, స్టాక్‌ మార్కెట్‌ విజృంభిస్తోందని ఏలినవారు గొప్పగా చెబుతున్నారు. అయితే, దేశీయంగా అత్యధిక శాతం ప్రజల స్థితిగతులు నేటికీ మెరుగుపడలేదు. ద్రవ్యోల్బణం వారిని కుంగదీస్తోంది. మరోవైపు గడచిన పదేళ్లలో శతకోటీశ్వరుల సంపద భారీగా పెరిగింది.  దేశంలో అత్యధికులు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. కుబేరులు మాత్రం అమెరికా, చైనాల తరవాత భారత్‌లోనే అత్యధికంగా 166 మంది ఉన్నారు. 2014 నుంచి ప్రభుత్వం అనుసరించిన విధానాలు, బ్యాంకులు ఉదారంగా ఇచ్చిన రుణాలు అతి సంపన్నులను అపర కుబేరులుగా మార్చాయి. మరోవైపు ప్రభుత్వం పరోక్ష పన్నులను పెంచి సామాన్యుల నడ్డివిరుస్తోంది.

ఇండియా సగటు వార్షిక ఆదాయ వృద్ధి 2001-2010 మధ్య కాలంలో 6.67శాతం. 2011-2020 మధ్య అది 5.35 శాతానికి తగ్గింది. కొవిడ్‌ వల్ల ఈ తరుగుదల సంభవించింది. ఇక 2001-2010 మధ్య దిగువ అంచెలోని 50శాతం జనాభా సగటు వార్షికాదాయ వృద్ధి రేటు 5.55శాతం. 2011-2020 మధ్య అది 4.97శాతానికి తగ్గింది. అంటే, పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయాలు జాతీయ సగటుకన్నా తక్కువగానే పెరిగాయన్నమాట. ఈ రెండు కాలావధుల్లో జనాభాలో పై అంచెలోని 10శాతం సగటు వార్షికాదాయ వృద్ధి రేట్లు వరసగా 7.87శాతం, 5.66శాతంగా ఉన్నాయి. అదే కాలానికి ఒక శాతం అతి సంపన్నుల వృద్ధి రేట్లు 8.12 శాతం, 5.37 శాతంగా నమోదయ్యాయి. కిందనున్న 50 శాతం జనాభా వార్షికాదాయాలు గడచిన పదేళ్లలో దారుణంగా పడిపోయాయి. వారి ఆదాయాలు 1951-60లో ఉన్నదానికన్నా ప్రస్తుతం తక్కువ. ఆర్థిక సరళీకరణ తరవాత సంపన్నులు, అతి సంపన్నుల ఆదాయాలు, జాతీయ సంపదలో వారి వాటాలు పెరిగిపోయాయి. పేద, మధ్యతరగతి వారి వాటా మాత్రం తగ్గిపోతూ వచ్చింది. ఫలితంగా సగం జనాభా వస్తుసేవలపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయలేకపోతోంది.

సంపన్నులకే అభివృద్ధి ఫలాలు

సంపన్నులు, అతి సంపన్నులు ఎంత ఖర్చు చేసినా మొత్తం దేశ వినియోగంలో వారి వాటా పరిమితమే. దానివల్ల పరిశ్రమలు, వ్యాపారాలు గొప్పగా పుంజుకొనేది ఏమీ ఉండదు. ఉపాధి అవకాశాలూ వెల్లువెత్తవు. ప్రజల ఆదాయాలూ పెరగవు. ఇప్పటికే ఆదాయాలు పడిపోయిన సామాన్య ప్రజలపై పరోక్ష పన్నులు పెంచడం వస్తుసేవల వినియోగాన్ని మరింత కుంగదీస్తుంది. దీన్ని నివారించాలంటే ప్రజలు ఎక్కువగా వాడే వస్తువులపై జీఎస్‌టీ తగ్గించాలి. పెట్రో ఉత్పత్తులపై పన్నులను కుదించాలి. పెట్రోలు, డీజిల్‌ ధరలు ఎక్కువైతే రవాణా వ్యయం, తద్వారా నిత్యావసరాల ధరలూ పెరిగిపోతాయి. ప్రజల చేతిలోని కాస్త మిగులూ దానివల్ల హరించుకుపోతుంది. 2014 నుంచి పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ప్రజలకు అందించే సేవల తాలూకు రుసుములూ అధికమవుతున్నాయి. ఏతావతా అభివృద్ధి ఫలాలు అతి సంపన్నులకే తప్ప సామాన్యులకు అందడం లేదు.


ఆదాయాల పెంపే ముఖ్యం

ఇండియాలో అత్యధికులు తమ ఆదాయంలో 65-70శాతాన్ని ఆహారం, రవాణా, గృహ వసతి, కరెంటు, నీటి బిల్లులపైనే ఖర్చుచేస్తారు. తరవాత దుస్తులు, విద్య, వైద్యాలపై 15శాతం ఆదాయాన్ని వెచ్చిస్తారు. వస్తుసేవల ధరలు పెరిగిపోతే రుణాలు తీర్చడానికి, ఇతర వినియోగాలకు ప్రజల చేతిలో డబ్బు ఉండదు. అందుకే పేద, మధ్యతరగతివారు వాడే ద్విచక్ర వాహనాల విక్రయాలు ఇప్పటికీ కొవిడ్‌ ముందునాళ్ల స్థాయిని అందుకోలేదు. వేగంగా వినియోగమయ్యే వినియోగదారు వస్తువులు (ఎఫ్‌ఎంసీజీ) అయిన సబ్బులు, డిటర్జంట్లు, టూత్‌ పేస్టులు, ఎలెక్ట్రానిక్‌ వస్తువుల విక్రయాలు ప్రస్తుతం తీసికట్టుగానే ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో ఈ వస్తువుల వాడకం క్షీణించింది. 2019లో జరిపిన ఒక సర్వేలో 61శాతం తమ ఆదాయ వ్యయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. 2022 డిసెంబరు వచ్చేసరికి వారి సంఖ్య 55శాతానికి తగ్గింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం కష్టమవుతుంది. అందువల్ల జనాభాలో దిగువ అంచెలో ఉన్న 70శాతం ప్రజల ఆదాయాలను పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమివ్వాలి. వారి ఆదాయాలు పెరిగితే వినియోగం, తద్వారా దేశార్థికం వేగంగా పురోగమిస్తాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.