Cryptocurrency: క్రిప్టో నేరాలకు ముకుతాడు
Cryptocurrency: క్రిప్టో కరెన్సీ లావాదేవీలు, నిల్వలు, ఇతర ఆర్థిక కార్యకలాపాలకూ నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టాన్ని కేంద్రం ఇటీవల వర్తింపజేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీన్నిబట్టి డిజిటల్ ఆస్తులపై పకడ్బందీ నియంత్రణకు కేంద్రం సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది.
క్రిప్టో కరెన్సీ లావాదేవీలు, నిల్వలు, ఇతర ఆర్థిక కార్యకలాపాలకూ నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టాన్ని కేంద్రం ఇటీవల వర్తింపజేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీన్నిబట్టి డిజిటల్ ఆస్తులపై పకడ్బందీ నియంత్రణకు కేంద్రం సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది.
క్రిప్టో ఆస్తుల నియంత్రణకు ప్రామాణిక నిర్వహణ పద్ధతి (ఎస్‌ఓపీ)ని, సక్రమ ఆచరణ నియమాలను రూపొందించాలని నిశ్చయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంటుకు తెలిపారు. గుప్తలిపి (క్రిప్టోగ్రఫీ), బ్లాక్ చెయిన్ సాంకేతికతల ఆధారంగా క్రిప్టో కరెన్సీలను సృష్టించి, ధ్రువీకరించి, భద్రంగా లావాదేవీలను నిర్వహించే పద్ధతి ప్రపంచవ్యాప్తమైంది. క్రిప్టో ఆస్తుల వేదికలు క్రిప్టో విక్రేతలు, కొనుగోలుదారుల మధ్య అనుసంధానం ఏర్పరుస్తున్నాయి. చైనాతోపాటు పశ్చిమాసియా దేశాలు క్రిప్టోలను పూర్తిగా నిషేధించాయి. భారత్ క్రిప్టో లావాదేవీలను నియంత్రించడానికి నడుంకట్టింది. అక్రమ ధన చలామణీ నిరోధ చట్టం ప్రకారం బ్యాంకులు, స్టాక్ బ్రోకర్లు పాటిస్తున్న నియమ నిబంధనలు క్రిప్టో వ్యాపారానికీ వర్తిస్తాయని ఇటీవల ఉద్ఘాటించింది. నిజానికి డిజిటల్ ఆస్తుల వేదికలకూ మనీలాండరింగ్ నిబంధనలను వర్తింపజేయాలని ప్రపంచ దేశాల నుంచి కొంతకాలంగా వాదన వినిపిస్తోంది. దానికి అనుగుణంగానే భారత్ నిర్ణయం తీసుకుంది. ఇకపై అనుమానాస్పద కార్యకలాపాల గురించి క్రిప్టో ఎక్స్ఛేంజీలు వెంటనే భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి తెలియజేయాల్సి ఉంటుంది.
నియంత్రణకు దృఢ నిశ్చయం
ఇటీవలి కాలంలో సామాన్య మదుపరుల్లోనూ క్రిప్టోలకు ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో క్రిప్టో కేటుగాళ్లు అక్రమ ధన చలామణీకి పాల్పడకుండా నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ సందర్భంగా అసలు అక్రమ ధన చలామణీ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవాలి. అక్రమ ధన చలామణీ మూడు అంచెలుగా జరుగుతుందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. మొదటిది, అక్రమ ధన తరలింపు. రెండో అంచె-మధ్యవర్తులు, నకిలీ బ్యాంకుల ద్వారా దాని తరలింపును కప్పిపెట్టడం. మూడో అంచె- అక్రమ ధనంతో పెట్టుబడులు పెట్టడం, విలాస వస్తువులు కొనడం వంటివి. ఆ విధంగా దాన్ని సక్రమ ధనంగా చలామణీ చేస్తారు. క్రిప్టోలకు సైతం ఇలాంటి మూడంచెల పద్ధతినే అనుసరిస్తున్నారు. ఒక్క 2021లోనే అక్రమంగా దాచిన 870 కోట్ల డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని చట్టబద్ధ మార్గాల్లో చలామణీ చేశారని క్రిప్టో ఎనాలిసిస్ అనే బ్లాక్ చెయిన్ పరిశోధన సంస్థ తెలిపింది. 2020లో చలామణీ చేసిన దానికి ఇది 30శాతం అధికం. ప్రపంచవ్యాప్తంగా మాఫియా, మాదకద్రవ్య ముఠాలు తమ పాపపు సొమ్మును క్రిప్టో కరెన్సీల సాయంతో సక్రమ ధనంగా మార్చుకుంటున్నాయి. ఆ డబ్బును వేర్వేరు విధాలుగా పెట్టుబడి పెడుతున్నాయి. క్రిప్టోల నియంత్రణకు భారత్ ఇప్పుడిప్పుడే చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. అసలు క్రిప్టోలు ఆవిర్భవించి ఇప్పటికి పధ్నాలుగు సంవత్సరాలే అయ్యింది. అందువల్ల వాటి పరిస్థితిని పూర్తిగా ఆకళింపు చేసుకోవడానికి కొంత సమయం అవసరమవుతుంది. గత ఏప్రిల్ నుంచి క్రిప్టో వంటి డిజిటల్ ఆస్తులకు సంబంధించిన లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయాలపై కేంద్రం 30శాతం పన్ను విధిస్తోంది. అసలైతే క్రిప్టోలను నిషేధించాలని రిజర్వు బ్యాంకు ప్రతిపాదించినా, కోర్టులు అందుకు అడ్డుపడ్డాయి. అయితే, రిజర్వు బ్యాంకు సూచన సరైనదని 2022 జూలైలో కేంద్ర ప్రభుత్వం ఉద్ఘాటించింది.
డిజిటల్ కరెన్సీ కట్టడికి అంతర్జాతీయ సహకారం అవసరమని కేంద్రం వెల్లడించింది. తాజా ఉత్తర్వు క్రిప్టోల నియంత్రణ పట్ల దృఢ నిశ్చయాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ విషయంలో అంతర్జాతీయ విధివిధానాలు, ప్రమాణాలను భారత్ అనుసరించనున్నట్లు కేంద్రం స్పష్టం చేస్తోంది. ఆదాయ పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లకు తాజా ఉత్తర్వు పదునైన అస్త్రంగా ఉపకరిస్తుంది. క్రిప్టో ఎక్స్ఛేంజీలను నడుపుతూ, వాటి లావాదేవీలను నిర్వహిస్తున్న పలు సంస్థలపై ఈ సంస్థలు ఇప్పటికే కన్నువేశాయి. తాజా ఉత్తర్వు ఈ సంస్థలకు చట్టబద్ధమైన అధికారం ఇస్తున్నందువల్ల అవి దోషులపై వేగంగా చర్యలు తీసుకోగలుగుతాయి. అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలతో, క్రిప్టో ఫోరెన్సిక్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ క్రిప్టో నేరాలను అరికట్టగలుగుతాయి.
ప్రత్యేక వ్యవస్థ అవసరం
క్రిప్టోల నియంత్రణకు తోడుగా తీసుకోవలసిన చర్యలు మరెన్నో ఉన్నాయి. తాజా నిబంధనల ప్రకారం బ్యాంకులు, స్టాక్ బ్రోకర్లు అనుసరిస్తున్న నియమాలనే క్రిప్టో ఎక్స్ఛేంజీలు సైతం పాటించాల్సి ఉంటుంది. అవి పారదర్శకంగా వ్యవహరించాలి. బ్యాంకులు రిజర్వు బ్యాంకు పర్యవేక్షణలో ఉంటే, స్టాక్ బ్రోకర్లు సెబీ నియంత్రణలో పనిచేయాలి. క్రిప్టోలకూ అలాంటి కేంద్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అక్రమ క్రిప్టో లావాదేవీలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునే అధికారం కొత్త సంస్థకు ఉండాలి. దానివల్ల క్రిప్టో అక్రమాలపై దర్యాప్తునకు పెద్దయెత్తున సిబ్బందిని, వనరులను వెచ్చించాల్సిన అగత్యాన్ని ఈడీ, ఆదాయ పన్ను శాఖలకు తప్పించి, అవి తమ పని తాము చేసుకునే వెసులుబాటు కల్పించవచ్చు. క్రిప్టోలపై ప్రత్యేకంగా నెలకొల్పే నియంత్రణ సంస్థ ఇలాంటి బరువు బాధ్యతలను సమర్థంగా చేపట్టగలుగుతుంది.
తీవ్ర నష్టం
సామాన్య మదుపరులు క్రిప్టోలపై అవగాహన లేకుండానే వాటి లావాదేవీల్లోకి దిగే ప్రమాదం ఉంది. సరైన అవగాహన లేకుంటే క్రిప్టో విపణిలో వ్యక్తులు, సంస్థలు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. కొద్ది రోజుల క్రితం బిట్ కాయిన్ విలువ 20,000 డాలర్ల కన్నా దిగువకు పడిపోవడంతో 7,000 కోట్ల డాలర్ల మదుపరుల సంపద హరించుకుపోయింది. క్రిప్టో లావాదేవీలకు పేరుమోసిన సిల్వర్ గేట్ క్యాపిటల్, సిలికాన్ వ్యాలీ బ్యాంకులు దివాలా తీయడం మదుపరులను మరింత దెబ్బతీసింది. ఈ రెండు సంస్థలు క్రిప్టో కంపెనీలకు భాండాగారాలుగా పనిచేసేవి. హెడ్జ్ ఫండ్లు, క్రిప్టో ఎక్స్ఛేంజీలకు మధ్యవర్తిగా వ్యవహరించి చెల్లింపులు వేగంగా జరిగేలా చూసేవి. ఇప్పుడు ఈ రెండు సంస్థలు చేతులు ఎత్తేయడం వల్ల క్రిప్టోల పట్ల మదుపరులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అర్థమవుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Jayanth C Paranjee: త్రిషకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడం వాళ్లకు నచ్చలేదు: జయంత్ సి.పరాన్జీ
-
India News
Odisha Train Accident: మృతులు 288 కాదు.. 275 మంది: ఒడిశా ప్రభుత్వం క్లారిటీ
-
Politics News
Bandi sanjay: తెదేపాతో భాజపా పొత్తు ఊహాగానాలే..: బండి సంజయ్
-
India News
Guwahati airport: కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Health News
Diabetes patient: మధుమేహులు ఉపవాసం చేయొచ్చా..?
-
India News
Odisha Train Accident: ఏమిటీ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ..?