Heart Failure : లయ తప్పుతున్న గుండె
కరోనా మహమ్మారి సృష్టించిన భయోత్పాతాల నుంచి బయటపడినట్లుగా భావిస్తున్న తరుణంలో కొత్త సమస్య ఎదురవుతోంది. ప్రపంచమంతటా అకస్మాత్తుగా సంభవిస్తున్న హృద్రోగ మరణాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
కరోనా మహమ్మారి సృష్టించిన భయోత్పాతాల నుంచి బయటపడినట్లుగా భావిస్తున్న తరుణంలో కొత్త సమస్య ఎదురవుతోంది. ప్రపంచమంతటా అకస్మాత్తుగా సంభవిస్తున్న హృద్రోగ మరణాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా యువతలో అధికంగా నమోదవుతున్న ఇలాంటి మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
కొన్ని గణాంకాల ప్రకారం కొవిడ్ మహమ్మారి ఉద్ధృతి అనంతరం సంభవిస్తున్న హృద్రోగ మరణాల్లో కేవలం ఆసుపత్రుల్లోనే పదిహేను శాతం పెరుగుదల నమోదు కావడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్క కొవిడ్ వ్యాధి బారిన పడటం తప్పించి ఇతరత్రా అనారోగ్య సమస్యలు లేని వారిలోనూ ఈ మరణాల శాతంలో పెరుగుదల కనిపించడం ఆశ్చర్యకరం. కరోనా వైరస్ శరీరంలో ప్రవేశించిన తరవాత శరీర కణాలకు అంటిపెట్టుకొనేందుకుగాను దాని ఉపరితలం మీద ఉన్న కొక్కెపు నిర్మాణాలను (స్పైక్ ప్రొటీన్లు) ఉపయోగించుకుంటుంది. అయితే ఈ కొక్కెపు నిర్మాణాలు గుండె వాపును, హృదయ కవాటాల్లో రక్తం గడ్డ కట్టడాన్ని ప్రేరేపిస్తున్నాయన్నది పలు శాస్త్రీయ అధ్యయనాల సారాంశం. కొవిడ్ వల్ల గుండెకు ముప్పు వాటిల్లవచ్చని వైద్య రంగం భావిస్తున్నా- వ్యాధి నివారణకు ఉపయోగించే టీకాల పాత్రపైనా ఇటీవల పలు వాదనలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కట్టడిలో విలక్షణ పనితీరు
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు రకాల టీకాలు తయారైనప్పటికీ వైరస్‌ను కట్టడిచేసే విధానంలో ఒక్కొక్క టీకా పనితీరు విలక్షణం. టీకా తయారీ విధానం కూడా శరీరంలో తయారయ్యే రోగనిరోధక శక్తిపై విస్పష్ట ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కొన్ని టీకా రకాల్లో పూర్తిగా నిష్క్రియగా మార్చిన సంపూర్ణ వైరస్ రేణువులు ఉండగా, మరికొన్ని టీకా రకాలను శరీరంలో కేవలం కరోనా వైరస్ కొక్కెపు నిర్మాణాలను మాత్రమే ఉత్పత్తి చేసే విధంగా తయారుచేశారు. కరోనా వైరస్‌ను నిష్క్రియగా లేదా నిర్వీర్యంగా మార్చిన కరోనా టీకాల వల్ల వైరస్‌పై పోరాడేందుకు రోగ నిరోధకశక్తి సమగ్రంగా ఏర్పడే అవకాశం ఉండగా, రెండోరకం టీకాల వల్ల కేవలం వైరస్‌పై ఉండే కొక్కెపు నిర్మాణాలపై దాడి చేసేందుకు మాత్రమే రోగనిరోధకశక్తి పరిమితం అవుతుంది. శరీరంలో టీకా ప్రభావం ఉన్నంతకాలం దానికి వ్యతిరేకంగా రోగనిరోధకశక్తి ప్రతిస్పందిస్తూనే ఉంటుంది. కానీ, రెండో రకం టీకాల వల్ల వైరస్ కొక్కేలకు వ్యతిరేకంగా రోగనిరోధకశక్తి సన్నద్ధమవడంతో పాటు, టీకా ప్రభావం ఉన్నంతకాలం శరీరంలో కరోనా వైరస్ కొక్కెపు నిర్మాణాల ఉత్పత్తి కొనసాగుతూనే ఉంటుంది. వీటివల్ల కొవిడ్ వ్యాధి తలెత్తే పరిస్థితి ఉండదు. అయితే, రోగనిరోధక శక్తి సరిపడినంతగా ప్రతిస్పందించని పక్షంలో- శరీర కణాలను అంటిపెట్టుకొని ఉండే కొక్కెపు నిర్మాణాలు వాటిపై కలిగించే అసహజ జీవరసాయనిక చర్యల వల్ల దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదమూ ఉంది. కరోనా వైరస్ కొక్కేలు- గుండె వాపును, రక్తం గడ్డకట్టడాన్ని ప్రేరేపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు, టీకాల వల్ల ఉత్పత్తి అయ్యే కొక్కేల వల్ల కూడా, అసాధారణ పరిస్థితుల్లో, హృదయ సంబంధ సమస్యలు తలెత్తే ఆస్కారం ఉండవచ్చన్న వాదన సహేతుకమని అనిపించకమానదు. కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ లేకపోయినా కొక్కెపు నిర్మాణాలు హృదయ కండరాల రక్షణను నిర్వహించే కణాల సహజ విధులను దెబ్బతీసి, తద్వారా వాటి నుంచి గుండె వాపును (నాన్-ఇన్‌ఫెక్టివ్ కొవిడ్ వ్యాధి) కలిగించే కారకాలను ఎక్కువగా స్రవింపజేయగలవని బ్రిస్టల్ మెడికల్ స్కూల్, యూకే శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించడం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
దుష్ప్రభావాలపై అధ్యయనం
కరోనా టీకాలు తీసుకున్న వారిలోని రక్తంలో కొక్కెపు ప్రొటీన్ల ఉనికి, అవి ఏ స్థాయుల్లో ఉన్నాయో నిర్ధారించే పరీక్షలను అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో రెండంచెల్లో నిర్ధారణను చేపట్టాలి. మొదటి దశలో ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పద్ధతిలో ప్రాథమిక నిర్ధారణ జరిపి, పాజిటివ్‌గా తేలిన నమూనాలను ఎలీసా పద్ధతిలో పరీక్షించినట్లయితే మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. ఇన్‌ఫెక్షన్ లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌గా తేలిన పక్షంలో గుండె ఆరోగ్యానికి సంబంధించి ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశాన్ని ప్రజలందరికీ కల్పించినట్లవుతుంది. ఇలాంటి నాన్-ఇన్‌ఫెక్టివ్ కొవిడ్ వ్యాధిలో కొక్కేలు ఇతర గ్రాహకానికి అంటి పెట్టుకొని వ్యాధిని కలిగిస్తున్నందువల్ల వ్యాధి చికిత్సను కూడా తదనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. ఇందుకుగాను కొవిడ్ వల్ల కలిగే న్యుమోనియా చికిత్సలో ఉపయోగించే యాంటీబాడీ చికిత్స ప్రయోజనకరంగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే యాంటీబయాటిక్ ఔషధం కూడా కొక్కేలను ఇతర గ్రాహకానికి అంటుకోకుండా అడ్డుకోగలదని గమనించారు. వీటితోపాటు ఇప్పటికే అభివృద్ధి చేసిన ఇతర యాంటీబాడీ చికిత్సలూ నాన్-ఇన్‌ఫెక్టివ్ కొవిడ్ వ్యాధిలో ఎంతవరకు సహాయ పడగలవనేది తేలాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో గుండె, గుండె రక్తనాళాల ఆరోగ్యంపై కరోనా వైరస్ లేదా దాని కొక్కేలు కలిగించే దుష్ప్రభావాల గురించి సమగ్ర అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ముందున్న సవాళ్లు
గుండె వాపును ప్రేరేపించే పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు కూడా సూక్ష్మంగా దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ బాధితులతో పాటు, ఇతర ఆరోగ్యవంతుల్లోనూ దీనివల్ల రక్తనాళాల్లో మరింత ఎక్కువగా కొవ్వు పేరుకొని అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టు వంటి పరిస్థితికి దారి తీయవచ్చు. అందువల్ల గుండె పనితీరుపై నిరంతరం నిఘా ఉంచడం అత్యావశ్యకం. అయితే అందరిలో ఇలా జరుగుతుందని కచ్చితంగా చెప్పలేం. కొన్ని కరోనా టీకాల వల్ల అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే కొందరిలో ముప్పు కలగవచ్చని భావిస్తున్నారు. అదికూడా అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకని, ఇంతకుముందు హృద్రోగ సమస్యలేవీ లేకపోయినా గుండె ఆరోగ్య స్థితిగతులను తెలియజేసే పరీక్షలు, యాంజియోగ్రామ్ మొదలైనవి వైద్యుల పర్యవేక్షణలో చేయించుకుని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కూడా గుండె ఆరోగ్యంపై పెను ప్రభావాలను కనబరుస్తున్నాయి కాబట్టి- ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని అనుసరించేలా మన నడవడికలో మార్పులు రావాలి. అకస్మాత్తుగా సంభవిస్తున్న హృద్రోగ మరణాల్లో, వారు తీసుకున్న టీకా రకాన్ని పరిశీలించి నివేదికలు రూపొందిస్తే ఏది సురక్షితం అనే అంశంపై ఒక అవగాహన ఏర్పడేందుకు ఆస్కారం ఉంటుంది. భవిష్యత్తులో అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించే వీలు ప్రభుత్వాలకూ కలుగుతుంది.
డాక్టర్ అమరేంద్ర వర్మ (ఇమ్యునాలజీలో పరిశోధక శాస్త్రవేత్త)
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Sachin Pilot: సచిన్ పైలట్ కొత్త పార్టీ?
-
India News
Odisha Train Accident: పరిహారం కోసం ‘చావు’ తెలివి
-
World News
పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు
-
Ap-top-news News
9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
India News
క్రికెట్ బుకీని ఫోన్‌కాల్స్‌తో పట్టించిన అమృతా ఫడణవీస్
-
India News
సోదరి కులాంతర వివాహం.. బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన అన్న