సవాళ్లు రువ్వుతున్న చైనా విస్తరణవాదం

సరిహద్దుల్లో డ్రాగన్‌ తరచూ కయ్యానికి దిగుతుండటంతో చైనా, భారత్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు తూర్పు చైనా సముద్రంలో జపాన్‌ ఆధీనంలో ఉన్న సెంకాకు దీవులను డ్రాగన్‌ తనవిగా చెబుతోంది. దక్షిణ చైనా సముద్రం మొత్తాన్నీ తనదిగా చెప్పుకొంటూ విస్తరణ వాదంతో దూసుకుపోతోంది.

Published : 29 Mar 2023 00:32 IST

సరిహద్దుల్లో డ్రాగన్‌ తరచూ కయ్యానికి దిగుతుండటంతో చైనా, భారత్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు తూర్పు చైనా సముద్రంలో జపాన్‌ ఆధీనంలో ఉన్న సెంకాకు దీవులను డ్రాగన్‌ తనవిగా చెబుతోంది. దక్షిణ చైనా సముద్రం మొత్తాన్నీ తనదిగా చెప్పుకొంటూ విస్తరణ వాదంతో దూసుకుపోతోంది. చైనా నుంచి కీలక సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఇండో-పసిఫిక్‌ ప్రాంత భద్రత న్యూదిల్లీ, టోక్యోలకు తప్పనిసరి అవసరంగా మారింది.

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అనుసరించాల్సిన వ్యూహం, దాని ప్రాధాన్యాలు, సవాళ్లపై భారత్‌-జపాన్‌ కలిసికట్టుగా దృష్టి సారించడం దశాబ్ద కాలానికి ముందే ప్రారంభమైంది. పసిఫిక్‌, హిందూ మహాసముద్ర ప్రాంతానికి సంబంధించి ‘రెండు సాగరాల సంగమం’ భావనను జపాన్‌ పూర్వ ప్రధాని షింజో అబే 2007లో ప్రతిపాదించారు. ఈ క్రమంలో ‘స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ (ఎఫ్‌ఓఐపీ) వ్యూహాన్ని జపాన్‌ 2017లో ప్రకటించింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రత, అక్కడి దేశాల అభివృద్ధి(సాగర్‌)పై గతంలో ఆసియా భద్రతా సదస్సులో మోదీ పిలుపిచ్చారు. ఈ క్రమంలో ఇండో-పసిఫిక్‌లో అంతర్జాతీయ చట్టాల వర్తింపు, సముద్ర భద్రత, అంతర్జాతీయ సహకారాన్ని పెంచడానికి భారత్‌, జపాన్‌లు కట్టుబడి ఉన్నాయి. వీటిని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద ఇటీవల రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు. ఆ సందర్భంలో స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ ప్రాంతం కోసం ఆయన నాలుగు పునాదుల ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భారత్‌ను అనివార్య భాగస్వామిగా ఆయన అభివర్ణించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సవాళ్లను అధిగమించడంతో పాటు శాంతి స్థాపనకు ఈ నాలుగు కీలకంగా నిలుస్తాయని కిషిద వ్యాఖ్యానించారు. శాంతి, శ్రేయస్సు కోసం కృషి చేయడం, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో సవాళ్లను సమష్టిగా అధిగమించడం, బహుళ స్థాయి అనుసంధానత, కడలి నుంచి నింగి వరకు భద్రత అన్నవే ఆ పునాదులు.

పటిష్ఠ సహకారం

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో బలప్రయోగంతో పనిలేకుండా అంతర్జాతీయ నియమాలకు అనుగుణంగా వివాదాలను న్యాయ, దౌత్య మార్గంలో శాంతియుతంగా పరిష్కరించుకోవాలని 2018 అక్టోబరు నాటి ఇండియా-జపాన్‌ దార్శనిక పత్రం ప్రకటించింది. సముద్ర చట్టాలపై ఐక్యరాజ్య సమితి ఒడంబడిక నిర్దేశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని అది ప్రతిపాదించింది. సముద్ర భద్రతపై ఐరాస భద్రతా మండలి తీర్మానాలను అమలు చేయడం గురించీ భారత్‌, జపాన్‌లు పునరుద్ఘాటించాయి. ఈ క్రమంలో సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, ఏకపక్షంగా ప్రస్తుతం ఉన్న విధానాలను మార్చడాన్ని వ్యతిరేకించడం వంటివి కిషిద సూచించిన శాంతి, శ్రేయస్సుకు కృషి చేయడంలో ప్రధానమైన అంశాలు. 

ఇండో-పసిఫిక్‌లో ప్రాదేశిక అధికార పరిధులను పరిరక్షించేందుకు 2014 టోక్యో సదస్సులో భారత్‌, జపాన్‌లు తమ అనుబంధాన్ని ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యం స్థాయికి పెంచాలని నిర్ణయించాయి. దానికి అనుగుణంగా నావికా దళ సామర్థ్యాన్ని పెంపొందించడంపై అవి దృష్టి సారించాయి. ఈ క్రమంలో భారత నావికాదళం, జపాన్‌ సముద్ర స్వీయ రక్షణ దళం (జేఎంఎస్‌డీఎఫ్‌) మధ్య ద్వైపాక్షిక భద్రతా సహకారం తెరపైకి వచ్చింది. 2012లోనే ఇరు దేశాలు జపాన్‌-ఇండియా సముద్ర విన్యాసాలు నిర్వహించాయి. నిరుడు సెప్టెంబరు నాటికి అవి ఆరు సార్లు జరిగాయి. ఈ విన్యాసాలు భూ, సముద్ర, గగనతల భద్రతలో పరస్పరం సహకారాన్ని మరింతగా పటిష్ఠం చేసుకోవడానికి అధిక ప్రాధాన్యమిచ్చాయి. నిరుడు నవంబరులో జపాన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ నావికా, మలబార్‌ సైనిక విన్యాసాల్లో భారత్‌ పాల్గొంది. 2021లో ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందమూ సైనిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని సంకల్పించింది. అలాగే భారత నావికాదళం, జేఎంఎస్‌డీఎఫ్‌ మధ్య జలాంతర్గామి విధ్వంసక వ్యవస్థ, నిఘా, మానవ రహిత సాంకేతిక వ్యవస్థల అంశంలోనూ పరస్పర సహకారం కొనసాగుతోంది. తీవ్రవాదులు, సముద్రపు దొంగల నుంచి ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి పొంచి ఉన్న ముప్పును నిలువరించడం ఇండియా-జపాన్‌ బాంధవ్యానికి మరింత విలువను చేకూరుస్తుంది. హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలకూ అది మేలు చేస్తుంది.

ఆర్థికాభివృద్ధికి ఊతం

నాలుగు పునాదుల్లో ఒకటైన బహుళ స్థాయి అనుసంధానత అన్నది ఆర్థికాభివృద్ధికి సంబంధించింది. స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో-పసిఫిక్‌ సహకారానికి సంబంధించి ఇది అత్యంత కీలకమైంది. ఆగ్నేయ ఆసియా, దక్షిణాసియా, పసిఫిక్‌ దీవుల్లో ఆయా అంశాల్లో అనుసంధానతను ఇది పెంపొందిస్తుంది. తద్వారా ఆయా దేశాలు తమకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి ఆర్థికాభివృద్ధి సాధించడానికి అవకాశం లభిస్తుంది. అలాగే బంగ్లాదేశ్‌తో పాటు సముద్రతీరం లేని ఈశాన్య భారతం వంటి ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి సారిస్తారు. పర్యావరణం, ప్రపంచ ఆరోగ్యం, సైబర్‌ భద్రత తదితరాలకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు వాస్తవికమైన, ఆచరణ యోగ్యమైన విధానాలను అనుసరించడం అత్యంత కీలకం. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా విస్తరణ వాదం వల్ల ఎదురయ్యే సవాళ్లను భారత్‌, జపాన్‌లు ఇప్పటికే గుర్తించాయి. ఈ క్రమంలో అవి స్వీయ ఇండో-పసిఫిక్‌ దృక్పథంతో కీలక భాగస్వాములుగా మారాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌-జపాన్‌ భాగస్వామ్యం ఇప్పటికే సానుకూల ప్రభావం చూపుతోంది. ఉమ్మడి ప్రయోజనాల కోసం అంతర్జాతీయ సహకారం ఆవశ్యకతను అది తెలియజెబుతోంది. దీన్నిబట్టి భవిష్యత్తులో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరిణామాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

చట్టాల సమర్థ అమలు

భారత్‌, జపాన్‌ల ఇండో-పసిఫిక్‌ వ్యూహాన్ని బలోపేతం చేయడంలో అంతర్జాతీయ సహకారం కీలక పాత్ర పోషిస్తుంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం ఆసియా, ఆఫ్రికా ఖండాలు, పసిఫిక్‌, హిందూ మహాసముద్రాలతో కూడి ఉంది. అందువల్ల పసిఫిక్‌ దీవులు, ఆసియాన్‌ దేశాలు, పశ్చిమాసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌, క్వాడ్‌ సభ్య దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియాల సహకారం భవిష్యత్తులో కీలకంగా నిలుస్తుంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని పరిరక్షించేందుకు ఇండియా, జపాన్‌లు అన్ని దేశాల్లో సముద్ర చట్టాలు సమర్థంగా అమలయ్యేలా చొరవ తీసుకోవాలి. దానికోసం మానవ వనరుల అభివృద్ధి, తీర రక్షక దళాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, వారి ఉమ్మడి శిక్షణ వంటి వాటిపై దృష్టి సారించాలి. కిషిద ప్రతిపాదించిన కడలి నుంచి నింగి వరకు భద్రతలో ఈ అంశాలు ఇమిడి ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.