ఆధునిక యుగానికి కొత్త డిజిటల్‌ చట్టం

కేంద్ర ఎలెక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక శాఖ త్వరలోనే 2023 డిజిటల్‌ ఇండియా చట్టాన్ని ప్రవేశపెట్టనుంది. 2000 సంవత్సరం నాటి సమాచార సాంకేతిక (ఐటీ) చట్టం స్థానంలో ఈ కొత్త చట్టం అమలులోకి వస్తుంది. నిరుడు నవంబరులో ప్రతిపాదించిన 2022 డిజిటల్‌ వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లుకు తోడుగా డిజిటల్‌ ఇండియా చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్షిస్తోంది.

Published : 02 Apr 2023 00:46 IST

కేంద్ర ఎలెక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక శాఖ త్వరలోనే 2023 డిజిటల్‌ ఇండియా చట్టాన్ని ప్రవేశపెట్టనుంది. 2000 సంవత్సరం నాటి సమాచార సాంకేతిక (ఐటీ) చట్టం స్థానంలో ఈ కొత్త చట్టం అమలులోకి వస్తుంది. నిరుడు నవంబరులో ప్రతిపాదించిన 2022 డిజిటల్‌ వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లుకు తోడుగా డిజిటల్‌ ఇండియా చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్షిస్తోంది.

ఇరవై మూడేళ్ల కిందటి ఐటీ చట్టంలో కాలానుగుణంగా కేంద్రం పలు సవరణలు చేస్తూ వచ్చింది. మొదట్లో ఈ-కామర్స్‌ లావాదేవీలు భద్రంగా సాగేలా చూడటానికి, సైబర్‌ నేరాలను నిర్వచించడానికి మాత్రమే ఐటీ చట్టం పరిమితమైంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి దాకా సైబర్‌ సీమలో భద్రతకు సంబంధించి పెను మార్పులు సంభవించాయి. వాటికి దీటుగా స్పందించే ఏర్పాట్లు పాత ఐటీ చట్టంలో లేవు. అలాగే వ్యక్తిగత సమాచార హక్కుల రక్షణకు సంబంధించీ ఐటీ చట్టంలో సరైన నియమాలు కనిపించవు. నానాటికీ పెచ్చరిల్లుతున్న సైబర్‌ దాడులను దీటుగా ఎదుర్కొనే ఏర్పాట్లూ అందులో లేవు. అందువల్ల ప్రస్తుత డిజిటల్‌ చట్టాల స్థానంలో కొత్త శాసనాలను ప్రవేశపెడితేనే ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా నూతన సాంకేతికతలను ఉపయోగించడం సాధ్యమవుతుంది. నవకల్పనలకు, అంకుర సంస్థలకు ఊతమిస్తూ భారత ఆర్థిక వ్యవస్థకు ఉత్ప్రేరకంగా పనిచేసే విధంగా కొత్త డిజిటల్‌ ఇండియా చట్టాన్ని రూపొందించారు. అదే సమయంలో డిజిటల్‌ సీమలో పౌరులకు గోప్యత, భద్రత కల్పించే విధంగా దాన్ని తీర్చిదిద్దారు.

కలగలిసి సమగ్రంగా...

నూతన చట్టంలో ప్రధాన అంశం- సైబర్‌ సీమలో సురక్షిత స్థలం (సేఫ్‌ హార్బర్‌) అనే నిబంధనను పునర్నిర్వచించడం. ఇంటర్నెట్‌లో, సామాజిక మాధ్యమాల్లో మూడో పక్షం లేదా మూడో వ్యక్తులు చేసే పోస్టులు లేదా సందేశాలకు ఆయా వెబ్‌సైట్‌, సామాజిక మాధ్యమ నిర్వాహకులు (మధ్యవర్తులు) బాధ్యులు కారనే నిబంధననే సేఫ్‌ హార్బర్‌ అంటారు. అభ్యంతరకర సందేశాలు, పోస్టులను తొలగించాలని ప్రభుత్వం లేదా చట్టాలు ఆదేశిస్తే సంబంధిత వెబ్‌సైట్‌ లేదా సామాజిక మాధ్యమం దాన్ని శిరసా వహించాలని కొత్త నిబంధనలు తెచ్చారు. వాటినే 2021నాటి సమాచార సాంకేతిక (మధ్యవర్తులకు మార్గదర్శకాలు, డిజిటల్‌ మీడియా నైతిక) నిబంధనావళి అంటున్నారు. వినియోగదారులకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందనే సంగతిని మధ్యవర్తి వేదికలు గుర్తించాలని ఆ నిబంధనావళి నిర్దేశిస్తోంది. వినియోగదారులు చేసే ఫిర్యాదులను పరిష్కరించడానికి మూడు అప్పిలేట్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ జాగ్రత్తలన్నీ 2023 డిజిటల్‌ ఇండియా చట్టంలోనూ అంతర్భాగాలవుతాయి. కొత్త చట్టం కింద ఆన్‌లైన్‌లో క్రిమినల్‌, సివిల్‌ నేరాలపై సరికొత్త నిర్ణాయక ప్రాధికార సంస్థనూ ఏర్పాటు చేస్తారు. ఐటీ చట్టం వచ్చిన అనంతరం వినియోగదారులకు హాని చేసే ట్రోలింగ్‌, ఫిషింగ్‌, క్యాట్‌ ఫిషింగ్‌, డాక్సింగ్‌ వంటి కొత్త తరహా బెడదలు పుట్టుకొచ్చాయి. దాంతో వినియోగదారులకు ఆన్‌లైన్‌లో భద్రత కల్పించాల్సిన ఆవశ్యకతను, సామాజిక మాధ్యమాలపై నియంత్రణ అవసరాన్నీ ప్రభుత్వం గుర్తించింది. దానికి అనుగుణంగా 2022లో డిజిటల్‌ వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు ముసాయిదాను వెలువరించింది. ఆ బిల్లుతోపాటు జాతీయ డేటా నిర్వహణ విధానం, భారత శిక్షాస్మృతి (ఐపీసీ)కి చేసే సవరణలు డిజిటల్‌ ఇండియా చట్టానికి మూల స్తంభాలుగా నిలుస్తాయి. ఏతావతా డిజిటల్‌ ఇండియా చట్టం, డిజిటల్‌ వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు కలగలిసి సమగ్ర చట్టంగా పనిచేస్తాయి.

గుత్తాధిపత్యంపై గురి

ప్రస్తుతం ట్విటర్‌, మెటావెర్స్‌, అమెజాన్‌, గూగుల్‌ వంటి బడా టెక్‌ సంస్థలు దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక జీవనాలపై విస్తృత ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. భారతీయులు సృష్టించి పోస్ట్‌ చేసే అంశాలపై వాణిజ్య ప్రకటనల ద్వారా బడా టెక్‌ సంస్థలు ఆదాయం ఆర్జిస్తున్నాయి. ఆ ఆదాయాన్ని భారతీయ కంటెంట్‌ ప్రొవైడర్లతో పంచుకొనేలా డిజిటల్‌ ఇండియా చట్టం ఏర్పాట్లు చేస్తుంది. డిజిటల్‌ సేవలపై బడా టెక్‌ కంపెనీల గుత్తాధిపత్యాన్ని నిలువరించడం ఈ చట్టం లక్ష్యాల్లో ముఖ్యమైంది. లఘు వ్యాపారాలు, చిన్న అంకుర సంస్థలు సైతం డిజిటల్‌ సేవలు అందించగలిగేలా ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారులకు వైవిధ్యభరితమైన సేవలు, వస్తువులు అందించాలని నూతన చట్టం ఉద్దేశిస్తోంది. డిజిటల్‌ ఇండియా చట్టం భారతదేశ ఐటీ చరిత్రలో అత్యంత కీలకంగా నిలవనుంది. అది రాబోయే ఒకటీ రెండు దశాబ్దాల వరకు డిజిటల్‌ రంగానికి సంబంధించిన చట్టాలన్నింటికీ మాతృకగా నిలవనుంది. అందుకే భారత ప్రభుత్వం ఈ చట్ట ముసాయిదా రూపకల్పనలో సంబంధిత పక్షాలు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంది. 2026కల్లా లక్ష కోట్ల డాలర్ల డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను సాధించాలన్న భారత ప్రభుత్వ లక్ష్యానికి డిజిటల్‌ ఇండియా చట్టం చోదక శక్తిగా నిలవనుంది.


* డిజిటల్‌ ఇండియా చట్టం కృత్రిమ మేధ (ఏఐ), సైబర్‌ నేరాలు, డేటా రక్షణ, ఇంటర్నెట్‌ వేదికల మధ్య పోటీ, ఆన్‌లైన్‌ భద్రత వంటి అంశాలపై నిబంధనల చట్రాన్ని ఏర్పరుస్తుంది. మెషీన్‌ లెర్నింగ్‌, 5జీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), క్లౌడ్‌ కంప్యూటింగ్‌, మెటావెర్స్‌, బ్లాక్‌చెయిన్‌, క్రిప్టో కరెన్సీ వంటి కొత్త తరం సాంకేతికతలకు నూతన మార్గదర్శక సూత్రాలు, నియంత్రణలను ఏర్పరుస్తుంది. డిజిటల్‌ ప్రమాణాలు, ప్రత్యేక చట్టాల రూపకల్పనకు పునాదిగా నిలుస్తుంది.

* సైబర్‌ సీమలో బెదిరింపులకు దిగడం, వ్యక్తుల సమాచారాన్ని వారి సమ్మతి లేకుండా ఇతరులకు వ్యాపింపజేయడం తదితరాల విషయంలో శిక్షలు విధించే ఏర్పాట్లు డిజిటల్‌ ఇండియా చట్టంలో ఉంటాయి.

* వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవడానికి పౌరులకు హక్కు ఉంది. అదే సమయంలో చట్ట ప్రయోజనాల కోసం పౌరుల సమాచారాన్ని వినియోగించుకోవాల్సి రావచ్చు. ఈ రెండు ఆవశ్యకతలను బాధ్యతాయుతంగా మేళవించడానికి డిజిటల్‌ ఇండియా చట్టాన్ని తీసుకొస్తున్నారు.

* కొత్త డిజిటల్‌ ఇండియా చట్టం భారతీయుల్లో డిజిటల్‌ అక్షరాస్యతను వ్యాపింపజేస్తుంది. విద్యావైద్యాలు, వ్యవసాయం తదితర రంగాల్లో డిజిటల్‌ సాంకేతికతల వినియోగానికి పటిష్ఠమైన ప్రాతిపదికను ఏర్పరుస్తుంది. ఉత్పాదకతను, సామర్థ్యాన్ని పెంచడానికి వెసులుబాటు కల్పిస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.