జీఎస్టీలోకి చమురు ఇంకెప్పుడు?

పెట్రోలు, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి.  అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పడిపోయినా వీటి ధరలను మాత్రం ప్రభుత్వాలు తగ్గించడంలేదు. పెరిగిన ధరలతో సామాన్యులతో పాటు వ్యాపారులూ సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రో ఉత్పత్తులను వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలన్న...

Updated : 11 Apr 2023 17:25 IST

పెట్రోలు, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి.  అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పడిపోయినా వీటి ధరలను మాత్రం ప్రభుత్వాలు తగ్గించడంలేదు. పెరిగిన ధరలతో సామాన్యులతో పాటు వ్యాపారులూ సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రో ఉత్పత్తులను వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు ఊపందుకొన్నాయి.

పెట్రోలు, డీజిల్‌ ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం, రాష్ట్రాలు పెద్దగా ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు. అధిక ధరలను తగ్గించడంలేదన్న భావన ప్రజల్లో నెలకొంది. దాంతో రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రో ఉత్పత్తులను వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెబుతున్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీలో కలపడంవల్ల వాటి ధరలు తగ్గుతాయా... ఈ విషయంలో రాష్ట్రాలు చెబుతున్న అభ్యంతరాలు ఏమిటి... రాష్ట్రాల సూచనలను బేఖాతరుచేస్తూ పెట్రో ఉత్పత్తులను కేంద్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకురాగలదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా 2017, జులై 1 నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చింది. అప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్తువులు, సేవలపై వేర్వేరుగా విధిస్తూ వచ్చిన పన్నులన్నీ జీఎస్టీలో కలిసిపోయాయి. దేశమంతటా ఒకే పన్ను విధానాన్ని అనుసరిస్తుండటంతో పరోక్ష పన్నుల విషయంలో జీఎస్టీని భారీ సంస్కరణగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా అమ్మకాలపై కట్టాల్సిన పన్ను నుంచి కొనుగోలుపై కట్టిన పన్నుకు మినహాయింపు ఇవ్వడంతో- పన్నుపై పన్ను విధించే హానికర విధానానికి తెరపడింది.

రాష్ట్రాల ఆందోళన...

జీఎస్టీని ప్రవేశపెట్టడానికి ముందు జరిగిన చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కీలక అంశాలను ప్రస్తావించాయి. వీటిలో మొదటిది: ఈ పన్ను విధానం వల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గిపోతే, ప్రజలకు ఇచ్చిన ఆర్థికపరమైన వాగ్దానాలను అవి ఎలా నెరవేరుస్తాయి? రెండోది: జీఎస్టీ రాకతో వస్తువుల కొనుగోలు, అమ్మకాలపై పన్ను విధించే అధికారాన్ని రాష్ట్రాలు కోల్పోతే... అవసరాలకు తగ్గట్లు ఆదాయాన్ని అవి ఎలా పెంచుకుంటాయి? కేంద్రం వీటికి బదులిస్తూ- జీఎస్టీ అమలు కారణంగా రాష్ట్రాల ఆదాయం తగ్గితే, అయిదు సంవత్సరాలపాటు ఆ లోటును భర్తీచేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించేందుకు కావలసిన నిధుల సేకరణ నిమిత్తం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి, దాని కింద ఎంపిక చేసిన వస్తువులపై ‘సెస్‌’ విధించేందుకు అనుమతించింది. ఈ నష్టపరిహార చెల్లింపు గడువు నిరుడు జూన్‌తో ముగిసింది. ఈ అయిదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం సుమారు అయిదు లక్షల కోట్ల రూపాయలకుపైగా నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లించింది. 2022 జులై నుంచి ఆదాయలోటు భర్తీని నిలిపివేసింది. ఇక రెండో ప్రశ్నకు సమాధానంగా- రాష్ట్రాలకు దండిగా ఆదాయం సమకూర్చే పెట్రోలు, డీజిల్‌, సహజ వాయువు, ముడిచమురు, విమాన ఇంధనం వంటి ఉత్పత్తులను కేంద్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. వీటిపై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాలను, రాష్ట్రాలు అమ్మకపు పన్నులను విధించుకోవచ్చని తెలిపింది. అయితే, ఈ సౌలభ్యం తాత్కాలికమే! పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని జీఎస్టీ మండలి ఏ క్షణమైనా ప్రతిపాదించవచ్చు. కేంద్ర ఆర్థికమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ మండలిలో రాష్ట్రాల తరఫున మంత్రులు లేదా ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. పెట్రో ఉత్పత్తులు, కేంద్ర రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరు. వీటి ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి పన్ను రూపంలో రూ.2,64,182 కోట్లు, రాష్ట్రాలకు రూ.2,36,864 కోట్లు సమకూరాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు సుమారు        రూ.17,500 కోట్లు, తెలంగాణకు రూ.15,000 కోట్లు వచ్చాయి. రాష్ట్రాల సొంత ఆదాయంలో పెట్రో ఉత్పత్తులపై పన్ను రూపంలో సమకూరే మొత్తం 16-18 శాతం ఉంటోంది. దీనికితోడు రకరకాల పన్నులు విధించుకునే సౌలభ్యమూ ఉంది. అందుకే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చాలా రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేయడంలేదు.

కొన్ని రాష్ట్రాలు అంగీకరించకపోయినా, పెట్రో ఉత్పత్తులను వస్తుసేవల పన్ను పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం జీఎస్టీ మండలి ద్వారా సిఫార్సు చేయించవచ్చు. అయితే, అది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమే అవుతుంది. ఇప్పటివరకు పరస్పర అంగీకారంతోనే ఈ మండలి నిర్ణయాలు తీసుకుంటోంది. కాబట్టి రాష్ట్రాల అభ్యంతరాలను కాదని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకపోవచ్చు. సుప్రీంకోర్టు ఏడాది కిందట మొహిత్‌ మినరల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కేసులో తీర్పు వెలువరిస్తూ- జీఎస్టీ మండలి సిఫార్సులను కేంద్రం, రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరమేమీ లేదని తేల్చిచెప్పింది. అందుకే రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి చెబుతున్నారు.

లక్ష్యం పూర్తిగా నెరవేరాలంటే...

పెట్రో ఉత్పత్తులను ఇంకా జీఎస్టీలో చేర్చకపోవడం వల్ల వస్తుసేవల పన్ను లక్ష్యం పూర్తిగా నెరవేరడంలేదు. వీటిపై ఇప్పటికీ పన్నుపై పన్ను విధానమే కొనసాగుతోంది. పెట్రోలు, డీజిల్‌పై రాష్ట్రాలు తమకు తోచిన విధంగా పన్నులు విధిస్తున్నాయి. ఈ విషయంలో రాష్ట్రాల మధ్య ఏకరూపత లేకపోవడం వ్యాపారాలు, పరిశ్రమల నిర్వహణకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. రాష్ట్రాల మధ్య పన్నుల వ్యత్యాసం వల్ల సరిహద్దు జిల్లాల్లో అక్రమ రవాణాకు ఆస్కారం ఉంటుంది. దీనివల్ల రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుంది. ‘ఒకే దేశం-ఒకే పన్ను’ విధానం వ్యాపారాలను సులభతరం చేసి, దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు సమాలోచనలు జరిపి రాష్ట్రాల ఆదాయాలకు నష్టం కలగకుండా, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే మార్గాన్ని అన్వేషించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టి సారించి, అధిక ధరల భారం నుంచి ప్రజలకు, వ్యాపారులకు ఉపశమనం కలిగించాలి.


ఎస్‌బీఐ అధ్యయనం...

పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అధ్యయనం చేపట్టి, 2021లో నివేదికను వెల్లడించింది. దాని ప్రకారం- పెట్రోలు, డీజిల్‌ను వస్తుసేవల పన్నులో కలిపితే... ఇప్పుడున్న 28శాతం పన్నుతో పాటు లీటరుకు మరో 20-30 రూపాయలు సెస్‌ విధించినా ఈ రెండింటి ధరలు సుమారుగా 68 రూపాయలకు పడిపోతాయి. ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఆదాయం కోల్పోతాయని, అది జీడీపీలో 0.4శాతం వరకు ఉండవచ్చని నివేదిక పేర్కొంది. పీపా ముడి చమురు ధరను 60 డాలర్లుగా, రూపాయి మారకం విలువ ఒక డాలరుకు 73 రూపాయలుగా పరిగణించి ఎస్‌బీఐ ఈ లెక్కగట్టింది. ఈ నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోలేదు.

 డి.వెంకటేశ్వరరావు (సంయుక్త కమిషనర్‌ (విశ్రాంత), వాణిజ్య పన్నులశాఖ)

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు