వాణిజ్య విధానం... ఎగుమతులకు ఊతం

దేశ ఎగుమతులను భారీగా పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మార్చి 31న కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రకటించింది. భారత్‌ 192 దేశాలకు 7500 రకాల సరకులను ఎగుమతి చేస్తోంది.

Updated : 16 Apr 2023 17:23 IST

దేశ ఎగుమతులను భారీగా పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మార్చి 31న కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రకటించింది. భారత్‌ 192 దేశాలకు 7500 రకాల సరకులను ఎగుమతి చేస్తోంది. మన సరకులు, సేవల ఎగుమతుల విలువను 2030కల్లా రెండు లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.164లక్షల కోట్లకు) పెంచాలని కొత్త విధానం లక్షించింది. ఇందులో వస్తువులు, సేవల వాటా చెరో లక్ష కోట్ల డాలర్ల మేర ఉండాలని నిపుణులు ఆకాంక్షిస్తున్నారు.

భారత వస్తుసేవల ఎగుమతుల విలువ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 78,018 కోట్ల డాలర్లు (సుమారు రూ.63.76లక్షల కోట్లు)గా లెక్క తేలింది. ఇందులో వస్తువుల విలువ 44,746 కోట్ల డాలర్లు, సేవల విలువ 33,272 కోట్ల డాలర్లు. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నిరుడు వస్తువులు 6.03శాతం అధికంగా ఎగుమతి అయ్యాయి. అయితే, 2022-23లో వస్తువుల దిగుమతులు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 16.50శాతం పెరిగి, 89,224 కోట్ల డాలర్లకు చేరాయి. దాంతో 26,678 కోట్ల (సుమారు రూ.21.80లక్షల కోట్ల) మేర వస్తు వాణిజ్యలోటు ఏర్పడింది. ఈ లోటును పూడ్చుకొని, ఎగుమతులను పెంచుకునేందుకు కొత్త విధానం దోహదపడుతుందంటున్నారు.

ఉపాధికి తోడ్పాటు 

కొవిడ్‌, ఉక్రెయిన్‌ సంక్షోభాల వల్ల అంతర్జాతీయ వాణిజ్యం మందగించిన పరిస్థితుల్లోనూ ఎగుమతులను పెంచుకోవాలని భారత్‌ ఆశిస్తోంది. రూపాయల్లో విదేశీ వాణిజ్యాన్ని విస్తరించాలని కేంద్రం లక్షిస్తోంది. జీ-20 అధ్యక్ష హోదాలో తన ఎగుమతులను మరింత పెంచుకోవడంపై భారత్‌ దృష్టి సారిస్తోంది. వస్తుసేవల ఎగుమతుల పెంపుతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. జీడీపీ వృద్ధిచెంది పేదరికం తగ్గుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి వస్తుసేవలను కోరుకుంటారు. ఆ గిరాకీ పారిశ్రామిక, వ్యాపారాభివృద్ధికి ఊతమిస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కేంద్రం నూతన విదేశీ వాణిజ్య విధానాన్ని తీసుకొచ్చింది. ప్రత్యేక రసాయనాలు, సేంద్రియ ఉత్పత్తులు, ముడిపదార్థాలు, ఆధునిక సాంకేతికతలను ‘స్కోమెట్‌’గా వ్యవహరిస్తారు. నూతన విధానంలో భాగంగా స్కోమెట్‌ ఎగుమతులను క్రమబద్ధీకరిస్తారు. కొత్త విదేశీ వాణిజ్య విధానం నాలుగు స్తంభాలపై నిలుస్తుంది. అవి: పన్ను మినహాయింపులకు బదులు ప్రోత్సాహకాలను ఇవ్వడం; ఎగుమతిదారులు, రాష్ట్రాలు, జిల్లాలు, విదేశాల్లోని భారత దౌత్య కార్యాలయాలతో కలిసి ఎగుమతుల పెంపునకు కృషి చేయడం; వ్యాపార సౌలభ్యాన్ని పెంచి, లావాదేవీల ఖర్చు తగ్గించి, ఎలెక్ట్రానిక్‌ మార్గాల్లో వ్యాపారాభివృద్ధికి ఏర్పాట్లు చేయడం; ఈ-కామర్స్‌కు, ఎగుమతుల కోసం ఉత్పత్తి చేపట్టే కేంద్రాలకు తోడ్పాటు అందించడం.

కొత్త విదేశీ వాణిజ్య విధానం ఎగుమతిదారుల నమ్మకం చూరగొనడానికి, వారితో భాగస్వామ్యానికి ప్రాధాన్యమిస్తోంది. ముఖ్యంగా ఎగుమతిచేసే వస్తువుల సంఖ్యను పెంచడం, మరిన్ని ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేయడం, ఎగుమతుల్లో ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం, ఎగుమతులకు ఆంక్షలు లేకుండా చూడటం, వస్తుసేవల తయారీకి అవసరమైన ముడిసరకులు, విడిభాగాల దిగుమతిని ప్రోత్సహించడం వంటి ఎన్నో సంస్కరణలు ఈ విధానంతో సాధ్యం కానున్నాయి. రూపాయిని విదేశీ కరెన్సీల్లోకి, విదేశీ కరెన్సీని రూపాయిల్లోకి తేలిగ్గా మార్చుకునే సౌలభ్యం కల్పించడం ఇందులోని మరో కీలకాంశం. అవసరాన్ని బట్టి కొత్త వాణిజ్య విధానాన్ని ఎప్పటికప్పుడు సవరిస్తారు. రీ-ఇంజినీరింగ్‌, యాంత్రీకరణల ద్వారా ఎగుమతులను ప్రోత్సహిస్తారు.సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు... రుసుముల తగ్గింపు, సమాచార సాంకేతికత ఆధారిత పథకాల ద్వారా ఎగుమతులను పెంచుకోవడానికి కొత్త విధానం ఊతమిస్తుంది.రాష్ట్రాల భాగస్వామ్యంతో జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కొత్త విధానం సూచిస్తోంది. ఎగుమతికి అనువైన వస్తుసేవల గుర్తింపు, సమస్యల పరిష్కారానికి రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఎగుమతి ప్రోత్సాహక బృందాలను ఏర్పాటుచేస్తారు. జిల్లాల కోసం ప్రత్యేకంగా ఎగుమతి వృద్ధి కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తారు. 2030 నాటికి భారత ఈ-కామర్స్‌ ఎగుమతుల సామర్థ్యం 20,000-30,000 కోట్ల డాలర్లకు (సుమారు రూ.16-25లక్షల కోట్లకు) చేరుతుందని అంచనా. దీన్ని అందుకునేందుకు ఈ-కామర్స్‌ కేంద్రాలను అభివృద్ధి చేయాలని కొత్త విదేశీ వాణిజ్య విధానం లక్షిస్తోంది. చేనేత, చేతివృత్తులవారు, దుస్తుల తయారీదారులు, ఆభరణ డిజైనర్లు ఈ-కామర్స్‌ను ఉపయోగించుకునేందుకు శిక్షణ ఇస్తారు. ఎగుమతిచేసే వస్తువుల తయారీకి అవసరమైన ఉత్పాదక యంత్రాలను ఎలాంటి సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడానికి వీలుకల్పించే (ఈపీసీజీ) పథకాన్ని క్రమబద్ధీకరిస్తున్నారు. దీని ద్వారా ‘పీఎం-మిత్ర పార్కు (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌, అపారెల్‌ పార్కు)లకు ప్రయోజనం చేకూరుస్తారు. విద్యుత్‌ వాహనాలు, వాననీటి సేకరణ-వడపోత సాధనాలు, ఎత్తయిన భవనాలపై సేద్యానికి ఉపయోగించే సామగ్రికి ఈపీసీజీ రాయితీలను అందిస్తారు. కొత్త విదేశీ వాణిజ్య విధానం- పాడి పరిశ్రమకు మునుపు ఉన్న సగటు ఎగుమతి పరిమితిని ఎత్తివేసింది. దుబాయ్‌, సింగపూర్‌, హాంకాంగ్‌ల మాదిరిగా గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీని విదేశీ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని పేర్కొంది.

వివాదాలను తప్పించి... విశ్వాసం నెలకొల్పి...

ఎగుమతిదారులు కోర్టు వ్యాజ్యాల్లో చిక్కుకొనే అవస్థను తప్పించి, పరస్పర నమ్మకం ఆధారంగా విదేశీ వాణిజ్యాన్ని పెంపొందించాలని కేంద్రం ఆశిస్తోంది. ‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకం కింద పన్ను వివాదాల పరిష్కారానికి ఒక్కసారి క్షమాభిక్ష ప్రసాదించాలని యోచించింది. ఎగుమతిదారులు కస్టమ్స్‌ సుంకాలను చెల్లించడం ద్వారా అన్ని పెండింగు కేసులను పరిష్కరించుకునేందుకు వీలు కల్పిస్తారు. ఎగుమతి సంస్థల దరఖాస్తులకు వేగంగా అనుమతులు మంజూరు చేయడానికి డిజిటల్‌ పద్ధతులను అవలంబిస్తారు. ఇంతవరకు విదేశీ వాణిజ్య విధానాన్ని అయిదేళ్ల కాలపరిమితితో వెలువరిస్తున్నారు. ఇకపై ఈ కాలావధికి స్వస్తిచెప్పి దీర్ఘకాలిక దృష్టితో పథకాన్ని అమలుచేస్తారు. సమర్థంగా అమలుచేస్తే- ఈ కొత్త విధానం భారత్‌ నుంచి వస్తుసేవల ఎగుమతులను ఇతోధికంగా పెంచి, పెద్దమొత్తంలో విదేశ మారకద్రవ్యాన్ని ఆర్జించేందుకు తోడ్పడగలదు.


శిక్షణకు అవకాశం

గతంలో ఉత్కృష్ట ఎగుమతి పట్టణాల (టీఈఈ) పథకం కింద దేశంలోని 39 పట్టణాల నుంచి ఎగుమతుల వృద్ధికి మౌలిక వసతులు, రాయితీలు కల్పించారు. ఇకపై మీర్జాపుర్‌, ఫరీదాబాద్‌, మొరాదాబాద్‌, వారణాసిల నుంచీ ఎగుమతుల పెంపునకు కృషి చేస్తారు. టీఈఈ పట్టణాలకు విపణి సౌలభ్య కార్యక్రమం ద్వారా నిధులు అందిస్తారు. గణనీయంగా ఎగుమతులు చేపట్టిన సంస్థలకు 2స్టార్‌ అంతకుమించి స్టార్‌ రేటింగ్‌ ఇస్తున్నారు. ఇలాంటి సంస్థలు- విదేశీ వాణిజ్యానికి సంబంధించి వ్యక్తులు, సంస్థలకు శిక్షణ ఇచ్చేందుకు కొత్త విధానం వీలు కల్పిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి