Global Recession: ముసురుతున్న మాంద్యం మబ్బులు
అంతర్జాతీయంగా మాంద్యం ముంచుకొస్తోందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. సంపన్న దేశాలు ఆర్థిక శాస్త్ర నియమాలకు విరుద్ధమైన ద్రవ్య విధానాన్ని దూకుడుగా అనుసరిస్తున్నాయి. ఫలితంగా అవి మాంద్యంలోకి జారిపోతున్నాయి. వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ప్రపంచాన్ని అమెరికా ఆర్థిక అనిశ్చితిలోకి నెట్టింది. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తూత్పత్తి తగ్గిపోతోంది.
అంతర్జాతీయంగా మాంద్యం ముంచుకొస్తోందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. సంపన్న దేశాలు ఆర్థిక శాస్త్ర నియమాలకు విరుద్ధమైన ద్రవ్య విధానాన్ని దూకుడుగా అనుసరిస్తున్నాయి. ఫలితంగా అవి మాంద్యంలోకి జారిపోతున్నాయి. వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ప్రపంచాన్ని అమెరికా ఆర్థిక అనిశ్చితిలోకి నెట్టింది. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తూత్పత్తి తగ్గిపోతోంది. ఈ పరిణామం వర్ధమాన దేశాలకు పెను భారంగా మారుతోంది.
వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో సంపన్న, వర్ధమాన దేశాలు పరస్పరం అనుసంధానమై ఉంటాయి. అందువల్ల అమెరికా, బ్రిటన్ తదితర సంపన్న దేశాల విధానాలు పేద దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ద్రవ్యోల్బణం వల్ల అభివృద్ధిపై నమ్మకం సడలుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అలముకుంటున్న ఆర్థిక మాంద్యాన్ని అర్థం చేసుకోవాలంటే 2008 నాటి పరిణామాలను గుర్తుతెచ్చుకోవాలి. అప్పట్లో అమెరికా ఆర్థిక సంస్థలు అర్హత లేనివారికీ తక్కువ వడ్డీకి గృహ రుణాలు ఇచ్చాయి. రుణ గ్రహీతలు వాటిని తీర్చలేకపోవడం వల్ల నాడు అంతర్జాతీయంగా మాంద్యం ఏర్పడింది. 2008లో అంతర్జాతీయ పెట్టుబడులు, ఆర్థిక సేవల సంస్థ ‘లేమాన్ బ్రదర్స్’ దివాలా తీసింది. దాంతో ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి అమెరికా, ఐరోపా, బ్రిటిష్, జపాన్ కేంద్ర బ్యాంకులు తమ దేశాల్లోని వాణిజ్య బ్యాంకుల నుంచి ప్రభుత్వ బాండ్లను కొనుగోలుచేసి వాటికి నిధుల లభ్యతను పెంచాయి. అలా బ్యాంకుల వద్దకు చేరిన అదనపు నిధులను పెట్టుబడి రుణాలుగా అందించారు. దాంతో కేవలం అయిదేళ్లలో తక్కువ వడ్డీకి నిధుల లభ్యత నాలుగు రెట్లు పెరిగిపోయింది. సాధారణ పరిస్థితుల్లోనైతే ఇది రెండేళ్లలోనే ద్రవ్యోల్బణానికి దారితీసి ఉండేది. కానీ, 2008 నాటి ఆర్థిక పరిస్థితులు అసాధారణమైనవి. అప్పట్లో అదనపు నిధులు బ్యాంకుల ద్వారా పరోక్షంగా చలామణీ అయ్యాయి కాబట్టి నేరుగా ద్రవ్యోల్బణానికి దారి తీయలేదు.
బ్యాంకుల దివాలా
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2008 తరవాత నెమ్మదిగా కోలుకొంటుండగా 2020లో కొవిడ్ మహమ్మారి వచ్చిపడింది. ఆ ఏడాది అనేక దేశాల్లో లాక్‌డౌన్లు అమలయ్యాయి. ఫలితంగా ఆర్థిక మందగతి ఏర్పడి ప్రభుత్వాలు వివిధ భృతులు, రాయితీల రూపంలో జనం చేతికి డబ్బు అందేలా చూశాయి. అయితే, లాక్‌డౌన్ల వల్ల ఆ డబ్బును ఖర్చుచేసే మార్గాలు పరిమితమయ్యాయి. అయినా సంపన్న దేశాల్లో కేంద్ర బ్యాంకులు మార్కెట్లో నిధుల లభ్యతను రెండురెట్లు పెంచాయి. ఈ క్రమంలోనే 2022 ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీసింది. చమురు, సహజవాయువు, ఎరువులు, వంట నూనెలు, రసాయనాల సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దాంతో పేద దేశాల్లో ఆహార కొరత ఏర్పడింది. సంపన్న దేశాల్లో ఇంధన ధరలు పెరిగిపోయాయి. ఇదంతా అధిక ద్రవ్యోల్బణానికి దారితీసింది. సంపన్న దేశాల్లో ద్రవ్యోల్బణం ఏకంగా తొమ్మిది శాతానికి ఎగబాకింది!
ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. అది సరైన నిర్ణయం కాదని ఇప్పుడు తెలిసి వస్తోంది. ఆ ఆంక్షలను మాస్కో సమర్థంగా తట్టుకోగలిగిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) గత నెలలో వెల్లడించింది. వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ద్రవ్య లభ్యతను తగ్గించి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలని అమెరికా తదితర సంపన్న దేశాలు ఆరాటపడుతున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే పెట్టుబడులకు కొరత ఏర్పడి ఉత్పత్తి, అభివృద్ధి మందగిస్తాయి. ఉపాధి అవకాశాలు కుంచించుకుపోతాయి. పలు సంపన్న దేశాల్లో వచ్చే మూడు నాలుగేళ్ల వరకు నిరుద్యోగం అధికంగా ఉంటుందన్నది నిపుణుల అంచనా. ధనిక దేశాల్లో ఉత్పత్తి తగ్గినప్పుడు వర్ధమాన దేశాలకు పెట్టుబడులు తరలిపోతాయి. వర్ధమాన దేశాలు మాంద్యం కారణంగా సంపన్న దేశాలకు ఎగుమతి చేసే వీలుండదు. అందువల్ల ఈ పెట్టుబడులు ఉత్పత్తి పెంపునకు కాకుండా స్టాక్ మార్కెట్లకు వెళ్ళిపోతాయి. ప్రపంచ వాణిజ్యం సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. అందుకే రాబోయే కొన్నేళ్ల దాకా అభివృద్ధి రేటుపై ఐఎంఎఫ్ ఆశావహ అంచనాలను వెలువరించడం లేదు. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచి నిధుల లభ్యతను తగ్గించడం వల్లే అక్కడి బ్యాంకులు వరసగా దివాలా తీస్తున్నాయి. అభివృద్ధి పడకేయడంతో ఐరోపాకు చెందిన అంతర్జాతీయ పెట్టుబడులు, ఆర్థిక సేవల సంస్థ ‘క్రెడిట్ స్వీస్’ కుప్పకూలింది.
జాగ్రత్త వహిస్తే...
వడ్డీ రేట్ల పెంపు కొన్ని నెలలుగా నెమ్మదిస్తుండటం సంపన్న దేశాల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. వర్ధమాన దేశాల ఎగుమతులు పెరిగి అవి కాస్త తేరుకుంటాయి. సంపన్న దేశాల ఆర్థిక, ద్రవ్య విధానాలు బాధ్యతాయుతంగా ఉండేలా ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులు జాగ్రత్త వహించాలి. ప్రస్తుతం చమురు ధరలు దిగివస్తున్నందువల్ల ద్రవ్యోల్బణం తగ్గి ఆర్థికాభివృద్ధి పుంజుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొత్త తరహా ఆర్థిక విధానాల అమలుకు ముందే వాటి మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రభావాలను ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు, విధానకర్తలు అంచనా వేయాలి. సంపన్న దేశాల ప్రయోగాలు వికటిస్తే వర్ధమాన దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. అందువల్ల, సంపన్న దేశాల ఆర్థిక, ద్రవ్య విధానాలకు ఐఎంఎఫ్ కొన్ని ప్రమాణాలను నిర్దేశించాలి. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంపై కేంద్ర బ్యాంకుల యాజమాన్యంలోని అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్- బిస్) పర్యవేక్షణ మెరుగుపడాలి. కొవిడ్ వల్ల పెరిగిన పేదరికం, ఆదాయ అసమానతలను సరిదిద్దడానికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఆసియా, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకుల కృషి ఎంతో అవసరం. జాతీయ ప్రభుత్వాలు సైతం ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో కలిసి అభివృద్ధి పథంలో అడుగులు వేయాలి.
కట్టుతప్పిన లభ్యత
ప్రపంచ జీడీపీలో అత్యధిక వాటా సంపన్న దేశాలదే. అందువల్ల వాటిలో జరిగే పరిణామాలు వర్ధమాన దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయ పెట్టుబడులు, ఆర్థిక సేవల సంస్థ ‘లేమాన్ బ్రదర్స్’ కుప్పకూలిన తరవాత సంపన్న దేశాలు అదేపనిగా ద్రవ్య లభ్యతను పెంచేశాయి. ఆ నిధులను జవాబుదారీతనంతో అత్యంత జాగ్రత్తగా, పరిమితంగా విడుదల చేసి ఉండాల్సింది. కానీ, సంపన్న దేశాల కేంద్ర బ్యాంకులు నాలుగు రెట్లు అధికంగా నిధులను విడుదల చేశాయి. తరవాత కొవిడ్ ఉద్ధృతి సమయంలోనూ ఎడాపెడా ద్రవ్య లభ్యతను పెంచేశాయి. ఇప్పుడు వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ద్రవ్య లభ్యతకు పగ్గాలు వేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Andhra news: ఐబీ సిలబస్ విధివిధానాల కోసం కమిటీల ఏర్పాటు
-
Ram Pothineni: ‘స్కంద’ మాస్ చిత్రం మాత్రమే కాదు..: రామ్
-
BJP: మధ్యప్రదేశ్ అసెంబ్లీ బరిలో కేంద్రమంత్రులు, ఎంపీలు.. 39మందితో భాజపా రెండో జాబితా!
-
Black Sea: రష్యాకు ఎదురుదెబ్బ.. నౌకాదళ కమాండర్ సహా 34 మంది మృతి!
-
TS High Court: అక్టోబరులోగా సింగరేణి ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
-
Prabhas Statue: ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!