పారుబాకీల జోరు తగ్గించే వ్యూహం
దేశంలో పారుబాకీలకు సంబంధించిన కేసులు రుణ వసూలు ట్రైబ్యునళ్లలో భారీగా పోగుపడ్డాయి. వీటిన్నింటినీ ఒకేసారి పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలంటూ కేంద్ర ఆర్థికశాఖ ఇటీవల ఆదేశించింది.
దేశంలో పారుబాకీలకు సంబంధించిన కేసులు రుణ వసూలు ట్రైబ్యునళ్లలో భారీగా పోగుపడ్డాయి. వీటిన్నింటినీ ఒకేసారి పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలంటూ కేంద్ర ఆర్థికశాఖ ఇటీవల ఆదేశించింది. ఇందుకు లోక్ అదాలత్ వంటి ప్రత్యామ్నాయ మధ్యవర్తిత్వ వేదికలను ఉపయోగించుకోవచ్చని సూచించింది. ధర్మాసనాల సంఖ్యను పెంచడం ద్వారా వీటిని పరిష్కరించుకునే వీలుంది.
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించకపోతే- వాటిని పారుబాకీలుగా పరిగణిస్తారు. బ్యాంకుల పరిభాషలో ఆ బాకీలను నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా పిలుస్తారు.90 రోజులు దాటినా రుణగ్రహీతలు వాయిదాలను చెల్లించనప్పుడు వాటిని పారుబాకీలుగా పరిగణిస్తారు. రిజర్వు బ్యాంకు తాజా సమాచారం ప్రకారం-2022 సెప్టెంబరు నాటికి అన్ని బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తి గత ఏడేళ్లలోనే అతి తక్కువగా నమోదైంది. ఇలాంటి బాకీల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేయడానికి బ్యాంకులు తమ లాభాల్లో కొంత పక్కనపెడతాయి. జీఎన్‌పీఏల నుంచి ఈ మొత్తాలను మినహాయిస్తే నికర నిరర్థక ఆస్తుల (ఎన్‌ఎన్‌పీఏ) రాశి ఎంతో తేలుతుంది. ఏటా మొదట్లో బ్యాంకులు ఈ నికర నిరర్థక ఆస్తులను కొత్తగా ఇచ్చే రుణాలతో భాగిస్తాయి. అలా చేసినప్పుడు ‘స్లిపేజ్ నిష్పత్తి’ వస్తుంది. నిరుడు సెప్టెంబరులో ఈ నిష్పత్తి రెండు శాతానికి తగ్గింది. 2015 తరవాత ఇదే అత్యంత తక్కువ.
ఖాతాల నుంచి తొలగింపు...
నిరర్థక ఆస్తులను తగ్గించుకోవడానికి మరో మార్గం- బ్యాంకు ఖాతా పుస్తకాల నుంచి పారుబాకీలను తొలగించడం. దాని అర్థం- ఎన్‌పీఏలను రద్దు చేయడమని కాదు. ఎన్‌పీఏలను ఖాతాల్లో చూపకపోయినా వడ్డీ రేటును, కిస్తీ మొత్తాలను తగ్గించడం, చెల్లింపు కాలాన్ని పొడిగించడం, ఎన్‌పీఏలను ఇతరులకు విక్రయించడం, కోర్టులు, రుణ రికవరీ ట్రైబ్యునల్‌లో కేసులు వేయడం వంటి మార్గాల్లో పారుబాకీలను రాబట్టుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ బాకీలను ఖాతా పుస్తకాల నుంచి తొలగించడం వల్ల బ్యాంకుల ఆస్తి-అప్పుల పట్టికలు ఆరోగ్యవంతంగా కనిపిస్తాయి. తద్వారా పన్ను రాయితీలు లభించడంతోపాటు పెట్టుబడిని సమర్థంగా ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. అయితే, ఖాతా పుస్తకాల నుంచి పారుబాకీలను తొలగించడం వల్ల బ్యాంకుల లాభాలు కోసుకుపోతాయి. గడచిన అయిదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.10,09,511 కోట్ల పారుబాకీలను బ్యాంకులు ఖాతా పుస్తకాల నుంచి తొలగించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత డిసెంబరులో రాజ్యసభకు వెల్లడించారు. ఖాతాల నుంచి తొలగించిన పారు బాకీల్లో 72శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులవి. మిగతా 28శాతం ప్రైవేటు బ్యాంకులవి. రుణ గ్రహీతలు సకాలంలో కిస్తీలను చెల్లించలేకపోతే వారికి మొదట మంజూరు చేసిన మొత్తంలో విడుదల చేయకుండా మిగిలిన మొత్తాలను ఇతరులకు ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. ఖాతా పుస్తకాల నుంచి తొలగించిన బాకీల్లో ఏవైనా వసూలైతే వాటిని ఆ ఏడాది లాభాల్లో చూపించవచ్చు. గత అయిదేళ్లలో ఇలా వసూలైంది 13శాతం లోపే!
రుణ వసూలు ట్రైబ్యునళ్లు (డీఆర్‌టీలు), లోక్ అదాలత్‌ల ద్వారా పారు బాకీ కేసులను పరిష్కరించాలని కేంద్రం తాజాగా ఆదేశించింది. ఈ కేసులు లోక్ అదాలత్‌ల ద్వారా 2021-22లో 2.3శాతం, 2020-21లో నాలుగు శాతమే పరిష్కారమయ్యాయి. ప్రస్తుతం డీఆర్‌టీల్లో పోగుపడిన పారుబాకీల కేసులు రెండు లక్షలకు పైనే ఉన్నాయి. వాటిలో లక్షన్నర కేసుల మొత్తం విలువ రూ.12లక్షల కోట్లు! 12 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో లక్షకుపైగా ఎన్‌పీఏ కేసులు ఉండగా, వాటి మొత్తం విలువ రూ.7.4 లక్షల కోట్లు. రూ.20లక్షల లోపు విలువగల కేసులను త్వరగా పరిష్కరించాలని కేంద్ర ఆర్థికశాఖ బ్యాంకులకు సూచించింది. పనిభారం వల్ల డీఆర్‌టీలు ఈ కేసులను పరిష్కరించలేకపోతున్నాయి. అధిక మొత్తాలతో కూడిన పారుబాకీ కేసుల పరిష్కారానికి రుణ వసూలు ట్రైబ్యునళ్లలో ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.
రుణాల మంజూరులో నిబంధనలను పాటించకుండా అవినీతికి పాల్పడే బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం జరుగుతోంది. గత అయిదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులకు సంబంధించి ఏజీఎం, ఆపై స్థాయులకు చెందిన 3,312 మంది అధికారులను బాధ్యులుగా గుర్తించారు. వీరిపై చర్యలు ప్రారంభించామని ప్రభుత్వం చెబుతోంది. రుణ మంజూరుకు ఎన్నో నిబంధనలు, ప్రమాణాలు ఉన్నా- నీరవ్ మోదీ వంటి ఎగవేతదారులను ముందే గుర్తించడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు విఫలమవుతున్నాయి. ప్రమాణాలు బలహీనంగా ఉండటంవల్లే ఇలా జరుగుతోందని బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అధ్యయనం తేల్చింది.
ఆధునిక సాంకేతికతలతో అడ్డుకట్ట
బ్లాక్ చెయిన్ వంటి అధునాతన సాంకేతికతలతో ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇంతవరకు కొన్ని బ్యాంకులే ఈ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు భారత బ్యాంకుల సంఘం వెల్లడించింది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి 15 బ్యాంకులు ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. దాని ద్వారా రుణ చెల్లింపు హామీపత్రం (లెటర్ ఆఫ్ క్రెడిట్), జీఎస్‌టీ ఇన్వాయిస్, ఈ-వే బిల్లుల తనిఖీ, మంజూరు ప్రక్రియను చేపడుతున్నాయి. కంపెనీలు రుణాలను సక్రమంగా చెల్లిస్తాయని భరోసా ఇస్తూ బ్యాంకులు మంజూరు చేసేదే- రుణ చెల్లింపు హామీపత్రం. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటివారు ఈ పత్రాల ఆసరాతోనే బ్యాంకులకు టోపీ పెట్టారు. ఈ రకమైన మోసాలను నివారించడానికి బ్లాక్ చెయిన్ సాంకేతికత ఉపకరిస్తుంది. రుణ చెల్లింపు హామీపత్రాల తనిఖీ, మంజూరుకు సాధారణంగా నాలుగైదు రోజులు పడుతుంది. బ్లాక్ చెయిన్ సాంకేతికత ద్వారా వాటిని కేవలం నాలుగు గంటల్లోనే జారీ చేయవచ్చు. తద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు వేగంగా రుణాలను అందించే వీలుంది.
బ్యాంకులకు మోసాల బెడద
అమెరికాలో బ్యాంకులు వరసపెట్టి కుప్పకూలడాన్ని రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ప్రస్తావించారు. అక్కడితో పోలిస్తే భారత్‌లోని బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పటిష్ఠంగా ఉందన్నది ఆయన విశ్లేషణ. ఆస్తులు-అప్పుల మధ్య సరైన నిష్పత్తిని పాటించడం, నష్ట నివారణ చర్యలు తీసుకోవడం, భావి నష్టాలను అధిగమించేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు వంటి చర్యలు అవసరమని దాస్ సూచించారు. భారతీయ బ్యాంకుల్లో మోసాలు తక్కువేమీ కాదు. 1997లో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.497కోట్ల మేర మోసాలకు గురయ్యాయి. 2019-20 వచ్చే సరికి అలాంటి మొత్తం రూ.1.85లక్షల కోట్లకు ఎగబాకింది. మొత్తం మోసాల్లో అడ్వాన్సులకు సంబంధించినవి ఏకంగా 98శాతం. వీటి మొత్తం విలువ రూ.1.82లక్షల కోట్లు!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
General News
Odisha Train Accident : కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఏపీకి చెందిన వారి వివరాలివే..
-
India News
Odisha Train Tragedy: బోగీలు గాల్లోకి లేచి.. ఒకదానిపై మరొకటి దూసుకెళ్లి..!
-
India News
Odisha Train Tragedy: సరిగ్గా 14 ఏళ్ల క్రితం.. ఇదే శుక్రవారం..!
-
Crime News
Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. 278కి చేరిన మృతుల సంఖ్య
-
General News
Odisha Train Accident: రాజమహేంద్రవరం రావాల్సిన 21 మంది ప్రయాణికులు సురక్షితం!
-
India News
Odisha Train Tragedy: విపత్తు వేళ మానవత్వం.. రక్తదానానికి కదిలొచ్చిన యువకులు