రానున్నది... ఏఐ శకం!

చాట్‌ జీపీటీ, బింగ్‌, బార్డ్‌ వంటి స్మార్ట్‌ చాట్‌బాట్‌లకు మూలాధారమైన కృత్రిమ మేధ (ఏఐ)ను నియంత్రించడానికి ఐరోపా సమాఖ్య (ఈయూ), అమెరికా నడుం కట్టాయి. భారత్‌ సైతం ఏఐ వినియోగానికి చట్టపరమైన ప్రాతిపదికను రూపొందించాలని తలపెట్టింది.

Published : 28 May 2023 00:51 IST

చాట్‌ జీపీటీ, బింగ్‌, బార్డ్‌ వంటి స్మార్ట్‌ చాట్‌బాట్‌లకు మూలాధారమైన కృత్రిమ మేధ (ఏఐ)ను నియంత్రించడానికి ఐరోపా సమాఖ్య (ఈయూ), అమెరికా నడుం కట్టాయి. భారత్‌ సైతం ఏఐ వినియోగానికి చట్టపరమైన ప్రాతిపదికను రూపొందించాలని తలపెట్టింది. కాపీరైట్లను, మేధా హక్కులను ఉల్లంఘించకుండా, పక్షపాతం ప్రదర్శించకుండా ఏఐ సాంకేతికతను కట్టడి చేయడానికి ప్రమాణాలు నెలకొల్పాలని భావిస్తోంది.

ఇది యావత్‌ ప్రపంచానికి సంబంధించిన సమస్య కాబట్టి భావసారూప్యత కలిగిన దేశాలతో కలిసి కృత్రిమ మేధ (ఏఐ) నియంత్రణ ముసాయిదాను రూపొందించాలని భావిస్తున్నట్లు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఇటీవల వెల్లడించారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్‌ బఫెట్‌ కృత్రిమ మేధను అణుబాంబుతో పోల్చారు. ఏఐ పితామహుడు డాక్టర్‌ జెఫ్రీ హింటన్‌ సైతం దీనివల్ల అపార హాని కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మార్చిలో జీపీటీ4ను విడుదల చేసినప్పుడు ఏఐ వినియోగం, అభివృద్ధిని ఆరు నెలలపాటు నిలిపివేసి, దానివల్ల కలిగే ముప్పును ఆమూలాగ్రం శోధించిన తరవాత నివారణ చర్యలతో ముందుకు రావాలని దాదాపు 1000 మంది పరిశోధకులు, సాంకేతిక దిగ్గజాల అధిపతులు పిలుపిచ్చారు. చాట్‌ జీపీటీని సృష్టించిన అంకుర సంస్థ ఓపెన్‌ ఏఐ అధిపతి శామ్‌ ఆల్ట్‌మన్‌ సైతం ఏఐ సంస్థలకు లైసెన్సులు ఇవ్వడానికి ప్రత్యేక సంస్థను నెలకొల్పాలని, పకడ్బందీ నియంత్రణ పాటించాలని అమెరికా సెనెట్‌కు సూచించారు.

పోటీలో వెనకంజ వద్దు

ఈయూ ఇప్పటికే ఏఐపై డిజిటల్‌ చట్టాలను రూపొందించింది. చైనా వ్యాపారం కోసం ఏఐ సాంకేతికతల సృష్టికి నియంత్రణ చట్రం విధించింది. కృత్రిమ మేధపై ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఈయూ శాసనకర్తలు చర్చిస్తున్నారు. గత మార్చిలో ఇటలీ చాట్‌ జీపీటీని నిషేధించింది. ఆ దేశ నియంత్రణ సంస్థలు నిర్దేశించిన ప్రమాణాలను పాటించిన తరవాతే తిరిగి అనుమతించింది. చాట్‌ జీపీటీ వంటి ఏఐ చాట్‌బాట్లు పనిచేసే విధానాన్ని నిశితంగా పరిశీలించాలి. సాధారణంగా వివిధ విషయాలను అభ్యసించడానికి ఇచ్చే శిక్షణ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి- పర్యవేక్షణ ద్వారా అభ్యసనం, రెండు- పర్యవేక్షణ లేకుండా స్వతంత్ర అభ్యసనం. పర్యవేక్షక అభ్యసనంలో ఏఐ సిస్టమ్‌ లేదా అల్గొరిథమ్‌కు కుక్క, పిల్లి, కారు వంటి బొమ్మలను చూపి వాటిని అది గుర్తించేలా నేర్పిస్తారు. అయితే, ఇలా ప్రపంచంలో అన్ని విషయాలను చూపి నేర్చుకునేలా చేయడం అంతూపొంతూ లేని వ్యవహారమవుతుంది. పర్యవేక్షణ లేని అభ్యసన ప్రక్రియలో ఏఐ అల్గొరిథమ్‌కు అపార సమాచార రాశిని (డేటాబేస్‌) అందిస్తారు. ఆ సమాచార శకలాల మధ్య సంబంధాలను అవగాహన చేసుకుని జవాబిచ్చే సత్తాను అలవరుస్తారు. అలా సంపాదించిన పూర్వ విజ్ఞానంతో వాక్య సందర్భం, ఛందస్సు, వ్యాకరణం, శైలి తదితరాలను ఏఐ అర్థం చేసుకొని వాక్యం లేదా ప్రశ్నలో తదుపరి పదాన్ని గుర్తించి జవాబు ఇచ్చే శక్తిని సంపాదిస్తోంది. ఇలాంటి ఏఐ చాట్‌బాట్ల వల్ల యావత్‌ ప్రపంచ గతి మారిపోనుంది.

గడచిన 40 ఏళ్లలో ఆయుర్దాయం, శిశు మరణాలు, విద్య, మహిళా కార్మిక భాగస్వామ్యం, పట్టణీకరణ వంటి అంశాల్లో చాలా వర్ధమాన దేశాలు సంపన్న దేశాల దరిదాపుల్లోకి చేరాయి. ఆదాయం విషయంలో మాత్రం సంపన్న, వర్ధమాన దేశాల మధ్య అంతరాలు అలాగే కొనసాగుతున్నాయి. 40 ఏళ్ల క్రితం నాటి అమెరికా ఆదాయ స్థాయిని అనేక మధ్యాదాయ దేశాలు ఇప్పటికీ అందుకోలేకపోతున్నాయి. దీనికి కారణం సాంకేతిక పరిజ్ఞానం పరంగా వాటిమధ్య భేదం నానాటికీ పెరిగిపోవడమే. చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు మాత్రం అధునాతన సాంకేతికతలతో కొత్త తరహా వస్తుసేవలను ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసి నేడు అమెరికా, ఐరోపాలకు అవి పోటీ ఇవ్వగలుగుతున్నాయి. ఒక దశలో వాటి ఎగుమతుల విలువ జీడీపీ వృద్ధి రేటును మించిపోయింది. సంక్లిష్ట ఉత్పత్తుల తయారీకి, విభిన్న వస్తువులను ఎగుమతి చేయడానికి, ఇతర దేశాలతో పోటీపడి నెగ్గడానికి కృత్రిమ మేధ తోడ్పడబోతోంది. వాక్యంలో తదుపరి పదాన్ని ఊహించి సమాచారాన్ని చాట్‌జీపీటీ అందించగలదు. అలాగే దేశాలు సైతం తమ తరవాతి ఎగుమతి ఏమిటనేది ఊహించగలగాలి. అందుబాటులో ఉన్న అపార మార్కెట్‌ సమాచారాన్ని రెప్పపాటులో విశ్లేషించి, ఏయే వస్తుసే వలకు ఎక్కడెక్కడ గిరాకీ ఉండబోతోందో ఏఐ చెప్పగలిగే రోజు ఎంతో దూరంలో లేదు. కాబట్టి భారతదేశం ఏఐ పోటీలో వెనకబడకూడదు.

పటిష్ఠ నియంత్రణ ముఖ్యం

అన్ని అధునాతన సాంకేతికతల తరహాలోనే ఏఐ వల్లా లాభాలు, నష్టాలు ఉంటాయి. ఆర్థికాభివృద్ధి, ఉత్పాదకత పెంపునకు తోడ్పడే ఏఐ పెద్దయెత్తున పాత ఉద్యోగాలను కనుమరుగు చేస్తుంది. కొత్త నైపుణ్యాలు కావాల్సిన నూతన తరహా ఉద్యోగాలను సృష్టిస్తుంది. కొత్త మందులు, వస్తువుల ఉత్పత్తిని సుసాధ్యం చేస్తూ వైద్య చికిత్సను కొత్త పుంతలు తొక్కిస్తుంది. విద్య, వాతావరణ పరిరక్షణను విప్లవీకరిస్తుంది. అదే సమయంలో ఉగ్రవాదులు, శత్రుదేశాలు ఏఐతో తప్పుడు సమాచారాన్ని, విద్వేష పూరిత ప్రసంగాలు, చిత్రాలను పంపిణీ చేయగలుగుతాయి. కృత్రిమ మేధ ఆర్థిక అసమానతలను పెచ్చరిల్లజేయడమే కాకుండా, భస్మాసుర హస్తమై మానవాళి మనుగడకే ముప్పు తీసుకొస్తుందేమోనని ఏఐ శాస్త్రవేత్తలే కలవరపడుతున్నారు. పటిష్ఠ నియంత్రణ చట్రంతో ఈ ప్రమాదాన్ని నివారించాలని భారత్‌తోపాటు అన్ని ప్రధాన దేశాలూ గ్రహించాయి. తదనుగుణంగా కార్యాచరణకు అవి ఉపక్రమిస్తున్నాయి.


అన్ని జాగ్రత్తలు మేలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ ఇటీవల శ్వేతసౌధంలో ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌, మైక్రోసాఫ్ట్‌ సత్యా నాదెళ్ల, గూగుల్‌ సుందర్‌ పిచ్చాయ్‌, ఆంథ్రోపిక్‌ సంస్థ అధిపతి డేరియో అమోడైలతో సమావేశమయ్యారు. ఏఐని దుష్టశక్తులు దుర్వినియోగం చేయకుండా చూస్తూ, దాని విషయంలో ప్రజలకు, ప్రభుత్వానికి పారదర్శకంగా అన్ని అంశాలనూ తెలియజేయాలని ఆ సమావేశంలో అంగీకరించారు. ఏఐ భద్రత, సామర్థ్యాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలనీ నిర్ణయించారు. కృత్రిమ మేధ నుంచి పౌరుల హక్కులకు రక్షణ కల్పించే బిల్లు నమూనాను అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది. ఏఐలోని లోపాలను పసిగట్టడానికి అమెరికా ప్రభుత్వం హ్యాకర్లను ప్రోత్సహిస్తోంది. ఆగస్టులో జరిగే హ్యాకర్ల సదస్సులో అమెరికా ప్రభుత్వ ఆశీస్సులతో చాట్‌ జీపీటీ, గూగుల్‌, ఆంథ్రోపిక్‌, మైక్రోసాఫ్ట్‌, ఎన్‌ విడియా వంటి సంస్థలు విడుదల చేసిన ఏఐ సిస్టమ్స్‌ను హ్యాక్‌ చేస్తారు. అమెరికా ప్రభుత్వం ఏడు కొత్త ఏఐ పరిశోధన సంస్థలను ఏర్పాటు చేయదలచింది. ఏదిఏమైనా రాబోయేది ఏఐ యుగమే. అన్ని జాగ్రత్తలతో ముందడుగు వేసే సంస్థలు, దేశాల ప్రగతికి- ఆకాశమే హద్దు.

ఏఏవీ ప్రసాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.