తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక

ఒక విద్యార్థిగా 1980వ దశకం ఆరంభంలో ఆరుకోట్ల ఆంధ్రుల్లో ఒకడిగా ఎన్టీఆర్‌ చైతన్య రథ ప్రభంజనాన్ని నిబిడాశ్చర్యంతో చూశాను. అనతికాలంలోనే ఆయనకు సన్నిహితంగా సేవలందించే అవకాశం నాకు లభిస్తుందని కలలో కూడా ఊహించలేదు.

Updated : 29 May 2023 09:02 IST

ఒక విద్యార్థిగా 1980వ దశకం ఆరంభంలో ఆరుకోట్ల ఆంధ్రుల్లో ఒకడిగా ఎన్టీఆర్‌ చైతన్య రథ ప్రభంజనాన్ని నిబిడాశ్చర్యంతో చూశాను. అనతికాలంలోనే ఆయనకు సన్నిహితంగా సేవలందించే అవకాశం నాకు లభిస్తుందని కలలో కూడా ఊహించలేదు. వారితో సాన్నిహిత్యం ఒక చెరగని అనుబంధానికి దారితీసింది. ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ఎన్నెన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ఇటీవలి కాలం వరకు రాజ్యాంగ పదవిలో ఉన్నందువల్ల కాస్త తటపటాయించాను కానీ... నా అనుభవాలు, ఆలోచనల్లో కొన్నయినా సాటి తెలుగువారితో పంచుకోవడం అవసరమని భావించాను.

త్యవసర పరిస్థితిని ప్రజలు తిప్పికొట్టిన కొన్నేళ్లకే కేంద్రం ఏకస్వామ్య పోకడలు ప్రజాస్వామ్యానికి, సమాఖ్య వ్యవస్థకు ముప్పుగా దాపురించిన కాలమది. ఒక వ్యక్తి చుట్టూ రాజకీయాలు పరిభ్రమిస్తూ అధికారం కేంద్రీకృతమై నియంతృత్వ పోకడలకు మళ్ళీ తెరలేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ   పెత్తందారీతనానికి వ్యతిరేకంగా, తెలుగువాడి ఆత్మగౌరవమే నినాదంగా ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. దేశ రాజకీయ చిత్రపటాన్ని తిరుగులేని రీతిలో మార్చివేశారు. ఆరంభంలో ఎంచుకున్న, దరిచేరనిచ్చిన విద్యావంతులు, సలహాదారులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్టీఆర్‌ పడిన తపనకు తగినట్లుగా ఆయన ఆలోచనలకు పదునుపెట్టారు. అవినీతిని నిర్మూలించాలని, గాడితప్పిన వ్యవస్థలను దారిలోకి తేవాలని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ఆయన పడిన శ్రమకు తగినట్లుగా వారు నిరంతరం కృషి చేశారు.

సామాన్యులను గెలిపించి... సామాజిక న్యాయం

డబ్బులో మునిగితేలుతూ రాజకీయాలు అవినీతిమయంగా మారిన తరుణంలో సుడిగాలి పర్యటనలతో వేల సంఖ్యలో ఉపన్యాసాలిచ్చి, యావత్తు తెలుగు సమాజాన్ని మేల్కొలిపి సామాన్యులను సైతం చట్టసభలకు గెలిపించడం ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమైంది. ప్రసార సాధనాలనేవి పరిమితంగా, ప్రభుత్వ కట్టడిలో ఉన్న ఆ రోజుల్లో చైతన్యరథంతో గడపగడపకూ వెళ్ళి ఎన్టీఆర్‌ తన సందేశాన్ని వినిపించిన వైనం న భూతో న భవిష్యతి. తెలుగు రాష్ట్రాల్లో నేటికీ ప్రజాజీవితంలో రాణిస్తున్న ఎందరో నాయకులకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పింది రామారావు. ఆయన తన పార్టీని దేశభక్తితో, జాతీయ దృక్పథంతో నడిపారు. పరిపాలనను జనరంజకంగా ఒక ఉద్యమంలా సాగించారు. ‘దేశమంటే మట్టికాదోయ్‌...దేశమంటే మనుషులోయ్‌’ అన్న గురజాడ మాటలను పరిపూర్ణంగా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టిన మహోన్నత మానవతావాది ఎన్టీఆర్‌. పాలనలో ప్రతి ఘట్టం ఆయన దార్శనికతకు నిదర్శనం. దేశ చరిత్రలో సామాజిక న్యాయానికి పునాదులు వేసిన తొలి నాయకుడు ఆయన. కొన్ని అగ్రవర్ణాలకు పరిమితమైన రాజ్యాధికారంలో విప్లవాత్మక రీతిలో బడుగు, బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించి సమాజంలో సరికొత్త జాగరూకతకు నాంది పలికారు. ఎన్టీఆర్‌ ఆనాడు వేసిన పునాదులే కులమతాలకు అతీతంగా అధికారంలో అందరినీ హక్కుదారులను చేశాయి. తెలుగునేలపై ఏ ఒక్క మనిషినీ ఆకలితో అలమటించనివ్వబోనని ప్రతిజ్ఞ చేసిన ఎన్టీఆర్‌- ఎన్నో వినూత్న సంక్షేమ పథకాలకు నాంది పలికారు. గౌరవంగా జీవించడం, మనిషి ప్రాథమిక హక్కు అన్న ప్రగాఢ విశ్వాసంతో పాలన సాగించారు. ప్రాంతీయ వైవిధ్యాన్ని గౌరవించాలని, ప్రతి భాష, సంస్కృతి దేశ సమగ్రతను పరిపుష్టం చేస్తాయని చెప్పిన ఎన్టీఆర్‌- సమాఖ్యవాదానికి కొత్త ఊపిరులూదారు. ప్రజలు, రాష్ట్రాల హక్కుల విషయంలో ఏమాత్రం రాజీపడలేదు. జాతీయ స్థాయిలో కూటమి కట్టి వందేళ్ల చరిత్ర గల పార్టీని ఢీకొన్న ధీశాలి ఆయన. ‘కేంద్రం మిథ్య’ అన్న రెండు పదాలతో ఆయన దేశ రాజకీయాలను, దిల్లీ పీఠాన్ని కుదిపేశారు.

రాజీ పడటాన్ని, లాలూచీకి దిగడాన్ని ఎన్టీఆర్‌ ఛీత్కరించుకునేవారు. నా సమక్షంలో జరిగిన ఒక సంఘటనను ఉదాహరిస్తాను. మాజీ కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు తెలుగుదేశం తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తరవాత ఎన్టీఆర్‌ దగ్గరకు వచ్చి అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీతో సయోధ్య కుదుర్చుకుంటే రాష్ట్రంలో పాలన సజావుగా సాగుతుందని హితవు చెప్పబోయారు. ఆయన మాటలు విని ఎన్టీఆర్‌ ఉగ్ర నరసింహుడయ్యారు. ‘ఏం తప్పు చేశామని రాజీపడాలి... మన ఆత్మగౌరవాన్ని దిల్లీ దర్బారుకు తాకట్టు పెట్టదలిస్తే తెలుగుదేశం పార్టీని ఎందుకు ప్రారంభించినట్టు... కాంగ్రెస్‌లో కలిసిపోతే పోలా... మనం రాష్ట్రాల హక్కుల కోసం ఎందుకు పోరాడుతున్నట్టు?’ అని ప్రశ్నించారు. తుది శ్వాస వరకూ అదే ఆయన సిద్ధాంతం, నమ్మకం. కేంద్రం నియంతృత్వ విధానాలను ప్రాంతీయ పార్టీల నాయకులు అడ్డుకోవడం సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని ఎన్టీఆర్‌ తన ఆచరణ ద్వారా దేశానికి సందేశమిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో నేటితరం నాయకులు తెలుగు జాతి ప్రయోజనాల పరిరక్షణకు ఆ స్ఫూర్తితో ముందుకు సాగాలి. పార్టీలకతీతంగా, ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పిన మాటకు కట్టుబడే విషయంలో ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుంటే ప్రజలు బ్రహ్మరథం పడతారు. అహంకారభరిత అధికారానికి దాసోహమనేవారిని ప్రజలు ఆదరించరు. ఆఖరికి ఛీత్కరిస్తారు.

ఆయన దగ్గరే నేర్చుకోవాలి

తిరుగుబాటు ఎన్టీఆర్‌ నైజం. ఆయన అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదు. కేంద్రం ఆయనను నానా అగచాట్లు పెట్టింది. గద్దె దింపేందుకు ఎన్నో కుట్రలు పన్నింది. అన్ని వ్యవస్థలను వాడుకుంది. తెలుగువారైన నాటి కేంద్రమంత్రులు కొందరు ఈ కుట్రలకు సూత్రధారులు కావడం ఆయనను ఎంతో బాధించింది. తొలిరోజుల్లో న్యాయవ్యవస్థ పట్ల ఎన్టీఆర్‌కు అపారమైన గౌరవం ఉండేది. ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మక పాలనా సంస్కరణలకు న్యాయవ్యవస్థ సహకారంతో ప్రగతి నిరోధకులు పలుమార్లు అడ్డంకులు సృష్టించడం ఆయనను అంతులేని నిరుత్సాహానికి గురిచేసింది. పైగా రాజకీయ ప్రత్యర్థులు ఆయనను వేధించేందుకు న్యాయవ్యవస్థను సైతం వాడుకోవడం ఎంతగానో బాధించింది. వ్యక్తిగతమైన కొన్ని కేసుల్లో తనకు కోర్టులో అన్యాయం జరిగిందని ఎన్టీఆర్‌ నమ్మడానికి సహేతుకమైన కారణాలు లేకపోలేదు. మనిషిని మనిషిగా చూడటం ఎన్టీఆర్‌ దగ్గరే నేర్చుకోవాలి. ఎవరైనా ఇతరులను కించపరుస్తూ తమ మేధస్సును చాటిచెప్పే ప్రయత్నంచేస్తే ఏమాత్రం సహించేవారు కాదు. ఒకానొక సందర్భంలో న్యాయమూర్తుల మేధకు మరెవరూ పోటీ రాజాలరని ఒక విశ్రాంత న్యాయమూర్తి గొప్పలు చెప్పడంతో రామారావు ‘దానవీరశూరకర్ణ’ చిత్రంలోని మాటలను అనర్గళంగా రెండు నిమిషాలు వినిపించి... ‘అందులో నాలుగు ముక్కలైనా మీరు చెప్పగలరా?’ అని అడిగారు. నీళ్లు నమిలిన ఆ పెద్దమనిషికి ఇతరులతో పోలిక సరికాదని హితవు పలికారు.

భారతరత్నతో గౌరవించాలి

ఎన్టీఆర్‌ లాంటి మహామనీషిని గౌరవించడమంటే సమాజం తనను తాను గౌరవించుకోవడమే. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని భారతరత్న పురస్కారంతో ఎన్టీఆర్‌ను, తద్వారా దేశ ఔన్నత్యానికి తెలుగు ప్రజలు చేసిన కృషిని గౌరవిస్తాయని ఆశిస్తాను. తెలుగు ప్రజలు కష్టజీవులు. సంపద సృష్టించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. సప్త సముద్రాలు సైతం దాటి అద్భుతాలు చేయగల సత్తా తెలుగువారి సొత్తు. తెలుగుజాతి ఐక్యతను చాటి చెప్పడానికి ఎన్టీఆర్‌ శతజయంతి ఒక గొప్ప అవకాశం. మానవ జాతి నిలిచి ఉన్నంతకాలం సమగ్ర మానవతామూర్తి నందమూరి తారక రామారావు జ్ఞాపకాలు స్మరణీయం. ఆ మహానాయకుడికి, యుగపురుషుడికి నా నమస్సులు, శ్రద్ధాంజలులు.


మూలాలను మరవని వ్యక్తిత్వం

ళాకారులంటే ఎన్టీఆర్‌కు అపారమైన గౌరవం, అభిమానం. ఎందరో వృత్తినిపుణులను, కళాకారులను తన సొంత డబ్బుతో ఆదుకొని సత్కరించారు. వారి కళా కౌశలం గురించి నలుగురికీ వివరిస్తూ మైమరచిపోయేవారు. పేదలన్నా, పల్లెటూరివారన్నా ఆయనకు ఎనలేని అభిమానం. మూలాలను మరవని వ్యక్తి ఆయన. సామాన్యుల సమక్షంలో ఎన్టీఆర్‌లో సహజమైన ఆర్ధ్రత, ఆప్యాయత, అనురాగం తొణికిసలాడేవి. ధనికులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల పట్ల ముభావంగా ఉండేవారు. డబ్బు, దర్పం, హోదాలను బేఖాతరు చేసేవారు. పేదల పక్షపాతి అయిన    ఎన్టీఆర్‌ డబ్బున్నవారికి పదవులు కట్టబెట్టేందుకు ఇష్టపడేవారు కాదు. పేదలు, వెనకబడిన వర్గాలు, మహిళలకు పెద్దపీట వేసేవారు. విద్యాబుద్ధులు ఉన్నవారిని, సంస్కారవంతులను వయసుకు అతీతంగా గౌరవించేవారు. విధేయతతో, నిజాయతీతో, క్రమశిక్షణతో శ్రమించినవారికి తగిన గుర్తింపునిచ్చి హోదా కల్పించడం ఎన్టీఆర్‌ దగ్గరే నేర్చుకోవాలి.


ఆయనకు ఆయనే సాటి!

తెలుగుజాతి, భాష, సంస్కృతులకు అగ్ర తాంబూలం దక్కాలని ఎన్టీఆర్‌ అనుక్షణం పరితపించేవారు. అభివృద్ధి పేరుతో భాషను, సంస్కృతిని బలిపెట్టేవారిని దరిచేరనిచ్చేవారు కాదు.  ఆయనను మరెవరితోనైనా పోల్చడం దుస్సాహసం. ఆయనకు ఆయనే సాటి. సినీరంగం నుంచి ఎన్టీఆర్‌ నిష్క్రమించి నాలుగు దశాబ్దాలు దాటింది. భౌతికంగా మనల్ని వీడి రెండున్నర దశాబ్దాలు గడిచాయి. నేటితరం సైతం ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకోవడం సంతోషదాయకం. ఆయనలాంటి మహనీయుడిని భౌతికంగా చూడగలగడమే భాగ్యం. అలాంటిది ఆయనతో సన్నిహితంగా మెలగుతూ సేవలందించగలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎన్టీఆర్‌ జీవన సందేశానికి అద్దంపట్టే ఒక పాట సి.నారాయణరెడ్డి రాశారు. ఘంటసాల స్వరంతో ఆ పాటను ఎన్టీఆర్‌పైనే చిత్రీకరించారు. ‘ఎవరికీ తలవంచకు, ఎవరినీ యాచించకు, గుండె బలమే నీ ఆయుధం, నిండు మనసే నీ ధనం... చీకటి రాజ్యం ఎంతోకాలం చలాయించదని మరువకు...’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.