సహేతుక పన్ను... బడుగులకు దన్ను

ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి, దేశ రక్షణకు, ప్రభుత్వ నిర్వహణకు పన్నుల విధింపు అవసరం. భారత పన్నుల వ్యవస్థలో హేతుబద్ధత లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. మరోవైపు పన్నుల ఎగవేత నేటికీ కొనసాగుతూనే ఉంది.

Updated : 30 May 2023 06:37 IST

ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి, దేశ రక్షణకు, ప్రభుత్వ నిర్వహణకు పన్నుల విధింపు అవసరం. భారత పన్నుల వ్యవస్థలో హేతుబద్ధత లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. మరోవైపు పన్నుల ఎగవేత నేటికీ కొనసాగుతూనే ఉంది.

ప్రాచీన భారత్‌లోని వివిధ రకాల పన్నుల గురించి మనుస్మృతి, అర్థశాస్త్రం వివరించాయి. ప్రభుత్వ వ్యయాన్ని భరించడానికి సమాజంలో వివిధ వర్గాలపై పన్నులు వేసేవారు. సుంకాలు వసూలు చేసేవారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాల కోసమూ పన్నుల ఆదాయాన్ని వెచ్చించేవారు. స్వాతంత్య్రం వచ్చాక భారత రాజ్యాంగంలోని 246వ అధికరణ కేంద్రం, రాష్ట్రాలు వసూలు చేయగల పన్నుల గురించి తెలిపింది. విద్యాసంస్థలు, ఆస్పత్రులు, రహదారులు తదితర మౌలిక వసతుల కల్పనకు, దేశ రక్షణ, న్యాయ, శాంతిభద్రతల వ్యవస్థల నిర్వహణకు పన్నుల ఆదాయాన్ని వెచ్చించాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల మధ్య వ్యత్యాసం ఉంది. ప్రత్యక్ష పన్నుకు చిరపరిచిత ఉదాహరణ ఆదాయ పన్ను. దాన్ని వ్యక్తులు, సంస్థల రాబడి నుంచి వసూలు చేస్తారు. పరోక్ష పన్నులను ప్రజలు వినియోగించే వస్తుసేవలపై విధిస్తారు. ఈ పన్నులకు విశిష్ట ఉదాహరణ జీఎస్‌టీ. నల్లధన నిర్మూలనకు ఎన్ని చట్టాలు తెచ్చినా, పన్నుల సంస్కరణలు చేసినా సమస్య అపరిష్కృతంగానే ఉంది. నల్లధనం నానాటికీ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

నల్లధనం సమస్య

బ్రిటిష్‌వారి పాలనలో ఉన్నప్పుడే భారత్‌లో ఆదాయ పన్ను విధించడం ప్రారంభమైంది. 1860లో నాటి ఆర్థిక మంత్రి సర్‌ జేమ్స్‌ విల్సన్‌ మొదటిసారి ఈ పన్నును ప్రవేశపెట్టారు. 1922నాటి ఆదాయపన్ను చట్టం ఆ పన్నును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి చేర్చింది. ఆనాటి బడ్జెట్‌ అవసరాలకు అనుగుణంగా పన్ను రేట్లను నిర్ణయించేవారు. ఆ రేట్లను మార్చడానికి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. స్వాతంత్రోద్యమం ఉద్ధృతంగా సాగిన 1930లు, 1940ల్లో... అలాగే దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తమ గతి ఏమౌతుందోనని సంస్థానాధీశులకు, సంపన్నులకు కలవరం పట్టుకుంది. దాంతో వారు తమ సంపదలో పెద్ద మొత్తాలను విదేశాలకు తరలించారు. నల్ల ధనం పుట్టుకకు అదే బీజం వేసింది. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ జరిగినప్పుడూ నల్లధనం పుట్టుకొచ్చింది. 1939 నాటికి ఆదాయ పన్ను వసూళ్ల రూపేణా ప్రభుత్వానికి 20శాతం రాబడి వచ్చేది. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రగతిశీల పన్నుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఆదాయాన్ని బట్టి పన్ను విధించసాగారు. ఎక్కువ ఆదాయం ఉంటే ఎక్కువ పన్ను కట్టాల్సిందే. 1956నాటి కంపెనీల చట్టం కార్పొరేట్‌ రాజ్యానికి తెరతీసింది. అప్పటివరకు భారతీయ కంపెనీలకూ బ్రిటిష్‌ చట్టాలే వర్తించేవి. దేశమంతటికీ వర్తించే విధంగా 1961లో రూపుదిద్దుకొన్న ఆదాయ పన్ను చట్టం 1962 ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. 1973-74 నాటికి భారత్‌లో సర్‌చార్జిలతో సహా ఆదాయ పన్ను 97.75శాతానికి చేరింది. 1991-92కల్లా దాన్ని క్రమక్రమంగా 50శాతానికి తగ్గించారు. ఆపైన అది 30శాతానికి తగ్గి మళ్ళీ ఇప్పుడు 42.7శాతానికి చేరింది. 1975లో పన్ను సవరణ చట్టాలు ఆదాయ పన్ను రిటర్నుల స్వీయ ఎసెస్‌మెంట్‌కు వీలు కల్పించాయి. జాతీయ పబ్లిక్‌ ఫైనాన్స్‌, పాలసీ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్‌ రాజా జేసుదాస్‌ చెల్లయ్య భారత్‌లో పన్నుల సంస్కరణలకు ఆద్యుడు.

నల్లధనాన్ని అరికట్టడానికి 2015లో ప్రత్యేక చట్టం చేశారు. దాని కింద పన్ను చెల్లింపుదారులు తమ వద్ద ఉన్న అప్రకటిత ధనాన్ని వెల్లడించే వెసులుబాటు కల్పించారు. అందులో భాగంగా హైదరాబాద్‌లో దేశంలోనే అత్యధికంగా రూ.13,000 కోట్ల ఆదాయాన్ని వెల్లడించారు. ముంబయి, దిల్లీలు రూ.8,000 కోట్ల వెల్లడింపులతో తరవాతి స్థానాల్లో నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం 2017లో వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) చట్టాన్ని తీసుకొచ్చింది. పెట్రోలియం ఉత్పత్తులు మినహా మిగతా వస్తువులపై అప్పటిదాకా ఉన్న పరోక్ష పన్నులన్నింటినీ రద్దు చేసి జీఎస్‌టీని విధించడం మొదలుపెట్టారు. మానవ సంప్రదింపులతో పనిలేకుండా పూర్తి స్వయంచాలిత యంత్రాంగాన్నీ ప్రవేశపెట్టారు. ట్రైబ్యునళ్లు, హైకోర్టులకు చేసుకునే రెండో అప్పీలు మినహా అన్ని పన్ను వ్యవహారాలు కంప్యూటర్‌ ద్వారా జరగసాగాయి. అయితే, అధికారుల అవినీతి మూలంగా ఇందులోనూ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. మరిన్ని ఎక్కువ పన్ను శ్లాబులు, తక్కువ పన్ను రేట్లతో 2020లో కొత్త ఆదాయ పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టారు. అందులో మినహాయింపులు, రాయితీలను తొలగించారు. రెండేళ్ల తరవాత 2022లో క్రిప్టో ఆదాయంపై 30శాతం పన్ను ప్రవేశపెట్టారు. 2023లో ఆదాయపన్ను రిబేట్‌ పరిమితిని ఏడాదికి అయిదు లక్షల రూపాయల నుంచి ఏడు లక్షల రూపాయలకు పెంచారు. అంతకన్నా తక్కువ ఆదాయం కలిగినవారికి ఆదాయ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపునిచ్చారు.

సవరణలు అవసరం

దేశీయంగా యాభై ఏళ్ల కాలంలో పాలకులకు ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలనే లక్ష్యం తప్పితే, వాటి విధింపులో హేతుబద్ధత కొరవడింది. ఫలితంగా నల్లధనం బాగా పెరిగిపోయింది. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని, ఇతర మార్గాల్లో పన్నులు ఎగవేసి ధనికులు మరింత సంపన్నులు అవుతున్నారు. సాధారణ ప్రజానీకం మాత్రం పన్నుల బాదుడుతో ఆర్థిక ఎదుగుదల లేకుండా పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పన్ను విధానాల సవరణకు పాలకులు నడుం కట్టాలి. దేశీయంగా పన్ను ఎగవేతదారులపై సరైన దృష్టి సారించాలి. బడుగుజీవులపై పరోక్ష పన్నుల భారాన్ని తగ్గించేందుకూ చర్యలు తీసుకోవాలి.  


సెస్సుల ఆదాయం కేంద్రానికే...

ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌లు 1991లో ఆర్థిక సరళీకరణను ప్రారంభించారు. పన్ను రేట్లను తగ్గించారు. పన్నుల చట్టాలను వారు సులభతరం చేశారు. అనంతర కాలంలో భారత్‌ అమ్మకం పన్నుకు స్వస్తి చెప్పి అదనపు విలువ జోడింపు పన్ను (వ్యాట్‌) పద్ధతికి మారింది. 2005లో ఫ్రింజ్‌ బెనెఫిట్‌ పన్ను (ఎఫ్‌బీటీ) విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఉద్యోగులకు జీతభత్యాలు కాకుండా ఇతర ప్రయోజనాలను కల్పిస్తే అవి పన్నుకు అర్హమవుతాయి. పన్నుల విధానాన్ని సరళీకరించి సంఘటితం చేయడానికి 2012లో ప్రత్యక్ష పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టారు. 2013 ఫైనాన్స్‌ చట్టం కొన్ని వర్గాల ఆదాయపన్ను చెల్లింపుదారులపై సర్‌ఛార్జీ విధింపునకు వీలు కల్పించింది. అప్పటికే ఉన్న సెస్సునూ పెంచింది. ఈ సెస్సుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేంద్రమే అట్టిపెట్టుకుంటుంది. దాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్రం పంచుకోదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి