మహిళా విజేతలతో రగిలే స్ఫూర్తి

ఈ ఏడాది కేంద్ర పబ్లిక్‌ సర్వీసుల కమిషన్‌ (యూపీఎస్సీ) పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిలో మూడో వంతుకు పైగా అభ్యర్థులు యువతులే. ఒక్క ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో వనితలు  సివిల్‌ సర్వీసులకు ఎంపిక కావడం చరిత్రలో ఇదే ప్రథమం.

Published : 31 May 2023 00:37 IST

ఈ ఏడాది కేంద్ర పబ్లిక్‌ సర్వీసుల కమిషన్‌ (యూపీఎస్సీ) పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిలో మూడో వంతుకు పైగా అభ్యర్థులు యువతులే. ఒక్క ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో వనితలు  సివిల్‌ సర్వీసులకు ఎంపిక కావడం చరిత్రలో ఇదే ప్రథమం. మొదటి మూడు ర్యాంకులను సాధించిన వారిలో తెలుగమ్మాయి నూకల ఉమాహారతి కూడా ఉండటం గర్వకారణం. ఈ సానుకూల పరిణామం భవిష్యత్తులో ఎంతోమంది బాలికలు, యువతులకు స్ఫూర్తిమంత్రంలా పనిచేస్తుంది.

కొంతకాలంగా వివిధ పోటీపరీక్షల్లో యువతులు మెరుగైన విజయాలతో రాణిస్తున్నారు. గతేడాది యూపీఎస్సీ పరీక్షల్లో సైతం మొదటి మూడు ర్యాంకులను యువతులే సాధించారు. 2018లో సివిల్‌ సర్వీసు విజేతల్లో 24 శాతం యువతులు. 2022లో 34 శాతానికి పెరిగారు. 2006 వరకు విజేతల్లో వనితల వాటా 20 శాతం, అంతకులోపే ఉండేది. 2022లో పరిస్థితి మారిపోయింది. ఇతర పరీక్షల్లోనూ జయకేతనం ఎగురవేస్తున్నారు. ఈ ఏడాది నీట్‌ యూజీ, పీజీ పరీక్షల్లో మహిళలే అగ్రశ్రేణి ర్యాంకర్లు. గడచిన అయిదేళ్లుగా 12వ తరగతి ఉత్తీర్ణుల్లో బాలురకన్నా బాలికలే ఎక్కువ. కాకపోతే, ఉన్నత విద్యలో మన యువతుల ప్రాతినిధ్యం పెరగాల్సి ఉంది. దేశంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల్లో తొమ్మిది శాతం మాత్రమే మహిళలున్నారు. ఉన్నత విద్యా కోర్సుల్లో చేరిన విద్యార్థుల్లో మహిళల వాటా కేవలం ఏడు శాతమే. సాటి వర్ధమాన దేశాలైన ఈజిప్ట్‌, థాయ్‌లాండ్‌లలో వారి వాటా ఏకంగా 20 శాతం. ఈ డిజిటల్‌ యుగంలో సరికొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఉన్నత విద్య తప్పనిసరి అన్నది గుర్తించాలి.

ఛేదిస్తున్న వనిత

భారతదేశంలో ఫైనాన్స్‌, వ్యాపారం, డిజిటల్‌ సాంకేతికతలు, సైన్స్‌, రక్షణ, విద్య, వైద్యం, క్రీడలు, కళలు, రాజకీయ రంగాల్లో తాను ఉన్నత స్థానాలను అధిరోహించకుండా ఇంతకాలం నిరోధించిన అదృశ్య తెరను మహిళ క్రమంగా ఛేదిస్తోంది. బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల విజయాలు అపూర్వమైనవి. రక్షణ దళాల్లో మహిళల సంఖ్య అధికమవుతోంది. ఎన్నికల్లో ఉత్సాహంగా ఓటు వేసే మహిళల సంఖ్య జోరెత్తుతున్నా- స్థానిక, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మహిళలు మాత్రం తక్కువగానే ఉంటున్నారు. ఫలితంగా చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం పెరగడంలేదు. 2021 అక్టోబరు నాటికి పార్లమెంటు సభ్యుల్లో మహిళలు 10.5శాతం మాత్రమేనని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రాల శాసనసభల్లో వారి వాటా తొమ్మిది శాతమే. భారతీయ సమాజంలో పితృస్వామ్య భావజాలం వేళ్లూనుకొన్నందువల్లే రాజకీయాల్లో మహిళల పాత్ర అవసరమైనంత మేర పెరగడం లేదనే అభిప్రాయాలున్నాయి.

వ్యాపార రంగంలోనూ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. 2022లో కంపెనీ బోర్డుల్లో 18 శాతం స్థానాల్లో మాత్రమే మహిళలు ఉన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) యజమానుల్లో మహిళలు 20.37 శాతమే. అంకుర సంస్థల వ్యవస్థాపకుల్లో 13.76 శాతం మాత్రమే వనితలని కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది. దేశంలో 5.85 కోట్లమంది వ్యవస్థాపకులుంటే వారిలో 80 లక్షలమంది మాత్రమే వనితలు. స్త్రీలు రాణించడానికి అవకాశాలు దండిగా ఉండే ఫ్యాషన్‌ రంగంలో సైతం పురుషాధిక్యమే కొనసాగుతోంది. వస్త్రాల ఎంపిక, దుస్తులను ధరించడంపై స్త్రీలు పురుషులకన్నా మూడింతలు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయినా భారతదేశంలో అగ్రశ్రేణి ఫ్యాషన్‌ డిజైనర్లలో పురుషుల భాగస్వామ్యమే అధికం. పెట్టుబడుల కొరత, మార్కెట్‌లో పరిచయాలు లేకపోవడం మహిళా వ్యవస్థాపకుల ఎదుగుదలకు శాపంగా మారుతున్నాయి. దేశంలో అనేక రాష్ట్రాల్లో వారసత్వ ఆస్తుల్లో మహిళలకు దక్కే వాటా చాలా స్వల్పం. హక్కుగా దక్కాల్సిన ఆస్తిపాస్తుల్ని చాలామంది వరకట్నంతో సరిపెడుతూ చేతులు దులుపుకొంటున్నారు. మహిళా వ్యవస్థాపకులకు పెట్టుబడి కొరత తీర్చడానికి ప్రభుత్వం, బ్యాంకులు ప్రత్యేక పథకాలతో ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ముఖ్యమైన అడుగులు వేయడం స్వాగతించాల్సిన పరిణామం. ప్రధానమంత్రి ముద్రా యోజన ఖాతాల్లో 66 శాతం మహిళా వ్యాపారులు, వ్యవస్థాపకులవే. దేశంలో సొంత బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న స్త్రీల సంఖ్య 53 శాతం నుంచి 78.6 శాతానికి పెరిగినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 (2015-16), జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21) వెల్లడించాయి. సొంత ఇల్లు, సొంత భూమి (లేదా ఉమ్మడి భూమి) కలిగిన మహిళల సంఖ్య 2015లో 38.4 శాతం. 2021లో అది 43 శాతానికి పెరిగింది. గ్రామాల్లో మహిళా స్వయం సహాయక బృందాలు (ఎస్‌.హెచ్‌.జి.) పొదుపు, రుణ మొత్తాలను అందించి మహిళలు స్వావలంబన సాధించడానికి తోడ్పడుతున్నాయి. దేశమంతా 1.2 కోట్ల ఎస్‌.హెచ్‌.జి.లు ఉండగా వాటిలో 88 శాతాన్ని పూర్తిగా మహిళలే నడుపుతున్నారు. అవి 14.2 కోట్ల గ్రామీణ కుటుంబాలకు తోడ్పాటునిస్తున్నాయి.

నాయకత్వ స్థానాలకు...

ప్రభుత్వ యంత్రాంగంలో, చట్టసభల్లో, ఆర్థిక రంగంలో మహిళల సంఖ్య పెరిగినప్పుడు విధాన నిర్ణయాల్లో వారు కీలక పాత్ర పోషించగలుగుతారు. అన్ని రంగాల్లో నాయకత్వ స్థానాలకు ఎదుగుతారు. ఆకాశంలో సగమైన స్త్రీలు నిర్ణయాత్మక పాత్రలను పోషించడం  దేశ ఆర్థిక ప్రగతికి, సమర్థ పాలనకు దోహదం చేస్తుంది. సమస్యలను మహిళలు ఎదుర్కొనే పద్ధతి పురుషులకన్నా భిన్నంగా ఉంటుంది.  స్త్రీల జీవితానుభవాలు, నాయకత్వ శైలులు కూడా భిన్నమే. అందుకే వారు తీసుకునే నిర్ణయాలు విలక్షణంగా ఉంటాయి. అందువల్ల  విధానాల రూపకల్పనలో, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మహిళా భాగస్వామ్యం చక్కని ఫలితాలు ఇస్తుంది. అన్ని రంగాల్లో మహిళలు నాయకత్వ స్థానాలకు ఎదిగినప్పుడు వారు బాలికలకు, యువతులకు ఆదర్శంగా నిలుస్తారు. ఆ విజేతలు అందుకున్న ఉన్నత శిఖరాలను తామూ అధిరోహించాలనే స్ఫూర్తిని రగిలిస్తారు. గ్రూప్‌ ఆఫ్‌20 (జీ20) అధ్యక్ష హోదాలో ఉన్న ఇండియా- మహిళలకే ప్రాధాన్యం కల్పించే  అభివృద్ధి అజెండా అమలు విషయంలో యావత్‌ ప్రపంచానికి దారిదీపం కావాలి.


పెరగాల్సిన వాటా

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మరింతగా పెరగాల్సి ఉంది. 2020లో కేంద్ర ఉద్యోగుల్లో స్త్రీల వాటా 13 శాతం మాత్రమే. 2022లో ఐఏఎస్‌ స్థాయి కార్యదర్శుల్లో 14 శాతం మాత్రమే మహిళలు. కేంద్ర హోం, రక్షణ, ఆర్థిక, సిబ్బంది వ్యవహారాల శాఖలకు ఇంతవరకు మహిళా కార్యదర్శులే నియమితులు కాలేదు. ఏ మహిళాధికారీ కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి పదవిని చేపట్టలేదు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రధాన కార్యదర్శి పదవులను కేవలం ముగ్గురు మహిళలే చేపట్టారు. భవిష్యత్తులో పరిస్థితి మారనున్నదని సివిల్‌ సర్వీసులతోపాటు వివిధ పరీక్షల్లో ఏటికేడు పెరుగుతున్న మహిళా ఉత్తీర్ణుల సంఖ్య సూచిస్తోంది.

 వరప్రసాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు