మహాసాగర మథనానికి ప్రత్యేక ఒప్పందం

జీవావరణ వ్యవస్థ ప్రధానంగా సముద్రాలపైనే ఆధారపడి ఉంటుంది. సాగర జలాలు మానవాళికి ఆహార భద్రతతోపాటు ఆర్థిక ప్రయోజనాలనూ చేకూర్చుతాయి. సముద్ర జలాల్లో మానవ కార్యకలాపాలకు తోడు వ్యర్థ రసాయనాలు సాగరాల్లో కలుస్తుండటం పెను ముప్పుగా పరిణమించింది. 

Updated : 03 Jun 2023 05:21 IST

జీవావరణ వ్యవస్థ ప్రధానంగా సముద్రాలపైనే ఆధారపడి ఉంటుంది. సాగర జలాలు మానవాళికి ఆహార భద్రతతోపాటు ఆర్థిక ప్రయోజనాలనూ చేకూర్చుతాయి. సముద్ర జలాల్లో మానవ కార్యకలాపాలకు తోడు వ్యర్థ రసాయనాలు సాగరాల్లో కలుస్తుండటం పెను ముప్పుగా పరిణమించింది. ఇలాంటి తరుణంలో ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు తాజాగా ‘మహాసాగర జల సంరక్షణ ఒప్పందం’ కుదుర్చుకున్నాయి.

తీరం నుంచి సముద్రంలో 370 కిలో  మీటర్ల వరకు విస్తరించిన జలాలను తీరస్థ దేశాల ప్రత్యేక ఆర్థిక మండలిగా పరిగణిస్తారు. ఆ పరిధికి ఆవల 95శాతం మహా సాగర జలాలు విస్తరించి ఉంటాయి. సాగర జలాలపై ఏ ఒక్క దేశానికీ సొంత హక్కులు ఉండవు. వాటిని బహిరంగ జలాలుగానే పరిగణించాలని సముద్ర చట్టాలపై ఐక్యరాజ్య సమితి ఒప్పందం (అన్‌క్లస్‌) తీర్మానించింది. సువిశాల మహాసాగరంలో సముద్ర గర్భమూ అంతర్భాగమే. అక్కడి జీవవైవిధ్యం యావత్‌ మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతోంది. క్యాన్సర్‌ చికిత్సకు వాడే హాలెవెన్‌, కొవిడ్‌-19 తీవ్రతను తగ్గించే రెమ్‌డెసివిర్‌లతోపాటు అల్జీమర్స్‌, లుకేమియా వ్యాధుల చికిత్సకు, నొప్పి నివారణకు వాడే మందులు సాగర వనరుల నుంచి రూపుదిద్దుకొన్నవే. మానవాళి ఉమ్మడి ఆస్తి అయిన మహాసాగర జలాలు, వాటిలోని జీవవైవిధ్యం నేడు కాలుష్యానికి, వాతావరణ మార్పులకు గురవుతున్నాయి. సముద్ర గర్భంలోని చమురు, సహజ వాయువు, ఖనిజ నిక్షేపాల కోసం తవ్వకాలు, అతిగా చేపలు పట్టడం- సాగర జలాలకు చేటుతెస్తున్నాయి. ప్రపంచంలో 80శాతం వ్యర్థ జలాలను సముద్రాల్లోకే విడిచిపెడుతున్నారు. వీటిలోని రసాయన, జీవసంబంధ వ్యర్థాలు సాగరాలకు, తీర ప్రాంతాలకు తీరని హాని కలిగిస్తున్నాయి.

వాతావరణ సమతౌల్యానికి...

భూ వాతావరణాన్ని సమతౌల్య స్థితిలో ఉంచడంలో సాగరాలదే కీలక పాత్ర. వాతావరణంలో సగానికిపైగా ఆమ్లజని సముద్రాల నుంచే ఉత్పన్నమవుతోంది. శిలాజ ఇంధనాల నుంచి పుట్టుకొచ్చే వేడిని, కర్బన ఉద్గారాలను సముద్రాలు ఒడిసిపట్టుకుంటూ ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతాయి. మానవ కార్యకలాపాల వల్ల కాలుష్యం తీవ్రమవుతుండటంతో- ఉష్ణోగ్రతలను నియంత్రించడం సాగరాలకు కూడా అలవికాని పరిస్థితి ఏర్పడింది. బొగ్గుపులుసు వాయువు పాళ్లు పెరిగిపోవడంతో సాగర జలాలు ఆమ్లీకరణకు లోనవుతున్నాయి. అది సముద్ర జలాల్లోని సూక్ష్మజీవులు మొదలు భారీ జలచరాల వరకు అన్నింటికీ ముప్పు తెచ్చిపెడుతోంది. సాగరాల్లో 41శాతం జీవజాతుల మనుగడకు ముప్పు ఏర్పడిందని, 10శాతం జలచరాలు అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయని అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం నివేదిక హెచ్చరించింది. సాగరాల్లో మత్స్య సంపదను అతిగా వేటాడుతున్నాం. చట్టవిరుద్ధ చేపల వేట నానాటికీ పెరిగిపోతోంది. మహా సాగరాల గర్భంలో ఖనిజ వనరులు, చమురు కోసం చేపడుతున్న తవ్వకాలు జలచరాలకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా నత్తలు, శంఖాలు, ముత్యపు చిప్పలు, అక్టోపస్‌ తదితర జీవుల మనుగడను దెబ్బతీస్తున్నాయి.

సముద్ర చట్టాలపై ఐక్యరాజ్య సమితి ఒప్పంద ప్రధాన లక్ష్యం- సాగరాల్లో నౌకాయానానికి నియంత్రణ చట్రం విధించడమే. సముద్ర జీవజాతుల పరిరక్షణకు ఆ ఒప్పందంలో ప్రత్యేక ఏర్పాట్లేమీ లేవు. ఈ లోపాన్ని సరిదిద్దడానికి 2004 నుంచే కృషి జరుగుతోంది. ఆ ఏడాది ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సాగర జీవజాతుల సంరక్షణను పరిశీలించడానికి నిపుణులతో తాత్కాలిక కార్యబృందాన్ని ఏర్పాటుచేసింది. 2018 నుంచి ఈ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో సంప్రతింపులు మొదలయ్యాయి. చివరకు ఈ ఏడాది మార్చి 4న జాతీయ అధికార పరిధికి ఆవల జీవవైవిధ్య సంరక్షణ ఒప్పందం కుదిరింది. దీన్ని ‘మహాసాగర జల సంరక్షణ ఒప్పందం’గా వ్యవహరిస్తున్నారు. భారత్‌ సహా ఐరాసలోని 193 సభ్య దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2015 నాటి పారిస్‌ వాతావరణ ఒప్పందం తరవాత కుదిరిన అంతటి కీలక ఒప్పందం- ఇదే. దీనికి తోడు 2030కల్లా 30శాతం సముద్రాల పరిరక్షణకు 100 దేశాలు మహదాశయ సాధన కూటమిగా ఏర్పడ్డాయి. అందులోనూ భారత్‌, బ్రిటన్‌, అమెరికా వంటి ప్రధాన దేశాలు ఉన్నాయి.

నియమబద్ధ వినియోగం

అండమాన్‌, నికోబార్‌, లక్షదీవులతో కలిసి భారతదేశానికి 7,500 కిలోమీటర్ల సువిశాల సాగర తీరం ఉంది. ఆ జలాల్లోని ప్రత్యేక ఆర్థిక మండలం (ఈఈజడ్‌)పైన, అందులోని మత్స్య, ఖనిజ సంపదపైన భారత్‌కు సర్వహక్కులు ఉన్నాయి. తాజాగా కుదిరిన మహాసాగర సంరక్షణ ఒప్పందం వల్ల ఈఈజడ్‌కు ఆవల ఉన్న బహిరంగ సముద్ర జలాల్లోనూ నియమబద్ధంగా మత్స్య, ఇతర వనరుల వినియోగానికి వీలు ఏర్పడింది. సంరక్షణకు, స్థిరత్వానికి భంగం కలగని రీతిలో వినియోగం, సమాన ఫలాలు అనే అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా మహా సాగరాల్లో వనరుల అన్వేషణ, వినియోగానికి భారత్‌ కట్టుబడి ఉంది. 2002లో భారత్‌ ఆమోదించిన జీవవైవిధ్య చట్టమే ఇందుకు నిదర్శనం. సాగర స్వస్థత, తీరప్రాంత వాసుల శ్రేయస్సు, భూగోళ హితం అనే మూడు అంశాలకు మహాసాగర సంరక్షణ ఒప్పందం అగ్రాసనం వేసింది. దీన్ని ఐక్యరాజ్య సమితి లాంఛనంగా ఆమోదించిన తరవాత భూమిపై 43శాతం ఉపరితలం, 90శాతం సాగర జీవవనరుల సంరక్షణకు ప్రాతిపదిక ఏర్పడుతుంది. ప్రస్తుతం అమలులో ఉన్న సాగర గర్భ గని తవ్వకాల ఒప్పందంతో సముద్ర జీవులకు హాని కలుగుతోంది. దాన్ని బాధ్యతాయుతంగా అమలు చేయడంలో మహా సాగర జల   సంరక్షణ ఒప్పందం మార్గదర్శిగా నిలుస్తుంది.


నాలుగు కీలక అంశాలు

ఐరాస సభ్య దేశాల మధ్య తాజాగా కుదిరిన ‘మహాసాగర జలసంరక్షణ ఒప్పందం’లో నాలుగు ప్రధానాంశాలు ఉన్నాయి.

* ఒకటి: విశాల బహిరంగ సముద్రాల్లో జీవవైవిధ్యాన్ని రక్షించాల్సిన ప్రాంతాల గుర్తింపునకు ఒక విధానాన్ని ఖరారు చేయాలి. దానికి కావలసిన సాధనాలను సిద్ధం చేసుకోవాలి.

* రెండు: సముద్ర జీవజాతుల జన్యు సమాచారాన్ని వర్ధమాన దేశాలతో పంచుకోవడానికి ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ఇంతవరకు జలచరాల జన్యు సమాచారాన్ని సంపన్న  దేశాల బయో టెక్నాలజీ కంపెనీలే సొంతం చేసుకుని ఆవిష్కరణలు చేపడుతున్నాయి. వాటిపై మేధాహక్కులు తమవేనని అంటున్నాయి.  

* మూడు: సాగర జీవులకు హాని కలగకుండా మహా సాగరాల్లో వాణిజ్య కార్యకలాపాలకు ఉమ్మడిగా నియంత్రణ చట్రం ఏర్పాటు చేసుకోవాలి.

* నాలుగు: సాగర వనరుల వినియోగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతిక సమాచారాన్ని వర్ధమాన దేశాలతో పంచుకోవాలి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి