క్యాన్సర్ పోరాట యోధులకు వందనం
ఆనందంగా సాగిపోతున్న జీవితాన్ని ఒక్కసారిగా తీవ్ర కుదుపునకు గురిచేసే వ్యాధి- క్యాన్సర్. ఇది వస్తే ఇక అంతా అయిపోయినట్లేనని చాలామంది భావిస్తారు. ఆధునిక వైద్య చికిత్స ఆలంబనగా, మొక్కవోని మానసిక స్థైర్యంతో క్యాన్సర్‌ను జయించడం సాధ్యమే. మన చుట్టూరా ఎంతోమంది ఈ సత్యాన్ని తెలియజెబుతున్నారు.
ఆనందంగా సాగిపోతున్న జీవితాన్ని ఒక్కసారిగా తీవ్ర కుదుపునకు గురిచేసే వ్యాధి- క్యాన్సర్. ఇది వస్తే ఇక అంతా అయిపోయినట్లేనని చాలామంది భావిస్తారు. ఆధునిక వైద్య చికిత్స ఆలంబనగా, మొక్కవోని మానసిక స్థైర్యంతో క్యాన్సర్‌ను జయించడం సాధ్యమే. మన చుట్టూరా ఎంతోమంది ఈ సత్యాన్ని తెలియజెబుతున్నారు.
క్యాన్సర్ వచ్చినట్లు నిర్ధారణ అయిన తరవాత ధైర్యంగా దానిపై పోరాడుతూ మనుగడ సాగిస్తున్నవారు భారత్‌లో 22.50 లక్షల మంది దాకా ఉంటారని అంచనా. క్యాన్సర్ వచ్చిన వెంటనే దాన్ని గుర్తించడం, ఆధునిక చికిత్సలు అందుబాటులోకి రావడం వల్ల ప్రస్తుతం చాలామంది దీర్ఘకాలం జీవిస్తున్నారు. వారి స్థైర్యాన్ని గుర్తిస్తూ, వారికి మరింత భరోసా ఇస్తూ 1988 జూన్ నుంచి అమెరికాలో క్యాన్సర్‌ను జయించినవారి దినోత్సవాన్ని జరుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకొన్నారు. ఈ క్రమంలో ఏటా జూన్ నెల మొదటి ఆదివారం నాడు క్యాన్సర్‌ను జయించినవారి దినోత్సవాన్ని పాటించడం ఆనవాయితీగా మారింది. ఈ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వాటిలో క్యాన్సర్‌ను ఎదిరించి నిలిచినవారితో పాటు వారి కుటుంబసభ్యులు, మిత్రులు, వైద్య సహాయకులు పాల్గొంటారు. క్యాన్సర్ వచ్చిన తరవాతా అర్థవంతంగా, ఫలవంతంగా జీవితాన్ని గడపవచ్చని చాటుతారు. ముందుగా గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే క్యాన్సర్‌ను అదుపులో ఉంచవచ్చనే సందేశం దీని ద్వారా అందుతుంది. ఆధునిక విజ్ఞానం, ధైర్య స్థైర్యాలు, ఆశాభావం, ప్రేరణ, తోటివారి తోడ్పాటు క్యాన్సర్‌ను అధిగమించడానికి ఎంతగానో తోడ్పడతాయి.
తక్కువ వయసులోనే...
ఇండియాలో ఏటా దాదాపు 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు వెలుగు చూస్తున్నాయి. వారిలో ఎనిమిది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విశ్లేషణ ప్రకారం ప్రతి తొమ్మిది మంది భారతీయుల్లో ఒకరు తమ జీవితకాలంలో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. ప్రతి 15 మందిలో ఒకరు ఆ వ్యాధితో మరణించే ముప్పు నెలకొంది. దేశీయంగా క్యాన్సర్‌పై అవగాహన, జాతీయ స్థాయిలో ముందుగా గుర్తించే యంత్రాంగం కొరవడటం, సరిపడా వైద్య వసతులు, సిబ్బంది లేమి, చికిత్స వ్యయాన్ని భరించే ఆర్థిక స్థోమత ప్రజలకు లేకపోవడం పెను సమస్యలుగా మారాయి. దానివల్ల 60శాతం భారతీయ క్యాన్సర్ రోగుల్లో వ్యాధిని గుర్తించేసరికే అది ముదిరిపోతోంది. ఫలితంగా అధికాదాయ దేశాలతో పోలిస్తే భారత్‌లో క్యాన్సర్ మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు వచ్చినా, అధునాతన వైద్యాన్ని పొందడానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి క్యాన్సర్ రోగుల పాలిట అశనిపాతంలా మారింది. కరోనా మొదటి, రెండో దశల్లో ఆస్పత్రులు కొవిడ్ రోగులతో కిక్కిరిసిపోయాయి. దాంతో క్యాన్సర్ రోగులకు పడకలు చిక్కకుండా పోయాయి. వారికి చికిత్స అందించడానికీ వైద్యుల కొరత ఏర్పడింది. అందువల్ల క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించే అవకాశం లేక వ్యాధి తీవ్రమై మరణాలు అధికమయ్యాయి.
పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా భారత్‌లోని యువతలో సకాలంలో క్యాన్సర్‌ను గుర్తించి చికిత్స అందించడం సాధ్యపడటం లేదు. ఫలితంగా వారిలో మరణాలు పెరుగుతున్నాయి. ఇండియాలో రొమ్ము క్యాన్సర్ తక్కువ వయసులోనే అధికంగా కనిపిస్తోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే దశాబ్దం ముందుగానే, అంటే 40-50 ఏళ్ల వయసులోనే ఇక్కడ మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. భారత జనాభాలో 75శాతం 50 ఏళ్ల లోపు వయసువారే. చిన్న వయసులో క్యాన్సర్ బయటపడటం బాధితులకు పిడుగుపాటు అవుతుంది. పిన్నవయసు క్యాన్సర్ బాధితుల సమస్యలు, పెద్ద వయసు రోగులకన్నా భిన్నంగా ఉంటాయి.
పోరాట స్ఫూర్తి
హైదరాబాద్ కేంద్రంగా ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్‌కు అనుబంధంగా 2008లో ‘ఆశ’ అనే సహాయ బృందం ఏర్పాటైంది. ఇది రొమ్ము క్యాన్సర్ బాధితులకు మానసిక దన్ను అందిస్తోంది. క్యాన్సర్ రోగుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన మొట్టమొదటి సహాయక బృందం ఇదే. దీన్ని ప్రసిద్ధ స్త్రీ వ్యాధుల నిపుణురాలు డాక్టర్ ఉషాలక్ష్మి రూపొందించి, ప్రారంభించారు. స్వయంగా క్యాన్సర్ బారినుంచి కోలుకున్న ధీర వనిత ఆమె. కష్టాల్లో నుంచే అద్భుతాలు పుడతాయని ఫ్రెంచి నవలా రచయిత జాన్ డి లా బ్రుయేర్ అంటారు. క్యాన్సర్ వ్యాధి సైతం అలాంటి ప్రభావాన్నే చూపుతుంది. వ్యాధి అనేది మన జీవన శైలిని మార్చుకోవాలని శరీరం పంపే హెచ్చరిక సంకేతం. భయానికి, అనిశ్చితికి లోనవకుండా ఉంటే క్యాన్సర్‌ను జయించడం సాధ్యమే. ఆ సత్యాన్ని నిరూపించిన అనేకమంది పోరాట యోధులకు నా వందనం. వారి సాహసాన్ని, మొక్కవోని పోరాట స్ఫూర్తిని, విజయాన్ని కీర్తించాల్సిన రోజు ఇది.
మానసిక భరోసా కీలకం
క్యాన్సర్ కేవలం శరీరాన్నే కాదు, మనసును ఆత్మను దెబ్బతీస్తుందంటే అతిశయోక్తి కాదు. అందువల్ల శరీరానికి వచ్చిన వ్యాధికి మాత్రమే చికిత్స చేస్తే సరిపోదు. క్యాన్సర్ వ్యాధి శారీరకంగా, భావోద్వేగపరంగా, ఆర్థికంగా తీవ్ర సమస్యలను తెచ్చిపెడుతుంది. రోగ నిర్ధారణ జరిగిన తరవాతే కాదు, చికిత్స అనంతరమూ ఈ సమస్యలు విడిచిపెట్టవు. అందువల్ల చికిత్సతో పాటు రోగులకు మానసికంగా భరోసా ఇవ్వడం అత్యంత కీలకం. రోగితో పాటు కుటుంబ సభ్యులకూ వైద్యులు మానసిక సలహాలు ఇవ్వాలి. క్యాన్సర్ గురించి వారికి తెలియజెప్పి గుండె ధైర్యం నింపాలి. నిజం చెప్పాలంటే, క్యాన్సర్ చికిత్సలో సగభాగం మానసిక భరోసాకు సంబంధించే ఉంటుంది. రోగ నిర్ధారణ జరిగి చికిత్స చేయించుకున్నాక, ఆశావహ వైఖరిని అవలంబించే వ్యక్తి క్యాన్సర్‌ను సమర్థంగా ఎదిరించి సుదీర్ఘ కాలం సంతోషంగా జీవించగలుగుతారు. క్యాన్సర్ నిపుణులు, మానసిక సలహాదారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాధి బాధితులకు మానసికంగా అండగా నిలవాలి. రోగి అనుమానాలు, ఆందోళనలను నివృత్తి చేయడానికి అంకితమవడం వైద్య నిపుణుల కర్తవ్యం. దీనిపై డాక్టర్లకు తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
TTD: సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Weather Report: తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
Chandrayaan 3: జాబిల్లిపై సూర్యోదయం.. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు ఇస్రో ప్రయత్నాలు
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Manipur: మణిపుర్లో మరోసారి ఉద్రిక్తతలు.. కర్ఫ్యూ సడలింపులు రద్దు!