రవాణా వ్యయాలకు కళ్ళెం... ప్రగతికి మార్గం

ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌... తలసరి ఆదాయం, తలసరి స్థూలదేశీయోత్పత్తిలో మాత్రం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడలేకపోతోంది. వస్తువుల ఉత్పత్తితోపాటు వాటి రవాణా వ్యయాన్ని, సమయాన్ని గణనీయంగా తగ్గించుకోవడమే దీనికి పరిష్కారంగా కనిపిస్తోంది.

Published : 10 Jun 2023 01:03 IST

ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌... తలసరి ఆదాయం, తలసరి స్థూలదేశీయోత్పత్తిలో మాత్రం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడలేకపోతోంది. వస్తువుల ఉత్పత్తితోపాటు వాటి రవాణా వ్యయాన్ని, సమయాన్ని గణనీయంగా తగ్గించుకోవడమే దీనికి పరిష్కారంగా కనిపిస్తోంది. ప్రస్తుతం జీడీపీలో 14-16శాతం ఉన్న రవాణా వ్యయాలను తొమ్మిది శాతానికి తగ్గించడంపై దృష్టి సారించినట్లు కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల వెల్లడించారు. రవాణా వ్యయం తగ్గితే అభివృద్ధి జోరందుకుంటుందని భావిస్తున్నారు.

అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దగ్గర రవాణా వ్యయం అధికంగా ఉండటానికి కారణం- ఎక్కువగా రోడ్డు రవాణాపై ఆధారపడటమే. మన దగ్గర సరకు రవాణాలో 71 శాతం రోడ్డు మార్గంలోనే జరుగుతోంది. దేశంలోని రహదారి నెట్‌వర్క్‌లో కేవలం మూడు శాతంలోపే ఉన్న జాతీయ రహదారులపై 40 శాతానికి పైగా సరకు రవాణా అవుతుండటమే ఇందుకు నిదర్శనం. 1950ల్లో సరకు రవాణాలో 89శాతం దాకా రైళ్ల ద్వారా సాగేది. 2020 నాటికి అది 18శాతానికి పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఆ తరవాతి కాలంలో ఇది కాస్త పుంజుకొన్నా, ఆశావహ స్థాయికి మాత్రం చేరలేదు. రైల్వే ద్వారా సరకు రవాణా ఆలస్యమవుతోంది. గూడ్సు రైలు సరాసరి వేగం మన దేశంలో గంటకు 25 కిలోమీటర్లే. అమెరికా వంటి దేశాల్లో ఇది 50 కిలోమీటర్లు.

జల మార్గాల దుస్థితి

మన దేశంలో విమానాల ద్వారా సరకు రవాణా చాలా పరిమితంగానే జరుగుతోంది. 2019-20లో దేశంలో ఉన్న 20 స్వదేశీ, 20 అంతర్జాతీయ కార్గో టెర్మినళ్ల ద్వారా 35.6 లక్షల టన్నుల సరకు రవాణా చేసినట్లు పౌర విమానయానశాఖ వార్షిక నివేదికలో పేర్కొంది. అదే ఏడాది చైనాలోని షాంఘై అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే 36.3 లక్షల టన్నుల మేర సరకు రవాణా చేసింది. కార్గో రవాణాలో మనం ఎంత వెనకబడిపోయామో దీని ద్వారా అర్థమవుతోంది. ఒకప్పుడు దేశంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న జల రవాణా పూర్తిగా బక్కచిక్కిపోయింది. బకింగ్‌హామ్‌ కాలువ వంటి జలమార్గాలు మురుగు కాలువల్లా మారిపోయిన దుస్థితి జల రవాణాను రెండు శాతానికి తగ్గించేసింది. రోడ్డు, రైలు, వాయు మార్గాలతో పోలిస్తే- జల రవాణా చాలా చౌక. దీన్ని పునరుజ్జీవింపజేయాలన్న ఆలోచనలు దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమయ్యాయి.

దేశంలో దాదాపు రూ.16.5 లక్షల కోట్ల విలువైన రవాణా మార్కెట్‌ రెండున్నర కోట్ల మందికి జీవనోపాధి చూపుతోంది. అయినా దీనిలో ఎన్నో ముక్కలుచెక్కలుగా ఉన్న వ్యవస్థలు ఈ రంగానికి ఒక ఏకీకృత రూపు లేకుండా చేశాయి. ఫలితంగా రవాణా రంగంలో సమస్యలను గుర్తించి, తదనుగుణంగా పరిష్కారాలను కనుగొనడానికి సరైన ప్రణాళికన్నది లేకపోయింది. ఈ నేపథ్యంలో సమీకృత, సమగ్ర రవాణా విధానం అవసరాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020 బడ్జెట్‌ ప్రసంగంలో నొక్కి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది జాతీయ రవాణా విధానాన్ని (నేషనల్‌ లాజిస్టిక్‌ పాలసీ- ఎన్‌ఎల్‌పీ)ని ప్రారంభించారు. దీనిలో భాగంగా ఏకీకృత రవాణా వ్యవస్థ  కింద రవాణా సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలని నిర్ణయించారు. రోడ్డు, రైలు, వాయు, జల రవాణా సేవలన్నింటినీ ఒకే వేదికపైకి తెస్తే వినియోగదారులకు సులువుగా ఉంటుందన్నది దీని ఉద్దేశం. రవాణా సౌకర్యాల్లోని ఇబ్బందుల పరిష్కారానికి సులభతర రవాణా సేవల వ్యవస్థను ప్రారంభించారు. వీటిలో ఏర్పడే సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ‘సిస్టమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ గ్రూప్‌’ను తీసుకొచ్చారు. వీటన్నింటి సమన్వయంతో రవాణా రంగంలో సంస్కరణలు తెచ్చి, ఖర్చులను తగ్గించాలన్నది ప్రభుత్వ యోచన. దేశ రవాణా వ్యవస్థలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రధానమంత్రి గతిశక్తి యోజనను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ద్వారా జాతీయ రహదారుల అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అయితే, రైల్వేల విద్యుదీకరణ, లైన్ల విస్తరణ పనులు వేగం పుంజుకోవాల్సిన అవసరం ఉంది.

రైలు, విమాన రవాణా మార్గాలు అందరికీ పూర్తిస్థాయిలో అందుబాటులో లేనందువల్ల రోడ్డు రవాణా వ్యవస్థే ప్రస్తుతానికి ఆదరువు. అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న డీజిల్‌ ధరలు రవాణా వాహన యజమానులను నష్టాల్లోకి నెడుతున్నాయి. దీనికితోడు టోల్‌ రుసుముల భారమూ అంతకంతకు పెరిగిపోతోంది. అసలే నష్టాల్లో ఉన్న తమకు మానవ వనరుల కొరత కొత్త సమస్యలు సృష్టిస్తోందని వాహన యజమానులు వాపోతున్నారు. మరోవైపు, నిబంధనల అతిక్రమణ పేరిట రవాణా శాఖలు విధించే భారీ చలాన్లు వారికి తలకు మించిన భారమవుతున్నాయి. డీజిల్‌ ధరలు తగ్గించాలని, టోల్‌ రుసుములను నియంత్రించాలని రవాణా వాహనాల యజమానులు చేస్తున్న వినతులపై ప్రభుత్వాలు దృష్టి సారించడంలేదు. చమురు ఉత్పత్తుల ద్వారా వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు- వాటిపై ధరల బాదుడును కాస్త తగ్గిస్తే వాహన యజమానులు నష్టాల నుంచి కొంతైనా గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. దీనిపై దృష్టి సారించనంత కాలం రవాణా ఖర్చులు దిగిరావడమన్నది దాదాపు అసాధ్యం!

ధరలు తగ్గుముఖం...

ఉత్పత్తి చేసిన వస్తువుల రవాణా వ్యయాన్ని, సమయాన్ని తగ్గించగలిగితే- వాటి ధరలూ దిగి వస్తాయి. వస్తువు ధరలో స్వల్ప తగ్గుదల సైతం అంతర్జాతీయ మార్కెట్‌లో దానికి డిమాండును గణనీయంగా పెంచుతుంది. దేశీయ రవాణా రంగం తీరుతెన్నులు మారి, మన తయారీ రంగం ప్రపంచస్థాయిలో గట్టి పోటీదారు కావాలంటే- రవాణా వ్యవస్థ అభివృద్ధి, వ్యయాల నియంత్రణపై ప్రభుత్వాలు నిశితంగా దృష్టి సారించాలి. తయారీ రంగంతోపాటు పర్యాటక, పారిశ్రామిక, సేవా రంగాలకు మెరుగైన, చవకైన రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలి. తద్వారా ఆర్థిక వ్యవస్థ పటిష్ఠమవుతుంది. కొత్త ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడటంతోపాటు తలసరి ఆదాయమూ పెరుగుతుంది.


ర్యాంకింగ్‌లో వెనకబాట

ప్రపంచబ్యాంకు రూపొందించిన రవాణారంగ పనితీరు సూచిక (ఎల్‌పీఐ) ప్రకారం- 2018లో భారత్‌ 48వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. రవాణా వ్యవస్థలో మౌలిక సౌకర్యాల లేమి, సమయానికి సరకును చేరవేయలేకపోవడంతో పాటు ఈ రంగంలోని అసంబద్ధ నిబంధనలే ఇందుకు కారణాలని ఎల్‌పీఐ నివేదిక విశ్లేషించింది. ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఏమీ లేవు. సమ్మిళిత, సత్వర వృద్ధిని కాంక్షిస్తున్న భారత్‌ లాంటి దేశానికి ఇది ఏ మాత్రం ప్రయోజనకారి కాదన్నది నిపుణుల మాట.


శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.