జోడు గుర్రాలుగా...సంక్షేమం-అభివృద్ధి!

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు దారితీసింది. 2047కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది.

Published : 14 Jun 2024 01:46 IST

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు దారితీసింది. 2047కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని సాకారం చేయడానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని పెంచడంతోపాటు నిరుద్యోగాన్ని రూపుమాపడం అత్యావశ్యకం. ఆ దిశగా సమ్మిళిత, సుస్థిర అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేయాలి.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ప్రజాస్వామ్యం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుండటం గొప్ప విజయం. ఇటీవలి లోక్‌సభ ఎన్నికలు మన ప్రజాస్వామ్య పటిష్ఠతకు అద్దం పట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వాన ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వం దేశార్థికాన్ని బలోపేతం చేయడంతో పాటు అభివృద్ధిని జోరెత్తించాలని భావిస్తోంది. పెట్టుబడులు, ఎగుమతులు అనే జవనాశ్వాలపై అభివృద్ధి రథం పరుగుతీస్తుందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ సి.రంగరాజన్‌ ఏనాడో మేలిమి సూచన చేశారు. 2047కల్లా భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ప్రజల తలసరి ఆదాయం 13,205 డాలర్లకు పెరగాలి. రూపాయి విలువ క్షీణతను దృష్టిలో పెట్టుకుంటే అది 15,000 డాలర్లకు చేరాలి. ఇది సాకారం కావాలంటే భారత్‌ ఏటా కనీసం ఏడు శాతం జీడీపీ వృద్ధి రేటు సాధించడం ముఖ్యం. మరోవైపు, ప్రభుత్వ పెట్టుబడులతోపాటు ప్రైవేటు పెట్టుబడులూ దండిగా ప్రవహించాలి. అందుకోసం ప్రభుత్వం పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరముంది.

యువతలో నిరుద్యోగిత

స్థూల దేశీయోత్పత్తితో పాటు ఎగుమతులు పెరిగితేనే భారత్‌ సుసంపన్న దేశంగా అవతరిస్తుంది. ఇటీవల ఇండియా దిగుమతి సుంకాలను పెంచి, ఆత్మనిర్భరత పేరిట స్వీయ వాణిజ్య రక్షణ విధానాలను అనుసరించడం ఎగుమతుల వృద్ధికి ఆటంకంగా పరిణమిస్తోంది. చైనాపై ఆధారపడటం తగ్గించుకోవాలని అమెరికా, ఐరోపాలు నిర్ణయించినందువల్ల భారత్‌ తన ఎగుమతులు పెంచుకోవడానికి ఇదే సరైన సమయం. ఎగుమతులు లేకుండా ఏ దేశమూ 7-8 శాతం వృద్ధి రేటు సాధించలేదు. నేడు ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తున్న భారత్‌- త్వరలోనే మూడో పెద్ద వ్యవస్థగా మారనున్నది. అయితే తలసరి ఆదాయాల రీత్యా 180 దేశాల జాబితాలో భారత్‌ 138వ స్థానంలోనే తచ్చాడుతోంది. 1990లో భారత్, చైనాల తలసరి ఆదాయం ఒకే స్థాయిలో ఉండేది. ఇప్పుడు 12,000 డాలర్ల తలసరి ఆదాయంతో చైనా 71వ స్థానంలో నిలుస్తుంటే, భారత్‌ 2,600 డాలర్ల ఆదాయంతో 138వ స్థానంతో సరిపెట్టుకొంటోంది. ఈ పరిస్థితిని వేగంగా మార్చాలి.

ఏ దేశమైనా వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగానికి మారితేనే వేగంగా అభివృద్ధి సాధించగలుగుతుంది. ప్రజల్లో అత్యధికులు ఉద్యోగాల కోసం సేద్యం మీద కాకుండా పరిశ్రమల మీద ఆధారపడటం అభివృద్ధి చెందిన దేశ లక్షణం. అదే సమయంలో సేద్య రంగానికి అధునాతన సాంకేతికతలు, అధిక పెట్టుబడులు, మౌలిక వసతులను సమకూర్చాలి. అప్పుడు తక్కువ సిబ్బందితో అత్యధిక వ్యవసాయ ఉత్పత్తి సాధించడం వీలవుతుంది. జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా పెరిగినప్పుడు ఉపాధి, వ్యాపార అవకాశాలు, ఎగుమతులు వృద్ధిచెందుతాయి. యువతకు పెద్దయెత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం సంకీర్ణ ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు. ఉపాధి కల్పన సమ్మిళిత అభివృద్ధిలో అంతర్భాగం. 2012-19 మధ్య కాలంలో జీడీపీ 6.7శాతం వృద్ధిరేటు సాధించినప్పటికీ, ఉపాధి కల్పన రేటు మాత్రం 0.1 శాతమే! లభ్యమైనవీ అసంఘటిత రంగంలో నాసిరకం ఉద్యోగాలే. మహిళా కార్మిక భాగస్వామ్య రేటూ మన దేశంలో చాలా తక్కువ. భారత జనాభాలో 27శాతం 15-29 ఏళ్ల వయసువారే. దేశంలో 83శాతం నిరుద్యోగులు యువజనులే. సెకండరీ విద్య, అంతకుమించి విద్యార్హతలు ఉన్నవారిలో 18.4శాతం, పట్టభద్రుల్లో 29.1శాతం  నిరుద్యోగులు. మహిళా పట్టభద్రుల్లో 34.5శాతానికి ఉద్యోగాల్లేవు. దేశంలో విద్య, వైద్యాలపరంగా తీవ్ర అసమానతలు ఉండటం సమ్మిళిత అభివృద్ధికి అడ్డుపడుతోంది.

సంక్షేమ కార్యక్రమాలతోనే అసమానతలు, పేదరికం సమసిపోవు. ‘జనానికి చేపలు ఇస్తే ఒక పూట గడుస్తుంది. అదే చేపల వల ఇస్తే జీవితాంతం వారు సొంత కాళ్లపై నిలబడతారు’ అని చైనా సామెత. దీన్ని మన పాలకులూ గుర్తుంచుకోవాలి. ఎడాపెడా అప్పులు చేయడంవల్ల ప్రభుత్వాలను లోటు బడ్జెట్లు పీడిస్తున్నాయని రిజర్వు బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు హెచ్చరించారు. ఈ అప్పుల భారం భవిష్యత్‌ తరాలపై పడుతుంది. సంక్షేమానికి తోడుగా అభివృద్ధికీ సమ ప్రాధాన్యమివ్వాలి. మౌలిక వసతుల నిర్మాణంతోనే అభివృద్ధి ఊపందుకుంటుంది. వాజ్‌పేయీ హయాములో నిర్మించిన స్వర్ణ చతుర్భుజి రహదారి ప్రాజెక్టు వల్ల సంబంధిత జిల్లాల్లో పారిశ్రామికోత్పత్తి 49శాతం పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి.

పాలనా వికేంద్రీకరణ కీలకం

భారతదేశంలో పట్టణీకరణ వేగంగా విస్తరిస్తోంది. అది పర్యావరణ అనుకూలంగా, సుస్థిరాభివృద్ధి సాధనకు తోడ్పడేదిగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసేటప్పుడు ఆర్థిక ప్రగతి, సమర్థ పాలనతోపాటు మానవ వనరుల వికాసానికి, పర్యావరణహితకరమైన విధానాలకు, జీవన నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలి. కేంద్రంలోని కొత్త సంకీర్ణ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణకు పట్టం కట్టాలి. రాష్ట్రాలకు రాజ్యాంగం కట్టబెట్టిన అధికారాలను గౌరవించాలి. పంచాయతీలు, పురపాలక సంస్థలకు నిధులూ అధికారాలను కట్టబెట్టాలి. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు భారత్‌లో కేవలం మూడు శాతం నిధులే అందుతున్నాయి. చైనాలో అది 51శాతం, అమెరికాలో 27శాతం మేర లభిస్తున్నాయని గుర్తించాలి. ఇటువంటి సమస్యలు, సవాళ్లను అధిగమిస్తే- భారత్‌ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడం తథ్యం!


నైపుణ్య శిక్షణ అవసరం

భారతీయ యువతలో చాలామందికి సరైన నైపుణ్యాలు ఉండటంలేదు. దాంతో వారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. దక్షిణ కొరియాలో 96శాతం కార్మికులకు, జపాన్‌లో 80శాతం, జర్మనీలో 75శాతం, బ్రిటన్‌లో 68శాతం పనివారికి నైపుణ్య శిక్షణ లభిస్తోంది. భారత్‌లోని కార్మికుల్లో కేవలం 2.3 శాతానికే నైపుణ్యాలు ఉంటున్నాయని నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. సాంకేతిక విద్యార్హతలు కలిగిన ఉన్నత విద్యావంతులు తమ స్థాయికి తగని ఉద్యోగాలు చేస్తున్నారు. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్‌ వల్ల ఉపాధి అవకాశాలకు ముప్పు వాటిల్లనుందనే హెచ్చరికల నేపథ్యంలో భారత్‌ సరైన విధానాలతో ముందుకుసాగాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.