జల వనరులకు నష్టం...దేశార్థికానికి కష్టం

మానవాళికి ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్లో అత్యంత అమూల్యమైనవి- జల వనరులు. ప్రజల దాహార్తిని, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అవసరాలను తీర్చడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Published : 09 Jul 2024 01:57 IST

మానవాళికి ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్లో అత్యంత అమూల్యమైనవి- జల వనరులు. ప్రజల దాహార్తిని, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అవసరాలను తీర్చడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. కానీ, జల వనరులను సరిగ్గా సంరక్షించకపోవడంవల్ల అనేక ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడమే కాకుండా, దేశార్థికమూ ప్రమాదంలో పడుతుంది.

దేశంలోనైనా ఆర్థిక వ్యవస్థ పనితీరును అంచనా వేయడానికి అక్కడి ప్రజలకు అందుతున్న కనీస వసతులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. భారత్‌లో అంతకంతకు అధికమవుతున్న నీటి కొరత దేశార్థికంతో పాటు పరపతిపైనా ప్రతికూల ప్రభావం చూపుతోందంటూ ‘మూడీస్‌’ తాజా నివేదిక వెల్లడించింది. సమర్థ, సమగ్ర నీటి నిర్వహణ కొరవడటం దేశ ఆర్థిక వ్యవస్థకు శరాఘాతమని అది వ్యాఖ్యానించింది. జీ20 కూటమిలోని ఇతర దేశాలతో పోలిస్తే తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో ఇండియా బాగా వెనకబడింది. ఈ ఏడాది వేసవిలో దిల్లీ, బెంగళూరు వంటి చోట్ల పెద్దసంఖ్యలో జనం తాగునీటి ట్యాంకర్ల వద్ద బారులుతీరిన దృశ్యాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టేవే.

పొంచి ఉన్న ముప్పు

దేశంలో నీటి ఎద్దడి కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితం కాలేదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇటువంటి పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. వీటన్నింటికీ ప్రధాన కారణం- జల వనరులను మితిమీరి వినియోగిస్తుండటమే. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు శరవేగంగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లు నీటి వినియోగమూ అధికమవుతోంది. దానికితోడు వాతావరణ మార్పుల మూలంగా తరచూ సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు దేశంలో నీటి కొరతకు దారితీస్తున్నాయి. వెరసి దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదపుటంచుల్లోకి జారుతోందంటూ ‘మూడీస్‌’ నివేదిక హెచ్చరించింది. అడుగంటుతున్న జల వనరులను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను అది గుర్తుచేసింది. పూర్తిగా రుతుపవనాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన దేశంలో- నీటి సరఫరాలో ఏమాత్రం అవాంతరాలు ఎదురైనా వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా ఆహార ధాన్యాలు, ఇతర ఆహారోత్పత్తుల ధరలు ఎగబాకుతాయి. ఆ పరిస్థితి ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు. అదే జరిగితే సమాజంలో అశాంతి చెలరేగే ముప్పు ఉంటుందని ‘మూడీస్‌’ నివేదిక హెచ్చరించింది. నీటి ఎద్దడి మూలంగా సంభవించే పరిణామాలను అది సమగ్రంగా విశ్లేషించింది. తీవ్రమవుతున్న నీటి కొరత వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో ఒడుదొడుకులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం దెబ్బతింటుంది. ఎందుకంటే భారతదేశ జనాభాలో 40 శాతానికి పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తగినంత నీరు లభించకపోతే వ్యవసాయ కార్యకలాపాలు కుంటువడతాయి. ఇనుము-ఉక్కు, థర్మల్‌ విద్యుదుత్పత్తి వంటి భారీ పరిశ్రమలు సైతం నీటి ఎద్దడి ప్రభావానికి ఎక్కువగా గురవుతాయి. ఫలితంగా వాటి ఉత్పాదక శక్తి దెబ్బతింటుంది.

జనసాంద్రత అధికంగా ఉన్న భారత్‌లో ఆర్థికాభివృద్ధికి తోడు పారిశ్రామికీకరణ, నగరీకరణ పెరుగుతుండటం వల్ల జల వనరుల లభ్యత పోనుపోను కుంచించుకుపోతోంది. అధికారిక గణాంకాల ప్రకారం, 2021లో భారత్‌లో తలసరి నీటి లభ్యత 1,486 ఘనపు మీటర్లు. 2031 నాటికి అది 1,367 ఘనపు మీటర్లకు పడిపోతుందని కేంద్ర జలవనరులశాఖ అంచనా వేసింది. జలశక్తి శాఖ నిర్దేశించిన ప్రమాణాలను బట్టి చూస్తే- తలసరి నీటి లభ్యత 1,700 ఘనపు మీటర్ల దిగువకు పడిపోవడాన్ని జల వనరులు ఒత్తిడికి లోనవుతున్నట్లుగా అర్థం చేసుకోవాలి. అదే తలసరి నీటి లభ్యత 1,000 ఘనపు మీటర్లకు దిగజారితే, ఆ పరిస్థితిని ‘నీటి కొరత’గా భావించాలని కేంద్ర జలవనరుల విభాగం సూచించింది. అటువంటి పరిస్థితి రాకముందే జాగ్రత్తపడటం మేలు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ కార్యక్రమం కింద చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కుళాయి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కానీ, పూర్తిస్థాయిలో సురక్షిత తాగునీటిని సరఫరా చేయడం లేదు. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సి.ఆర్‌.పాటిల్‌ ఇటీవల దిల్లీలో ఉన్నతాధికారులతో వర్క్‌షాప్‌ నిర్వహించారు. దేశంలో ఇప్పటికీ నీటి వసతికి నోచుకోని గ్రామీణ కుటుంబాలన్నింటికీ రక్షిత తాగునీరు అందించేందుకు కొత్త ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దాన్ని సత్వరమే అమలు చేయాల్సిన అవసరముంది.

సంరక్షణే శిరోధార్యం

దేశంలోని జల వనరులపై అంతకంతకు పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించాలంటే- ముందుగా మితిమీరిన వినియోగానికి ముకుతాడు వేయాలి. వాన నీటి సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని, గృహావసరాలకు వినియోగించిన నీటిని పునర్వినియోగించడాన్ని తప్పనిసరి చేయాలి. కొత్త భవనాల నిర్మాణానికి అటువంటి షరతులతో కూడిన అనుమతుల్ని మంజూరు చేయాలి. ఆ దిశగా నగరాలు, పట్టణాల్లోని పాలక యంత్రాంగాలు పటిష్ఠ ప్రణాళికలను రూపొందించి అమలుపరచాలి. చాలామంది చెరువులను ఆక్రమించి భవంతులను నిర్మిస్తున్నారు. దాంతో నీటి నిల్వకు అవకాశం లేకుండా పోతోంది. అన్యాక్రాంతమవుతున్న చెరువులు, కుంటలు, వాటి పరీవాహక ప్రాంతాలను పరిరక్షించుకోవాలి. మరోవైపు అదేపనిగా నీటిని తోడేస్తుండటంతో భూగర్భ జలమట్టాలు దిగువకు జారిపోతున్నాయి. కాబట్టి, ఏటా వర్షాకాలంలో కురిసే వాన నీటిని వృథాగా పోనీయకూడదు. ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి భూగర్భంలోకి, ఉపరితల జల వనరుల్లోకి మళ్ళించాలి. అప్పుడే అడుగంటిపోతున్న భూగర్భ జల వనరులను కాపాడుకోవడం సాధ్యమవుతుంది. వివిధ అవసరాల కోసం అంతకంతకు పెరుగుతున్న నీటి డిమాండుకు, లభ్యమవుతున్న జల వనరులకు మధ్య పొంతన ఉండటంలేదు. ఈ అంతరాన్ని తగ్గించాలంటే వీలైనన్ని మార్గాల ద్వారా జల వనరులను సంరక్షించుకోవాలి. అప్పుడే ముంచుకొస్తున్న నీటి ఎద్దడి ముప్పు నుంచి బయట పడగలుగుతాం.


సరఫరా ముఖ్యం...

గ్రామీణ భారతంలోని ప్రతి ఇంటికీ¨ రక్షిత తాగునీటిని అందిస్తామని  ప్రధాని నరేంద్ర మోదీ 2019లో ఎర్రకోట నుంచి హామీ ఇచ్చారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం రూ.3.6 లక్షల కోట్ల వ్యయంతో జల్‌జీవన్‌ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 19 కోట్ల కుటుంబాలకు తాగునీరు అందించాలని లక్షించారు. అయితే, ఈ ఏడాది జూన్‌ 25 నాటికి దేశంలోని 15 కోట్ల కుటుంబాలకు... అంటే లక్షించిన కుటుంబాల్లో 77శాతానికి మాత్రమే కుళాయిల ద్వారా మంచి నీటి సదుపాయం కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.