Published : 15/01/2022 00:04 IST

రోజూ పండగే...

‘సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా... సరదాలు తెచ్చిందే తుమ్మెదా... కొత్త ధాన్యాలతో కోడి పందేలతో ఊరే ఉప్పొంగుతుంటే...’
‘మరీ ఉప్పొంగితే వైరస్‌ రివ్వున దూసుకొచ్చి హత్తుకుంటుందేమో జాగ్రత్త’
‘అలా భయపెడతావేమిటి? అసలు సంక్రాంతి అంటే ఎంత పెద్ద పండుగ. నువ్వు చూస్తే ఇల్లే కదలకున్నావు. అటువైపు ఎన్నికల సంఘం అయిదు రాష్ట్రాల ఓట్ల జాతరకు నగారా మోగించింది. దాని ముందు ఈ పండగ సంబరం పెద్ద లెక్కా. పద అలా కోడిపందేల సందడి చూసొద్దాం’
‘పందేనికి వచ్చి పోలీసుల లాఠీలకు పండగ చేయలేను. ఏరికోరి కొవిడ్‌ను ఒంట్లోకి ఆవాహన చేసుకోలేను. ఒకవైపు కట్ట తెగిన ఆనకట్టలా కరోనా భీరకంగా విరుచుకుపడుతోంది. వచ్చే ఏడెనిమిది వారాలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మసలాలని వైద్య నిపుణులు మొత్తుకొని చెబుతున్నారు. ఇల్లు కాలుతుంటే ఆ మంటలో టీ కాచుకున్నట్లు ఈ తరుణంలో ప్రజాస్వామ్య పరిరక్షణకోసం మన ఎన్నికల సంఘం పడుతున్న తాపత్రయం చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియడంలేదు. నలుగురికీ జాగ్రత్తలు చెప్పాల్సిన పెద్దన్నే వైరస్‌ను తక్కువ అంచనా వేసి ఓట్ల కోలాహలానికి లాకులెత్తితే- ఇక సామాన్య జనాలకు జంకేమి ఉంటుంది?’
‘అవుననుకో, మరి వైరస్‌కు భయపడి పండగ సరదాలను వదిలేసుకోవాల్సిందేనా?’
‘అదెంత మాట. ఈసీ పుణ్యమా అని ఆ నాయక జామాతలే బోలెడు వినోదం పంచడానికి తయారుగా ఉన్నారు కదా!’
‘ఎట్టెట్టా!?’
‘కోడిపందేలు వద్దని పోలీసులు ఊరూ వాడా తిరిగి తెగ బతిమాలుకుంటున్నారట. కొన్నిచోట్ల దాడులు చేస్తున్నారట. అయినా పట్టించుకునేదెవరూ. దానికి బదులుగా చక్కగా ఇంట్లోనే కూర్చొని టీవీలు, వార్తా పత్రికల్లో ఆ అయిదు రాష్ట్రాల ఎలక్షన్ల కోలాహలం వైపు దృష్టి సారించాలని సూచిస్తే సరిపోదా? ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్లు సంధించుకుంటూ, విమర్శల తిరగమోతలతో ఎగిరెగిరిపడుతూ కాకిడేగ, నల్లకెక్కెర, తెల్లనెమలి, అబ్రాస్‌ కుక్కుటాలను మించి చెలరేగిపోవడంలేదూ! ఒక్క ఎన్నికల సమయంలో అనే ఏముంది? మన దగ్గర అధికార, ప్రతిపక్ష నేతలు ఎప్పుడూ చేసే పని అదేగా! అన్నట్లూ ఉత్తర్‌ప్రదేశ్‌లో తాజాగా బీజేపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అదును చూసి అవతలి పక్షంలోకి దూకేసి అధికార పార్టీకి అదిరిపోయే దెబ్బ రుచి చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆ అడుగుజాడలను అందిపుచ్చుకొనేవారు ఇంకెందరో? పదవులిచ్చి ప్రేమగా పెంచుకున్న కుక్కుటాలు అలా అకస్మాత్తుగా పార్టీని కాలదన్నిపోతే ఎంత బాధో! మన పందెం కోళ్లూ వారి అడుగుజాడల్లో నడిచి ప్రతిపక్ష కుక్కుటంతో దోస్తీ చేస్తే అసలు పోటీల మాటే రాదు కదా!’
‘అదిసరే, నాయక జామాతలు అన్నావు, అదేమిటి?’
‘సంక్రాంతికి కొత్త అల్లుళ్లు రావడం పరిపాటే. వారికి ఏడాదికి ఒక్కసారే మర్యాదలు. రకరకాల పిండివంటలు. ఓట్లు రాబట్టుకొని గద్దెనెక్కాలేగానీ మన నేతాశ్రీలకు నిత్య పంచభక్ష్య పరమాన్న భాగ్యమే కదా! ఉచిత వసతుల నుంచి వీర దోపిడిదాకా వాళ్లకు తరుగేముందీ! నన్నడిగితే మన దేశంలో అసలైన నిత్య సంక్రాంతి అక్షరాలా మన నేతలదే. ప్రకృతి చిన్నచూపు చూసో, పరిస్థితులు బాగలేకో రైతులను ఇప్పుడు పుట్టెడు కష్టాలు పట్టిపీడిస్తున్నాయి. నేతలకైతే ఆ గొడవేమీ ఉండదు. వాళ్లకు నిత్య సంక్రాంతి సంబరాలే! ఆ విషయం గ్రహించక పెద్ద పండగ అని అమాయక మొహాలేసుకొని తెగ హడావుడి చేసేస్తుంటాం’
‘అవును నిజమే!’
‘అంతేనా, ఆకర్షించే పథకాలతో ఓట్లను ఆవాహన చేసుకునేందుకు ఆయా పక్షాలు తీర్చిదిద్దే హమీల ముగ్గులు మన సంక్రాంతి రంగవల్లులకు ఎందులో తీసిపోతాయి చెప్పు? ఊసరవెల్లికి పెద్దన్నల్లాగ ప్రతి ఎన్నికల ముందూ పార్టీ కండువా మారుస్తూ ఓట్లయాచనకు వచ్చే నేతలను చూస్తే గంగిరెద్దు గుర్తు రావడంలో వింతేమీ ఉండదు. ఎన్నికల ప్రకటన వస్తూనే ఈ పార్టీ నుంచి ఆ పక్షంలోకి గంతులేసే ఛోటా మోటా నేతలను పరికిస్తే జల్లికట్టు క్రీడ స్ఫురణకు రావాల్సిందే. ఇక ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి మిత్రుడిగా, పక్క స్టేట్‌లో అదే పక్షానికి శత్రువుగా, మరోచోట లోపాయికారీ ఎత్తులతో చీట్లపేకల శిబిరాలకు తెరతీసిన వారి గురించి చెప్పుకొంటూపోతే సమయమే సరిపోదు. వీటన్నింటిని బట్టి చూస్తే ఈ ఎన్నికలు ముగిసేదాకా వద్దన్నా బోలెడు వినోదమే! అసలూ, ఈ నాయకులు మనల్ని ఉద్ధరించేది ఏమీ లేదని కరోనా రెండో దశ మృత్యు ఢంకా మోగించి చెప్పేసింది. నేతలు వాళ్ల స్వార్థపూరిత పాట్లేవో వాళ్లు పడతారు. మనం మాత్రం జాగ్రత్తగా ఉందాం. ముందు జాగ్రత్తలు తీసుకుందాం. వైరస్‌కు కొత్త కోరలు మొలవకుండా జాగ్రత్తపడదాం. అదే మన జీవితాలకు నిజమైన సంక్రాంతి’

- ఎం.వేణు

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

సంపాదకీయం

మరింత ఉన్నత కక్ష్యలోకి... ఇస్రో!

మరింత ఉన్నత కక్ష్యలోకి... ఇస్రో!

రోదసి ప్రయోగ రంగాన దిగ్గజ సంస్థగా ఎదిగిన ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) సారథ్య బాధ్యతలు డాక్టర్‌ శివన్‌ నుంచి ప్రఖ్యాత రాకెట్‌ శాస్త్రవేత్త ఎస్‌.సోమనాథ్‌కు తాజాగా దఖలుపడ్డాయి. డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌, ప్రొఫెసర్‌ సతీశ్‌ ధావన్‌,...
తరువాయి

ప్రధాన వ్యాఖ్యానం

సంఘటితమైతేనే సాగు బాగు

సంఘటితమైతేనే సాగు బాగు

ఉత్పత్తి ఖర్చులో సగం సైతం దక్కని ధరలతో రైతులు నష్టాల సేద్యం చేస్తున్నారు. ఆరుగాలం కష్టానికి గిట్టుబాటు లభించనప్పుడు రైతులు సేద్యంపై భరోసా కోల్పోతారు. మార్కెట్ల గమనం, ధరల స్థితిగతులు, సరఫరా, గిరాకీ వ్యత్యాసాలను తెలుసుకునే...
తరువాయి

ఉప వ్యాఖ్యానం

ఎన్నికల గోదాలో గెలిచేదెవరో?

ఎన్నికల గోదాలో గెలిచేదెవరో?

పంజాబ్‌లో ప్రాబల్య జాట్‌ సిక్కు వర్గానికి చెందిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి- దళిత సిక్కు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని గద్దెనెక్కించడం ద్వారా కాంగ్రెస్‌ అందరినీ ఆశ్చర్యపరచింది. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఒక...
తరువాయి
రోజూ పండగే...

రోజూ పండగే...

‘సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా... సరదాలు తెచ్చిందే తుమ్మెదా... కొత్త ధాన్యాలతో కోడి పందేలతో ఊరే ఉప్పొంగుతుంటే...’ ‘మరీ ఉప్పొంగితే వైరస్‌ రివ్వున దూసుకొచ్చి హత్తుకుంటుందేమో జాగ్రత్త’ ‘అలా భయపెడతావేమిటి? అసలు సంక్రాంతి అంటే ఎంత పెద్ద పండుగ....
తరువాయి

అంతర్యామి

సంక్రాంతి వైభవం

సంక్రాంతి వైభవం

తెలుగువారి లోగిళ్లలో ఆనందం వెల్లివిరిసే శుభదినం... ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆబాలగోపాలం ప్రమోదభరితమయ్యే పర్వదినం... ధనధాన్యాలతో కర్షకుల గృహాలు కళకళలాడుతుండగా, అన్ని కులాలూ వృత్తులవారు మమేకమై జరుపుకొనే తెలుగువారి పెద్ద
తరువాయి
జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని