Published : 18 Jan 2022 00:19 IST

మిథ్యగానే వ్యాయామ విద్య

ర్యాంకుల పోటీలో నలిగిపోతున్న బాల్యం

ర్యాంకులే లక్ష్యంగా సాగుతున్న మన విద్యావ్యవస్థ పాఠశాలలు, కళాశాలల్లో వ్యాయామ విద్యకు స్థానం లేకుండా చేస్తోందన్నది నిష్ఠుర సత్యం. వారానికి కనీసం రెండు తరగతుల మేర చిన్నారులకు వ్యాయామ విద్య నేర్పించాలన్న నిబంధన అత్యధిక బడుల్లో ఆచరణకు నోచుకోవడం లేదు. బట్టీ చదువులతో ర్యాంకులు తెచ్చుకునే తాపత్రయంలో ప్రైవేట్‌ విద్యాసంస్థలు పిల్లలను శారీరకంగా, మానసికంగా బలిష్ఠంగా తీర్చిదిద్దే వ్యాయామ విద్యకు కాలపట్టికలో చోటు కల్పించడం లేదు. మరోవైపు సర్కారీ బడులు- ఆటస్థలాలు, క్రీడాపరికరాలు, శిక్షకులు లేక కునారిల్లుతున్నాయి. అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్న పట్టణీకరణ పాఠశాల క్రీడామైదానాలను మింగేస్తోంది. ఫలితంగా పిల్లలు శారీరకంగా బలహీన పడుతున్నారు. కొవిడ్‌ సంక్షోభ సమయంలో శారీరక పటుత్వం అత్యవసరమైన పరిస్థితుల్లోనూ వాటికి దూరంగా మన విద్యాలయాలు మిగిలిపోవడం శోచనీయం. మన ప్రాచీన విద్యావిధానంలో వ్యాయామ, యుద్ధ విద్యలకు ప్రముఖ స్థానం ఉండేది. విలువిద్య, వేట, కత్తిసాము, కర్రసాము, గుర్రపు స్వారీ వంటివి బాల్యం నుంచే పాఠాల్లో భాగమయ్యేవి. యోగా నేర్చుకోవడమూ విద్యార్థుల ప్రణాళికలో ఉండేది. ఫలితంగా పిల్లల్లో శారీరక దారుఢ్యంతోపాటు మానసిక దృఢత్వమూ అలవడేది. గెలుపోటములను స్వీకరించగలిగే మానసిక స్థైర్యం అలవడేది. ప్రస్తుత విద్యావిధానంలో అవన్నీ మృగ్యంకావడం, కనీసం సాధారణ వ్యాయామాలకూ నోచుకోకపోవడం- వారిని శారీరకంగా, మానసికంగా దుర్బలంగా మార్చేస్తున్నాయి. మానసిక దృఢత్వం కరవై చిన్నచిన్న అపజయాలకే పిల్లలు కుంగిపోతున్నారు.

చిన్నప్పటి నుంచే...

విద్యార్థి దశ నుంచే పిల్లల్లో శారీరక దృఢత్వానికి ప్రోది చేయడం అత్యవసరమని 1948లోనే తారాచంద్‌ కమిటీ స్పష్టీకరించింది. తదనంతరం కుంజ్రు, సీడీ దేశ్‌ముఖ్‌ కమిటీలూ దీన్ని సమర్థించాయి. జాతీయ వ్యాయామ విద్య, వినోద ప్రణాళిక రూపుదిద్దుకున్నా అది దస్త్రాల్లోనే మిగిలిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతోమంది చిన్నారులు ఆరోగ్యకరమైన ఎత్తు-బరువు నిష్పత్తి (బీఎంఐ)కి దూరంగా మిగిలిపోవడానికి వ్యాయామం లేకపోవడమే ప్రధాన కారణమనే నివేదికలు పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని పాఠశాలల్లో వ్యాయామ విద్యను తప్పనిసరి చేస్తామన్న మంత్రి కేటీఆర్‌ ప్రకటన స్వాగతించదగిందే. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల క్రీడామైదానాల్లోనే రైతుభరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల నిర్మాణం జరుగుతుండటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. విద్యార్థుల శారీరక పటుత్వానికి దోహదం చేసే వ్యాయామ విద్య, క్రీడలకు చోటు ఎక్కడుంటుందని ప్రశ్నించింది. క్రీడామైదానాల్లో కొలువుతీరిన ప్రభుత్వ కార్యాలయాలను తక్షణం తొలగించాలని ఆదేశించినా, ఆ ఉత్తర్వులను అమలు చేయలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని విదితమవుతోంది. దేశంలో 40శాతం పాఠశాలలకు ఆట స్థలమే లేదు. శరవేగంగా సాగుతున్న పట్టణీకరణ క్రీడామైదానాల ఉసురు తీస్తోందన్నది కాదనలేని వాస్తవం. పాఠశాల స్థాయిలో ఆట స్థలాలకు చోటులేకపోవడానికి నగరీకరణే ప్రధాన కారణమని నివేదికలు ఘోషిస్తున్నాయి. సీబీఎస్‌ఈ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ట్రాక్‌తోపాటు ఆటస్థలం ఉండాలంటూ 2009లో విద్యాహక్కు చట్టంలో నిబంధన విధించారు. బడిలో కాకపోయినా, సమీపంలోని పార్కులో ఉన్నా చాలంటూ మరుసటి ఏడాదే దానికి సవరణ తీసుకొచ్చారు. క్రీడా మైదానం లేకపోయినా, బడి నడిపేందుకే విద్యాసంస్థలు మొగ్గు చూపుతున్నాయనేందుకు ఇదో ఉదాహరణ మాత్రమే.

భర్తీ కాని కొలువులు

అత్యధిక బడుల్లో క్రీడా సామగ్రి సైతం కరవే. శిక్షణ ఇచ్చే వ్యాయామ ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. చాలా రాష్ట్రాల్లో అయిదో తరగతిలోపు ప్రాథమిక పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు లేవు. ఉన్నత పాఠశాల స్థాయిలో పోస్టులున్నా అత్యధిక శాతం భర్తీ కావడం లేదు. ఒకటి, రెండో తరగతి పిల్లలకు వారానికి నాలుగు గంటలు, ఆపై తరగతుల వారికి కనీసం మూడు గంటలు వ్యాయామ, క్రీడా శిక్షణ తప్పనిసరి చేసిన చైనా విద్యాశాఖ, దానిని నిక్కచ్చిగా అమలు చేస్తోంది. బడుల్లో ప్రతిభ చూపినవారిని క్రీడా పాఠశాలల్లోకి తీసుకెళ్లి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న చైనా- ఒలింపిక్స్‌లో పెద్దసంఖ్యలో పతకాలు సాధిస్తోంది. 2019లో ‘ఫిట్‌ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం- పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో వ్యాయామం, క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించింది. రెండేళ్లు గడిచినా ఆ ఉద్యమ స్ఫూర్తిని రాష్ట్రాలు అందిపుచ్చుకోలేదు. పంజాబ్‌, హరియాణాలాంటి రాష్ట్రాల్లో సంప్రదాయ అఖాడాలు, క్రీడా గురుకులాలు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. అందుకే మన రెజ్లర్లు, బాక్సర్లు, హాకీ క్రీడాకారులు అక్కడి నుంచే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికైనా దేశంలో క్రీడలు, వ్యాయామ విద్య అవసరాన్ని గుర్తించి తదనుగుణంగా రాష్ట్రాలు మందడుగు వేయాలి. లేదంటే భావి భారత పౌరులు ఊబకాయులుగానో, బలహీనులుగానో మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది.  

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

క్వాడ్‌ సంకల్ప దీక్ష

క్వాడ్‌ సంకల్ప దీక్ష

‘కడలి నురగలా చెల్లాచెదురవుతుంది’- ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్‌ల చతుర్భుజ కూటమి(క్వాడ్‌)కి లోగడ చైనా పెట్టిన పిల్లి శాపమిది!  కృత్రిమ దీవులు నిర్మిస్తూ, సైనిక స్థావరాలు నెలకొల్పుతూ,
తరువాయి

ప్రధాన వ్యాఖ్యానం

చమురు ధరాభారం... ఉపశమనమెంత?

చమురు ధరాభారం... ఉపశమనమెంత?

ఎట్టకేలకు చమురు మంటల నుంచి దేశ ప్రజానీకానికి కొంతమేర ఉపశమనం లభించింది. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు ఒకపక్క, ఇతర నిత్యావసర సరకుల ధరలు మరోపక్క తారస్థాయికి చేరడంతో ప్రజలు అల్లాడిపోయారు.
తరువాయి

ఉప వ్యాఖ్యానం

అవగాహన లోపం... సమస్య క్లిష్టం!

అవగాహన లోపం... సమస్య క్లిష్టం!

గొంతు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్‌ గ్రంథి, శరీరంలో పలు రకాల జీవక్రియలను నియంత్రిస్తుంది. హార్మోన్లను స్రవించడం ద్వారా సాధారణ జీవక్రియలతో పాటు ఎదుగుదల, శరీర ఉష్ణోగ్రతల్ని ప్రభావితం చేస్తుంది.
తరువాయి
ఆచూకీ లేని బాల్యం

ఆచూకీ లేని బాల్యం

పేగు తెంచుకుని పుట్టిన కన్నబిడ్డ ఉన్నట్టుండి కనిపించకుండా పోతే, ఆ తల్లిదండ్రుల మనోవేదన వర్ణనాతీతం. అప్పటి వరకూ చేయి పట్టుకుని తిరిగి, మారాం చేసిన పిల్లలు ఒక్కసారిగా మాయమైపోతే, ఆ తల్లిదండ్రులు ఏమైపోతారు?
తరువాయి

అంతర్యామి

ఆంజనేయం... మహావీరం!

ఆంజనేయం... మహావీరం!

శ్రీమద్రామాయణంలో రాముడు నాయకుడిగా అన్ని కాండల్లో కనిపిస్తాడు. కాని, రామాయణానికి ఆత్మ సదృశమైన సుందరకాండకు హనుమంతుడే నాయకుడు. రాముడు బాహ్యంగా నరుడే అయినా, అంతర్లీనంగా అనంత పరబ్రహ్మ చైతన్యం.
తరువాయి
జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని