
చదవేస్తే ఉన్నమతి పోయినట్లు...
‘బాగా చదువుకుంటే ఉన్న మతి పోతుందా?’
‘గతి తప్పిన అతి చదువులైతే పోతుందేమో మరి!’
‘అదెలా?’
‘చదువంటే ఏమిటి... పుస్తక జ్ఞానమా, ప్రాపంచిక విజ్ఞానమా? ఏది విద్వత్తుకు ప్రామాణికం అనే ధర్మసందేహాలు ఎప్పట్నుంచో నానుతూనే ఉన్నాయి. ఎంతకీ తేలని ఇలాంటి వ్యవహారాల్ని అంత తేలిగ్గా తేల్చేయడం కుదరదు. ఇంతకీ ఇప్పుడు మతి పోయేంత సందేహం ఎందుకు వచ్చినట్లు?’
‘ఇప్పటి కాలంలో ఐఐటీలో చదువే మన జీవితాల్లో పరమోన్నత పరమార్థం కదా! ఐఐటీలో సీటు రావాలంటే కోచింగ్ కావాలి. కోచింగ్ సెంటర్లో చోటు కోసం ఇంకోచోట కోచింగ్ తీసుకోవాలి. దానికి ముందు ఇంట్లో ఓరియెంటేషన్ జరగాలి. వాటన్నింటికీ సిద్ధంగా ఉండేందుకు పుట్టినప్పటి నుంచే ఫోకస్ తప్పకూడదు. గర్భంలోని శిశువుపై ఫోకస్ పడేందుకు ఒకటి, ఒకటీ... రెండు, రెండు, రెండూ... అంటూ రామకోటిలా మాతృమూర్తి ఐఐటీకోటినే పారాయణం చేయాలి... ఇప్పుడు చదువంటే ఇంతటి భారీ ప్రాజెక్టు!’
‘అంతేమరి, ఐఐటీ అంటేనే మహాయజ్ఞం. అందులో సీటు దక్కడమంటే మనుషుల్లోనే మహా పుట్టుకన్నమాట! ఆ అదృష్టం అందరికీ అందదు. ఐఐటీ గురించి కల కనాలన్నా కోచింగ్ తీసుకోవాల్సిందే అన్నది ఇప్పటి తల్లిదండ్రుల గట్టి నమ్మకం! ఇంతకీ అసలు విషయం చెప్పలేదు’
‘లక్షల మంది పోటీదారులను పక్కకుతోసి, విజేతలు మాత్రమే అడుగుపెట్టే గెలుపు కోటలు ఐఐటీలు. అంతటి జ్ఞానాలయాల్లో చదువు చెప్పేవారు ఎంత జ్ఞానసంపన్నులై ఉంటారు?’
‘అంతేగా, విశ్వవిజ్ఞానులైతే తప్ప అలాంటి విజ్ఞానశాలల్ని కనుసన్నల్లో నడిపించలేరు. అయినా, అసలు విషయం చెప్పకుండా అదీఇదీ అంటూ ఏదేదో చెబుతున్నావు!’
‘అక్కడికే వస్తున్నా, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి ఐఐటీకి కొత్తగా వచ్చిన డైరెక్టర్ ఒకాయన- దయ్యాలు ఉన్నాయని, తాను చూశానని, వదిలించానని చెబుతున్నారు. జ్ఞానం పంచాల్సిన నోటితో అశాస్త్రీయాలు పలకడం అసమంజసం కదా?’
‘దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు, దయ్యాలను కూడా నమ్మాలనే వితండ వాదనలు ఉన్నాయి కదా... అందుకే ఇలా చెప్పేశారేమో పెద్దసారు!’
‘శాస్త్రజ్ఞానమే సర్వోన్నతమని రాజ్యాంగమే చెబుతుంటే, వింత వాదనలకు చోటే లేదు. వ్యక్తిగత నమ్మకాలేవైనా భద్రంగా ఇంట్లో బీరువాలో దాచుకోవాలి’
‘రాజ్యాంగం ఎన్నో చెప్పింది. అనుసరించేవారేరీ? రాజ్యాంగాన్ని చదవడమే- రంధ్రాలు వెతకడానికి అన్నట్లుగా పరిస్థితి ఉన్నప్పుడు, ఇలాంటి జ్ఞానాచార్యులకు కొదవేముందీ?’
‘ముందసలు పేరుగొప్ప ఐఐటీల్లో పేరుకుపోయిన దయ్యాలను వదిలిస్తే మంచిది’
‘అదేమిటి... ఐఐటీల్లో దయ్యాలా?’
‘చిన్నప్పట్నుంచే ఐఐటీలో సీటు సంపాదించాలని అమ్మానాన్నలు, చుట్టాలుపక్కాలు, ఇరుగుపొరుగులు పోరుపెడితే, అయిష్టంగానే గానుగెద్దులా చదివిందే చదివీ, లక్ష ప్రశ్నలకు జవాబులు బట్టీపట్టి, బుర్రలో ఊరబెట్టి, పరీక్షలో కక్కేసి, ర్యాంకు కొట్టేసి, అందరి ఆహా ఓహోల నడుమ ఐఐటీకి చేరతారు. అక్కడ చెప్పే పాఠాలు అర్థంకాక, అడిగిన వాటికి జవాబులు చెప్పలేక, పరీక్షలు రాయలేక... కష్టాలన్నీ పీడకలలై పీడిస్తుంటే, ఎవరికీ చెప్పుకోలేక, ఇంటికి రాలేక, పరువుకు ప్రాణమిచ్చి, తమ ప్రాణాలు విడుస్తున్న వాళ్లు ఎంతో మంది! ఇవీ ఐఐటీలను పీడిస్తున్న పెద్ద దయ్యాలు. వాటిని వదిలించే మార్గాల్ని వెదికి, భావితరాల భవితను కాపాడుకోవడంపై మనసు పెడితే మేలు. ఇలాంటి పనికిమాలిన వ్యవహారాలపై సమయం వృథా చేస్తే... విజ్ఞుల విజ్ఞానం, విజ్ఞతలపై సందేహాలు రాకమానవు!’
‘ఐఐటీ విద్యార్థుల వెనక ఇంత కథ ఉందా?’
‘ఇంతేనా, ఇంకెంతో ఉంది. దేశంలో శాస్త్రపరిశోధనలపై ఆసక్తి పెంచి, దేశం కోసం కొత్త ఆవిష్కరణలు తీసుకురావాలనే సదుద్దేశంతో ఏర్పాటైన ఐఐటీలను ప్రైవేటు కంపెనీలకు పెద్దజీతాల కూలీలను తయారుచేసే కర్మాగారాలుగా మార్చి, కొండంత జీతాల్ని ఎరగా చూపి ఊదరగొట్టడం తప్ప సాధించిందేమిటి? ప్రపంచ దేశాలకు ఇస్త్రీ చొక్కాల బానిసలను ఎగుమతి చేయడం తప్పించి, దేశానికి ఉపయోగపడిందెంత? ఏటా ఐఐటీల కోసం కోట్లకొద్దీ జనం సొమ్ము ఖర్చు చేస్తుంటే, ఆ ఫలాలు తింటున్నదెవరు? ఇవన్నీ ఐఐటీల పునాదుల నుంచే పాతుకుపోయిన భూతాలు, ప్రేతాలు, పిశాచాలు. వాటిని పారదోలడం మంచిది’
‘ఇంకా నయం, అదేదో యూనివర్సిటీలో కొత్తగా భూత వైద్యంపై ప్రత్యేక కోర్సు పెట్టారట. పిల్లల్ని తీసుకెళ్లి అందులో చేర్పించలేదు. అంతటి ఐఐటీ పెద్దకే దెయ్యాల గోల పడితే... సామాన్యుల సంగతేమిటి? అందుకేనేమో గుజరాత్లో ఒకతను దెయ్యాల గ్యాంగ్ వేధిస్తోందంటూ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేశారట?’
‘బుర్రలో ఇంగితం ఇంకిపోతే- మాన్యులైనా, సామాన్యులైనా ఒక్కటే. ముందసలు ఇటువంటి వాటి పట్ల అలక్ష్యం వహిస్తున్న రాజకీయ వ్యవస్థకు చికిత్స జరగాలి. అప్పుడుగాని సమాజంలో మార్పు రాదు... ఏమంటావు?’
- శ్రీనివాస్ దరెగోని
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
సంపాదకీయం

క్వాడ్ సంకల్ప దీక్ష
ప్రధాన వ్యాఖ్యానం

చమురు ధరాభారం... ఉపశమనమెంత?
ఉప వ్యాఖ్యానం

అవగాహన లోపం... సమస్య క్లిష్టం!

ఆచూకీ లేని బాల్యం
అంతర్యామి
