
ఆరిపోతున్న దీపాలు
బాణసంచా కర్మాగారాల్లో ఆగని పేలుళ్లు
బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లో తరచూ చోటుచేసుకుంటున్న పేలుళ్లు ఎందరి జీవితాలనో ఛిద్రం చేస్తున్నాయి. కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి. తమిళనాడులోని విరుధునగర్ జిల్లా సత్తూరు సమీపంలోని ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో ఈ నెల అయిదో తేదీన జరిగిన పేలుడులో నలుగురు మృతి చెందారు. అదే జిల్లాలో జనవరి ఒకటిన కళత్తూరు వద్ద జరిగిన అటువంటి పేలుడులో మరో అయిదుగురు మృత్యువాత పడ్డారు. దేశంలో సింహభాగం బాణసంచా తయారీకి పేరెన్నికగన్న శివకాశి సైతం విరుధునగర్ జిల్లాలోనే ఉంది. అక్కడా పలు ప్రమాదాలు గతంలో చోటుచేసుకొన్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ అటువంటి దుర్ఘటనలెన్నో వెలుగుచూశాయి. వాటికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వాల వైఫల్యం కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది.
అనుమతులు లేనివే అధికం
భారత్‌లో బాణసంచా పరిశ్రమ విలువ రూ.5,000 కోట్ల దాకా ఉంటుందని అంచనా. దేశవ్యాప్తంగా సుమారు పది లక్షల కుటుంబాలు ఆ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తయారీ కేంద్రాల్లో జరిగే ప్రమాదాలు ఏటా పెద్ద సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. 2012లో శివకాశిలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 38 మంది మృతి చెందారు. 70 మందిదాకా గాయపడ్డారు. ఆ కర్మాగారానికి అనుమతులు సైతం లేవు. 2016లో శివకాశీలోనే జరిగిన మరో పేలుడులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల క్రితం పంజాబ్‌లోని ఓ టపాసుల కేంద్రంలో చోటుచేసుకొన్న పేలుడులో 23 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో గత అయిదేళ్లలో జరిగిన అటువంటి దుర్ఘటనల్లో దాదాపు 50 మంది మరణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విశాఖపట్నంలోని సబ్బవరం మండలం గుల్లిపల్లెలో 2019లో ఒక అక్రమ బాణసంచా తయారీ కర్మాగారంలో జరిగిన పేలుడులో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. 2018లో వరంగల్‌కు సమీపంలోని కాశీబుగ్గ బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడులో దాదాపు 10 మంది మృత్యువాత పడ్డారు. అనుమతులు పొందిన వాటితో పోలిస్తే అక్రమ తయారీ కేంద్రాల్లోనే ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అక్రమ కేంద్రాలను గుర్తించి వాటిని మూసివేయించడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు అలక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా పేలుళ్లు సర్వసాధారణంగా మారిపోయాయి. ప్రధానంగా రసాయనాలను కలిపే సమయంలో నిర్లక్ష్యంవల్లనే అధికంగా పేలుళ్లు సంభవిస్తున్నట్లు ఆయా ఘటనలు చాటుతున్నాయి. ప్రమాదాలను నివారించేందుకు పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రత సంస్థ (పీఈఎస్ఓ) తరచూ ఆయా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తుంటుంది. నిబంధనలను అతిక్రమించినట్లు తేలితే పేలుడు పదార్థాల చట్టం, వాటికి సంబంధించిన నిబంధనల కింద లైసెన్సు రద్దు వంటి చర్యలు తీసుకుంటుంది. బాణసంచా తయారీ, రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. చాలా సందర్భాల్లో సరైన తనిఖీలు కొరవడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో విరుధునగర్ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో చోటుచేసుకున్న పేలుళ్లలో దాదాపు 19 మంది మృత్యువాతపడ్డారు. 30 మందిదాకా గాయపడ్డారు. దానిపై విచారణ జరిపేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.కన్నన్ నేతృత్వంలో ఎనిమిది మందితో కమిటీని జాతీయ హరిత ట్రైబ్యునల్ నియమించింది. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన సంఘం- ప్రమాదాలకు కారణాలను విశ్లేషించడంతో పాటు పలు సిఫార్సులు చేసింది.
తనిఖీలేవీ?
పరిమితికన్నా ఎక్కువ సంఖ్యలో, సరైన శిక్షణ లేని సిబ్బందిని నియమించుకోవడం, బాణసంచాలో వాడే రసాయనాలను షెడ్డులో కాకుండా ఆరుబయట విచ్చలవిడిగా కలపడం వంటివి దుర్ఘటనలకు హేతువులుగా కమిటీ పేర్కొంది. బాణసంచాను నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేస్తున్నారని, అగ్నిప్రమాదం వంటివి జరిగినప్పుడు వెంటనే నివారించే ఏర్పాట్లు సైతం కొరవడ్డాయని పేర్కొంది. అధికారులు ఆయా కేంద్రాల్లో సరైన తనిఖీలు జరపకపోవడంవల్ల తయారీదారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించింది. రసాయనాలను కలిపే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ఫోన్లు వంటి ఎలెక్ట్రానిక్ వస్తువులను బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదని, మద్యం మత్తులో ఉన్నవారిని లోనికి అనుమతించకూడదని సూచించింది. నిబంధనలను అతిక్రమించే వారికి కఠిన శిక్షలు విధించేలా పేలుడు పదార్థాల చట్టంలో మార్పులు తేవాల్సిన అవసరాన్నీ నొక్కి వక్కాణించింది. ఆ సూచనలకు తప్పనిసరిగా మన్నన దక్కితేనే నానాటికీ పెచ్చుమీరుతున్న ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. అనుమతులు లేని కర్మాగారాలపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. బాణసంచా కారణంగా నానాటికీ తలెత్తుతున్న శబ్ద, వాయు కాలుష్యం దృష్ట్యా సుప్రీంకోర్టు గతేడాది హరిత టపాసులను ప్రతిపాదించింది. వాటి తయారీపై శివకాశి కార్మికులకు శిక్షణ సైతం ఇస్తున్నారు. అదే సమయంలో జాగ్రత్తలపైనా అవగాహన కల్పించడంద్వారా ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది.
- దివ్యాన్షశ్రీ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
సంపాదకీయం

ముంచెత్తుతున్న ఈ-వ్యర్థాలు
ప్రధాన వ్యాఖ్యానం

పట్టాలకెక్కాల్సిన పన్నుల వ్యవస్థ
ఉప వ్యాఖ్యానం

అత్యాచారం... వక్రభాష్యం!

ప్రపంచదేశాలపై కరవు పడగ
అంతర్యామి
