Published : 24 Jan 2022 00:11 IST

అమ్మాయి వికాసం... జాతికి శ్రేయం!

నేడు జాతీయ బాలికా దినోత్సవం

బాలబాలికలు భావి సమాజానికి ప్రతినిధులు. ప్రతిభ, ఉత్సాహం, దూసుకుపోయే తత్వం వంటివి వారిద్దరిలోనూ సమానంగానే ఉంటాయి. అయితే, సమాజంలో అనాది నుంచీ వస్తున్న అనేక రకాల కట్టుబాట్లు, ఆంక్షల వల్ల బాలికలు తీవ్ర దుర్విచక్షణను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా చాలా విషయాల్లో వెనకంజ వేస్తున్నారు. బాలురతో పోలిస్తే బాలికల్లోనే అంకితభావం, సునిశితమైన పరిశీలన, దేన్నైనా సాధించగలమన్న నమ్మకం, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం అధికంగా ఉంటాయని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. తగిన ప్రోత్సాహం, శిక్షణ అందితే బాలికలు ఏ రంగంలోనైనా మేటిగా రాణిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ సమాజంలో బాలికల విషయంలో నెలకొన్న దుర్విచక్షణ పట్ల అందరినీ చైతన్యవంతం చేసేందుకు 2008లో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రారంభించారు. బాలికలకు సమాజంలో ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం, బాలికా విద్య ఆవశ్యకత, లింగ పరమైన దుర్విచక్షణ, బాల్యవివాహాలవల్ల తలెత్తే దుష్పరిణామాలు, బాలికల సామాజిక ఎదుగుదల, చట్టపరంగా వారికి లభించే హక్కులు తదితరాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ‘ఉజ్జ్వల భవితకు బాలికా సాధికారత’ అనే నినాదాన్ని ఎంచుకున్నారు.

అమ్మాయిలను అన్ని అంశాల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయినప్పటికీ వారికి అనేక అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. సామాజిక విశ్లేషకులు అనేక కోణాల్లో బాలికల సమస్యలపై అధ్యయనాలు జరిపారు. రుతుక్రమం సమయంలో సరైన సౌకర్యాలు కొరవడటం, ఆ సందర్భంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన లేక జబ్బుపడి ఎంతోమంది అమ్మాయిలు చదువుకు దూరమవుతున్నారు. బాల్యవివాహాలు ఇప్పటికీ వారి పాలిట పెనుశాపంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి ముగ్గురు బాలికా వధువుల్లో ఒకరు ఇండియానుంచే ఉన్నట్లు గతంతో పలు అధ్యయనాలు ధ్రువీకరించాయి. చిన్నవయసులోనే పెళ్ళిళ్లు, గర్భధారణవల్ల అమ్మాయిల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. లింగపరమైన దుర్విచక్షణ కారణంగా గత యాభై ఏళ్లలో భారత్‌లో సుమారు 4.5 కోట్ల మంది ఆడ శిశువులు కనుమరుగైనట్లు ఐక్యరాజ్య సమితి జననిధి సంస్థ రెండేళ్ల క్రితం వెల్లడించింది. 15-49 ఏళ్ల స్త్రీలలో 56శాతానికి పైగా రక్తహీనతతో బాధపడుతున్నారని అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేటతెల్లం చేసింది. కొవిడ్‌ కారణంగా కుటుంబాల ఆదాయాలు తెగ్గోసుకుపోయి రాబోయే రోజుల్లో మరెంతోమంది అమ్మాయిలు చిన్నవయసులోనే పెళ్ళిపీటలు ఎక్కే ప్రమాదం పొంచి ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించి బాలికలు ఆ ఊబిలో చిక్కుకోకుండా చూడాలి. ప్రతి అమ్మాయి తన విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. ఇటీవల యువతుల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచాలని కేంద్రం ప్రతిపాదించడంపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అమ్మాయిల విషయంలో అనాదిగా కొనసాగుతూ వస్తున్న సమస్యలను ప్రభుత్వాలు సత్వరం పరిష్కరించాలి.

స్వేచ్ఛ, ప్రోత్సాహం అందిస్తే బాలికలు మేలిమి నారీమణులుగా ఎదుగుతారని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ దిశగా తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారాలి. అమ్మాయిలను పెంచే తీరులో ఎటువంటి దుర్విచక్షణ చూపకూడదు. ఇది మగ పిల్లలు మాత్రమే చేయగలిగిన పని అంటూ అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని ఆదిలోనే తుంచేయకూడదు. ‘బాలిక పుడితే పండగ జరుపుకోవాలి. కూతురు పుట్టినందుకు అందరూ గర్వపడాలి’ అని బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అది అందరి నినాదం కావాలి. కూతురైనా, కుమారుడైనా ఇద్దరినీ సమానంగా పెంచాలి. ఇటీవలి కాలంలో బాలికల పట్ల సమాజంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఇప్పుడు దాదాపు అందరు తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆధునిక కాలంలో ఎందరో అమ్మాయిలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుకుంటున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగానూ రాణిస్తున్నారు. చిన్ననాటి నుంచే అమ్మాయిలకు సరైన దిశానిర్దేశం చేస్తూ, వారిలో స్థైర్యాన్ని, విజయ ఆకాంక్షను పెంపొందించాలి. వారి అభివృద్ధికోసం రూపొందించిన కార్యక్రమాలను ప్రభుత్వాలు పటిష్ఠంగా అమలు చేయాలి. అప్పుడు అమ్మాయిలు తప్పకుండా జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించగలుగుతారు.

- శార్వరీ శతభిషం

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

సంపాదకీయం

న్యాయంకోసం... సమగ్ర సంస్కరణలు!

న్యాయంకోసం... సమగ్ర సంస్కరణలు!

భాగ్యనగర శివార్లలో ఒంటరి ఆడపిల్ల ‘దిశ’ను బలితీసుకున్న మృగాళ్ల పైశాచికత్వంపై రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. నేరస్థులను కఠినంగా దండించాలని యావద్భారతం ముక్తకంఠంతో నినదించింది. కేసును శాస్త్రీయంగా దర్యాప్తు చేసి,....
తరువాయి

ప్రధాన వ్యాఖ్యానం

ఆగని పోరుతో సంక్షోభం తీవ్రం

ఆగని పోరుతో సంక్షోభం తీవ్రం

ఉక్రెయిన్‌పై రష్యా దాడి పర్యవసానాలను ప్రపంచం ఇప్పటికే చవిచూస్తోంది. ఇది ఇంతటితో ఆగదు. దీర్ఘకాలంలో దుష్పరిణామాలు మరింతగా కనిపించే అవకాశం ఉంది. ఇంధనం, ఆహారం, ఎరువులు తదితర అంశాల్లో ఈ రెండు దేశాలకు కీలక ప్రాధాన్యం....
తరువాయి

ఉప వ్యాఖ్యానం

పైలట్‌ మత్తు పెనుముప్పు

పైలట్‌ మత్తు పెనుముప్పు

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నందువల్ల చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో ఏటా ఇండియాలో వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో క్షతగాత్రులుగా మిగులుతున్నారు. అందువల్ల మత్తులో వాహనాలను నడపడాన్ని ప్రభుత్వాలు...
తరువాయి
అడవులను కబళిస్తున్న కార్చిచ్చులు

అడవులను కబళిస్తున్న కార్చిచ్చులు

వేసవి ఉష్ణోగ్రతలవల్ల ఉత్తర భారతంలోని అడవులు కార్చిచ్చులతో రగిలిపోతున్నాయి. కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌తో పాటు, పలు ఈశాన్య రాష్ట్రాల్లోని అడవులు దావానలాలకు ఆహుతి అవుతున్నాయి. వేగంగా విస్తరిస్తున్న మంటలబారిన పడి....
తరువాయి

అంతర్యామి

వృద్ధుల ఉత్సవాలు

వృద్ధుల ఉత్సవాలు

సృష్టిలో అన్ని ప్రాణులకన్నా నరజన్మ ఉత్తమమైనది. ఆహార నిద్రా భయ మైథునాలు జీవకోటికి సమానమైనా- వాక్కు, బుద్ధి మానవులకు విశేషమైనవి. సాధారణంగా అధర్మ వర్తనులకు అపమృత్యువు కలుగుతుందని, ధర్మాత్ములకు పరిపూర్ణాయుర్దాయం సిద్ధిస్తుందని వరాహమిహిరుడు బృహత్సంహితలో పేర్కొన్నాడు....
తరువాయి
జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని