Published : 25 Jan 2022 00:37 IST

చెదిరిపోతున్న చరిత్ర

నేడు జాతీయ పర్యాటక దినం

దేశానికి స్వయంపాలన సిద్ధించి 75 వసంతాలు అవుతున్న వేళ, ప్రతి సందర్భాన్ని స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసి, నేటి జాతీయ పర్యాటక  దినోత్సవానికీ అదే నేపథ్యాన్ని ఇతివృత్తంగా ఎంచుకుంది. దేశం నలుమూలలా ఉన్న పర్యాటక కేంద్రాల  ప్రాధాన్యాన్ని ఇనుమడింపజేసే లక్ష్యంతో ఏటా నిర్వహించే ఈ వేడుకకు రెండేళ్లుగా కరోనా మహమ్మారి కాలపరీక్ష పెడుతోంది. ఈ ఏడాదీ కొవిడ్‌ మూడోదశ ముప్పిరిగొన్న వేళ, ప్రత్యేక కార్యక్రమాల విషయంలో నిరాశ తప్పడం లేదు. సహజసిద్ధ ప్రకృతి సౌందర్యాలు, వైవిధ్యభరిత భౌగోళిక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే ఆలయాలు,  ఆధునికత మేళవించిన దర్శనీయ స్థలాలకు ఆసేతుహిమాచలం కొదవలేదు. వాటికితోడు స్వాతంత్య్ర సంగ్రామంలో వలస  పాలకులపై పోరాడిన పల్లెలు, పట్టణాల చరిత్రను జాతీయ స్పృహతో స్పృశించే పర్యాటక ప్రణాళికలు మొగ్గతొడగాల్సిన సందర్భమిది. 2024 నాటికల్లా పర్యాటక, ఆతిథ్య రంగాలు తిరిగి పట్టాలు ఎక్కవచ్చునని అంతర్జాతీయంగా అంచనాలు వినవస్తున్నాయి. ఈ తరుణంలోనైనా యాత్రాస్థలాల్లో ‘భారతీయత’ను జోడిస్తూ సరికొత్త దేశాన్ని సందర్శకులకు చూపించాల్సిన అవసరం ఉంది.

ఉద్యోగాల్లో కోత
కరోనాకు ముందువరకూ దేశ జీడీపీలో సుమారు 9.2శాతం వాటా కలిగి, నాలుగు కోట్ల మందికి ఉపాధి చూపిన పర్యాటక రంగం నేడు అత్యంత దుర్భర స్థితిని ఎదుర్కొంటోంది. కరోనా లాక్‌డౌన్‌ కాలంలో పర్యాటక, అనుబంధ రంగాలను 100శాతం మూసివేయక తప్పలేదు. దాదాపు రెండేళ్లుగా అంతర్జాతీయంగా ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు పాక్షికంగానో, సంపూర్ణంగానో కొనసాగుతున్నాయి. భారత పర్యాటక, ఆతిథ్య సంఘాల సమాఖ్య (ఫెయిత్‌) దేశీయంగా పర్యాటక రంగానికి సుమారు రూ.10 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఏడాది కిందటే అంచనా వేసింది. ప్రస్తుతం వివిధ దేశాల్లో ఒమిక్రాన్‌ రూపంలో ముంచుకొచ్చిన మూడో దశ ముప్పు పెను సవాళ్లు విసురుతోంది. ఉద్యోగాలు భారీగా తెగ్గోసుకుపోతున్నాయి. ప్రపంచ ట్రావెల్‌, టూరిజం కౌన్సిల్‌ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగంలో 17.4 కోట్ల మంది ఉపాధి కోల్పోగా, ఆ సంఖ్య ఇండియాలో సుమారు రెండు కోట్లదాకా ఉంటుందని అంచనా. అందులో 40శాతందాకా మహిళలే. ముఖ్యంగా ట్రావెల్‌ ఏజెంట్లు, గైడ్లు, ట్యాక్సీ డ్రైవర్లు, హ్యాకర్ల ఉపాధి పూర్తిగా దెబ్బతింది. హోటళ్ల ఆక్యుపెన్సీ ఇప్పటికీ 40శాతానికి మించడం లేదు. రెండేళ్లుగా కార్యకలాపాలు లేనందువల్ల కాంట్రాక్టుల గడువు పొడిగింపు, లైసెన్సుల రెన్యువల్‌, పన్నుల మినహాయింపు, రుణాల మంజూరు, ఎస్‌జీఎస్‌టీ రద్దు, అంతర్రాష్ట్ర రవాణా పరిమితి రుసుము తగ్గింపు వంటి ఉద్దీపన చర్యలు తీసుకోవాలన్న ట్రావెల్స్‌ సంఘాల విజ్ఞప్తులు సహేతుకమైనవే. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ప్రకటించిన ఉపశమన ప్యాకేజీలు అరకొరగా అమలవుతున్నాయని ఆయా సంస్థలు వాపోతున్నాయి. పర్యాటక రంగం, తిరిగి తన వాటాను దక్కించుకునేందుకు ప్రభుత్వ చేయూతే ఆలంబన కానుంది. స్వరాజ్య సంగ్రామానికి వేదికైన స్థలాలకు ప్రత్యేక గుర్తింపు తెస్తామని ప్రస్తుతం మోదీ సర్కారు పేర్కొంటోంది. పర్యాటకం ఎక్కువగా ప్రైవేటు రంగంలోనే విస్తరించినందువల్ల యాత్ర, రవాణా, ఆతిథ్య రంగాల్లోని సంస్థలను అందులో భాగస్వాములను చేయడంద్వారా ఆ ఆశయాన్ని   నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. చరిత్ర పొడవునా భారత ఉపఖండం ఎన్నో దండయాత్రలు, యుద్ధాలను ఎదుర్కొంది. కొల్లగొట్టుకుపోయిన సంపదకు చిహ్నంగా మిగిలిన రాతి శిలలు, బురుజులు, కోటలు చాలాచోట్ల శిథిలావస్థకు చేరాయి.

పునరుద్ధరణకు సరైన సమయం
ఐరోపా, లాటిన్‌ అమెరికా దేశాలు తమ స్వాతంత్య్ర చరిత్రను, స్థలాలను పదిలంగా కాపాడుకొంటున్నాయి. స్మృతిచిహ్నాలుగా, దర్శనీయ ప్రదేశాలుగా మలచుకొని యాత్రికుల్ని ఆకర్షిస్తూ విదేశ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తున్నాయి. అండమాన్‌లోని సెల్యూలార్‌ జైలునుంచి అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌ వరకు దేశమంతటా స్వాతంత్య్ర సంగ్రామంలో నలిగిన పల్లెలు కోకొల్లలు. చంపారన్‌, చీరాల, కకోరి, దండి, చౌరీచౌరా వంటి చిన్న పట్టణాలెన్నో దేశభక్తుల రక్తతర్పణతో తడిచాయి. బ్రిటిష్‌ వారి దాష్టీకానికి సాక్షీభూతంగా నిలిచిన ఠాణాలు, జైళ్లు, బందిఖానాలెన్నో చరిత్ర పుటల్లో మరుగున పడిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యాటక, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో వాటిని పునరుద్ధరించడానికి ఇదే సరైన సమయంగా నిపుణులు సూచిస్తున్నారు. మరుగున పడిన చారిత్రక సంపదను వెలుగులోకి తీసుకురావాలన్న సంకల్పంతో గతేడాది పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్రం ‘దేఖో అప్నా దేశ్‌’ నినాదం ఇచ్చింది. దాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. ‘ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా’ పేరిట దేశవిదేశాల్లో కల్పిస్తున్న ప్రచారానికి తోడు ఎక్స్‌పోలు నిర్వహించాలి. స్వాతంత్య్రోద్యమ ఘట్టాల్లో కీలక భూమిక పోషించిన ప్రదేశాల్లో ప్రత్యేక వేడుకల నిర్వహణ ద్వారా నేటి తరాన్ని నాటి స్ఫూర్తికి పునరంకితం చేయాలి. మనలో జిజ్ఞాసను రగిలించి, మనోఫలకంపై సరికొత్త ఆలోచనలను ఆవిష్కరింపజేసే అద్భుతాల అనంతగని భారతావనిని ప్రతి పౌరుడూ సందర్శించేలా ప్రోత్సహించాలి.

- సిరి

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

‘ప్రాథమిక’ సంక్షోభం

‘ప్రాథమిక’ సంక్షోభం

నాణ్యమైన బడి చదువే బంగరు భవితకు నారుమడి. ప్రాథమిక దశలో మేలిమి బోధన పటిష్ఠ విద్యాసౌధానికి గట్టి పునాది వేస్తుంది. వ్యక్తి వికాసానికి బాటలు పరచి, భావి జీవిత గమనానికి స్ఫూర్తి రగిలించే బడి చదువులకు సంబంధించి దేశీయంగా నాణ్యతా ప్రమాణాల పతనం తీవ్రంగా ఆందోళనపరుస్తోంది.
తరువాయి

ప్రధాన వ్యాఖ్యానం

సాగుభూమిని మింగేస్తున్న పట్టణీకరణ

సాగుభూమిని మింగేస్తున్న పట్టణీకరణ

వ్యవసాయం ఆర్థికాభివృద్ధికి, ఆహార భద్రతకు ప్రాణాధారం. కానీ, సగటు రైతులకు వ్యవసాయం భారమైంది. రసాయన ఎరువులు, పురుగుమందుల విచ్చలవిడి వినియోగం, తగ్గుతున్న భూసారం తదితర కారణాలు దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. దాంతో గ్రామాల నుంచి వలసలు పెరుగుతూ
తరువాయి

ఉప వ్యాఖ్యానం

సుదృఢ బంధమే ఉభయతారకం

సుదృఢ బంధమే ఉభయతారకం

ఆస్ట్రేలియాలో ఇటీవలి సాధారణ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ అత్యధిక స్థానాలు సాధించింది. ఆ పార్టీ నాయకుడు ఆంటొనీ ఆల్బనీస్‌ (59) ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆస్ట్రేలియన్లకు ‘ఆల్బో’గా సుపరిచితులైన ఆయన ప్రధాని అయిన.....
తరువాయి
ఎన్‌కౌంటర్‌లో నేరం ఎవరిది?

ఎన్‌కౌంటర్‌లో నేరం ఎవరిది?

రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ శివార్లలో ‘దిశ’పై అత్యాచారం, హత్య తరవాత దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. పోలీసులు, పాలకుల సామర్థ్యం, విశ్వసనీయతపై ప్రజలు, కొన్ని ప్రసార మాధ్యమాల నుంచి తీవ్ర ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘
తరువాయి

అంతర్యామి

జీవితమంటే ఇవ్వడమే!

జీవితమంటే ఇవ్వడమే!

నువ్వు ఇవ్వదగినదేదో ఇవ్వు... అది వెయ్యింతలై తిరిగి నీకు దక్కుతుంది. కాని, నీ దృష్టి దాని మీదే ఉండకూడదు. ఇది స్వామి వివేకానంద సూక్తి.
తరువాయి
జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని