Published : 27 Jan 2022 00:05 IST

నిషేధమే పరిష్కారమా?

కళారూపాల పరిరక్షణ అందరి బాధ్యత

పరస్త్రీ వ్యామోహం, వ్యభిచార వ్యసనంలోపడి ఇల్లు ఒళ్లు గుల్ల చేసుకొంటున్న నాటి సాంఘిక వ్యవస్థను చూసి తల్లడిల్లిన ఒక సంఘ సంస్కర్త హృదయంలోంచి పెల్లుబికిన ఆవేదనకు అక్షరాకృతి చింతామణి నాటకం. దాని సందేశం మహత్తరమైంది. దానికి లభించిన ఆదరణ అసాధారణమైంది. నిజానికి సాంఘిక నాటకాల్లో చింతామణి అగ్రశ్రేణికి చెందింది. ఆ నాటకకర్త మహాకవి కాళ్లకూరి నారాయణరావు వరవిక్రయం, మధుసేవ వంటి తన ఇతర నాటకాల్లోనూ సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా అక్షరాయుధాలను సంధించారు. ఈ రోజు మనం చూస్తున్న చింతామణికి, 1923 నాటికే సుమారు 450 ప్రదర్శనలను పూర్తిచేసుకొన్న అసలు రచనకు పోలికే లేదు. లీలాశుకుడి కథ ఆధారంగా అద్భుత ప్రణాళికతో కాళ్లకూరి రచించిన చింతామణి నాటకంలో వేలెత్తిచూపించేందుకు ఏ దోషం లేనందువల్లనే రంగస్థల వేదికపై విశేషంగా రాణించింది. సందేశాత్మకమైన పద్యాలు, హాస్యరసపూరితమైన సన్నివేశాలతో ప్రజలను విపరీతంగా ఆకర్షించింది. కాలక్రమంలో ఆ నాటకంలో విపరీత మార్పులు చోటుచేసుకొన్నాయి. ఫలితంగా ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందన్న విమర్శల కారణంగా చింతామణి నాటక ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల నిషేధించింది. అయితే, నిషేధించవలసింది దానిలోని చెడుపోకడలనే తప్ప పూర్తి నాటకాన్ని కాదు.

స్పర్ధే పతనానికి కారణం

నిషేధానికి కారణమైన సుబ్బిశెట్టి పాత్ర చింతామణిలో ఒకటి. అది ముఖ్య పాత్ర కాదు. సుబ్బిశెట్టి పాత్రధారి కాళిదాసు కోటేశ్వరరావు నటన ఆ నాటకానికి గొప్ప ఆకర్షణగా నిలిచినప్పటికీ, సంభాషణల్లో సభ్యతకు లోటు ఉండేది కాదు. చౌకబారు చేష్టలకు తావుండేది కాదు. చింతామణి, బిళ్వమంగళుడు నాటకంలో నాయికా నాయకులు. భవానీశంకరం మరో ముఖ్యపాత్ర. చింతామణిగా బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, ఆమె తల్లి శ్రీహరి పాత్రలో సూరవరపు వెంకటేశ్వర్లు నటిస్తుంటే కన్నుల పండువగా ఉండేది. ఎన్నో సందర్భాల్లో ఆ నాటకం కన్నీళ్లు తెప్పించేది. చివర్లో బిళ్వమంగళుడు వైరాగ్యసంపన్నుడై లీలాశుకుడిగా మారిపోవడం ద్వారా అద్భుతమైన ముగింపుతో నాటకం గొప్పగా రక్తికట్టేది. ఆ రోజుల్లో చింతామణి పాత్రధారులకు సినీతారలతో సమానమైన గుర్తింపు ఉండేది. ప్రజలంతా మెచ్చుకొన్న చింతామణి నాటకాన్ని 1933లో ఒకసారి 1956లో మరోసారి చలనచిత్రాలుగా రూపొందించారు. రెండోదానిలో భానుమతి, ఎన్టీఆర్‌ నాయికా నాయకులుగా, రేలంగి సుబ్బిశెట్టిగా, రుష్యేంద్రమణి శ్రీహరిగా అమోఘమైన నటనను ప్రదర్శించినా, నాటకానికి దక్కిన ప్రజాదరణ సినిమాలకు లభించలేదు.

శ్రీరామనవమి పందిళ్లలో, దసరా నవరాత్రుల్లో ఆరోజుల్లో చింతామణి నాటకాన్ని విధిగా ప్రదర్శించేవారు. ఒకే ఊళ్లో రెండు వేదికలు ఏర్పాటైతే ఒకే రోజు ఆ రెండింటిపైనా చింతామణి ప్రదర్శనలు సాగేవి. అదే ఆ నాటకం పతనానికి నాంది పలికింది. పోటాపోటీగా రెండు వేదికలపైనా ఒకే నాటకం ఆడిస్తుంటే జనాన్ని ఆకట్టుకోవడంలో స్పర్థ ఏర్పడేది. అసభ్యకరమైన పోకడలకు అదే మూల కారణం అయింది. అసలు పాత్రలు, వాటి ఉదాత్త నేపథ్యం వెనకబడి- చింతామణి చెల్లెలు చిత్ర, సుబ్బిశెట్టి మధ్య జుగుప్సాకరమైన సంభాషణలు పుట్టుకొచ్చాయి. శ్రీహరి పాత్ర వాటికి మరింత ఆజ్యం పోసింది. క్రమంగా ఆ మూడు పాత్రలు ప్రధానమై మాటల్లో అశ్లీలత మితిమీరిపోయింది. ఆ ప్రజాకర్షక తంత్రం సునిశిత హాస్యాన్నే కాదు, నాటకం అసలు లక్ష్యాన్నే సర్వనాశనం చేసింది. ముఖ్యంగా మగవారు స్త్రీ పాత్రలు పోషించిన సన్నివేశాల్లో ఒకరిని మించి మరొకరు విపరీత పోకడలకు పోయేవారు. విచ్చలవిడిగా ద్వంద్వార్థాలు, బూతులు చొరబడిపోయేవి. అలా నాటకం క్రమంగా తన సహజత్వాన్ని కోల్పోయింది. సందేశం సంగతి అలా ఉంచి సరసతను సైతం చేజార్చుకొని నాటకం మొత్తం రసాభాసగా పరిణమించింది. ఈ తరం ప్రేక్షకులకు కాళ్లకూరి చింతామణితో అసలు పరిచయమే లేని దుస్థితి దాపురించింది. చౌకబారుతనం దిశగా నటులు సైతం యథాశక్తి నాటకాన్ని భ్రష్టు పట్టించారు. ఒక వర్గాన్ని నొప్పించారు. ‘అరయంగా కర్ణుడీల్గె...’ అన్నట్లుగా తిలాపాపం తలాపిడికెడై మొత్తానికి నాటకాన్ని నిషేధించే దుర్దశ తలెత్తింది.

ఆ స్పృహ పెరగాలి

నిజానికి ఖండించవలసింది అందులో పుట్టుకొచ్చిన అశ్లీల పోకడలనేగాని అసలు నాటకాన్ని కాదు. రద్దు చేయాల్సింది అసభ్యతనేగాని, అసలు నాటకాన్ని కాదు. ఒక వర్గాన్ని నొప్పించి, నిషేధించాలన్న వాదానికి బలం చేకూర్చిన అంశం పనిపట్టాలిగాని, మొదలు నరికేసే సంప్రదాయం మంచిది కాదు. ఆ మాటకొస్తే సుప్రసిద్ధ ‘కన్యాశుల్కం’లోనూ కొందరిని అపహాస్యం చేసే సంభాషణలున్నాయి. దాన్నికూడా నిషేధించాలన్న డిమాండు తలెత్తితే? అలాగని ఎన్నింటిని నిషేధించుకుంటూ పోతాం? మార్పు రావాల్సింది ప్రజల్లో... ప్రజల అభిరుచుల్లో! ‘అత్తవారిచ్చిన అంటు మామిడి తోట’ వంటి మంచి పద్యాలను సైతం అశ్లీల సంభాషణల కారణంగా చేజార్చుకుంటామన్న స్పృహ ప్రజలకు ఏర్పడాలి. నటీనటుల్లో సైతం జవాబుదారీతనం పెరగాలి. మూలాలు చెడగొట్టకుండా అసలు నాటకాన్ని ప్రదర్శిస్తామన్న హామీని అందించాలి. అలా నిషేధాజ్ఞలు తొలగిపోయే సానుకూల పరిస్థితులు ఏర్పడాలి. అప్పుడే మంచి సాహిత్యం కలకాలం నిలిచి ఆదర్శవంతమైన సమాజానికి స్ఫూర్తిని అందిస్తుంది!

- హేమమాలిని

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

సంపాదకీయం

కాలుష్యరక్కసి వికటాట్టహాసం

కాలుష్యరక్కసి వికటాట్టహాసం

భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన జీవన హక్కును కాలుష్యభూతం కరకరా నమిలేస్తోంది. దేశంలో గాలి, నేల, నీరు పోనుపోను మరింత విషకలుషితమై పర్యావరణానికి నిలువెల్లా తూట్లు
తరువాయి

ప్రధాన వ్యాఖ్యానం

మానవ హక్కులకు పాతర!

మానవ హక్కులకు పాతర!

వలస పాలనతోపాటు చరిత్ర చెత్తబుట్టలో కలిసిపోవలసిన రాజద్రోహ చట్టం ఇప్పటికీ కొనసాగుతోంది. అందుకు కారణం- మన ప్రభుత్వాలు దాన్ని తమ రాజకీయ అవసరాల కోసం వాడుకోవడమే. భారత
తరువాయి

ఉప వ్యాఖ్యానం

మానవాళి మరువలేని నేస్తం

మానవాళి మరువలేని నేస్తం

సృష్టిలోని ప్రాణికోటిలో కీటక జాతి ఒకటి. ఎంటమాలజిస్టు(కీటక శాస్త్రవేత్త)ల విశ్లేషణ ప్రకారం మనిషికి, ప్రకృతికి మేలు చేసే కీటకాల్లో తేనెటీగలు ప్రధానమైనవి. క్రమశిక్షణ, స్వీయ రక్షణ వ్యూహం,
తరువాయి
అగ్రరాజ్యాలకు డ్రాగన్‌ సరికొత్త సవాలు

అగ్రరాజ్యాలకు డ్రాగన్‌ సరికొత్త సవాలు

దక్షిణ చైనా సముద్రంలో దుందుడుకు చర్యలతో పొరుగునున్న చిన్న దేశాలపై డ్రాగన్‌ ఇప్పటికే ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇటీవల తన దూకుడును, కుటిల దౌత్య నీతిని సుదూర ప్రాంతాలకూ విస్తరిస్తోంది. ఈ
తరువాయి

అంతర్యామి

బ్రహ్మజ్ఞానం

బ్రహ్మజ్ఞానం

మనిషి ఏది సాధించినా, అది దైవానుగ్రహంగా భావించాలి. మనిషికి ఏది ప్రాప్తించినా, దైవ ప్రసాదంగా స్వీకరించాలి. కష్టసుఖాలు, జయాపజయాలు, మానావమానాలు... ఇవన్నీ దైవలీలలు. పెద్దలు చెప్పే ఈ
తరువాయి
జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని