Updated : 12 Apr 2022 00:32 IST

రాబడి మత్తు

‘ఏమి పాడుకాలం వచ్చింది! పక్కవాడికి కాస్త మంచి చేద్దామన్నా కుదిరి చావడంలేదు. ఉక్రెయిన్‌పై ఆ రష్యా యుద్ధం పుణ్యమా అని వంట నూనెల ధరలు సలసలమంటున్నాయి’
‘మంచి ఏమిటి, నూనె ఏమిటి?’
‘అదే అన్నా, మద్యం తాగేవాళ్లంతా మహా పాపులు అన్నారు కదా బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌...’
‘అయితే...’
‘మా పక్కింటతను రోజూ తాగొచ్చి భార్యను నానా హింసలూ పెడుతున్నాడు. నితీశ్‌ లెక్క ప్రకారం పాపాల తాగుబోతులంతా చచ్చి నరకానికే పోతారు కదా. అక్కడ కుంభీపాకం పేరుతో సలసలా కాగే నూనెలో వేయిస్తారని అదేదో సినిమాలో చెప్పారుగా. ఆ బాధ ఎలా ఉంటుందో ఆయనగారికి ప్రత్యక్షంగా పరిచయంచేస్తే, తాగుడు విషయంలో కాస్త తగ్గుతాడేమో అని...’
‘అంటే, నువ్వే కాస్త నూనె మరగబెట్టి అతడి ఒంటిమీద
పోస్తానంటావ్‌!’
‘అనుకున్నాను. మండే ధరలతో అది కుదిరే పనేనా?’
‘భలేవాడివిలే. అయినా, పొద్దస్తమానం రెక్కలు ముక్కలు చేసుకున్న కష్టం మరచిపోదామనో, సినిమాల్లో చూపించినట్లు సిట్టింగులతో చిందులేద్దామనో మందు కోసం జేబులు
గుల్లచేసుకునేవాళ్లు పాపులైతే, ఖజానాలు నింపుకోవడానికి
వాడవాడలా మద్యం వరదలు పారిస్తున్న నేతలను ఏమనాలి? వాళ్లకు ఎన్నిసార్లు కుంభీపాకాలు రుచిచూపించాలి?’
‘నిజమే అన్నా! అధికారంలోకి రాకముందు సంపూర్ణ మద్య నిషేధం వల్లెవేసి, తీరా గద్దెనెక్కాక నాసిరకం సరకుతో
మార్కెట్లను ముంచెత్తి కాపురాలను గుల్ల చేస్తున్నారు కదా యువ ముఖ్యమంత్రి. రేట్లు పెంచితే ప్రజలు మందు జోలికి పోరని చెప్పి, ఖజానాకు కావాల్సినంతా రాబట్టుకున్నారుగా. మాట తప్పను, మడమ తిప్పను అని తడవకోసారి తీర్మానాలు వినిపించే ఆయనగారు, మద్యం ఆదాయంతో అక్కచెల్లెమ్మలకు మేలు జరగడం ప్రతిపక్షానికి సుతరామూ గిట్టడంలేదని తాజాగా సభాముఖంగా నాలుకను మహబాగా మడతెట్టేశారు కదా. దీని గురించి
నితీశ్‌కి చెబితే ఏమంటారో మరి!’
‘సంక్షేమం పేరుతో అప్పుచేసి పప్పుకూళ్లు తినిపించడానికి నానా తంటాలూ పడుతున్న ఆయనగారు, ‘నవరత్నాలను’ మద్యం ఆదాయంలో ముంచి మరింత మెరిపించాలని కంకణబద్ధులైనట్లున్నారు’
‘అంతేలే! మొన్నటికి మొన్న అధికార పార్టీ నేతల అండతోనే కల్తీ సారాను పానకంలాగ పంచి జనాల ప్రాణాలు ఆర్పేశారు కదా... పైగా అవి సహజ మరణాలంటూ గదమాయింపులు... ఆ పాపానికి నిష్కృతి ఉంటుందా?’
‘భలే చెప్పావులే! అక్రమ కాసుల వేటలో గుండెలు బండబారినవాళ్లే రాజకీయ నాయకులు. మొత్తానికి, సురతో సొంత లాభానికి, సంక్షేమానికి విడదీయలేని లంకె వేసేశారు నేతాగణాలు’
‘కర్రుకాల్చి వాతపెట్టి, మలాముకోసం చిల్లర విదిలించినట్లు... బతుకులను బుగ్గిచేసే మద్యంతో సంక్షేమం ఏమిటి అన్నా? మాయదారి మందు పుణ్యమా అని కాలేయం కుళ్లిపోయి, క్యాన్సర్లు కాటేసి, మత్తులో నడిపే వాహనాలు నుజ్జుచేసి భారత్‌లో ఏటా రెండున్నర లక్షల మంది ఊపిరి ఆగిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. మన నేతలకు అది ఎందుకు చెవికెక్కదు’
‘అంతేనా... హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, చిన్నపిల్లలపై అకృత్యాలు... లెక్కలేనన్ని నేరాల పాపం మద్యం మత్తుదే. అయినాగానీ, అప్పనంగా వేలకోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే ప్రభుత్వాలకు వదులుకోబుద్ధి కావడంలేదు. అసలు మద్యం లేకపోతే పోలీసులు, లాయర్లు, మన కోర్టులకు పెద్దగా పనేమి ఉంటుందీ! దాని గురించీ నేతలు గట్టిగా ఆలోచిస్తున్నారంటావా?!’
‘ఆ సంగతి ఏమోగానీ... మందు కొడితె మాకు మేమె మహారాజులం... నిషా దిగేదాక లోకాల్నే పాలిస్తాం అని పాడుకుంటారుగా మద్యంరాయుళ్లు. ఈ ప్రభుత్వాల వల్ల సామాన్యులకు దమ్మిడీ
ఉపయోగం లేదని తెలిసివచ్చి, ఆ మద్యంలోనే మాయా ఆనందం వెతుక్కుంటూ, సర్కార్లను పోషించడానికి తమ జీవితాలను పణంగా పెడుతున్నారేమో...’
‘అంతేగా మరి! ఇప్పుడు మందుకుతోడు మత్తుపదార్థాలూ దేశాన్ని ముంచెత్తుతున్నాయి. వాటిని కట్టడి చేయలేక కిందామీదా పడుతున్నారు మన నాయకులు’
‘దీన్నిబట్టి నాకొకటి అర్థమవుతోంది... ఈ నేతల ఆగడాలు సాగాలంటే ప్రజలు మత్తులో ఉండాలి. అందుకే వీటన్నింటినీ పెంచి పోషిస్తున్నారు కాబోలు?’
‘ఇప్పుడు దారికొచ్చావురా అబ్బాయ్‌! అసలు ప్రజాస్వామ్యానిదీ, మద్యానిదీ అవినాభావ సంబంధం. మందు లేకుండా ఎన్నికల సందడి ఉంటుందా? పైగా మందు మానేసి కష్టపడి సంపాదించుకున్న నాలుగు రాళ్లనూ జాగ్రత్త చేసుకుంటే ఇక దేశంలో పేదలు ఎవరుంటారూ... అప్పుడు ప్రభుత్వాలు ఎవరికోసం పనిచేయాలి... నేతలు ఏ పేరుతో దేశాన్ని దోచుకోవాలి... కాబట్టి ప్రజలను మత్తులో ముంచడం నాయకులకు అనివార్యమైన ఒక అవసరం’
‘నిజమేగానీ, ఈ జాడ్యానికి అంతమెప్పుడు?’
‘నితీశే సెలవిచ్చారుకదా, మద్యం విషమని తెలిసీ తాగుతున్నారంటే అది జనాల తప్పే అని. అందువల్ల మారాల్సింది పాలకులు కాదు, ప్రజలే! అది ఎప్పుడన్నది వాళ్ల చేతుల్లోనే ఉంది! రాజ్యాంగం అందించిన ఓటు హక్కు శక్తి తెలుసుకున్ననాడు తప్పకుండా దానికి సరైన పరిష్కారం దొరుకుతుంది’

- వేణుబాబు మన్నం

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని