
షాంఘైలో ఆకలి మంటలు
ఆంక్షలతో భగ్గుమంటున్న ప్రజాగ్రహం
శాస్త్ర సాంకేతికం, పరిశోధన, పర్యాటకం, సాంస్కృతికం, ఫ్యాషన్, క్రీడలు... ఇలా ఎన్నో రంగాల్లో ప్రపంచంలో అగ్రగామి నగరాల్లో ఒకటిగా చైనాలోని షాంఘై నిలిచింది. దాదాపు 2.6 కోట్ల జనాభాతో ప్రపంచ ఆర్థిక కేంద్రంగా అది ప్రసిద్ధి పొందింది. అంత గొప్ప నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఒమిక్రాన్‌లోని బీఏ.2 అనే ఉపరకం వైరస్ చైనాలో ఉత్పాతంలా వ్యాపిస్తోంది. దాన్ని అరికట్టేందుకు లాక్‌డౌన్‌తోపాటు కఠినమైన ఆంక్షలు అమలు
చేస్తున్నారు. ఇతర దేశాల్లోనూ గతంలో లాక్డౌన్లు విధించినా, ఎక్కడా లేని విధంగా షాంఘైలో మాత్రం ఒకే ఇంట్లో ఉండే ఇద్దరూ ఒక గదిలో ఉండకూడదని, దంపతులు చుంబనాలకు దూరంగా ఉండాలని కఠినమైన ఆంక్షలు జారీచేశారు. వాటిని ఇప్పటికీ సడలించలేదు. నిత్యావసరాలు కరవై నగరవాసులు ఆకలితో అల్లాడిపోతున్నారు. తమ ఇళ్లలో ఆహారం, మందులు లేవని బాల్కనీల్లోకి వచ్చి గగ్గోలు పెడుతున్నారు.
తీవ్రమైన ఆంక్షలతో షాంఘై వాసులకు తినడానికి బియ్యం, మాంసం వంటివి ఏమీ లభించడంలేదు. మొదట్లో కొంతమందికి ప్రభుత్వం ఆహార పదార్థాలు పంపిణీ చేసినా, అవి కొద్దిరోజులకే అయిపోయాయి. ఆ తరవాత మళ్ళీ అధికారవర్గాలు వాళ్లవైపు కన్నెత్తి చూడలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం బయటినుంచి నిత్యావసరాలు తెచ్చుకోవడానికీ అనుమతివ్వడంలేదు. షాంఘైలోని ఓ అపార్టుమెంటులో కొంతమంది తమ బాల్కనీల్లోకి వచ్చి నిరసన తెలుపుతూ పాటలు పాడటం మొదలుపెట్టారు. కొద్ది నిమిషాలకే ఓ డ్రోన్ అక్కడికి ఎగురుకుంటూ వచ్చింది. దానికి ఉన్న మైకులోంచి ‘ఇలా పాటలు పాడేందుకు కిటికీలు తెరవవద్దు. దానివల్ల మహమ్మారి మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది’ అంటూ ఓ సందేశం వినిపించింది. ఇలాంటి వాటితో ప్రజల ఆకలి మంటలు ఆగ్రహంగా మారుతున్నాయి. ఆన్లైన్లో ఆహార పదార్థాలు కొనుగోలు చేద్దామని ఎవరైనా తెల్లవారుజామునే ప్రయత్నిస్తున్నా, అప్పటికే తాము ఆ రోజుకు తీసుకోగలిగిన ఆర్డర్లన్నీ అయిపోయాయని ఆయా సంస్థలు చెబుతున్నాయి. నగర ప్రజలందరికీ పూర్తిస్థాయిలో నిత్యావసరాలు అందించాలని షాంఘై ఉప మేయర్ ఆదేశిస్తున్నా, క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. వ్యాప్తి వేగం ఎక్కువగా ఉంటుందని పేరున్న బీఏ.2 ఒమిక్రాన్ రకం విరుచుకుపడటంతో చైనాలో దాదాపు 23 నగరాలు పాక్షికంగా లేదా పూర్తిగా లాక్డౌన్లోకి వెళ్ళిపోయాయి. కొవిడ్ రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వైద్యులు, నర్సులు ఎంతగానో అలసిపోతున్నారు. ఒక ఐసొలేషన్ కేంద్రంలో రోజుల తరబడి అవిశ్రాంతంగా సేవలు అందిస్తూ కుప్పకూలిన వైద్యుడిని అక్కడ చికిత్స పొందుతున్న రోగులే చేతులమీద మోసుకుంటూ బయటికి తీసుకొస్తున్న దృశ్యాలు ‘వైబో’ సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి.
తొలుత మార్చి 28న షాంఘైలోని తూర్పు ప్రాంతానికే పరిమితమైన కొవిడ్ ఆంక్షలు, ఏప్రిల్ ఒకటి నుంచి అకస్మాత్తుగా నగరం మొత్తానికీ విస్తరించాయి. అప్పటికి నగర వాసులు నిత్యావసరాల విషయంలో సరైన ముందుజాగ్రత్తలు తీసుకోలేదు. ఫలితంగా ప్రస్తుతం ఇళ్లలో తినేందుకు ఆహారం లేక, తాగడానికి సరిపడా నీరు దొరక్క, అత్యవసర ఔషధాలు సైతం నిండుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగి, అల్లర్లు మొదలవుతున్నాయి. షాంఘైలోని ఒక ప్రాంతంలో ప్రజలు పెద్ద సంఖ్యలో బయటికి వచ్చి సూపర్ మార్కెట్లను లూటీ చేశారు. వారిని అదుపు చేసేందుకు వచ్చిన అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఏప్రిల్ అయిదుతో లాక్డౌన్ ముగిసిపోతుందని అంతా భావించారు. అలా జరగకపోగా, లాక్డౌన్ ఇంకెంతకాలం ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇంత కఠినమైన ఆంక్షలు విధిస్తున్నా, కొవిడ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రోజుకు దాదాపు ఇరవై వేలకు పైగా కొత్త కేసులు ఒక్క షాంఘైలోనే వస్తున్నాయి. కొవిడ్ మహమ్మారి సంగతి అటుంచితే, ఆకలి బాధకు తమ ప్రాణాలు పోయేలా ఉన్నాయని షాంఘై వాసులు తీవ్రంగా విలపిస్తున్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా అంతం కాలేదని, కొత్త వేరియంట్ల రూపంలో అది మన చుట్టూనే తిరుగుతూ ఉంటుందని ప్రధాని మోదీ తాజాగా హెచ్చరించారు. దానిపై పోరును ఆపకూడదని సూచించారు. చైనాలోని పరిస్థితుల దృష్ట్యా కొవిడ్ విషయంలో భారత్‌సైతం అప్రమత్తంగా వ్యవహరించాలి.
- పి.రఘురామ్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
సంపాదకీయం
ప్రధాన వ్యాఖ్యానం
ఉప వ్యాఖ్యానం
అంతర్యామి


తాజా వార్తలు (Latest News)
-
Related-stories News
Mouse Deer: మూషిక జింక.. బతికేందుకు తంటా
-
Ts-top-news News
Drones: మనుషుల్ని మోసుకెళ్లే డ్రోన్లు.. గమ్యానికి తీసుకెళ్లే సైకిళ్లు!
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
-
World News
Antonio Guterres: ఆహార కొరత.. ప్రపంచానికి మహా విపత్తే : ఐరాస చీఫ్ హెచ్చరిక
-
India News
50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Sports News
Bizarre Dismissals: క్రికెట్లో విచిత్రమైన ఔట్లు.. వీటిపై ఓ లుక్కేయండి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- IND vs LEIC Practice Match : భళా అనిపించిన భారత బౌలర్లు.. మెరిసిన పంత్
- Presidential Election: అట్టహాసంగా ద్రౌపది నామినేషన్
- Social Look: నయన్- విఘ్నేశ్‌ల ప్రేమ ‘క్లిక్’.. వేదిక పంచ్!